ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని మాండ్యలో వివిధ కీలక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. వీటిలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, మైసూరు-కుశాల్‌నగర్ 4 వరుసల జాతీయ రహదారి వంటి పథకాలున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- ముందుగా భువనేశ్వరీ మాతతోపాటు ఆది చుంచనగిరి, మేలుకోటే గురువులకు ఆయన వందనం చేశారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ప్రజలతో మమేకమయ్యే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పర్యటనలలో తనపై ప్రేమాభిమానాలు చూపడంతోపాటు ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మాండ్య ప్రజల ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని, వారి ఆశీస్సుల మధురానుభూతిలో తడిసిముద్దయ్యానని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలకు తగినట్లుగా రెండు ఇంజన్ల ప్రభుత్వం సత్వర అభివృద్ధితో వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నేడు రూ.వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన చేయబడ్డాయని అని ఆయన వివరించారు.
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే సంబంధిత జాతీయ ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ- ఇటువంటి అత్యాధునిక, నాణ్యమైన ప్రాజెక్టులను చూసి దేశ యువతరం గర్విస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే కారణంగా మైసూరు-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గుతుందని ప్రధాని చెప్పారు. అలాగే మైసూరు-కుశాల్‌నగర్ 4 వరుసల జాతీయ రహదారికి శంకుస్థాపన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు ‘సమష్టి ప్రగతి’ స్ఫూర్తిని మరింత పెంచి, సౌభాగ్యానికి బాటలు వేస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు రావడంపై కర్ణాటక ప్రజలను ప్రధానమంత్రి అభినందించారు.
భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఇద్దరు మహనీయులను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు “కర్ణాటక మాత పుత్రులైన కృష్ణరాజ వడయార్, ‘సర్’ మోక్షగుండం విశ్వేశ్వరాయ దేశానికి కొత్త దృక్పథాన్ని నిర్దేశించి, శక్తిమంతం చేశారు. ఈ మహనీయులు విపత్తులను అవకాశాలు మార్చారు. మౌలిక సదుపాయాల ప్రాముఖ్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. వారి అవిరళ కృషి ఫలితాలను నేటి తరం అనుభవిస్తుండటం అదృష్టం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వారి అడుగుజాడల్లో దేశవ్యాప్తంగా అధునాతన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన సాగుతోందని ప్రధాని విశదీకరించారు. ఈ మేరకు ‘భారతమాల’, ‘సాగరమాల’ వంటి ప్రాజెక్టులతో దేశమే కాకుండా కర్ణాటక రాష్ట్రం కూడా భౌగోళికంగా పరివర్తన చెందుతున్నది” అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం యావత్తూ కరోనాతో నేటికీ సతమతం అవుతున్న సమయంలోనూ మన దేశంలో మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో కేటాయింపు అనేక రెట్లు పెంచుతూ రావడాన్ని ప్రధాని గుర్తుచేశారు. తదనుగుణంగా ఈ ఏడాది రూ.10 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలతో జీవన సౌలభ్యం మెరుగుపడటమే కాకుండా ఉద్యోగాలు, పెట్టుబడులు రావడంతోపాటు ఆదాయ అవకాశాలు అందివస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క కర్ణాటక రాష్ట్రంలో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం జాతీయ రహదారి సంబంధిత ప్రాజెక్టులలో రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడి పెట్టిందని ఆయన వెల్లడించారు.
కర్ణాటకలోని కీలక నగరాలుగా బెంగళూరు, మైసూరుకుగల ప్రాధాన్యాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ- సాంకేతికత-సంప్రదాయాలకు కూడళ్లయిన ఈ రెండు నగరాల మధ్య అనుసంధానం అనేక కోణాల్లో ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే సమయంలో తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటారని గుర్తుచేశారు. ఇప్పుడిక ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంటన్నర తగ్గుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు ఈ మార్గం ఊపునిస్తుందని ఆయన అన్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే వారసత్వ పట్టణాలైన రామ్‌నగర్-మాండ్య మీదుగా వెళుతుందంటూ- దీనివల్ల పర్యాటకాభివృద్ధితోపాటు కావేరి నదీమాత జన్మస్థలానికి వెళ్లే సౌలభ్యం కలుగుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక బెంగుళూరు-మంగళూరు హైవేలో రుతుపవనాల వేళ కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రాంతంలోని ఓడరేవుతో అనుసంధానంపై దుష్ప్రభావం పడుతూంటుందని ప్రధాని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ మార్గాన్ని విస్తరిస్తున్నందువల్ల ఇకపై ఆ సమస్య తప్పుతుందని, అంతేగాక ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతూ- పేదల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో అధికశాతం స్వాహా అయ్యేవని ప్రధానమంత్రి విమర్శించారు. అయితే, 2014లో పేదల బాధలపై అవగాహనగల ప్రభుత్వం వచ్చాక పేదల సేవకు నిరంతర కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. గృహనిర్మాణం, కొళాయిలద్వారా నీటి సరఫరా, ఉజ్వల వంటగ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ సదుపాయం, రోడ్లు, ఆస్పత్రులు వగైరా సదుపాయాలతో పేదలకుగల అన్నిరకాల అగచాట్లు తగ్గించేందుకు ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ మేరకు గత 9 సంవత్సరాల్లో పాలన పేదల ముంగిటకు వచ్చి, వారికి జీవన సౌలభ్యం కల్పించిందని తెలిపారు. ఈ మేరకు ఉద్యమం తరహాలో ప్రయోజన సంతృప్త స్థాయిని ప్రభుత్వం నేడు సాధిస్తున్నదని వివరించారు.
అనేక దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాన్వేషణపై ప్రభుత్వ విధానాలు దృష్టి సారించాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు. ఆ మేరకు గత 9 సంవత్సరాల్లో నిర్మించిన 3 కోట్లకుపైగా ఇళ్లలో కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో లక్షలాది ఇళ్లున్నాయని తెలిపారు. మరోవైపు 40 లక్షల కొత్త గృహాలకు జల్ జీవన్ మిషన్ కింద కొళాయిల ద్వారా తాగునీరు అందిందని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించామని, మొత్తంమీద దశాబ్దాలుగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి వివరించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల సాగునీటి సమస్యలు పరిష్కారం కాగలవని పేర్కొన్నారు. కర్ణాటక రైతులకుగల చిన్నచిన్న సమస్యలకు పరిష్కారంతోపాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రూ.12,000 కోట్లను ప్రభుత్వం నేరుగా కర్ణాటక రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. ఈ మేరకు ఒక్క మాండ్య ప్రాంతంలోనే 2.75 లక్షల మందికిపైగా రైతులకు రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం రూ.6000కుగాను రాష్ట్రం తన వాటాగా రూ.4000 జోడించడంపై కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు. “రెండు ఇంజన్ల ప్రభుత్వంలో రైతులోకం రెట్టింపు ప్రయోజనాలు పొందుతోంది” అని ఆయన పేర్కొన్నారు. పంటల సాగులో అనిశ్చితి ఫలితంగా చక్కెర మిల్లుల నుంచి చెరకు రైతులకు బకాయిలు దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయని ప్రధాని అన్నారు. అయితే, ఇథనాల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమస్య చాలావరకూ పరిష్కారం కాగలదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఒకవేళ పంటలు సమృద్ధిగా పండితే అదనంగా లభించే చెరకుతో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా రైతులకు మరింత స్థిరమైన ఆదాయం లభిస్తుంది. గత ఏడాది దేశంలోని చక్కెర ఫ్యాక్టరీలు రూ.20 వేల కోట్ల విలువైన ఇథనాల్‌ను చమురు కంపెనీలకు విక్రయించాయని ప్రధాని గుర్తుచేశారు. దీంతో అవి చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలిగాయని ఆయన తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీల వద్ద 2013-14 నుంచి రూ.70 వేల కోట్ల విలువైన ఇథనాల్ విక్రయంతో ఆ సొమ్ము రైతుల బకాయిల చెల్లింపునకు అందివచ్చిందని తెలిపారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లోనూ చెరకు రైతుల కోసం చక్కెర సహకార సంఘాలకు రూ.10 వేల కోట్ల మేర సహాయంతోపాటు పన్ను రాయితీవంటి అనేక వెసులుబాట్లు కల్పించబడినట్లు ప్రధాని గుర్తుచేశారు. ఈ చర్యలతో రైతులకు ఎంతో మేలు ఒనగూడుతుందని ఆయన అన్నారు.
భారతదేశం ఇవాళ అపార అవకాశాల గని వంటిదని, ఈ మేరకు ప్రపంచం నలుమూలల నుంచి మన దేశంలో పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఆ మేరకు 2022లో మనకు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు రాగా, అందులో కర్ణాటకకు అత్యధికంగా రూ.4 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపారు. “ఈ రికార్డు పెట్టుబడులే రెండు ఇంజన్ల ప్రభుత్వ కృషికి నిదర్శనం" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సమాచార సాంకేతికత (ఐటీ)తోపాటు బయోటెక్నాలజీ, రక్షణరంగ తయారీ, విద్యుత్ వాహనాల తయారీవంటి పరిశ్రమలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని ప్రధాని చెప్పారు. అదేవిధంగా నేడు ఎయిరోస్పేస్, అంతరిక్ష రంగ పరిశ్రమలకూ అనూహ్య రీతిలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
ఈ విధంగా రెండు ఇంజన్ల ప్రభుత్వ కృషితో ఎన్నడూ లేనంత సత్ఫలితాలు వస్తున్న నేపథ్యంలో మోదీకి గోతులు తవ్వగలమని కొన్ని పక్షాలు కలలు గంటున్నాయని ప్రధాని ఆరోపించారు. అయితే, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ పేదలకు జీవన సౌలభ్యం కల్పించే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే వంటి అభివృద్ధి పనులతో మోదీ తీరికలేకుండా శ్రమిస్తున్నట్లు అభివర్ణించారు. కోట్లాది తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, దేశ ప్రజల ఆశీర్వాదాలు తనకు రక్షణ కవచంగా నిలుస్తాయనే వాస్తవాన్ని గుర్తించాల్సిందిగా ఆయన తన ప్రత్యర్థులను హెచ్చరించారు. చివరగా- నేటి ప్రాజెక్టులకు సంబంధించి కర్ణాటక ప్రజలను అభినందిస్తూ- “కర్ణాటక వేగంగా అభివృద్ధి చెందడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అత్యావశ్యకం” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మైతోపాటు కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, మాండ్య ఎంపీ శ్రీమతి సుమలత అంబరీష్, కర్ణాటక ప్రభుత్వ మంత్రి పాల్గొన్నారు.
నేపథ్యం
దేశమంతటా ప్రపంచ స్థాయి అనుసంధానంపై ప్రధానమంత్రి దూరదృష్టికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతుండటమే నిదర్శనం. ఈ కృషిలో భాగంగా ప్రధాన మంత్రి ఇవాళ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేని జాతికి అంకితం చేశారు. ఇది జాతీయ రహదారి275లో బెంగళూరు-నిడఘట్ట-మైసూరు విభాగంలో 6 వరుసలతో నిర్మితమైంది. ఆ మేరకు దాదాపు రూ.8480 కోట్లతో 118 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. దీంతో బెంగళూరు-మైసూరు మధ్య 3 గంటల ప్రయాణ సమయం దాదాపు 75 నిమిషాలకు తగ్గిపోతుంది. తద్వారా ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇది ఉత్తేజమిస్తుంది. అలాగే మైసూరు-కుశాల్‌నగర్ 4 వరుసల జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం 92 కి.మీ.ల ఈ రహదారిని రూ.4130 కోట్లతో నిర్మిస్తారు. బెంగళూరుతో కుశాల్‌నగర్‌కు అనుసంధానం పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం 5 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటలకు తగ్గిపోతుంది.
The state-of-the-art road infrastructure projects being launched today in Karnataka will boost connectivity across the state and strengthen economic growth. pic.twitter.com/M6PJpi7Sc4
— PMO India (@PMOIndia) March 12, 2023
Initiatives like 'Bharatmala' and 'SagarMala' are transforming India's landscape. pic.twitter.com/Jmcq47IgSO
— PMO India (@PMOIndia) March 12, 2023
Good infrastructure enhances 'Ease of Living'. It creates new opportunities for progress. pic.twitter.com/BkWMwcaduK
— PMO India (@PMOIndia) March 12, 2023
Irrigation projects which were pending for decades in the country are being completed at a fast pace. pic.twitter.com/bp72C2VHJc
— PMO India (@PMOIndia) March 12, 2023
A move that will significantly benefit our hardworking sugarcane farmers... pic.twitter.com/tzlLwvfeyl
— PMO India (@PMOIndia) March 12, 2023