ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య క్షేత్రంలో రూ.15,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన కార్యక్రమాలున్నాయి. దీనికిముందు పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన, కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి, దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ- అయోధ్య క్షేత్ర సందర్శనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర నగరంలో తన రహదారి యాత్ర ఆద్యంతం ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయని పేర్కొన్నారు. ‘‘యావత్ ప్రపంచం జనవరి 22 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ దేశంలోని అణువణువునూ, ప్రతి వ్యక్తినీ నేను ఆరాధిస్తాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించే ఆ రోజు కోసం నేనెంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
అండమాన్‌లో 1943 డిసెంబరు 30వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఈ రోజుకుగల చారిత్రక ప్రాధాన్యం గురించి ప్రధాని ప్రస్తావించారు. ‘‘స్వాతంత్ర్య ఉద్యమంతో ముడిపడిన ఇలాంటి పవిత్ర దినాన నేడు మనం అమృత కాలపు సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. వికసిత భారతం కార్యక్రమానికి అయోధ్య నుంచి నవ్యోత్తేజం లభిస్తోందని చెబుతూ- ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై నగర ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో అయోధ్య నగరం జాతీయ పటంలో తిరిగి ప్రముఖ స్థానం పొందుతుందని ఆయన చెప్పారు.
దేశం సరికొత్త ప్రగతి శిఖరాలను అధిరోహించడంలో వారసత్వ పరిరక్షణ కూడా అంతర్భాగమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఆ మేరకు ‘‘నేటి భారతం ప్రాచీనత-ఆధునికతల సమ్మేళనంతో ముందడుగు వేస్తోంది’’ అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మహిమాన్విత రామ మందిర నిర్మాణం దీనికి నిదర్శనాలని అభివర్ణించారు. డిజిటల్ భారత శకంలో ప్రగతితోపాటు భక్తివిశ్వాస ప్రదేశాల పునరుద్ధరణ చేపట్టామన్నారు; అలాగే 30,000కుపైగా పంచాయతీ భవనాల సరసన కాశీ విశ్వనాథ క్షేత్రం పునర్నిర్మాణం; 315కుపైగా వైద్య కళాశాలల ఏర్పాటు, కేదారనాథ్ క్షేత్ర పునరుద్ధరణ; ఇంటింటికీ కొళాయి నీరు, మహాకాల్ మహాలోక్ నిర్మాణం; విదేశాల నుంచి వారసత్వ కళాఖండాలను తిరిగి తేవడం, అంతరిక్షం-సముద్ర రంగాల్లో విజయాలు తదితరాలను ప్రధానమంత్రి ఉదాహరించారు.
రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట చేయబోవడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ- ‘‘ఇవాళ ఇక్కడ ప్రగతి కార్యక్రమాల వేడుక నిర్వహించుకుంటున్నాం... కొన్ని రోజుల తర్వాత సంప్రదాయత వైభవం ఉట్టిపడుతుంది... ఈ రోజు అభివృద్ధి వెలుగులు చూస్తున్నాం.. కొన్ని రోజుల తర్వాత వారసత్వ దివ్య ప్రకాశాన్ని అనుభూతి చెందుతాం. ఈ ప్రగతి-వారసత్వాల సమ్మిళిత శక్తి 21వ శతాబ్దంలో ఆధునిక భారతాన్ని మరింత ముందుకు నడుపుతుంది’’ అన్నారు. వాల్మీకి మహర్షి వర్ణించిన అయోధ్య ప్రాచీన వైభవాన్ని ప్రస్తావిస్తూ- ఆధునికత అనుసంధానంతో ఈ నగర పూర్వవైభవ పునరుద్ధరణ ఆకాంక్షను ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ‘‘ఉత్తరప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అవధ్ ప్రాంతం ఒక్కటే కాకుండా అయోధ్య కూడా కొత్త దిశను నిర్దేశిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. మహా దేవాలయ ప్రారంభోత్సవం తర్వాత ఈ పవిత్ర నగరానికి వచ్చే యాత్రికులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్న అంచనాలను ప్రస్తావిస్తూ- అందుకు మౌలిక సదుపాయాలను పునర్నవీకరిస్తున్నామని చెప్పారు.
అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడంపై ప్రధాని హర్షం ప్రకటించారు. వాల్మీకి మహర్షి రామాయణం మనల్ని శ్రీరామునితో మమేకం చేసే జ్ఞానమార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధునిక భారతంలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం మనల్ని అయోధ్య క్షేత్రం-ఆధునిక మహా రామాలయంతో అనుసంధానిస్తుందని చెప్పారు. తొలిదశలో ఈ విమానాశ్రయం ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించగలదని, రెండోదశ తర్వాత ఈ సంఖ్య 60 లక్షలకు పెరుగుతుందని తెలిపారు. ఇక అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ 10 వేల మంది ప్రయాణికుల రాకపోలను నిర్వహిస్తుందని, పునర్నవీకరణ తర్వాత 60 వేల మందికి సేవలందించగలదని తెలిపారు. అదేవిధంగా రామపథం, భక్తి పథం, ధర్మపథం, శ్రీరామ జన్మభూమి పథం, కారు పార్కింగ్‌లుసహా కొత్త వైద్య కళాశాలలు, సరయూ నది కాలుష్య నివారణ, రామ్‌కీ పేడి రూపాంతరీకరణ, ఘాట్‌ల నవీకరణ, పురాతన కుండాల పునరుద్ధరణ, లతా మంగేష్కర్ చౌరస్తా వగైరాలు అయోధ్యకు సరికొత్త గుర్తింపునిస్తాయని, ఈ పవిత్ర నగరంలో కొత్త ఆదాయ-ఉపాధి మార్గాలు అందివస్తాయని తెలిపారు.
వందే భారత్, నమో భారత్ తర్వాత కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్’ రైళ్ల శ్రేణి గురించి ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ మేరకు తొలి అమృత భారత్ రైలును అయోధ్య మీదుగా సాగనంపటం ఆనందంగా ఉందన్నారు. ఈ రైళ్లు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వెళ్లనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఆధునిక అమృత భారత్ రైళ్లు పేదలపట్ల సేవాభావనను ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి ప్రకటించారు. ‘‘తమతమ కార్యకలాపాల కోసం తరచూ దూర ప్రయాణం చేసేవారితోపాటు పరిమిత ఆదాయంగలవారికి కూడా ఆధునిక సౌకర్యాలు, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రావాలి. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లు రూపొందించబడ్డాయి’’ అని ఆయన తెలిపారు. ప్రగతిని వారసత్వంతో ముడిపెట్టడంలో వందేభారత్ రైళ్ల పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘దేశంలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కాశీ నుంచి బయల్దేరింది. ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా 34 మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మేరకు కాశీ, కట్రా, ఉజ్జయిని, పుష్కర్, తిరుపతి, షిర్డీ, అమృత్‌సర్, మదురై వంటి ప్రతి పెద్ద విశ్వాస కేంద్రాన్ని ఇవి అనుసంధానిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ అయోధ్యకు వందే భారత్ రైలు కానుకగా లభించింది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రాచీన సంప్రదాయంలో భాగంగా ప్రజలు చేపట్టే ‘యాత్ర’ల జాబితాను ఆయన ఏకరవు పెట్టారు. ఆ క్రమంలో అయోధ్య క్షేత్రంలో కల్పించిన సదుపాయాలు ఇక్కడికి భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతం చేస్తాయన్నారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు శ్రీరామజ్యోతిని వెలిగించాలని ప్రధాని కోరారు. ‘‘మనందరి జీవితాల్లో ఈ చారిత్రక ఘట్టం మనకు దక్కిన ఎనలేని అదృష్టం. మనమంతా దేశం కోసం కొత్త సంకల్పం నిర్దేశించుకుని అందులో కొత్త శక్తిని నింపాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రాణ ప్రతిష్ఠకు హాజరుకావాలనే ప్రతి ఒక్కరి ఆకాంక్షను ప్రస్తావిస్తూ- భారీ భద్రత, ఇతరత్రా భారీ సన్నాహాల దృష్ట్యా జనవరి 22 తర్వాత మాత్రమే అయోధ్య పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఆ మేరకు జనవరి 23 తర్వాత అయోధ్య క్షేత్రానికి యాత్ర తేదీని నిర్ణయించుకోవాలని కోరారు. ‘‘ఈ పవిత్ర క్షణం కోసం మనం 550 సంవత్సరాలు వేచి చూశాం... దయచేసి, మరికొద్ది రోజులు మాత్రమే ఎదురుచూడండి’’ అని ఆయన అభ్యర్థించారు.
భవిష్యత్తులో అసంఖ్యాక సందర్శకుల రాకపై అయోధ్య ప్రజలను సంసిద్ధులను చేస్తూ- పరిశుభ్రతపై నిశితంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఆ మేరకు అయోధ్యను దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా రూపుదిద్దడానికి కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ‘‘రామాలయ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో జనవరి 14న మకర సంక్రాంతి రోజునుంచే దేశవ్యాప్తంగా యాత్రా క్షేత్రాలలో భారీ స్థాయిన పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని దేశ పౌరులకు ప్రధాని పిలుపునిచ్చారు.
ఉజ్వల పథకం కింద 10 కోట్ల సంఖ్యతో వంటగ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారు నివాస సందర్శన అనుభవాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లాలో 2016 మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించి, మహిళలకు వంటింటి పొగనుంచి విముక్తి కల్పించడం ఎంతో సంతోషం కలిగించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా, స్వాతంత్ర్యం వచ్చాక 50-55 ఏళ్లలో కేవలం 14 కోట్ల కనెక్షన్లు ఇవ్వగా, తమ ప్రభుత్వం గత 10 ఏళ్లలోనే 10 కోట్ల ఉచిత కనెక్షన్లు సహా 18 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. చివరగా- శక్తివంచన లేకుండా ప్రజలకు సేవలందిండంపై తన నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ‘‘మోదీ హామీకి ఇంత బలం ఎక్కడిదని కొందరు నన్ను ఆరా తీస్తున్నారు... అయితే, మోదీ చెప్పింది చేస్తారు కాబట్టే ఆ హామీలకు అంత శక్తి ఉంటుంది. ఆ మేరకు మోదీ హామీపై నేడు దేశం అపార విశ్వాసం ప్రకటిస్తోంది. ఎందుకంటే- తన హామీలను నెరవేర్చడానికి మోదీ సకల శక్తులూ ఒడ్డగలడు. అయోధ్య నగరమే ఇందుకు ప్రత్యక్ష సాక్షి. ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధిలో ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టేది లేదని ఇవాళ నేను అయోధ్య వాసులకు నా హామీని పునరుద్ఘాటిస్తున్నాను’’ అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.
అభివృద్ధి పథకాల వివరాలు
అయోధ్యలో పౌర సదుపాయాల మెరుగుదల
శ్రీరామ మందిరానికి యాత్రికుల రాకపోకల సౌలభ్యం దిశగా అయోధ్యలో పునర్నిర్మించిన, విస్తరించిన, సుందరీకరించిన నాలుగు రహదారులు- ‘రామ్‌పథ్, భక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామ జన్మభూమి పథ్’లను ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే అయోధ్యసహా పరిసర ప్రాంతాల్లోనూ అనేక పౌర మౌలిక సదుపాయాల బలోపేతం, బహిరంగ ప్రదేశాల సుందరీకరణ సంబంధిత పలు ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించడంతోపాటు జాతికి అంకితం చేశారు. ప్రారంభించిన ప్రాజెక్టులలో: రాజర్షి దశరథ్ స్వయంప్రతిపత్త ప్రభుత్వ వైద్య కళాశాల; అయోధ్య-సుల్తాన్‌పూర్ రోడ్డు-విమానాశ్రయాన్ని కలుపుతూ 4 వరుసల రహదారి; జాతీయ రహదారి-27 బైపాస్ మహోబ్రా బజార్ మీదుగా తేధి బజార్ శ్రీరామ జన్మభూమి వరకు 4 వరుసల రహదారి; నగరవ్యాప్తంగా పలు రహదారుల సుందరీకరణ, అయోధ్య బైపాస్; జాతీయ రహదారి-330ఎ పరిధిలోని జగదీష్‌పూర్-ఫైజాబాద్ విభాగం; మహోలి-బరాగావ్-దియోధి రహదారి, జసర్పూర్-భౌపూర్-గంగారమణ్-సురేష్‌నగర్ రహదారి విస్తరణ-బలోపేతం; పంచకోసి పరిక్రమ మార్గ్‌లో బడీబువా రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి; పిఖ్రౌలీ గ్రామంలో ఘన వ్యర్థాల శుద్ధి కర్మాగారం; డాక్టర్ బ్రజ్‌కిషోర్ హోమియోపతి కళాశాల-ఆస్పత్రిలో కొత్త భవనాలు-తరగతి గదులు తదితరాలున్నాయి. అలాగే ముఖ్యమంత్రి నగర్ సృజన పథకం ప్రాజెక్టు పనులుసహా ఐదు పార్కింగ్, వాణిజ్య సౌకర్యాల పనులను కూడా ప్రధాని ప్రారంభించారు.
అయోధ్యలో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన
అయోధ్యలో పౌర సౌకర్యాల పునరుద్ధరణకు మరింత తోడ్పడే కొత్త ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో నగర సాంస్కృతిక వారసత్వ వైభవ బలోపేతం దిశగా అయోధ్యలోని నాలుగు చారిత్రక ప్రవేశ ద్వారాల పరిరక్షణ-సుందరీకరణ; గుప్తర్ ఘాట్-రాజ్‌ఘాట్ మధ్య కొత్త కాంక్రీట్ ఘాట్‌లు, అంతకుముందున్న ఘాట్‌ల పునరుద్ధరణ; నయా ఘాట్ నుంచి లక్ష్మణ్ ఘాట్ దాకా పర్యాటక సౌకర్యాల అభివృద్ధి-సుందరీకరణ; రామ్ కి పైడి వద్ద దీపోత్సవం, ఇతర వేడుకలు తిలకించేందుకు సందర్శకుల గ్యాలరీ నిర్మాణం; రామ్ కి పైడి నుంచి రాజ్ ఘాట్, అక్కడి నుంచి రామాలయం దాకా యాత్రికులు వెళ్లే మార్గం బలోపేతం-పునరుద్ధరణ పనులున్నాయి.
మరోవైపు అయోధ్యలో రూ.2180 కోట్లకుపైగా వ్యయంతో కొత్త శివారు నగరం రూపకల్పన, దాదాపు రూ.300 కోట్లతో నిర్మించనున్న వశిష్ఠ కుంజ్ ఆవాస నిర్మాణ పథకానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే జాతీయ రహదారి-28 (కొత్త ఎన్‌హెచ్-27) లక్నో-అయోధ్య విభాగం; ఎన్‌హెచ్-28 (కొత్త ఎన్‌హెచ్-27) సంబంధిత ప్రస్తుత అయోధ్య బైపాస్ బలోపేతం-నవీకరణ; అయోధ్యలో ‘సిపెట్’ కేంద్రం ఏర్పాటు, అయోధ్య పురపాలక సంస్థ, అయోధ్య అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయ నిర్మాణం తదితరాలకూ శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో మరికొన్ని ప్రాజెక్టులు
బహిరంగ సభ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్త ఇతర ప్రగతి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటిని జాతికి అంకితం చేశారు. వీటిలో- గోసాయ్ కీ బజార్ బైపాస్-వారణాసి (ఘఘ్రా వంతెన-వారణాసి) (ఎన్‌హెచ్-233) నాలుగు వరుసల విస్తరణ; ఎన్‌హెచ్-730లోని ఖుతార్‌ని-లఖింపూర్ విభాగంగా బలోపేతం-ఉన్నతీకరణ; అమేఠీ జిల్లా త్రిశుండిలో వంటగ్యాస్ ప్లాంట్ సామర్థ్యం పెంపు; పంఖాలో 30 ఎంఎల్డీ.. జజ్మౌ, కాన్పూర్‌లలో 130 ఎంఎల్డీ మురుగు శుద్ధి కర్మాగారాలు; ఉన్నావ్ జిల్లాలో కాలువల మళ్లింపు, మురుగునీటి శుద్ధి; కాన్పూర్‌లోని జాజ్‌మౌ వద్ద చర్మపరిశ్రమల సముదాయం కోసం ‘సిఇటిపి’ని ప్రారంభించారు.
రైల్వే ప్రాజెక్టులు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. వీటిలో- అయోధ్య ధామ్ జంక్షన్ పేరిట రూ.240 కోట్లతో పునర్నవీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ఒకటి. దీన్ని ఇప్పుడు మూడు అంతస్తులతో అత్యాధునికంగా పునర్నిర్మించారు. ఇందులో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆహార విక్రయ కేంద్రాలు, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్‌లు, పిల్లల సంరక్షణ గదులు, వేచి ఉండే హాళ్లు వంటి అత్యాధునిక సదుపాయాలన్నీ కల్పించారు. స్టేషన్ భవనం ‘అందరికీ సౌలభ్యంగల, ఐజిబిసి ధ్రువీకృత హరిత భవనం’ కావడం గమనార్హం.
అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దేశంలో సూపర్‌ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి ‘అమృత భారత్’ కొత్త శ్రేణిని ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అమృత భారత్ అనేది సాధారణ ఎల్‌హెచ్‌బి బోగీలుగల ‘పుష్-పుల్’ రైలు. వేగవంతమైన ప్రయాణం కోసం ఈ రైలుకు రెండువైపులా ఇంజన్ ఉంటుంది. అలాగే అందంగా-ఆకర్షణీయంగా రూపొందించిన సీట్లు, మెరుగైన లగేజీ సదుపాయం, మొబైల్ హోల్డర్-ఛార్జింగ్ పాయింట్, ఎల్ఇడి లైట్లు, సీసీటీవీ, ప్రజా అప్రమత్తత వ్యవస్థ తదితర మెరుగైన సౌకర్యాలతో ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. ఈ కొత్త శ్రేణితోపాటు ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కొత్త అమృత భారత్ రైళ్లలో ఒకటి దర్భంగా-అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ మార్గంలో వెళ్తుంది. మరొకటి మాల్డా టౌన్-సర్ ఎం.విశ్వేశ్వరాయ టెర్మినస్ (బెంగళూరు) మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి కొందరు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
ప్రధానమంత్రి మొత్తం ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇవి శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా-న్యూ ఢిల్లీ; అమృత్‌సర్-ఢిల్లీ; కోయంబత్తూరు-బెంగళూరు కంటోన్మెంట్, మంగళూరు-మడ్గావ్; జల్నా-ముంబై; అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ మార్గాల్లో ప్రయాణిస్తాయి. మరోవైపు ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం దిశగా రూ.2300 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. వీటిలో రూమా చకేరి-చందేరి 3వ లైన్; జౌన్‌పూర్-అయోధ్య-బారాబంకి డబ్లింగ్ ప్రాజెక్టులో భాగమైన జౌన్‌పూర్-తులసీ నగర్, అక్బర్‌పూర్-అయోధ్య, సోహవల్-పత్రాంగ, సఫ్దర్‌గంజ్-రసౌలీ విభాగాలు; మల్హౌర్-దాలిగంజ్ రైల్వే విభాగం డబ్లింగ్- విద్యుదీకరణ ప్రాజెక్టు ఉన్నాయి.
మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం - అయోధ్య ధామ్
అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. ఈ అత్యాధునిక విమానాశ్రయం తొలిదశను రూ.1,450 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిచేశారు. విమానాశ్రయం ప్రధాన (టెర్మినల్) భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించగలదు. భవనం ముఖభాగం అయోధ్యలో శ్రీరామ మందిరం ఆలయ ఆకృతిని ప్రతిబింబిస్తుంది. భవన అంతర్భాగాన్ని శ్రీరాముని జీవితగాథను వివరించేలా స్థానిక కళాకృతులు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో అలంకరించారు. అయోధ్య విమానాశ్రయ టెర్మినల్ భవనం పైకప్పు వ్యవస్థ విభిన్నంగా రూపొందించబడింది. ఎల్‌ఈడీ లైటింగ్, వర్షపునీటి సంరక్షణ, ఫౌంటైన్‌లతో సుందరీకరణ, జలశుద్ధి ప్లాంటు, మురుగు శుద్ధి ప్లాంటు, సౌరశక్తి ప్లాంటుసహా అనేక ఇతర సౌకర్యాలున్నాయి. ‘‘గృహ-5 స్టార్’’ రేటింగుకు అనుగుణంగా ఈ అత్యాధునిక సదుపాయాలన్నీ కల్పించబడ్డాయి. కొత్త విమానాశ్రయం ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా పర్యాటక, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడంతోపాటు ఉపాధి అవకాశాలు అందివస్తాయి.
आज पूरी दुनिया उत्सुकता के साथ 22 जनवरी के ऐतिहासिक क्षण का इंतज़ार कर रही है: PM @narendramodi pic.twitter.com/O0cPPZ1VOz
— PMO India (@PMOIndia) December 30, 2023
आज के ही दिन, 1943 में नेताजी सुभाषचंद्र बोस ने अंडमान में झंडा फहरा कर भारत की आजादी का जयघोष किया था।
— PMO India (@PMOIndia) December 30, 2023
आज़ादी के आंदोलन से जुड़े ऐसे पावन दिवस पर, आज हम आजादी के अमृतकाल के संकल्प को आगे बढ़ा रहे हैं: PM @narendramodi pic.twitter.com/6iwXnWGbMp
दुनिया में कोई भी देश हो, अगर उसे विकास की नई ऊंचाई पर पहुंचना है, तो उसे अपनी विरासत को संभालना ही होगा: PM @narendramodi pic.twitter.com/jsEf1i9s4A
— PMO India (@PMOIndia) December 30, 2023
विकास भी और विरासत भी। pic.twitter.com/OfWWpKFQbq
— PMO India (@PMOIndia) December 30, 2023
त्रिकालदर्शी महर्षि वाल्मीकि जी के नाम पर अयोध्या धाम एयरपोर्ट का नाम, इस एयरपोर्ट में आने वाले हर यात्री को धन्य करेगा: PM @narendramodi pic.twitter.com/hjpdEaSygZ
— PMO India (@PMOIndia) December 30, 2023
वंदे भारत, नमो भारत और अमृत भारत ट्रेनों की ये त्रिशक्ति, भारतीय रेलवे का कायाकल्प करने जा रही है: PM @narendramodi pic.twitter.com/hWWbMfKjeM
— PMO India (@PMOIndia) December 30, 2023
हमें देश के लिए नव संकल्प लेना है, खुद को नई ऊर्जा से भरना है।
— PMO India (@PMOIndia) December 30, 2023
इसके लिए 22 जनवरी को आप सभी अपने घरों में श्रीराम ज्योति जलाएं, दीपावली मनाएं: PM @narendramodi pic.twitter.com/x0TaozTe95
अयोध्या वासियों से प्रधानमंत्री का आग्रह... pic.twitter.com/KCfXSWy1AF
— PMO India (@PMOIndia) December 30, 2023
देश के सभी तीर्थ क्षेत्रों और मंदिरों से आग्रह... pic.twitter.com/MbNhJlcuZt
— PMO India (@PMOIndia) December 30, 2023