దర్భంగాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాలు సులభతరమవుతాయి: పీఎం
దర్భంగాలో ఎయిమ్స్ నిర్మాణం బీహార్ ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకొస్తుంది: పీఎం
దేశ ఆరోగ్యరంగంలో సమగ్ర విధానాన్ని మా ప్రభుత్వం అవలంబిస్తోంది: పీఎం
ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా మఖానా సాగుదారులకు లబ్ధి, మఖానా పరిశోధనా కేంద్రానికి జాతీయ సంస్థ హోదా, మఖానాలకు జీఐ ట్యాగ్ లభించింది: పీఎం
పాళీకి ప్రాచీన భాష హోదాను కల్పించాం : పీఎం

సుమారు రూ.12,100 కోట్లతో బీహార్‌లోని దర్భంగాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో ఆరోగ్యం, రైలు, రోడ్లు, పెట్రోలియం, సహజవాయు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి.

సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని, వికసిత భారత్ కోసం ఆ రాష్ట్ర ప్రజలు ఓటు వేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో జార్ఖండ్ ప్రజలు పాల్గొనాలని కోరారు. అలాగే ప్రముఖ గాయని శారదా సిన్హాకు నివాళులు అర్పించారు. సంగీతానికి ఆమె చేసిన సేవలను ముఖ్యంగా ఛఠ్ మహా పర్వ పాటలకు ఆమె చేసిన స్వరకల్పనలను కొనియాడారు.

కీలకమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో యావత్ భారతావనితో కలసి బీహార్ పురోగతి సాధిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. పథకాలను, ప్రాజెక్టులను గతంలో మాదిరిగా కాగితాలకు మాత్రమే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ‘‘వికసిత్ భారత్ వైపు నిలకడగా ముందుకు సాగుతున్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాకారం దిశగా చేసే ప్రయత్నాల్లో పాలుపంచుకోవడంతో పాటు వికసిత్ భారత్‌ నిర్మాణానికి సాక్షులుగా నిలిచే అదృష్టం ప్రస్తుత తరానికి దక్కిందని ఆయన అన్నారు.

 

ప్రజా సంక్షేమానికి, దేశసేవ పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను మరోసారి తెలియజేస్తూ... ఈ రోజు ప్రారంభించిన రోడ్లు, రైళ్లు, సహజవాయు రంగాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన రూ.12,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి తెలియజేశారు. బీహార్ ఆరోగ్య రంగంలో మార్పులను తీసుకొచ్చేందుకు, దర్భంగాలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలన్న కలను సాకారం చేసుకొనే దిశగా ఈ రోజు ముందడుగు వేసినట్లు ప్రధాని తెలిపారు. మిథిల, కోశి, తిర్హుత్ ప్రాంతాలతో పాటుగా పశ్చిమ బెంగాల్‌, సమీప ప్రదేశాలకు చెందినవారు దీని నుంచి ప్రయోజనం పొందుతారని, నేపాల్ నుంచి భారతదేశానికి వచ్చే రోగులకు కూడా ఈ ఆస్పత్రి వైద్య సేవలు అందిస్తుందని ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే ఉద్యోగం, స్వయం ఉపాధి కల్పన దిశగా నూతన అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. ఈ రోజు వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించిన నేపథ్యంలో మిథిల, దర్భంగాతో పాటు బీహార్ మొత్తానికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశంలోని జనాభాలో అధిక భాగం పేద, మధ్యతరగతికి చెందిన వారున్నారని, వీరే వ్యాధుల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. ఇంట్లో ఒకరు అనారోగ్యానికి గురైతే కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలోకి ఎలా వెళ్లిపోతుందో తనకు తెలుసని శ్రీ మోదీ తెలిపారు. ఆసుపత్రులు, వైద్యుల కొరత, ఔషధాల అధిక ధరలు, పరీక్షా కేంద్రాలు, పరిశోధనా కేంద్రాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల గతంలో ఆరోగ్య సేవలు అరకొరగా ఉండేవని వ్యాఖ్యానించారు. వైద్య సదుపాయాల కొరత, పేదలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల కారణంగా దేశాభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఇప్పుడు ఆ పాత ఆలోచన, విధానాన్ని పూర్తిగా మార్చినట్టు తెలిపారు.

 

ఆరోగ్యరంగంలో ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ రంగంలో వ్యాధి నివారణ, నిర్ధారణ, ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స - ఔషధాలు, చిన్న పట్టణాల్లో మెరుగైన వైద్య సదుపాయాల కల్పన, ఆరోగ్య రంగంలో టెక్నాలజీపై దృష్టి సారించడం అనే ఐదు ప్రధానాంశాలపై ప్రభుత్వ ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన వివరించారు.

యోగా, ఆయుర్వేదం, పోషక విలువలు, ఫిట్ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. సాధారణ రోగాలకు జంక్ ఫుడ్, అనారోగ్యకర జీవనశైలే ప్రధాన కారణమన్న ప్రధానమంత్రి, శుభ్రతను పెంపొందించి, వ్యాధులను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్, ప్రతి ఇంట్లోనూ టాయిలెట్లు, మంచినీటి కుళాయి తదితర కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. గత కొన్ని రోజులుగా దర్భంగాలో స్వచ్చతా కార్యక్రమాలను నిర్వహించి ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రధాన కార్యదర్శి, ఆయన బృందాన్ని, రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమాలను మరికొన్ని రోజులు పొడిగించాలని సూచించారు.

వ్యాధులను ముందుగా గుర్తించగలిగితే అవి తీవ్రం కాకుండానే నయం చేయవచ్చని ప్రధానమంత్రి అన్నారు. అయినప్పటికీ రోగనిర్ధారణ, పరిశోధనల్లో అధిక వ్యయం ప్రజలను వ్యాధి ప్రభావం గురించి తెలుసుకోనీయకుండా అడ్డుకుంటోందని అన్నారు. ‘‘దేశంలో 1.5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య మందిరాలను ప్రారంభించాం’’ అని శ్రీమోదీ తెలిపారు. ఇవి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు దోహదపడతాయని చెప్పారు.

ఇప్పటి వరకు 4 కోట్ల కంటే ఎక్కువ మంది ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా చికిత్స పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పథకం లేనట్లయితే అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకొని ఉండేవారు కాదని అన్నారు. ఈ విషయంలో ఎంతో మంది పేదల ఆందోళన ఆయుష్మాన్ భారత్ పథకంతో తొలగిపోయిందని అన్నారు. ఆయుష్మాన్ పథకం వల్ల ఎన్నో కోట్ల కుటుంబాలు దాదాపుగా రూ.1.25 లక్షల కోట్లు ఆదా చేసుకోగలిగాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ పథకం ద్వారా చికిత్స పొందారని తెలిపారు.

 

ఎన్నికల సమయంలో 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకంలో చోటు కల్పిస్తామని ఇచ్చిన హామీ గురించి ప్రస్తావిస్తూ ‘‘ఈ హామీని అమలు చేశాం. కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వయోధికులందరికీ ఉచిత చికిత్సను ప్రారంభించాం’’ అని ప్రధానమంత్రి తెలిపారు. లబ్ధిదారులందరికీ త్వరలోనే ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డులు అందజేస్తామన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన ఔషధాలను అందించే జన ఔషధి కేంద్రాల గురించి కూడా ఆయన మాట్లాడారు.

దేశ ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచే విధంగా సమగ్ర ఆరోగ్య విధానంలో నాలుగో అంశమైన చిన్న పట్టణాల్లో మెరుగైన వైద్య సదుపాయాల కల్పన, వైద్యుల గురించి చర్చిస్తూ, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 60 ఏళ్ల పాటు దేశం మొత్తం మీద ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదని, కొత్త ఎయిమ్స్‌ లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఏవీ గత ప్రభుత్వాల హయాంలో పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం రోగాల గురించి మాత్రమే ఆలోచించకుండా దేశంలోని ప్రతి మూలలోనూ ఎయిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేసిందని, ఫలితంగా వాటి సంఖ్య 24కు పెరిగిందని వివరించారు. గత పదేళ్లలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపు అయిందని, తద్వారా దేశంలో ఎక్కువ మంది వైద్యులు తయారవుతారని అన్నారు. ‘‘బీహార్, దేశానికి సేవలు అందించేందుకు దర్భంగా ఎయిమ్స్ ఎంతో మంది కొత్త వైద్యులను తయారుచేస్తుంది’’ అని అన్నారు. మాతృభాషలో విద్యాభ్యాసం గురించి స్పృశించిన ప్రధానమంత్రి కర్పూరీ ఠాకూర్ కన్న కలలకు ఇది పెద్ద నివాళి అని తెలిపారు. గడచిన పదేళ్లలో లక్ష మెడికల్ సీట్లను అందించామనీ, వీటికి అదనంగా రానున్న 5 ఏళ్లలో మరో 75,000 సీట్లను జోడించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. అలాగే హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో వైద్య విద్యను అభ్యసించే వెసులుబాటును కల్పించామని తెలిపారు.

 

క్యాన్సర్ పై పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన శ్రీ మోదీ... ముజఫర్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రి బీహార్‌లోని రోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్స అందిస్తుందని, చికిత్స కోసం రోగులు ఢిల్లీ లేదా ముంబయి వెళ్లాల్సిన అవసరం లేదని వివరించారు. త్వరలోనే బీహార్‌లో కంటి ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇటీవలే వారణాసిలో శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించిన విధంగానే బీహార్‌లోనూ ఏర్పాటు చేయాలని కంచి కామకోటి శ్రీ శంకరాచార్యను కోరినట్లు ఆయన తెలిపారు. దానికి సంబంధించిన పనులు సాగుతున్నట్లు వివరించారు.

సుపరిపాలన అభివృద్ధి నమూనాను రూపొందించిన బీహార్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి ప్రశంసించారు. బీహార్‌ను వేగంగా అభివృద్ధి చేసేందుకు డబుల్ ఇంజన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉందని, చిన్న రైతులు, పరిశ్రమలను బలోపేతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్ మార్గాల ద్వారా ఈ రాష్ట్ర గుర్తింపు పెరుగుతోందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా దర్భంగాలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. రూ.5,500 కోట్ల విలువైన ఎక్స్‌ప్రెస్ మార్గాలు, రూ.3,400 కోట్ల విలువైన సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) వ్యవస్థతో సహా ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ‘‘బీహార్‌ను అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు ఇదో మహాయజ్ఞం’’అని ప్రధానమంత్రి అన్నారు. అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రాంతంలోని రైతులు, మఖానా సాగుదారులు, మత్స్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా, మిథిలతో సహా బీహార్‌లోని రైతులకు రూ.25,000 కోట్లకు పైగా లబ్ధి చేకూరిందని ఆయన తెలియజేశారు. మఖానా రైతుల పురోగతికి ఒక జిల్లా ఒక పంట పథకాన్ని తీసుకొచ్చినట్లు, ప్రఖ్యాతి గాంచిన మఖానా పరిశోధనా సంస్థకు జాతీయ హోదా కల్పించినట్లు తెలిపారు. "మఖానాలు జీఐ ట్యాగ్‌ను సైతం పొందాయి" అని ఆయన వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం మత్స్య సంపద యోజన ప్రయోజనాలను పొందుతున్న చేపల పెంపకందారుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి పెద్ద చేపల ఎగుమతిదారుగా భారత్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.

 

కోశీ, మిథిలలో తరచూ సంభవించే వరదల నుంచి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు. బీహార్‌లో వరదల సమస్యను పరిష్కరించడానికి ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో సమగ్ర ప్రణాళికను ప్రకటించామన్నారు. నేపాల్ సహకారంతో వరదలకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రూ.11,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

"భారతీయ సంస్కృతికి బీహార్ ప్రధాన కేంద్రంగా ఉంది" అంటూ, దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని శ్రీ మోదీ అన్నారు. అందుకే “వికాస్ భీ, విరాసత్ భీ” మంత్రాన్ని తమ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఎంతో కాలంగా కోల్పోయిన ప్రజాదరణను తిరిగి పొందే దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి వెల్లడించారు.

భాషలను పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి చర్చించిన ప్రధాన మంత్రి... భగవాన్ బుద్ధుని బోధనలను, అద్భుతమైన బీహార్ చరిత్రను లిఖించిన పాళీభాషకు ప్రాచీన హోదా లభించిందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో మైథిలీ భాషను చేర్చింది కూడా తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. "జార్ఖండ్‌లో మైథిలీకి రాష్ట్ర రెండో భాషగా గుర్తింపు లభించింది" అని ఆయన అన్నారు.

 

రామాయణ సర్క్యూట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా అనుసంధానించిన 12 కంటే ఎక్కువ నగరాల్లో దర్భాంగా ఒకటని, దీని ద్వారా పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. దర్భంగా - సీతామర్హి - అయోధ్య మార్గంలో అమృత్ భారత్ రైలు ప్రజలకు మేలు చేసిందని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత విశిష్ట సేవలు అందించిన దర్భంగా ఎస్టేట్ మహారాజు శ్రీ కామేశ్వర్ సింగ్ జీకి శ్రీ మోదీ నివాళులర్పించారు. శ్రీ కామేశ్వర్ సింగ్ జీ చేసిన సామాజిక సేవ దర్భంగాకు గర్వకారణమని, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన చేసిన మంచి పనుల గురించి కాశీలో సైతం తరచూ చర్చించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి... ప్రజలకు గరిష్ట ప్రయోజనాలను అందించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాన్ని పునరుద్ఘాటించారు. వారికి మరోసారి అభినందనలు తెలిపారు.

 

బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర ఆర్లేకర్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ ప్రాంతంలో ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌కు పెద్ద పీట వేస్తూ రూ. 1260 కోట్లతో నిర్మించే ద‌ర్భంగా ఎయిమ్స్‌కు ప్రధానమంత్రి శంకుస్థాప‌న చేశారు. దీనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆయుష్ విభాగం, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, రాత్రి బస చేసేందుకు షెల్టర్, రెసిడెన్షియల్ సౌకర్యాలు ఉన్నాయి. ఇది బీహార్, సమీప ప్రాంతాల ప్రజలకు స్పెషలిస్ట్ వైద్య సేవలను అందిస్తుంది.

రోడ్డు, రైలు రంగాల్లో కొత్త ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో అనుసంధాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. బీహార్‌లో దాదాపు రూ. 5,070 కోట్ల విలువైన బహుళ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.

ఎన్‌హెచ్-327ఈ విభాగంలో నాలుగు లేన్ల గల్గాలియా-అరారియా సెక్షన్‌ను ఆయన ప్రారంభించారు. ఇది తూర్పు-పశ్చిమ కారిడార్ (ఎన్‌హెచ్-27)లోని అరారియా నుంచి గల్గాలియా వద్ద పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. ఎన్‌హెచ్-322, ఎన్‌హెచ్-31లో రెండు రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లను, బంధుగంజ్ వద్ద ఎన్‌హెచ్-110పై జెహానాబాద్‌ను బీహార్‌ షరీఫ్‌తో కలిపే ప్రధాన వంతెనను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

రామ్‌నగర్ నుంచి రోసెరా వరకు, బీహార్-పశ్చిమ బెంగాల్ సరిహద్దు నుంచి ఎన్‌హెచ్-131ఏ లోని మణిహరి సెక్షన్ వరకు, హజీపూర్ నుంచి బచ్వారా మీదుగా మహ్నార్, మొహియుద్దీన్ నగర్, సర్వన్- ఛకాయ్ వరకు విస్తరించిన రెండు లేన్ల రహదారితో సహా ఎనిమిది జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్-327ఈలో రాణిగంజ్ బైపాస్‌ రోడ్డుకు, ఎన్‌హెచ్-333ఏపై కటోరియా, లఖ్‌పురా, బంకా, పంజ్వారా బైపాస్‌లు, ఎన్‌హెచ్-82 నుంచి ఎన్‌హెచ్ -33 వరకు నాలుగు లేన్ల లింక్ రోడ్డుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

 

రూ.1740 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో చీరైలాపౌతు నుంచి బాఘా బిషున్‌పూర్‌ వరకు రూ.220 కోట్ల విలువైన సోనేనగర్‌ బైపాస్‌ రైలు మార్గానికి ఆయన శంకుస్థాపన చేశారు.

రూ.1520 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను సైతం ఆయన జాతికి అంకితం చేశారు. వీటిలో ప్రాంతీయంగా రవాణా సదుపాయాలను మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన జంఝర్‌పూర్-లౌకహా బజార్ రైలు విభాగంలో గేజ్ మార్పిడి, దర్భంగా జంక్షన్‌లో రైల్వే ట్రాఫిక్ రద్దీని తగ్గించే దర్భంగా బైపాస్ రైల్వే లైన్, డబ్లింగ్ ప్రాజెక్టులున్నాయి.

జంజార్పూర్-లౌకహా బజార్ సెక్షన్‌లో రైలు సేవలను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.  ఈ విభాగంలో మెము రైలు సేవలను ప్రారంభించడం ద్వారా సమీపంలోని పట్టణాలు, నగరాల్లో ఉద్యోగ, విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

 

భారతదేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన 18 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. ఇవి రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే ఔషధాలను ప్రయాణికులకు అందిస్తాయి. ఇవి జనరిక్ ఔషధాలపై అవగాహన పెంచడంతో పాటు, వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి. తద్వారా ఆరోగ్య సంరక్షణపై చేసే వ్యయం తగ్గుతుంది.

పెట్రోలియం, సహజవాయు రంగంలో రూ. 4,020 కోట్ల విలువైన వివిధ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి)ని గృహాలకు సరఫరా చేయడం, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు స్వచ్ఛమైన ఇంధనాలను అందించాలనే దృక్పథానికి అనుగుణంగా, బీహార్‌లోని అయిదు ప్రధాన జిల్లాలైన మధుబని, సుపాల్, సీతామర్హి, షెయోహర్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) వ్యవస్థ అభివృద్ధికి దర్భంగా వద్ద ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని బరౌనీ రిఫైనరీకి చెందిన తారు తయారీ యూనిట్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఇది దిగుమతిలపై ఆధారపడకుండా దేశీయంగా తారును ఉత్పత్తి చేస్తుంది.

 

Click here to read full text speech

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi