రూ.100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ మెమోరియల్ కు శంకుస్థాపన
రూ.1580 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న రెండు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన
రూ.2475 కోట్లకు పైగా వ్యయంతో డబ్లింగ్ చేసిన కోటా-బినా రైలు మార్గం జాతికి అంకితం
“సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ మెమోరియల్ వైభవంతో పాటు దైవత్వాన్ని కలిగి ఉంటుంది”
"సంత్ రవిదాస్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి సమాజానికి శక్తిని అందించారు"
“నేడు దేశం విముక్తి స్ఫూర్తితో, బానిసత్వ మనస్తత్వాన్ని తిరస్కరిస్తూ ముందుకువెడుతోంది”
అమృత్ కాల్ లో దేశం నుంచి పేదరికాన్ని, ఆకలిని రూపుమాపేందుకు మేము ప్రయత్నిస్తున్నాము”
“పేదల ఆకలి బాధ, ఆత్మగౌరవం నాకు తెలుసు. నేను మీ కుటుంబ సభ్యుడిని, మీ బాధను అర్థం చేసుకోవడానికి నేను పుస్తకాలు చూడాల్సిన అవసరం లేదు”
“పేదల సంక్షేమం, సమాజంలోని అన్ని వర్గాల సాధికారత పైనే మా దృష్టి”
“నేడు దళిత, బడుగు, వెనుకబడిన, గిరిజన అనే తేడా లేకుండా మా ప్రభుత్వం వారికి సముచిత గౌరవం, కొత్త అవకాశాలు కల్పిస్తోంది”

మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. రూ.100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ మెమోరియల్ కు , రూ.1580 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న రెండు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  రూ.2475 కోట్లకు పైగా వ్యయంతో డబ్లింగ్ చేసిన కోటా-బినా రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. 

 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సాధువులసమక్షం, శ్రీ రావిదాస్ ఆశీస్సులు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన భారీ జన సమూహం తో కూడిన సామరస్య సాగరాన్ని ఈరోజు సాగర్ భూమిలో చూడ వచ్చని అన్నారు. దేశం భాగస్వామ్య సౌభాగ్యం కోసం సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ మెమోరియల్‌కు ఈ రోజు శంకుస్థాపన జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాధువుల ఆశీస్సులతో ఈ రోజు జరిగిన దైవ స్మారక మందిరం భూమి పూజలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని, కొన్నేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. వారణాసి పార్లమెంటు సభ్యుడిగా, సెయింట్ రవిదాస్ జీ జన్మస్థలాన్ని అనేక సందర్భాల్లో సందర్శించడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ నుండి ఆయనకు నివాళులు అర్పించారు. 

 

సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ స్మారక చిహ్నం సంత్ రవిదాస్  బోధనల వైభవంతో పాటు దైవత్వాన్ని కలిగి ఉంటుందని, ప్రధాన మంత్రి అన్నారు. 20 వేలకు పైగా గ్రామాలు, 300 నదుల మట్టిని ఈ స్మారక చిహ్నంలో 'సమరస్తా' స్ఫూర్తితో నింపామని తెలిపారు. 

 

' సమరస్తు భోజ్' కోసం మధ్యప్రదేశ్ కు చెందిన కుటుంబాలు ధాన్యాన్ని పంపగా, సాగర్ లో ఈ రోజు ఐదు యాత్రలు కూడా ముగిశాయి. "ఈ యాత్రలు సామాజిక సామరస్యం కొత్త శకాన్ని సూచిస్తాయి" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రేరణ మరియు ప్రగతి కలిసినప్పుడు ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు. రెండు రోడ్డు ప్రాజెక్టులు, కోటా-బీనా రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం వల్ల సాగర్, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.

 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అమృత్ కాల్ మరో 25 ఏళ్లు మన ముందు ఉన్న తరుణంలో సెయింట్ రవిదాస్ జీ మెమోరియల్, మ్యూజియానికి శంకుస్థాపన జరిగిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూనే దేశ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఉద్ఘాటించారు. దేశం వెయ్యేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుందని పేర్కొన్న ప్రధాన మంత్రి, సమాజంలో దురాచారాలు పుట్టుకురావడం సహజమని అన్నారు. ఇలాంటి దురాచారాలను తరిమికొట్టడానికి రవిదాస్ జీ వంటి సాధువు లేదా మహాత్ముడు పదేపదే ఆవిర్భవించడం భారతీయ సమాజ బలం అని ఆయన నొక్కి చెప్పారు. మొఘలులు ఈ దేశాన్ని పరిపాలించిన సమయంలో , సమాజం అసమతుల్యత, అణచివేత, నిరంకుశత్వంతో పోరాడుతున్న కాలంలో సెయింట్ రవిదాస్ జన్మించారని తెలిపారు. ఇలాంటి సమయంలో రవిదాస్ జీ  సమాజంలోని దురాచారాలను తరిమికొట్టే మార్గాలను బోధిస్తూ అవగాహన కల్పించారని పేర్కొన్నారు. సంత్ రవిదాస్ ను ఉటంకిస్తూ, ఒకవైపు ప్రజలు కులమతాలను ఎదుర్కొంటూనే మరోవైపు చెడు క్రమంగా మానవత్వాన్ని క్షీణింపజేస్తోందని ప్రధాని అన్నారు.

 

సెయింట్ రవిదాస్  సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పారని, అదే సమయంలో దేశ ఆత్మను పునరుజ్జీవింపచేశారని ప్రధాన మంత్రి తెలియజేశారు. మొఘల్ పాలనలో సంత్ రవిదాస్  ధైర్యసాహసాలు, దేశభక్తిని ప్రస్తావించిన ప్రధాన మంత్రి, ఆధారపడటం అతి పెద్ద పాపమని, దానిని అంగీకరించి, దానికి వ్యతిరేకంగా నిలబడని వారిని ఎవరూ ప్రేమించరని అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే సంత్ రవిదాస్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని సమాజానికి అందించారని, హైందవి స్వరాజ్యానికి పునాదులు వేయడానికి ఛత్రపతి శివాజీ దీనిని ప్రేరణగా ఉపయోగించుకున్నారని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఈ భావనే భారత స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల హృదయాల్లో స్థానం సంపాదించిందని ఆయన అన్నారు. "నేడు దేశం అదే విముక్తి స్ఫూర్తితో, బానిసత్వ మనస్తత్వాన్ని తిరస్కరిస్తూ ముందుకు సాగుతోంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

సామాజిక సమానత్వం, అందరికీ సౌకర్యాల లభ్యతపై సంత్ రవిదాస్ ను ఉటంకిస్తూ, అమృత్ కాల్ లో దేశం నుంచి పేదరికాన్ని, ఆకలిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. మహమ్మారి సమయంలో పేద, అణగారిన వర్గాలకు ఆహారం అందించాలన్న తన సంకల్పాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. “పేదల ఆకలి, ఆత్మగౌరవం నాకు తెలుసు. నేను వారి కుటుంబంలో సభ్యుడిని, వారి బాధను అర్థం చేసుకోవడానికి  పుస్తకాలను చూడాల్సిన అవసరం లేదు" అని శ్రీ మోదీ అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందించడం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ప్రధాని అన్నారు.

 

గరీబ్ కళ్యాణ్ పధకాల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గతంలో మాదిరి కాకుండా దేశంలో అడుగడుగునా దళితులు, పేదలు, గిరిజనులు, మహిళలకు దేశం అండగా నిలుస్తోందని ఆన్నారు. పుట్టిన సమయంలో మాతృ వందన యోజన, నవజాత శిశువుల సంపూర్ణ టీకా భద్రత కోసం మిషన్ ఇంద్రధనుష్ కింద 5.5 కోట్లకు పైగా తల్లులు, పిల్లలకు టీకాలు వేశారు.

 

సికిల్ సెల్ అనీమియా నుండి 7 కోట్ల మంది భారతీయులను రక్షించే ప్రచారంతో పాటు 2025 నాటికి భారతదేశాన్ని టిబి నుండి విముక్తం చేసే ప్రచారం కొనసాగుతోందని ఆయన తెలియజేశారు. కాలా అజర్, మెదడువాపు వ్యాధులు తగ్గుముఖం పట్టాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆయుష్మాన్ కార్డు గురించి 

ప్రధాన మంత్రి మాట్లాడుతూ. "ప్రజలు తమకు మోదీ కార్డు వచ్చిందని చెబుతారు. 5 లక్షల వరకు చికిత్స అవసరాల కోసం, మీ కుమారుడు (ప్రధానమంత్రి) ఉన్నారు".

 

జీవితంలో విద్య ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, గిరిజన ప్రాంతాల్లోని 700 ఏకలవ్య పాఠశాలలు పుస్తకాలు ,స్కాలర్ షిప్ లు ,పటిష్ఠమైన మధ్యాహ్న భోజన వ్యవస్థను కలిగి ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. బాలికలకు సుకన్య సమృద్ధి యోజన, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ముద్రా రుణాల కింద పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ సభ్యులకు రుణాలు వంటి చర్యలను ఆయన వివరించారు. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.8 వేల కోట్ల ఆర్థిక సాయం, విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్లతో కూడిన ప్రధాన మంత్రి ఆవాస్ తో పాటు 90 అటవీ ఉత్పత్తులను ఎంఎస్ పీ కింద చేర్చడం గురించి కూడా ఆయన మాట్లాడారు. “ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలు నేడు తమ కాళ్లపై తాము నిలబడుతున్నా రు. సమానత్వంతో సమాజంలో వారికి సరైన స్థానం లభిస్తోంది" అని ఆయన అన్నారు.

 

"సాగర్ అటువంటి జిల్లా, దాని పేరులో సాగర్ ఉంది. ఇది 400 ఎకరాల లఖా బంజారా సరస్సుతో కూడా గుర్తించబడింది" అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న లఖా బంజారాను ఆయన ప్రస్తావిస్తూ, నీటి ప్రాముఖ్యతను తాను చాలా ఏళ్ల క్రితమే అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు తాగునీరు అందించాయని, ఈ రోజు ఆ జల్ జీవన్ మిషన్  పనిని పూర్తి చేస్తోందని ప్రధాని అన్నారు. దళిత బస్తీలు, వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు పైపుల ద్వారా నీరు చేరుతోందని తెలిపారు. లఖా బంజారా సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్ లను నిర్మిస్తున్నామని తెలిపారు. "ఈ సరస్సులు స్వాతంత్ర్య స్ఫూర్తికి చిహ్నంగా, సామాజిక సామరస్యానికి కేంద్రంగా మారుతాయి" అని శ్రీ మోదీ అన్నారు.

 

దేశంలోని దళితులు, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోందని, కొత్త అవకాశాలను కల్పిస్తోందని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ సమాజంలోని ప్రజలు బలహీనులు కాదు,  వారి చరిత్ర కూడా బలహీనం కాదు " అని ప్రధాన మంత్రి అన్నారు, జాతి నిర్మాణంలో అసాధారణ పాత్ర పోషించిన గొప్ప వ్యక్తులు ఒకరి తర్వాత మరొకరు సమాజంలోని ఈ వర్గాల నుండి ఉద్భవించారని ఆయన పేర్కొన్నారు. అందుకే వారి వారసత్వాన్ని దేశం సగర్వంగా కాపాడుకుంటోందని ప్రధాని అన్నారు. బనారస్ లోని సంత్ రవిదాస్ జీ జన్మస్థలంలో ఆలయ సుందరీకరణ, భోపాల్ లోని గోవింద్ పురాలో సెయింట్ రవిదాస్ పేరుతో నిర్మిస్తున్న గ్లోబల్ స్కిల్ పార్క్, బాబా సాహెబ్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలను పంచ తీర్థంగా అభివృద్ధి చేయడం, గిరిజన సమాజం మహోన్నత చరిత్రను చిరస్మరణీయం చేయడానికి అనేక రాష్ట్రాల్లో మ్యూజియంలను అభివృద్ధి చేయడం వంటి అంశాలను ఆయన ఉదాహరణలుగా ఇచ్చారు. బిర్సా ముండా జయంతిని జంజాతియా గౌరవ్ దివస్ గా దేశం జరుపుకోవడం ప్రారంభించిందని ప్రధాన మంత్రి తెలియజేశారు. మధ్యప్రదేశ్ లోని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ కు గోండు సామాజిక వర్గానికి చెందిన రాణి కమలాపతి పేరు పెట్టారని, పాతాళపానీ స్టేషన్ కు తాంతియా మామ పేరు పెట్టారని ఆయన తెలిపారు. దేశంలో తొలిసారిగా దళితులు, వెనుకబడిన, గిరిజన సంప్రదాయాలకు సముచిత గౌరవం లభిస్తోందని ప్రసంగాన్ని 

 

ముగిస్తూ ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.

'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' అనే ఈ సంకల్పం తో దేశం ముందుకు సాగాలని, సంత్ రవిదాస్ జీ బోధనలు భారత పౌరులను తన ప్రయాణంలో ఏకం చేస్తూనే ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ,శ్రీ వీరేందర్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ వి.డి.శర్మ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు ,తదితరులు పాల్గొన్నారు

 

నేపథ్యం

 

ప్రముఖ సాధువులను, సంఘ సంస్కర్తలను సన్మానించడం ప్రధాని కార్యక్రమం లో ప్రత్యేక అంశం. సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ మెమోరియల్ ను 11.25 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నారు. ఈ అద్భుతమైన స్మారక చిహ్నంలో సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్  జీవితం, తత్వశాస్త్రం ,బోధనలను ప్రదర్శించడానికి ఆకట్టుకునే ఆర్ట్ మ్యూజియం , గ్యాలరీ ఉంటాయి. స్మారక చిహ్నాన్ని సందర్శించే భక్తులకు భక్త నివాస్, భోజనాలయం వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉంటాయి.

 

కోటా-బినా రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసిన ప్రాజెక్టును ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.  రూ.2475 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు రాజస్థాన్ లోని కోటా, బరన్ జిల్లాలు, మధ్యప్రదేశ్ లోని గుణ, అశోక్ నగర్, సాగర్ జిల్లాల గుండా వెళ్తుంది. అదనపు రైలు మార్గం మెరుగైన చలనశీలత కోసం సామర్థ్యాన్ని పెంచుతుంది.  ఈ మార్గంలో రైలు వేగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

 

రూ.1580 కోట్లకు పైగా వ్యయంతో రెండు రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటిలో మోరికోరి - విదిషా - హినోటియాను కలిపే నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టు , హినోటియా నుండి మెహ్లువాను కలిపే రహదారి ప్రాజెక్ట్ ఉన్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones