తుముకూరులో పారిశ్రామిక టౌన్ షిప్ కు, రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
“డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కర్ణాటకవైపు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది”
“మన రక్షణ రంగ అవసరాలకోసం విదేశాలమీద ఆధారపడటం తగ్గించుకోవాలి”
“కచ్చితంగా విజయం సాధించే నినాదం ‘దేశం ముందు’ అనేదే”
“ఈ ఫాక్టరీ, పెరుగుతున్న హెచ్ఎఎల్ బలం దుష్ప్రచారం చేసే వాళ్ళ నోళ్ళు మూయిస్తాయి”
“ఫుడ్ పార్క్ తరువాత తుముకూరుకు పారిశ్రామిక టౌన్ షిప్ ఒక పెద్ద బహుమతి; హెచ్ఎఎల్ వలన దేశంలోనే ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తుముకూరు అభివృద్ధి చెందుతుంది”
“డబుల్ ఇంజన్ ప్రభుత్వం సామాజిక మౌలిక సదుపాయాలమీద, భౌతిక మౌలిక సదుపాయాలమీద సమానంగా దృష్టి సారిస్తోంది”
“ఈసారి బడ్జెట్ సమర్థ భారత్, సంపన్న భారత్, స్వయంపూర్ణ భారత్, శక్తిమాన్ భారత్, గతివాన్ భారత్ దిశలో పెద్ద అడుగు”
“బడ్జెట్ లో ఇచ్చిన ప్రయోజనాల కారణంగా మధ్య తరగతిలో ఎంతో ఉత్సాహం నెలకొన్నది”
“మహిళల ఆర్థిక సమ్మిళితి వల్ల ఇళ్ళలో వారి మాట బలంగా చెల్లుబాటవుతుంది; అందుకోసం ఈ బడ్జెట్ లో చాలా ఏర్పాట్లున్నాయి”

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తుముకూరులో ఈరోజు హెచ్ఎఎల్ హెలికాప్టర్ ఫాక్టరీని జాతికి అంకితం చేశారు. తుముకూరులో పారిశ్రామిక టౌన్ షిప్ కు, తిప్తూర్, చిక్కనాయకనహళ్ళి దగ్గర  రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు కూడా ప్రధాని ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్ తయారీ కేంద్రంలో కాసేపు తిరిగిన ప్రధాని తేలికపాటి వినియోగ హెలికాప్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి మాట్లాడుతూ, భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని, జ్ఞానాన్ని, శాస్త్రీయతా విలువలను  సుసంపన్నం  చేసిన ఋషులకు, సాధువులకు  కన్నడ నేల నిలయమన్నారు. తుముకూరు ప్రాధాన్యాన్ని, సిద్దగంగా మఠం సేవలను ప్రధాని కొనియాడారు. పూజ్య శివకుమార  స్వామి వదిలివెళ్ళిన అన్న, అక్షర, ఆశ్రయ వారసత్వ సంపదను శ్రీ సిద్దలింగ స్వామి ఇప్పుడు కొనసాగిస్తున్నారన్నారు.

ఈరోజు వందల కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులవలన యువతకు ఉపాధి అవకాశం కలుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ, మహిళలకు  జీవనం సులభమవుతుందని, అదే సమయంలో మన సాయుధ దళాల శక్తి పెరుగుతుందని, మేడిన్ ఇండియా భావన సాకారమవుతుందని అన్నారు. కర్ణాటక యువత ప్రతిభను, నవకల్పనాశక్తిని ప్రధాని ప్రశంసించారు. తయారీరంగంలో డ్రోన్లు మొదలుకొని తేజాస్ యుద్ధ విమానాల దాకా తయారు చేస్తూ తయారీరంగం తన బలం చాటుకున్నదన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కర్ణాటకవైపు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందన్నారు. విదేశాలమీద ఆధారపడటాన్ని తగ్గిస్తూ 2016 లో శంకుస్థాపన చేసినఆ హెచ్ ఎ ఎల్ ప్రాజెక్ట్ ఇప్పుడు సాకారం కావటాన్ని ప్రధాని ఉదాహరించారు.

ఈరోజు సాయుధ దళాలు వాడుతున్న వందలాది యుద్ధ పరికరాలు భారత్ లోనే తయారవుతుండటాన్ని ప్రస్తావిస్తూ, ఇది ఆనందించదగ్గ విషయమన్నారు. అత్యాధునిక రైఫిల్స్ మొదలు టాంకుల దాకా, విమాన వాహకాలు మొదలు హెలికాప్టర్లు, యుద్ధ జెట్ విమానాలు, రవాణా విమానాల దాకా భారత్ తయారు చేయగలుగుతోందన్నారు.  వైమానిక  రంగం గురించి మాట్లాడుతూ, 2014 కు ముందు, అంతకు ముందు 15 ఏళ్లలో ఈ రంగంలో పెట్టిన పెట్టుబడులకు ఐదు రెట్లు గడిచిన 8-9 సంవత్సరాలలోనే పెట్టిన సంగతి గుర్తు చేశారు. మేడిన్  ఇండియా ఆయుధాలు కేవలం భారతదేశ సైనిక అవసరాలకే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయని, 2014 తరువాత రక్షణ రంగ ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని అన్నారు. ఈ ఫాక్టరీలో వందల కొద్దీ హెలికాప్టర్లు తయారు కాబోతున్నాయని, త్వరలోనే 4 లక్షల కోట్ల వ్యాపారానికి ఎదిగే అవకాశముందని చెప్పారు.  పైగా, ఇలాంటి యూనిట్ల వలన ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయన్నారు. తుముకూరు హెలికాప్టర్ కర్మాగారం చుట్టూ చిన్న వ్యాపారాలు పెద్ద ఎత్తున సాధికారత సాధిస్తాయని కూడా ప్రధాని గుర్తు చేశారు. 

హెచ్ఎఎల్ పేరుతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఇటీవల సాగుతున్న దుష్ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, అబద్ధం ఎంత పెద్దదైనా, పదేపదే ప్రచారం చేసినా నిజం ముందు ఓడిపోక తప్పదన్నారు.  “ఈ ఫాక్టరీ, పెరుగుతున్న హెచ్ఎఎల్ బలం దుష్ప్రచారం చేసే వాళ్ళ నోళ్ళు మూయిస్తాయి. నిజం తనంతట తానే  మాట్లాడుతుంది ”  అని వ్యాఖ్యానించారు. ఈరోజు ఇదే హెచ్ ఎ ఎల్ భారత సాయుధ దళాల కోసం తేజస్ తయారు చేస్తూ, రక్షణ రంగంలో ఆత్మ నిర్భర చాటుకుంటూ యావత్ ప్రపంచాన్నీ ఆకట్టుకుందన్నారు. 

ఫుడ్ పార్క్ తరువాత తుముకూరుకు పారిశ్రామిక టౌన్ షిప్ ఒక పెద్ద బహుమతి అని,  హెచ్ఎఎల్ వలన దేశంలోనే ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తుముకూరు అభివృద్ధి చెందుతుందాని ప్రధాని ఆకాంక్షించారు. పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద టౌన్ షిప్ రూపుదిద్దుకోవటం ఆనందంగా ఉందన్నారు. ముంబై-చెన్నై జాతీయ రహదారిని, బెంగళూరు విమానాశ్రయాన్ని, తుముకూరు రైల్వే స్టేషన్ ను, మంగుళూరు నౌకాశ్రయాన్ని కలిపేలా ఉండటం గొప్ప విషయమన్నారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం సామాజిక మౌలిక సదుపాయాలమీద, భౌతిక మౌలిక సదుపాయాలమీద సమానంగా దృష్టి సారిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.  ఈ సంవత్సరం బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ, జల్ జీవన్ మిషన్ కేటాయింపులు ఈ సంవత్సరం 20,000 కోట్లకు పెరిగాయన్నారు. ఈ పథకానికి అతిపెద్ద లబ్ధిదారులు ఎంతో దూరం నడిచి నీళ్ళు మోసుకొచ్చే మన అమ్మలు, అక్కచెల్లెళ్ళేనని గుర్తు చేశారు. ఇక మీదట వాళ్ళకు ఆ శ్రమ ఉండదన్నారు. గడిచిన మూడేళ్లలో ఈ పథకం పరిధిని 3 కోట్ల గ్రామీణ గృహాల నుంచి 11 కోట్ల గ్రామీణ గృహాలకు పెంచామన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ అంకిత భావాన్ని గుర్తు చేస్తూ, అప్పర్ భద్రా ప్రాజెక్టుకు రూ.5,500 కోట్ల కేటాయింపు జరిగిందని, ఇది తుముకూరు, చిక్ మగళూరు, చిత్రదుర్గ, దావణగేరే తో బాటు కరవు పీడిత మధ్య కర్ణాటకకు ఎంతో మేలు చేస్తుందన్నారు. 

ఈ సంవత్సరం మధ్య తరగతి వారి  బడ్జెట్ ప్రవేశపెట్టామని, వికాస్ భారత్ కోసం అందరూ చేస్తున్న కృషికి ఇది ఊతమిస్తుందని అభివర్ణించారు. “ఈసారి బడ్జెట్ సమర్థ భారత్, సంపన్న భారత్, స్వయంపూర్ణ భారత్, శక్తిమాన్ భారత్, గతివాన్ భారత్ దిశలో పెద్ద అడుగు” అన్నారు.  ఇది జనరంజక బడ్జెట్ అని, ప్రతి ఒక్కరి హృదయాలనూ తాకుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.  బడ్జెట్ ప్రయోజనాలు యువతకు, వ్యవసాయ రంగంలోని మహిళలకు చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. “ మీ అవసరాలు, మీకు అందించాల్సిన సాయం, మీ ఆదాయం అనే మూడు అంశాలనూ  దృష్టిలో పెట్టుకున్నాం” అన్నారు.

ఒకప్పుడు ప్రభుత్వ సాయం అందటం గగనంగా మారిన వర్గాలను దృష్టిలో పెట్టుకొనివ 2014 నుంచి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.  “ప్రభుత్వ పథకాలు వారికి అందకపోవటమో, మధ్య దళారీలు దోచుకోవటమో జరిగేది” అన్నారు.  కార్మికులకు పెన్షన్, బీమా సౌకర్య కల్పించటాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. పిఎం కిసాన్ సమ్మాన్  నిధిని  ప్రస్తావిస్తూ చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పిఎం కౌశల్ హస్తకళాకారులకు వికాస్ యోజన ద్వారా ప్రయోజనం చేకూరుతుందని విశ్వకర్మలు, కుమ్మరి, కమ్మరి లాంటి వృత్తి కులాల వారు తమ హస్త నైపుణ్యం మెరుగు పరచుకోవటానికి పనికొస్తుందని అన్నారు.

అట్టడుగు వర్గాల వారికోసం తీసుకుంటున్న అనేక చర్యలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా సమయంలో పేదలకు  ఉచిత రేషన్ కోసం ప్రభుత్వం 4 లక్షలకోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. పేదల గృహనిర్మాణం కోసం 70 వేలకోట్లు ఖర్చుచేశామన్నారు.  

బడ్జెట్ లో  ప్రధానాంశాలను ప్రస్తావిస్తూ, ఆదాయం పన్ను ప్రయోజనాలు  మధ్యతరగతికి ఉపయోగపడతాయన్నారు.  7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకపోవటం మధ్యతరగతిలో ఎంతో ఉత్సాహం నింపిందన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన 30 ఏళ్లలోపు వారు, నెల నెలా ఖాతాలోకి డబ్బు వచ్చేవారు ఎంతో సంతోషించారన్నారు. అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్ల డిపాజిట్ పరిమితిని 15 లక్షలనుంచి 30 లక్షలకు పెంచటం, లీవ్ ఎన్ కాష్ మెంట్ మీద రిబేట్ ను 3 లక్షల నుంచి 25 లక్షలకు పెంచటం గురించి ప్రధాని ప్రస్తావించారు.

కేంద్ర బడ్జెట్ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి సారించిందని, అదే సమయంలో డిజిటల్ టెక్నాలజీ సాయం, సహకార సంస్థల విస్తరణ ద్వారా రైతులకు అడుగడుగునా అండగా నిలబడే ప్రయత్నం చేసిందని అన్నారు. ఇది రైతులకు, పశు పోషణదారులకు, మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  కర్ణాటకలోని చెరకు రైతులు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేమందుకు వీలవుతుందన్నారు. అదే విధంగా , ఆహార ధాన్యాలు పండించే రైతులు వాటిని  నిల్వ చేసుకోవటానికి దేశవ్యాప్తంగా గోదాముల నిర్మాణం జరుగుతోందన్నారు.  చిన్న రైతులు  కూడా తమ ఉత్పత్తులను నిల్వ చేసుకొని సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రకృతి సహజ వ్యవసాయం ద్వారా ఖర్చు తగ్గించుకోవటానికి రైతులకోసం  వేలాది సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయటాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కర్ణాటకలో చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశం ముతక ధాన్యాలకు ‘శ్రీ అన్’ అనే పేరు పెట్టి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తికి  ఈ సారి బడ్జెట్ లో ప్రాధాన్యమిచచ్చిన సంగతి చెబుతూ, అది కర్ణాటకలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్, కేంద్ర రక్షణ శాఖామంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతాశాఖామంత్రి శ్రీ నారాయణ స్వామి, కర్ణాటక రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత వైపు మరో అడుగేస్తూ ప్రధాని తుముకూరులో హెచ్ఎఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. దీనికి 2016 లో ప్రధాని స్వయంగా శంకుస్థాపన కూడా చేశారు. ఇది పూర్తిస్థాయి కాలుష్యరహిత హెలికాప్టర్ తయారీ కేంద్రం. హెలికాప్టర్ తయారీ సామర్థ్యాన్ని, అందుకు తగిన పర్యావరణాన్ని ఇది పెంపొందిస్తుంది. ఆసియా ఖండంలోనే  అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఇది తేలికపాటి వినియోగ హెలికాప్టర్లు (లైట్ వెయిట్ హెలికాప్టర్స్) తయారు చేస్తుంది. 3 టన్నుల విభాగంలో స్వదేశీ డిజైన్ తో, ఒకే ఇంజన్ తో బహుళ ప్రయోజనాలతో రకరకాలుగా విన్యాసాలు చేయగలిగేలా  రూపు దిద్దుకున్న హెలికాప్టర్ ఇది. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, భారతీయ బహుళపాత్ర  హెలికాప్టర్ లాంటి ఇతర హెలికాప్టర్లు కూడా తయారుచేయగలిగేలా ఈ ఫాక్టరీని విస్తరిస్తారు. అదే విధంగా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఈ హెలికాప్టర్లన్నిటి నిర్వహణ, మరమ్మతులు కూడా ఇక్కడే చేపడతారు.  ముందు ముందు పౌర రంగంలో వాడే తేలికపాటి హెలికాప్టర్లను కూడా తయారు చేయగల అవకాశం ఈ ఫ్యాక్టరీకి ఉంది. దీనివల్ల భారత దేశానికి అవసరమైన అన్ని రకాల హెలికాప్టర్ అవసరాలనూ స్వదేశంలో తీర్చుకోగలిగే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా హెలికాప్టర్ డిజైన్, అభివృద్ధి, తయారీ దాకా భారతదేశం స్వావలంబన సాధించటానికి దోహదపడుతుంది.

ఈ ఫ్యాక్టరీలో తయారీ ప్రమాణాలు 4.0 స్థాయిలో ఉంటాయి. వచ్చే 20 ఏళ్లలో ఈ తుముకూరు ఫాక్టరీ నుంచి 3.15 టన్నుల సామర్థ్యముండే హెలికాప్టర్లు 1000 కి పైగా తయారయ్యే అవకాశాలున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో దాదాపు 6000 మందికి ఉపాధి దొరుకుతుంది.

తుముకూరు పారిశ్రామిక టౌన్ షిప్  కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద  చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తూముకూరులో 8484 ఎకరాలలో మూడు దశలలో పారిశ్రామిక టౌన్ షిప్ నిర్మాణం జరుగుతుంది.

ఈ సందర్భంగా తుముకూరులోని తిప్తూర్, చిక్కనాయకన హళ్ళి అనే రెండు చోట్ల జల్  జీవన్  మిషన్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.  తిప్తూర్ బహుళ గ్రామ త్రాగు నీటి  సరఫరా ప్రాజెక్ట్ ను రూ. 430 కోట్లతో నిర్మిస్తుండగా, 147 ఆవాసాలకు త్రాగునీరందించే చిక్కనాయకనహళ్ళి బహుళ గ్రామ త్రాగునీటి ప్రాజెక్ట్ ను సుమారు రూ. 115 కోట్లతో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుస్తాయి.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi