ఈ వినూత్న చొరవకింద 2-3 నెలల్లో లక్షమంది యువతకు శిక్షణ: ప్రధాని
మొత్తం 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో 6 ప్రత్యేక శిక్షణ కోర్సులు
వైరస్‌ ఉనికి పరివర్తన వాస్తవం - మనం సర్వ సన్నద్ధం కావాలి: ప్రధాని
నైపుణ్యం, నైపుణ్యానికి మెరుగు, నైపుణ్య వికాసాలకుగల ప్రాధాన్యాన్ని కరోనా కాలం రుజువు చేసింది: ప్రధానమంత్రి
ప్రపంచంలోని ప్రతి దేశానికి, వ్యవస్థకు, సమాజానికి, కుటుంబానికి, వ్యక్తికి ఈ మహమ్మారి పరీక్ష పెట్టింది: ప్రధాని
టీకాలు వేయడంలో 45 ఏళ్లు పైబడినవారి తరహాలోనే 45 ఏళ్ల లోపువారికీ జూన్‌ 21 నుంచి ప్రాధాన్యం: ప్రధాని
గ్రామాల్లోని వైద్య కేంద్రాల్లో సేవలందించే ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలకు ప్రధానమంత్రి ప్రశంసలు

దేశవ్యాప్తంగాగల కోవిడ్‌-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

   ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- కరోనాపై పోరాటంలో ఇదొక ముఖ్యమైన ముందడుగని చెప్పారు. దేశంలో వైరస్‌ ఉనికితోపాటు అది జన్యుపరంగా పరివర్తన చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఇందుకు మనం సదా సర్వ సన్నద్ధులమై ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. ఈ వైరస్‌ మనకు ఎంతటి ప్రమాదకర సవాళ్లను విసరగలదో  మహమ్మారి రెండోదశ స్పష్టం చూపిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఏ సవాలునైనా ఎదుర్కొనేలా సదా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు లక్ష మందికిపైగా ముందువరుస యోధులకు శిక్షణ మరొక ముందడుగని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   ప్రపంచంలోని ప్రతి దేశానికి, వ్యవస్థకు, సమాజానికి, కుటుంబానికి, వ్యక్తికి ఈ మహమ్మారి కఠిన పరీక్ష పెట్టిందని ప్రధాని గుర్తుచేశారు. అదే సమయంలో శాస్త్రవిజ్ఞానం, ప్రభుత్వం, సమాజం, వ్యవస్థలు, వ్యక్తులు సర్వం తమతమ సామర్థ్యాలను విస్తరించుకోవాల్సిన ఆవశ్యకతపై అప్రమత్తం చేసిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నదని- ప్రస్తుతం కోవిడ్‌ పీడితుల సంరక్షణ, చికిత్సకు సంబంధించి దేశంలో పీపీఈ కిట్లు, రోగనిర్ధారణ పరీక్ష-ఇతర మౌలిక వైద్య సదుపాయాలు వంటివి ఈ కృషికి నిదర్శనాలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకూ వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్ల వంటి అత్యవసర పరికరాలను అందేశామని శ్రీ మోదీ గుర్తుచేశారు. అంతేకాకుండా 1500 ఆక్సిజన్‌ ప్లాంట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇన్నివిధాలుగా మనం కృషిచేస్తున్నా నిపుణ మానవశక్తి అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. అందుకే- ప్రస్తుత కరోనా యోధుల బలగానికి మద్దతునివ్వడం కోసం లక్షమంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ మేరకు మరో రెండుమూడు నెలల్లోనే వీరికి శిక్షణ పూర్తికాగలదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   దేశంలోని అగ్రశ్రేణి నిపుణులు ఈ క్షణ కార్యక్రమం కోసం 6 కోర్సులకు రూపకల్పన చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అవసరాలకు తగినట్లుగా ఈ కోర్సులను ఇవాళ ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా “గృహ సంరక్షణ మద్దతు, ప్రాథమిక సంరక్షణ మద్దతు, ఆధునిక సంరక్షణ మద్దతు, అత్యవసర సంరక్షణ మద్దతు, నమూనాల సేకరణ మద్దతు, వైద్య పరికరాల నిర్వహణ మద్దతు” కోర్సులలో శిక్షణ ఇవ్వబడుతుందని ఆయన వివరించారు. ఈ కోర్సులద్వారా తాజా నైపుణ్య కల్పనసహా ఇప్పటికే వీటిలో కొంత శిక్షణ పొందినవారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య రంగంలోని ముందువరుస సిబ్బందికి తాజా శక్తిసామర్థ్యాలు సమకూరడమేగాక యువతరానికి కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయన్నారు.

   నైపుణ్యం, నైపుణ్యానికి మెరుగు, నైపుణ్యాభివృద్ధి అనే త్రిగుణ మంత్రానికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో కరోనా కాలం రుజువు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. కాగా, దేశంలో తొలిసారిగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాటుసహా ‘నైపుణ్య భారతం కార్యక్రమం’ ప్రత్యేకంగా ప్రారంభించబడిందని ప్రధాని గుర్తుచేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా “ప్రధానమంత్రి నైపుణ్య కేంద్రాలు” ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. నేటి పరిస్థితులు, అవసరాలకు తగినట్లు ఏటా లక్షలాది యువతకు శిక్షణ ఇవ్వడంలో ‘నైపుణ్య భారతం కార్యక్రమం’ ఎంతగానో దోహదం చేస్తున్నదని చెప్పారు. తదనుగుణంగా గత సంవత్సరం మహమ్మారి పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా లక్షలాది ఆరోగ్య కార్యకర్తలకు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా శిక్షణ లభించిందని పేర్కొన్నారు.

   మన దేశ జనాభా విస్తృతికి తగినట్లు ఆరోగ్య రంగంలో వైద్యులు, నర్సులు, వైద్యసహాయ (పారామెడికల్‌) సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. ఆ మేరకు గత ఏడేళ్లుగా తదేక దృష్టితో కొత్త ‘ఎయిమ్స్‌ (AIIMS), వైద్య/నర్సింగ్‌ కళాశాలల వంటివి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. అదేవిధంగా వైద్యవిద్య, సంబంధిత వ్యవస్థలలో అనేక సంస్కరణలను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగం కోసం వృత్తి నిపుణులను సంసిద్ధం చేయడంలో శ్రద్ధ, కృషి అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

   దేశవ్యాప్తంగా వివిధ గ్రామాల్లోని వైద్య కేంద్రాల పరిధిలో సేవలందించే ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు మన ఆరోగ్య రంగానికి బలమైన మూలస్తంభాలని ప్రధానమంత్రి అన్నారు. అయితే, ఆరోగ్య రంగంపై చర్చల సందర్భంగా వారి ప్రస్తావన అంతగా వినిపించదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధి వ్యాప్తి నిరోధం కోసం దేశంలో నేడు కొనసాగుతున్న  ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమంలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎన్నో ప్రతికూలతల నడుమ దేశంలోని ప్రతి ఒక్కరి భద్రత కోసం ఆరోగ్య కార్యకర్తలు నిర్విరామ సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి కొనియాడారు. దేశంలోని గ్రామీణ, పర్వత, గిరిజ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి నిరోధం దిశగా వారెంతో విశిష్ట పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

   ఈ నేపథ్యంలో జూన్‌ 21 నుంచి ప్రారంభం కానున్న టీకాల కార్యక్రమానికి సంబంధించి అనేక మార్గదర్శకాలు జారీచేసినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఆ మేరకు టీకాలు వేయడంలో ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి ప్రాధాన్యం ఇస్తున్న రీతిలోనే 45 ఏళ్ల లోపువారికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని ఆయన వివరించారు. తదనుగుణంగా కరోనా విధివిధానాలను పాటిస్తూ దేశంలోని ప్రతి పౌరునికీ ఉచితంగా టీకా వేయడంపై కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రకటించారు. కొత్త కోర్సులలో శిక్షణ పొందబోయే అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, వారి కొత్త నైపుణ్యాలు దేశ పౌరులందరి ప్రాణరక్షణకు ఉపయోగపడగలవని ఆకాంక్షించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi