These projects will significantly improve the ease of living for the people and accelerate the region's growth : PM

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. వీటిలో రైల్వేలు, రహదారులు, పర్యాటకం, జల సంరక్షణ ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలోని అమ్రేలీ, జామ్‌నగర్, మోర్బి, దేవభూమి ద్వారక, జునాగఢ్, పోర్‌బంద‌ర్‌, కచ్, బోటాడ్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

   ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్  పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగ‌లు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగ‌మన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.
 

   సౌరాష్ట్రలోని అమ్రేలీ మన దేశానికి ఎందరో జాతిరత్నాలను అందించిందని ప్రధాని అభివర్ణించారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా, సాహితీపరంగా, రాజకీయంగానే కాకుండా అనేక విధాలుగా ఈ ప్రాంతానికి అద్భుత చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు. ఇది శ్రీ యోగీజీ మహారాజ్,  భోజా భగత్‌లతోపాటు జానపద గాయక-కవి దూలభయ్యా కగ్, కలాపి వంటి కవులు, ప్రపంచ ప్రసిద్ధ ఐంద్రజాలికుడు కె.లాల్, ఆధునిక కవిత్వ అగ్రగామి రమేష్ పరేఖ్‌ వంటి ఎందరో మహామహులకు కర్మభూమి అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ జీవరాజ్ మెహతా ఈ నగర వాస్తవ్యులేనని గుర్తుచేశారు. వ్యాపార ప్రపంచంలో పేరుప్రతిష్ఠలు సంపాదించిన ఎందరో అమ్రేలీ ముద్దుబిడ్డలు సమాజ సంక్షేమానికీ అవిరళ కృషి చేశారని శ్రీ మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో జల సంరక్షణ కార్యక్రమాల వ్యయాన్ని ప్రభుత్వం 80 శాతం, ప్రజలు 20 శాతం వంతున భరించే పథకం అమలవుతుండటాన్ని ఆయన గుర్తుచేశారు. దీనితో ముడిపడిన ధోలాకియా కుటుంబం సమాజ సేవా సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేస్తున్నదని ప్రశంసించారు. రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాలుగా ఈ నిరంతర కృషి కొనసాగుతున్న ఫలితంగా నేడు స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

   దీర్ఘకాలం నీటి కొరత సమస్యను ఎదుర్కొన్న గుజరాత్... ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రజలకు జల సంరక్షణ ఎంతో కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. నీటి కొరత ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు వలసపక్షులుగా పేరుపడ్డారని గుర్తుచేస్తూ- ‘‘ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నర్మదా నదీజలాలు గ్రామాలకు చేరువయ్యాయి’’ అన్నారు. ‘జలసంచయ్’, భూగర్భజల మట్టం గణనీయంగా పెంచే ‘సౌనీ’ పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రధాని ప్రశంసించారు. నదుల లోతు పెంపు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి పనులతో వరదల సమస్య తగ్గుతుందని, వర్షపు నీటిని కట్టుదిట్టంగా నిల్వ చేసుకోవచ్చునని చెప్పారు. తద్వారా పరిసర ప్రాంతాల్లోని  లక్షలాది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, తాగునీటి సమస్య కూడా పరిష్కారం కాగలదని ఆయన తెలిపారు.
 

   గుజ‌రాత్‌లో ఇంటింటికీ, ప్రతి కమతానికీ నీరందేలా చేయడంలో రెండు దశాబ్దాలుగా రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతి దేశానికే ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి గుర్తుచేశారు. రాష్ట్రం నలుమూలలకూ నీటి సరఫరా దిశగా నిరంతర కృషి కొనసాగుతోందని, ఇందులో భాగంగా ఇవాళ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలోని లక్షలాది మందికి మరింత మేలు కలుగుతుందని చెప్పారు. వీటిలో ‘నవ్దా-చావంద్ బల్క్ పైప్‌లైన్ ప్రాజెక్ట్’ వల్ల దాదాపు 1,300 గ్రామాలతోపాటు అమ్రేలీ, బోటాడ్, జునాగఢ్, రాజ్‌కోట్, పోర్‌బందర్ వంటి జిల్లాలపై ప్రభావం చూపే 35 నగరాలకూ ప్రయోజనం చేకూరుతుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఆ మేరకు నిత్యం అదనంగా 30 కోట్ల లీటర్ల నీరు ఈ ప్రాంతాలకు సరఫరా అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ‘పస్వీ గ్రూప్ సౌరాష్ట్ర ప్రాంతీయ నీటి సరఫరా పథకం’ రెండో దశకు శంకుస్థాపన చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘ఇది పూర్తయితే తాలాజా, మహువా, పాలితానా తాలూకాల నీటి అవసరాలు తీరుతాయి... దాదాపు 100 గ్రామాలు నేరుగా లబ్ధి పొందుతాయి’’ అని చెప్పారు.

   ప్రజా భాగస్వామ్య్యంతో చేపడుతున్న నేటి జల సంరక్షణ పథకాలు ప్రభుత్వ-సమాజ సహకార స్ఫూర్తికి నిదర్శనమని ప్రధాని అన్నారు. దేశ 75వ స్వాతంత్య్ర  సంవత్సరాన్ని జల సంరక్షణ కార్యక్రమాలతో జోడించడం ద్వారా సాధించిన విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత సరోవరాలు రూపుదిద్దుకోవడాన్ని ఆయన ఉదహరించారు. భవిష్యత్తరాలకు సుసంపన్న జల వారసత్వం సంక్రమింపజేస్తూ గ్రామాలలో 60,000 అమృత  సరోవరాలు నిర్మించడంపై శ్రీ మోదీ హర్షం ప్రకటించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్.పాటిల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ‘వర్షాన్ని ఒడిసి పడదాం’ కార్యక్రమం ఊపందుకోవడాన్ని ఆయన ప్రశంసించారు. ఇందులో భాగంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రజల భాగస్వామ్యంతో వేలాదిగా జలపూరక బావుల నిర్మాణం ద్వారా సాధించిన గణనీయ పురోగతిని ప్రధాని గుర్తుచేశారు. గ్రామాలు, పొలాల నడుమ స్థానికంగా నీటి నిల్వకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. అనేకమంది గ్రామీణులు తమ పూర్వికుల గ్రామాల్లో ఇలాంటి బావుల నిర్మాణానికి ఉత్సాహంగా ముందుకు రావడాన్ని ప్రశంసించారు. జల సంరక్షణ ద్వారా వ్యవసాయం, పశుపోషణను ప్రోత్సహించే లక్ష్యంతో నేడు వందలాది ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
 

   నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయం సులువైందని, అమ్రేలీలో ఇప్పుడు నర్మద నదీ జలాలతో ముక్కారు పంటలు పండుతున్నాయని ప్రధాని తెలిపారు. ఈ మేరకు ‘‘అమ్రేలీ జిల్లా నేడు వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఆవిర్భవించింది’’ అని పేర్కొన్నారు. పత్తి, వేరుసెనగ, నువ్వులు, చిరుధాన్యాలు వంటి పంటల సాగుకు సానుకూలత ఏర్పడిందని, అమ్రేలీకి గర్వకారణమైన ‘కేసర్‌’ మామిడికి ‘భౌగోళిక గుర్తింపు’ (జిఐ ట్యాగ్‌) లభించిందని ఆయన గుర్తుచేశారు. ఈ గుర్తింపుతో కేసర్ మామిడిని ప్రపంచంలో ఎక్కడ విక్రయించినా అది అమ్రేలీతో ముడిపడి ఉంటుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయానికి ఓ  కూడలిగా ఈ జిల్లా వేగంగా పురోగమిస్తున్నదని, దేశంలో తొలి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అమ్రేలీ పరిధిలోని ‘హలోల్‌’ నగరంలో నిర్మిస్తుండటమే ఇందుకు నిదర్శనమని ప్రధాని ఉద్ఘాటించారు. అలాగే ఈ విశ్వవిద్యాలయం పరిధిలో తొలి ప్రకృతి వ్యవసాయ కళాశాల కూడా ఏర్పాటవుతున్నదని ఆయన తెలిపారు. రైతులు మరింత ఎక్కువగా పశుపోషణ వైపు మళ్లడంతోపాటు ప్రకృతి వ్యవసాయం ద్వారా లబ్ధి పొందేలా చూడటమే దీని లక్ష్యమని శ్రీ మోదీ అన్నారు. ఇటీవలి కాలంలో అమ్రేలీ పాడి పరిశ్రమ విశేష ప్రగతి సాధించిందని, ప్రభుత్వంతోపాటు సహకార సంఘాల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ‘అమర్ డెయిరీ’ని 2007లో ప్రారంభించినపుడు 25 గ్రామాల్లోని ప్రభుత్వ కమిటీలు దానితో అనుసంధానం కావడాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘ఇప్పుడు 700కుపైగా సహకార సంఘాలు ఈ డెయిరీతో ముడిపడి ఉన్నాయి. ఇవి నిత్యం దాదాపు 1.25 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి’’ అని వివరించారు.
   మధుర (తేనె) విప్లవం ద్వారా అమ్రేలీకి ఎంతో ప్రాచుర్యం లభించిందని పేర్కొంటూ, తేనె ఉత్పత్తితో రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతున్నదని శ్రీ మోదీ అన్నారు. ఈ జిల్లాలో నేడు వందలాది రైతులు తేనెటీగల పెంపకంలో శిక్షణ పొంది, సంబంధిత వ్యాపారాలు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
   అనంతరం ‘ప్రధానమంత్రి సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం’ గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇది ప్రతి కుటుంబానికీ విద్యుత్ బిల్లు భారం తగ్గించడంతోపాటు అదనపు ఆదాయం ద్వారా ఏటా ₹25,000 నుంచి 30,000 దాకా లబ్ధి చేకూర్చే పథకమని ఆయన పేర్కొన్నారు. దీన్ని అమలు చేసిన నెలల వ్యవధిలోనే గుజ‌రాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పుపై దాదాపు 2,00,000 సౌర ఫలకాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వందలాది ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్న దుధాలా గ్రామం ఆదర్శంగా సౌరశక్తి రంగంలో అమ్రేలీ జిల్లా వేగంగా పురోగమిస్తున్నదని ఆయన వివరించారు. ఇప్పుడీ గ్రామం నెలకు ₹75,000 దాకా విద్యుత్ బిల్లు ఆదా చేస్తుండగా, ప్రతి ఇంటికీ ఏటా ₹4,000 వరకూ ప్రయోజనం లభిస్తుందని చెబుతూ- ‘‘అమ్రేలీలో తొలి సౌరశక్తి గ్రామంగా దుధాలా దూసుకుపోతోంది’’ అని వ్యాఖ్యానించారు.

 

   అనేక పవిత్ర, ఆధ్యాత్మిక ప్రదేశాలకు నిలయమైన సౌరాష్ట్ర ప్రాంతం పర్యాటక రంగానికి ప్రముఖ కూడలిగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రత్యేకించి... సర్దార్ సరోవర్ ఆనకట్ట ఇందులో ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నదని వివరించారు. ఇక్కడి సర్దార్ పటేల్ విగ్రహం  ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదని, నిరుడు దీన్ని 50 లక్షల మందికిపైగా పర్యాటకులు సందర్శించారని గుర్తుచేశారు. మరో రెండు రోజుల్లో నిర్వహించే సర్దార్ సాహెబ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ ప్రదేశాన్ని తాను సందర్శిస్తానని, అక్కడ జాతీయ ఐక్యత కవాతును వీక్షిస్తానని ఈ సందర్భంగా చెప్పారు.

   ‘కెర్లీ’ భూగర్భ జలపూరక జలాశయం రానున్న రోజుల్లో పర్యావరణ పర్యాటక కేంద్రంగా రూపొందగలదని, అలాగే సాహస పర్యాటకానికీ ఉత్తేజం లభిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. అంతేకాకుండా ‘కెర్లీ పక్షుల రక్షిత కేంద్రం’ అంతర్జాతీయ గుర్తింపు పొందగలదని పేర్కొన్నారు.

   సుదీర్ఘ తీరప్రాంతం గుజరాత్‌కు ఒక వరమని, ఈ నేపథ్యంలో వారసత్వ సంపద పరిరక్షణ సహా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని శ్రీ మోదీ అన్నారు. ఈ దిశగా శతాబ్దాల నాటి మత్స్య, ఓడరేవుల వారసత్వ పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నామని తెలిపారు. లోథాల్‌లో ‘జాతీయ సముద్ర వారసత్వ సముదాయం’ (ఎన్ఎంహెచ్‌సి) నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధాని గుర్తుచేశారు. దీంతో మన విశిష్ట సముద్ర వారసత్వం దేశానికే కాకుండా ప్రపంచానికీ పరిచయమై, ప్రజానీకంలో స్ఫూర్తి నింపుతుందని వ్యాఖ్యానించారు.

   దేశంలో నీలి విప్లవం గురించి మాట్లాడుతూ- ‘‘నీలివర్ణ సముద్రం నీలి విప్లవానికి కొత్త ఉత్తేజం ఇవ్వాలన్నదే మా లక్ష్యం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. రేవుల సారథ్యంలో అభివృద్ధి వికసిత భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని జాఫ్రాబాద్, షియాల్‌బెట్‌లో మత్స్యకారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా అమ్రేలీలోని ‘పిపవావ్’ ఓడరేవును ఆధునికీకరించడంతో 10 లక్షలకుపైగా కంటైనర్లు, వేలాది వాహనాల నిర్వహణ సామర్థ్యం సమకూరడమే కాకుండా వేలాదిగా కొత్త ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ‘పిపవావ్’తోపాటు గుజరాత్‌లోని ఈ తరహా రేవులన్నిటినీ దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని శ్రీ మోదీ చెప్పారు.
 

   ‘వికసిత భారత్’ రూపుదిద్దుకోవాలంటే పేదలకు పక్కా ఇళ్లు, విద్యుత్ సౌకర్యం, రహదారులు, రైలుమార్గాలు, విమానాశ్రయాలు, గ్యాస్ పైప్‌లైన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన అత్యావశ్యకమని ప్రధాని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం మూడోదఫా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ దిశగా శరవేగంతో ముందడుగు వేస్తున్నదని తెలిపారు.  సౌరాష్ట్రలో మౌలిక సదుపాయాల అనుసంధానం మెరుగుదలతో చేకూరిన ప్రయోజనాలు ఈ ప్రాంతా పారిశ్రామిక వృద్ధికి గణనీయంగా దోహదం చేశాయని ఆయన వివరించారు. ముఖ్యంగా  ‘‘రోల్ ఆన్-రోల్ ఆఫ్ (రో-రో) ఫెర్రీ (బల్లకట్టు) సేవ ప్రారంభంతో సౌరాష్ట్ర-సూరత్ మధ్య అనుసంధాన సౌలభ్యం మెరుగైంది. దీనివల్ల కొన్నేళ్లలో 7 లక్షలమందికి పైగా ప్రయోజనం పొందారు. లక్షకు పైగా కార్లతోపాటు 75,000కు పైగా ట్రక్కులు, బస్సుల రవాణా వల్ల సమయం, సొమ్ము రెండూ ఆదా అయ్యాయి’’ అని ప్రధాని గుర్తుచేశారు.

   జామ్‌నగర్ నుంచి అమృత్‌సర్-భటిండా వరకూ ఆర్థిక కారిడార్ నిర్మాణంలో పురోగమన వేగాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు, ‘‘ఈ ప్రాజెక్టుతో గుజరాత్-పంజాబ్ మధ్యనగల వివిధ రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరుతుంది. ఇక నేటి వివిధ ప్రారంభోత్సవాలు, రహదారుల శంకుస్థాపన నేపథ్యంలో జామ్‌నగర్, మోర్బీ వంటి కీలక పారిశ్రామిక కూడళ్లకు అనుసంధానం మెరుగుపడుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలకు మార్గ సౌలభ్యంతోపాటు సోమనాథ్, ద్వారక వంటి చారిత్రక క్షేత్రాల యాత్ర సులభమవుతుంది’’ అన్నారు. కచ్‌ ప్రాంతంలో రైల్వే అనుసంధాన విస్తరణ సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో పర్యాటకం, పారిశ్రామికీకరణకు మరింతగా దోహదం చేస్తుందని చెప్పారు.

   ‘‘భారత్ వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడిస్తోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచం నేడు కొత్త దృక్కోణంతో భారత్ వైపు దృష్టి సారించడమేగాక మన సామర్థ్యాన్ని గుర్తిస్తూ, మన గళానికి విలువనిస్తున్నదని చెప్పారు. భార‌త్‌లోగల అపార అవకాశాలపై ప్రతి దేశంలోనూ చర్చ సాగుతున్నదని, ఇందులో గుజరాత్‌ పాత్ర కీలకమని ఉద్ఘాటించారు. మన దేశ సామర్థ్యమేమిటో గుజ‌రాత్‌లోని ప్రతి నగరం, గ్రామం ప్రపంచానికి రుజువు చేశాయని వ్యాఖ్యానించారు. రష్యాలో ఇటీవల తాను ‘బ్రిక్స్’ సదస్సుకు హాజరైన సందర్భంగా- అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ భారత్‌తో మమేకమై, పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జర్మనీ చాన్సలర్ ఇటీవలి భారత్ పర్యటనను, ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు చేయడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. జర్మనీ ఇప్పుడు వార్షిక వీసా కోటాను 20 వేలకు పెంచిందని, దీంతో మన యువతకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. అలాగే గుజరాత్‌లో స్పెయిన్ అధ్యక్షుడి పర్యటన, వడోదరలో రవాణా విమానాల తయారీ కర్మాగారం రూపంలో ఆ దేశం భారీ పెట్టుబడులు పెట్టడాన్ని కూడా శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. లక్షలాది కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేసేవిధంగా విమానాల తయారీకి తగిన వాతావరణం సృష్టించినట్లు తెలిపారు. దీనివల్ల గుజరాత్‌లో వేలాది సూక్ష్మ-లఘు పరిశ్రమలకూ ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నారు.
 

    చివరగా... నేటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలపై ప్రజలను అభినందిస్తూ- ‘‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాభివృద్ధి ద్వారా దేశం కూడా ముందంజ వేస్తుందని చెప్పేవాణ్ని. ఆ మేరకు ఒక వికసిత గుజరాత్ ‘వికసిత భారత్’ దిశగా మన పయనాన్ని సుగమం చేస్తుంది’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్.పాటిల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ పర్షోత్తం రూపాలా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   ఈ పర్యటనలో భాగంగా అమ్రేలీలోని దుధాలా గ్రామంలో భారతమాత సరోవరాన్ని ప్రధాని ప్రారంభించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) కింద గుజరాత్ ప్రభుత్వం, ధోలాకియా ఫౌండేషన్‌ దీన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో భాగంగా ధోలాకియా ఫౌండేషన్ చెక్‌డ్యామ్‌ లోతు, వెడల్పు పెంచడంతోపాటు బలోపేతం చేసే పనులు నిర్వహించింది. దీనివల్ల వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 4.5 కోట్ల లీటర్ల నుంచి 24.5 కోట్ల లీటర్లకు పెరిగింది. తద్వారా పరిసర ప్రాంతాల బావులు, బోర్లలో భూగర్భజల మట్టం మెరుగుపడింది. నీటి పారుదల సదుపాయం మెరుగుపడి చుట్టుపక్కల గ్రామాలతోపాటు రైతులకూ సౌలభ్యం కలిగింది.
 

   మరోవైపు రాష్ట్రంలోని అమ్రేలీలో దాదాపు ₹4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వీటిద్వారా అమ్రేలీ, జామ్‌నగర్, మోర్బి, దేవభూమి ద్వారక, జునాగఢ్, పోర్‌బంద‌ర్‌, కచ్, బోటాడ్ జిల్లాల ప్రజలకు ఎనలేని ప్రయోజనం లభిస్తుంది.

   అలాగే ₹2,800 కోట్లకుపైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వీటిలో జాతీయ ర‌హ‌దారి నం.151, 151ఎ, 51తోపాటు జునాగఢ్ బైపాస్‌లోని వివిధ విభాగాలను 4 వరుసలకు విస్తరించడం వంటి పనులున్నాయి. జామ్‌నగర్ జిల్లాలోని ధ్రోల్ బైపాస్ నుంచి మోర్బి జిల్లాలో అమ్రాన్ వరకూ మిగిలిన విభాగంలోనూ 4 వరుసల విస్తరణ ప్రాజెక్టుకూ ప్రధాని శంకుస్థాపన చేశారు.

   మరోవైపు దాదాపు ₹1,100 కోట్లతో పూర్తిచేసిన భుజ్-నాలియా రైల్ గేజ్ కన్వర్షన్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ విస్తృత ప్రాజెక్టు పరిధిలో 24 ప్రధాన, 254 చిన్న వంతెనలతోపాటు 3 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, 30 రోడ్డు అండర్‌బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. కచ్  జిల్లా సామాజిక-ఆర్థిక ప్రగతిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
 

   నీటి సరఫరా విభాగం పరిధిలో ₹700 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అమ్రేలీ జిల్లా నుంచి ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వీటిలో నవ్దా-చావంద్ బల్క్ పైప్‌లైన్ ప్రాజెక్టు ఒకటి కాగా- దీనిద్వారా 36 నగరాలతోపాటు బోటాడ్, అమ్రేలీ, జునాగఢ్, రాజ్‌కోట్, పోర్‌బందర్ జిల్లాల్లోని 1,298 గ్రామాల్లో సుమారు 67 లక్షల మందికి అదనంగా 28 కోట్ల లీటర్ల నీరు సరఫరా అవుతుంది. భావ్‌నగర్ జిల్లాలో పస్వీ గ్రూప్ ఆగ్మెంటేషన్ వాటర్ సప్లై స్కీమ్ రెండోదశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే జిల్లా పరిధిలోని మహువ, తాలాజా, పాలితానా తాలూకాల్లోగల 95 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది.
 

   పోర్‌బందర్ జిల్లాలోని మోకర్‌సాగర్‌లో కెర్లీ జలపూరక జలాశయాన్ని అంతర్జాతీయ సుస్థిర పర్యావరణ పర్యాటక గమ్యంగా మార్చే ప్రాజెక్టుతోపాటు పర్యాటక సంబంధ అభివృద్ధి కార్యక్రమాలకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."