Inaugurates Namo Bharat Rapid Rail between Ahmedabad and Bhuj
Flags off several Vande Bharat trains
Sanctions more than 30,000 houses under the PM Awas Yojana - Gramin
Launches Single Window IT System (SWITS) of International Financial Services Centres Authority
“The first 100 days of our third term have brought impactful development for all”
“Big decision taken regarding the health of the poor and the middle class by providing free treatment worth Rs 5 lakh to all elderly people above 70 years of age”
“Namo Bharat Rapid Rail is going to provide a lot of convenience to middle-class families”
“Expansion of Vande Bharat network in these 100 days is unprecedented”
“This is the time for India, This is the golden period of India, This is the Amrit Kaal of India”
“India has no time to lose now, We have to increase credibility and also provide every Indian a life of dignity”

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ అహ్మదాబాద్‌లో రూ.8 వేల కోట్ల విలువైన- రైల్వే, రోడ్డు, విద్యుత్, గృహ నిర్మాణ , ఫైనాన్స్ రంగాలకు చెందిన ప‌లు అభివృద్ధి పథకాల్లో కొన్నింటిని ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆయన అహ్మదాబాద్- భుజ్‌ల మధ్య భారతదేశపు తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రారంభించారు. అలాగే, నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్, కొల్హాపూర్ నుంచి పుణె, ఆగ్రా కంటోన్మెంట్ నుంచి బెనారస్, దుర్గ్ నుంచి విశాఖపట్నం, పుణె నుంచి హుబ్బళ్లి మధ్య నడిచే వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి నుంచి ఢిల్లీ వెళ్లే తొలి 20 బోగీల వందే భారత్ రైలును కూడా ప్రారంభించారు. అనంతరం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి సంబంధించిన సింగిల్ విండో ఐటీ సిస్టమ్ (ఎస్‌డబ్ల్యూఐటీఎస్ )ను ప్రారంభించారు.

 

గణపతి మహోత్సవం, మిలాద్ ఉన్ నబీ వంటి వేడుకలతో పాటు దేశ వ్యాప్తంగా జరుగుతోన్న వివిధ పండుగలను ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సుమారు రూ.8,500 కోట్ల విలువైన రైలు, రోడ్డు, మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం ద్వారా భారతదేశ అభివృద్ధి పండుగ కూడా జరుగుతోందని ఆయన అన్నారు. నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రారంభోత్సవం గుజరాత్‌కు దక్కిన గౌరవంగా అభివర్ణించిన ప్రధాని, దేశంలో పట్టణ అనుసంధానతలో ఇది ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ రోజు వేలాది కుటుంబాలు నూతన గృహాల్లోకి ప్రవేశిస్తున్నాయని, అలాగే ఇతర వేలాది కుటుంబాల ఇళ్లకు సంబంధించిన మొదటి విడత నిధులు కూడా విడుదల చేశామని తెలిపారు. రాబోయే నవరాత్రులు, దసరా, దుర్గా పూజ, ధంతేరస్, దీపావళి పండుగల కాలాన్ని ఈ కుటుంబాలు తమ కొత్త ఇళ్లలో ఉత్సాహంతో జరుపుకుంటాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గృహ ప్రవేశానికి సంబంధించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గుజరాత్, దేశ ప్రజలకు.. ముఖ్యంగా కొత్త ఇంటి యజమానులుగా మారిన మహిళలకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

పండుగ ఉత్సాహం ఉన్న ప్రస్తుత సమయంలో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వరదలు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఇంతగా భారీ వర్షాలు పడటం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన పౌరులకు ఆయన సంతాపం తెలిపారు. బాధితులకు అండగా ఉండేందుకు, పునరావాసం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుజరాత్‌లో పర్యటించడం ఇదే తొలిసారని, ఈ రాష్ట్రం తన జన్మస్థలమని, ఇక్కడే తాను అన్ని జీవిత పాఠాలు నేర్చుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలు తనపై ప్రేమను కురిపించారని.. కొత్త శక్తి, ఉత్సాహంతో పునరుత్తేజం పొందడానికి ఒక బిడ్డ ఇంటికి తిరిగి వచ్చినట్లుగా ఉందని ఆయన అన్నారు. తనను ఆశీర్వదించడానికి ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో రావడం తన అదృష్టమని పేర్కొన్నారు.

మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో పర్యటించాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారని, అది సహజమని ఆయన అన్నారు. అరవై ఏళ్ల తర్వాత రికార్డుస్థాయిలో మూడోసారి ఒకే ప్రభుత్వానికి సేవలందించే అవకాశం కల్పించడం ద్వారా దేశ ప్రజలు చరిత్ర సృష్టించారని, ఇది భారత ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అనే సంకల్పంతో తనను దిల్లీకి పంపింది గుజరాత్ ప్రజలేనని ఆయన అన్నారు. ప్రభుత్వం వచ్చిన తొలి వంద రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకుంటామని భారత ప్రజలకు లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గుర్తు చేసిన ప్రధాన మంత్రి.. భారత్ అయినా, విదేశాల్లో అయినా తాను ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అన్నారు. తొలి 100 రోజులను ప్రజాసంక్షేమం, దేశ ప్రయోజనాల విషయంలో విధానాల రూపకల్పన, నిర్ణయాలు తీసుకోవడానికి కేటాయించానని చెప్పారు.

గడచిన 100 రోజుల్లో రూ.15 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని ప్రధాని తెలిపారు. 3 కోట్ల కొత్త ఇళ్లను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, ఆ దిశగా పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది గుజరాతీ కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌కు చెందిన వేలాది కుటుంబాలు కూడా కొత్త గృహాలను అందించినట్లు తెలిపారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ మెరుగైన జీవితాన్ని కల్పించడంలో తమ ప్రభుత్వం నిరంతరం నిమగ్నమై ఉందని పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి ప్రజల ఇళ్లకు ఆర్థిక సహాయం, కార్మికులకు సరసమైన అద్దెకు మంచి ఇళ్లు అందించే కార్యక్రమం, కర్మాగారాల్లో పనిచేసే వారికి ప్రత్యేక గృహాలను నిర్మించడం, వేరే ప్రాంతాల్లో పనిచేసే మహిళల కోసం హాస్టళ్లను నిర్మించడం వంటి వాటిపై ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు.

 

కొన్ని రోజుల క్రితం పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి తీసుకున్న భారీ నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల విలువైన ఉచిత చికిత్స అందిస్తామని ఇచ్చిన హామీని ప్రస్తావించారు. మధ్యతరగతికి చెందిన కొడుకులు, బిడ్డలు తల్లిదండ్రుల వైద్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

గత 100 రోజుల్లో యువత ఉపాధి, స్వయం ఉపాధి, వారి నైపుణ్యాభివృద్ధి కోసం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. 4 కోట్ల మందికి పైగా యువతకు ప్రయోజనం చేకూర్చే రూ .2 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. కంపెనీలు యువతను నియమించుకుంటే మొదటి సారి ఉద్యోగం చేస్తున్న వారి విషయంలో మొదటి వేతనాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ముద్రా రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

మహిళా సాధికారత కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, 3 కోట్ల మంది లక్షాధికారులైన మహిళలను (లక్‌పతి దీదీ) సృష్టిస్తామన్న హామీని ప్రధాని గుర్తు చేశారు. గత కొన్నేళ్లలో వారి సంఖ్య కోటికి చేరిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే దేశంలో 11 లక్షల లక్షాధికారులైన మహిళలను తయారు చేశామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నూనెగింజల రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. ఈ నిర్ణయాల ద్వారా పెరిగిన గరిష్ఠ మద్దతు ధర కంటే వారికి ఎక్కువ ధర లభిస్తుంది. సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటలు పండించే రైతులను ప్రోత్సహించడానికి, వంటనూనె ఉత్పత్తిలో భారత 'ఆత్మనిర్భర్' కలకు ఊతమిచ్చేందుకు విదేశీ నూనె దిగుమతులపై సుంకాన్ని పెంచినట్లు తెలిపారు. బాస్మతి బియ్యం, ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసిందని, దీనివల్ల విదేశాల్లో భారత బియ్యం, ఉల్లికి డిమాండ్ పెరిగిందని అన్నారు.
 

గడచిన 100 రోజుల్లో రైలు, రోడ్డు, ఓడరేవు, విమానాశ్రయం, మెట్రోకు సంబంధించిన డజన్ల కొద్దీ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మోదీ తెలిపారు. ఇవాళ జరుగుతోన్న కార్యక్రమంలో కూడా ఇదే దృశ్యం కనిపిస్తోందని అన్నారు. ఈ రోజు గుజరాత్‌లో అనుసంధానానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్న ప్రధాని.. కార్యక్రమానికి ముందు తాను గిఫ్ట్ సిటీ స్టేషన్‌కు మెట్రోలో ప్రయాణించానని తెలిపారు. మెట్రో ప్రయాణంలో చాలా మంది తమ అనుభవాలను పంచుకున్నారని, అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. గత 100 రోజుల్లోనే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మెట్రో విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

ఈ రోజు గుజరాత్‌కు ప్రత్యేకమైన రోజుగా పేర్కొన్న మోదీ..నమో భారత్ రాపిడ్ రైలు అహ్మదాబాద్, భుజ్‌ల మధ్య నడుస్తుందని గుర్తు చేశారు. దేశంలో ప్రతిరోజూ ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే మధ్యతరగతి కుటుంబాలకు నమో భారత్ ర్యాపిడ్ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. ఉద్యోగాలు, వ్యాపారం, విద్యలో నిమగ్నమైన వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో నమో భారత్ రాపిడ్ రైల్ దేశంలోని అనేక నగరాలను అనుసంధానించడం ద్వారా ఇంకా ఎంతో మందికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

15కు పైగా కొత్త వందే భారత్ రైలు మార్గాలను ప్రస్తావిస్తూ.. ఈ 100 రోజుల్లో వందే భారత్ విస్తరణ మునుపెన్నడూ లేనంతగా జరిగిందని ప్రధాని వ్యాఖ్యానించారు. జార్ఖండ్, నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పుణె, ఆగ్రా కంటోన్మెంట్-బెనారస్, దుర్గ్-విశాఖపట్నం, పుణె-హుబ్లీ మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు 20 బోగీలతో నడిచే ఢిల్లీ - వారణాసి వందే భారత్ రైలు గురించి కూడా ఆయన మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం నడుస్తోన్న 125కు పైగా వందేభారత్ రైళ్లు ప్రతిరోజూ వేలాది మందికి మెరుగైన ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయన్నారు.

సమయానికి ఉన్న విలువను గుజరాత్ ప్రజలు అర్థం చేసుకునే తీరును ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. ప్రస్తుత కాలం స్వర్ణయుగం అని, భారత్‌కు అమృత్ కాలమని ఉద్ఘాటించారు. రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలను కోరిన ఆయన.. ఇందులో గుజరాత్ కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ రోజు రాష్ట్రం చాలా పెద్ద ఉత్పాదక కేంద్రంగా మారుతోంద‌ని, దేశంలో అనుసంధానం అత్యంత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి తొలి మేడ్ ఇన్ ఇండియా రవాణా విమానం సీ-295ను గుజరాత్ ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ మిషన్‌లో రాష్ట్రం సాధించిన ఆధిక్యం అపూర్వమని కొనియాడారు. పెట్రోలియం, ఫోరెన్సిక్స్ నుంచి ఆరోగ్య వరకు వివిధ రంగాల్లో నేడు రాష్ట్రంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ప్రతి ఆధునిక అంశాన్ని అధ్యయనం చేయడానికి ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను తెరుస్తున్నాయని తెలిపారు. సంస్కృతి నుంచి వ్యవసాయం వరకు గుజరాత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందని ఆయన గర్వంగా చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా గుజరాత్ ఇప్పుడు పంటలు, ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తోందని, ఇదంతా గుజరాత్ ప్రజల పట్టుదల, కష్టపడే స్వభావం వల్ల సాధ్యమైందని అన్నారు.
 

ముందు తరం రాష్ట్రాభివృద్ధికి అంకితమై పనిచేసిందని, రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసిన ప్రధాని.. ఎగుమతి చేయని ఉత్పత్తులు నాసిరకం అనే మనస్తత్వం నుంచి బయటపడాలని ప్రజలకు విన్నవించారు. దేశవిదేశాల్లో నాణ్యతతో తయారైన ఉత్పత్తులకు గుజరాత్ దిక్సూచిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

భారత దేశం కొత్త పంధాతో పనిచేస్తున్న తీరు ప్రపంచంలోనే తనదైన ముద్ర వేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. వివిధ దేశాలలో అనేక పెద్ద వేదికలపై భారత్‌ ప్రాతినిధ్యం వహించడం దేశానికి అందుతోన్న గౌరవాన్ని తెలియజేస్తోందని అన్నారు. "ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ భారత్‌ను, భారతీయులను రెండు చేతులతో స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నారు. సంక్షోభ సమయాల్లో సహాయం కోసం ప్రపంచ దేశాలు ప్రజలు భారత్ వైపు చూస్తున్నాయి'' అని వ్యాఖ్యానించారు. భారత ప్రజలు వరుసగా మూడోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ప్రపంచ దేశాల అంచనాలు మరింత పెరిగాయని ఆయన ప్రధానంగా చెప్పారు.  పెరిగిన నమ్మకం ద్వారా రైతులు, యువత ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్నారని, నైపుణ్యం కలిగిన యువతకు పెరుగుతున్న గిరాకీ దీనికి నిదర్శనమని అన్నారు. విశ్వాసం పెరగడం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, విదేశీ పెట్టుబడిదారులకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

దేశంలోని ప్రతి పౌరుడు తమ దేశ బలాన్ని ప్రచారం చేస్తూ యావత్ ప్రపంచంలో భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్ కావాలని కోరుకుంటుంటే.. దేశంలో కొందరు ప్రతికూల మనస్తత్వంతో, అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులు దేశ సమైక్యతపై దాడి చేస్తున్నారని అన్నారు. 500కు పైగా సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశాన్ని సర్దార్ పటేల్ ఐక్యం చేసిన తీరును మోదీ గుర్తు చేశారు. అధికార దాహం ఉన్న ఒక వర్గం దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రజలను మోదీ హెచ్చరించారు.
 

దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఇలాంటి ప్రతికూల శక్తులను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. 'ఓడిపోయేందుకు భారత్‌ వద్ద ఇప్పుడు సమయం లేదు. భారతదేశం పట్ల విశ్వసనీయతను పెంపొందించాలి, ప్రతి భారతీయుడికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలి" అని అయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కూడా గుజరాత్ అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “ మనందరి కృషితో మన ప్రతి సంకల్పాలన్నీ నెరవేరుతాయి” అంటూ మోదీ ప్రసంగాన్ని ముగించారు.
 

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

నేపథ్యం

సమఖిలీ - గాంధీధామ్, గాంధీధామ్ - ఆదిపూర్ రైల్వే మార్గాలను నాలుగు వరుసలకు విస్తరించటం, అహ్మదాబాద్‌లోని ఏఎంసీ పరిధిలో ఐకానిక్ రోడ్ల అభివృద్ధి, బక్రోల్, హతిజన్, రామోల్, పంజర్ పోల్ జంక్షన్ ల వద్ద పై ఓవర్ల నిర్మాణంతో సహా అనేక కీలక ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

కచ్‌లోని కట్ లిగ్నైట్ థర్మల్ పవర్ స్టేషన్‌లో  30 మెగావాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ,35 మెగావాట్ల బీఈఎస్‌ఎస్ సౌర పీవీ ప్రాజెక్టు.. మోర్బి, రాజ్ కోట్‌లలో 220 కేవీ సబ్ స్టేషన్లను ఆయన ప్రారంభించారు.

ఆర్థిక సేవలను క్రమబద్ధీకరించేందుకు రూపొందించిన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి చెందిన సింగిల్ విండో ఐటీ సిస్టమ్ (ఎస్‌డబ్ల్యూఐటీఎస్ )ను ప్రారంభించారు.

 

గ్రామీణ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 30,000కు పైగా ఇళ్లను మంజూరు చేసిన ప్రధాని..  మొదటి విడత గృహాలను లబ్ధిదారులకు అందించారు. పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) పట్టణ, గ్రామీణ విభాగాల పరిధిలో పూర్తి అయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు.


 

అహ్మదాబాద్- భుజ్ మధ్య భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలుతో పాటు నాగ్‌పూర్- సికింద్రాబాద్, కొల్హాపూర్- పూణే, ఆగ్రా కంటోన్మెంట్- బనారస్, దుర్గ్- విశాఖపట్నం, పూణే- హుబ్బళ్లి మధ్య నడిచే వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి- ఢిల్లీ మధ్య నడిచే మొదటి 20 బోగీల వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi