Quote‘పిఎం-కిసాన్’ పథకం 16వ విడత కింద రూ.21,000 కోట్లు.. ‘నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి’ 2-3 విడతల కింద రూ.3800 కోట్ల మేర నిధుల విడుదల;
Quoteమహారాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల మహిళా స్వయం సహాయ సంఘాలకు రూ.825 కోట్ల మేర ఆవృత నిధి పంపిణీ;
Quoteమహారాష్ట్ర అంతటా కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీ ప్రారంభం; మోదీ ఆవాస్ ఘర్కుల్ యోజన ప్రారంభం;
Quoteయావ‌త్‌మ‌ల్‌ నగరంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ; పలు రహదారి.. రైల్వే.. నీటిపారుదల ప్రాజెక్టులు జాతికి అంకితం;
Quote‘‘ఛత్రపతి శివాజీ మహరాజ్ మాకు స్ఫూర్తిప్రదాత’’;
Quote‘‘దేశంలోని ప్రతి మూలనూ అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం.. నా తనువులో అణువణువు.. నా జీవితంలో అనుక్షణం దీనికే అంకితం’’;
Quote‘‘గత 10 సంవత్సరాల్లో మేం చేసిన ప్రతి పనీ రాబోయే 25 ఏళ్లకు పునాది వేస్తుంది’’;
Quote‘‘పేదలు నేడు తమకు దక్కాల్సిన వాటాను పొందగలుగుతున్నారు’’;
Quote‘‘వికసిత భారత్ నిర్మాణానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అవశ్యం’’;
Quote‘‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయకు ప్రతీక.. ఆయన జీవితమంతా పేదలకే అంకితం’’
Quoteఈ కార్యక్రమాలతో దేశం నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున అనుసంధానమయ్యారు.
Quoteతదనుగుణంగా నా తనువులోని అణువణువూ, నా జీవితంలోని అనుక్షణం ఈ సంకల్పానికి అంకితం చేస్తున్నాను’’ అని ప్రకటించారు.

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ మ‌హారాష్ట్ర‌లోని యావ‌త్‌మ‌ల్‌లో రూ.4900 కోట్లకుపైగా విలువైన రైల్వే, రహదారులు, నీటిపారుద‌ల‌ రంగాల సంబంధిత పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎం-కిసాన్ తదితర పథకాల లబ్ధిదారులకు నిధులను కూడా ఆయన విడుదల చేశారు. అలాగే మహారాష్ట్ర వ్యాప్తంగా కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ‘మోడీ ఆవాస్ ఘర్కుల్’ యోజనను ప్రారంభించారు. మరోవైపు రెండు రైళ్లను ఆయన జెండా ఊపి సాగనంపారు. యావ‌త్‌మ‌ల్‌ నగరంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలతో దేశం నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున అనుసంధానమయ్యారు.

   ఈ సందర్భంగా వారందర్నీ ఉద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత ఛ‌త్ర‌ప‌తి శివాజీ జన్మభూమికి శిరసాభివందనం చేశారు. అంతేకాకుండా భరతమాత ముద్దుబిడ్డ బాబా సాహెబ్ అంబేడ్కరుకు నివాళి అర్పించారు. లోగడ 2014, 2019 సంవత్సరాల్లో ‘చాయ్ పర్ చర్చ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్బంగా ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలతోపాటు వారి ఆశీర్వాదం అందుకోవడాన్ని గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తల్లులు, సోదరీమణులంతా మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రధాని వారికి విజ్ఞప్తి చేశారు.

 

|

   ఛత్రపతి శివాజీ పాలనకు 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఆయన పట్టాభిషేక మహోత్సవాన్ని గుర్తుచేశారు. జాతీయ చైతన్యానికి, రాజ్యం బలోపేతానికి అత్యంత ప్రాధాన్యంతో తుది శ్వాసదాకా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా పౌరుల జీవితాల్లో మార్పు తేవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘‘గత 10 సంవత్సరాల్లో చేసిన ప్రతి పని రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తుకు పునాది వేస్తుంది’’ అన్నారు. అలాగే  ‘‘దేశంలోని ప్రతి మూలనూ అభివృద్ధి చేయాలని నేను సంకల్పించాను. తదనుగుణంగా నా తనువులోని అణువణువూ, నా జీవితంలోని అనుక్షణం ఈ సంకల్పానికి అంకితం చేస్తున్నాను’’ అని ప్రకటించారు.

   దేశంలోని పేదలు, యువతరం, మహిళలు, రైతుల ప్రగతే తనకు నాలుగు అగ్ర ప్రాధాన్యాలని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘‘ఈ నాలుగు వర్గాల సాధికారతతోనే ప్రతి కుటుంబం, యావత్ సమాజం బలోపేతం అవుతాయనడంలో సందేహం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నేటి కార్యక్రమంలో భాగమైన ప్రాజెక్టులు ఈ నాలుగు వర్గాలతో అనుసంధానమై ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు  రైతులకు సాగునీటి సౌకర్యం, పేదలకు పక్కా గృహాలు, గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయం, యువత భవిష్యత్తు దిశగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు, గిరిజనులు, నిరుపేదలకు ఆర్థిక సహాయం దళారుల పాలు కావడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రూ.21,000 కోట్ల మేర పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా పంపిణీ చేయడాన్ని నాటి పరిస్థితితో పోల్చి చూపారు. ‘ఇదే మోదీ గ్యారంటీ’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా ‘పేదలు నేడు తమకు దక్కాల్సిన హక్కును పొందగలుగుతున్నారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

   మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ గ్యారెంటీల గురించి నొక్కిచెబుతూ... రాష్ట్రంలోని  రైతులకు ప్రత్యేకంగా రూ.3800 కోట్లు అందాయని ప్రధాని గుర్తుచేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. ఇక ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద దేశంలోని 11 కోట్ల మంది రైతులు రూ.3 ల‌క్ష‌ల కోట్లు అందుకున్నార‌ని వివరించారు. ఈ నిధులలో మహారాష్ట్ర రైతులకు రూ.30,000 కోట్లు, యావ‌త్‌మ‌ల్‌ ప్రాంత రైతులకు రూ.900 కోట్లు వంతున వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. చెరకు పంట క్వింటాలుకు సముచిత గిట్టుబాటు ధర (ఎఫ్‌ఆర్‌పి)ను రూ.340కి పెంచినట్లు కూడా ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార నిల్వల సదుపాయం నిర్మాణ పథకాన్ని ఇటీవల భారత్ మండపంలో ప్రారంభించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

 

|

   ‘‘వికసిత భారత్‌ రూపకల్పన కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అవశ్యం’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి సమస్యలన్నిటి పరిష్కారం దిశగా ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. తాగునీరు లేదా సాగునీరు విషయంలో గత ప్రభుత్వాల పాలన సందర్భంగా గ్రామాల్లో కరువు వంటి పరిస్థితులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు 2014కు ముందు 100లో 15 కుటుంబాలకు మాత్రమే కొళాయి నీటి సరఫరా ఉండేదని తెలిపారు. ‘‘నిర్లక్ష్యానికి గురైన చాలా కుటుంబాలు పేద, దళిత, గిరిజన సమాజాలకు చెందినవే’’ అని పేర్కొన్నారు. నీటి కొరతవల్ల ఆనాడు మహిళలకు  ఎదురైన కఠిన పరిస్థితులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, ‘మోదీ గ్యారెంటీ’ నెరవేరడంతో కేవలం 4-5 ఏళ్లలోనే 100కు 75 కుటుంబాలు ‘హర్ ఘర్ జల్’ పథకం ద్వారా నీరందుకోవడాన్ని గుర్తు చేశారు. ఇక మహారాష్ట్ర గణాంకాలను ఉటంకిస్తూ 50 లక్షలకన్నా తక్కువ స్థాయి నుంచి నేడు 1.25 కోట్ల స్థాయికి కొళాయి కనెక్షన్లు పెరుగుతున్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘మోదీ గ్యారంటీ అంటే... అది కచ్చితంగా నెరవేరే గ్యారంటీ’’ అని పేర్కొన్నారు.

   మునుపటి నుంచీ దీర్ఘకాలం పెండింగ్‌లోగల 100 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ- వాటిలో 60 ప్రాజెక్టులను గత 10 సంవత్సరాల్లో పూర్తిచేశామని ప్రధానమంత్రి రైతులకు వెల్లడించారు. ఇలా స్తంభించిన వాటిలో 26 ప్రాజెక్టులు మహారాష్ట్రకు చెందినవేనని తెలిపారు. ‘‘తమ కుటుంబాల్లో కష్టనష్టాలకు కారణమెవరో తెలుసుకునే అర్హత విదర్భ రైతులకుంది’’ అన్నారు. ఈ 26 ప్రాజెక్టులలో 12 ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తికాగా, మిగిలినవాటి పనులు కూడా కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఈ మేరకు 50 ఏళ్ల తర్వాత పూర్తయిన నీల్వాండే డ్యామ్ పరియోజన, కృష్ణా కోయినా, టెంబు ప్రాజెక్టులతోపాటు గోసీఖుర్ద్ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుత ప్రభుత్వ చొరవతో దశాబ్దాల జాప్యం నుంచి బయటపడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, బలిరాజా సంజీవిని పథకాల కింద 51 ప్రాజెక్టులను విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు ఆయన అంకితం చేశారు.

   దేశంలోని గ్రామీణ ప్రాంత మహిళల నుంచి ‘లక్షాధికారి సోదరీమణుల’ను సృష్టిస్తామ‌న్న మోదీ హామీని ప్ర‌స్తావిస్తూ- ఇప్పటికే కోటి మంది మ‌హిళ‌లు ఈ స్థాయికి చేరుకున్నారని ప్రధాని వివరించారు. ఈ నేపథ్యంలో తమ లక్ష్యాన్ని 3 కోట్లకు పెంచే ప్రణాళికను ఈ ఏడాది బ‌డ్జెట్‌లో ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఇక 10 కోట్ల మందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాలతో ముడిపడి ఉండగా బ్యాంకుల నుంచి రూ.8 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.40,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తద్వారా మహారాష్ట్రలోనూ లక్షలాది మహిళలకు లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు. యావ‌త్‌మ‌ల్‌ జిల్లాలో మహిళలకు కూడా పెద్ద సంఖ్యలో ఇ-రిక్షాలను అందజేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ‘నమో డ్రోన్ దీదీ’ పథకం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దీనికింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు డ్రోన్ పైలట్లుగా  శిక్షణ ఇప్పించడమేగాక, వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్‌లను అందుబాటులో ఉంచుతుందని తెలిపారు.

 

|

   ప్రధాన మంత్రి ఇవాళ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రబోధించిన అంత్యోదయ సూత్రం స్ఫూర్తితో గత 10 సంవత్సరాలుగా పేదలకు అంకితం చేసిన ఉచిత ఆహారధాన్యాల పంపిణీతోపాటు ఉచిత వైద్య చికిత్స తదితర పథకాల గురించి ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా నేడు మహారాష్ట్రలో కోటి కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేదల కోసం పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ, ఓబీసీ వర్గాలకు గృహకల్పన పథకం కింద 10 వేల కుటుంబాల కోసం నేడు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడాన్ని ప్రధాని ప్రస్తావించారు.

   ‘‘సదా నిర్లక్ష్యానికి గురైన వారిని మోదీ పట్టించుకోవడమే కాదు... వారిని ఆరాధిస్తున్నాడు’’ అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు చేతివృత్తిదారులు, హస్తకళాకారుల కోసం రూ.13,000 కోట్లతో విశ్వకర్మ యోజన, గిరిజన సంక్షేమం కోసం రూ.23,000 కోట్లతో ప్రధానమంత్రి జన్మన్ యోజన వంటి పథకాలను ప్రవేశపెట్టడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పీఎం జన్మన్ యోజన కింద మహారాష్ట్రలోని కట్కారి, కొలాం, మాదియాసహా అనేక గిరిజన తెగలవారికి జీవన సౌలభ్యం కలుగుతుందని ఆయన అన్నారు. చివరగా- పేదలు, రైతులు, యువత, నారీశక్తి సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో చురుగ్గా అమలు కానున్నాయని చెప్పారు. విదర్భ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికీ రాబోయే 5 సంవత్సరాల్లో మెరుగైన జీవన సౌలభ్యం కల్పన దిశగా ప్రగతి వేగాన్ని మరింత పెంచుతామని హామీ ఇస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

|

   ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండేలతోపాటు ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్ సహా పలువురు ఎంపీలు, రాష్ట్ర శాసనసభ/మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా వర్చువల్ మాధ్యమంద్వారా ఇందులో పాలుపంచుకున్నారు.

నేపథ్యం

   యావ‌త్‌మ‌ల్‌ కార్యక్రమాల్లో భాగంగా రైతు సంక్షేమంపై ప్రధాని అంకితభావానికి నిదర్శనంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) పథకం 16వ విడత కింద రూ.21,000 కోట్లకుపైగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమచేశారు. దీంతో 11 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.3 లక్షల కోట్లకుపైగా నిధులు బదిలీ చేయబడ్డాయి.

 

|

   అలాగే ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి’ పథకంలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 88 లక్షల మంది లబ్ధిదారులకు 2, 3 విడతల కింద రూ.3800 కోట్ల నిధులను కూడా ప్రధాని పంపిణీ చేశారు. ఈ పథకం కింద మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు ఏటా రూ.6000 అదనంగా లభిస్తాయి.

   ఇక రాష్ట్రవ్యాప్తంగా 5.5 లక్షల మహిళా స్వయం సహాయ బృందాలకు (ఎస్‌హెచ్‌జి) రూ.825 కోట్ల మేర ఆవృత నిధి (రివాల్వింగ్ ఫండ్‌)ని ప్రధానమంత్రి పంపిణీ చేశారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (ఎన్ఆర్ఎల్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ఆవృత నిధికి ఇది అదనం. ఈ నిధిని ఆయా సంఘాలలో వంతులవారీగా రుణాలిచ్చే విధంగా వినియోగిస్తారు. తద్వారా గ్రామీణ స్థాయిలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ సంస్థలకు ప్రోత్సాహం లభించి పేద కుటుంబాల వార్షిక ఆదాయం పెరిగేలా శ్రద్ధ వహిస్తారు. అన్ని ప్రభుత్వ పథకాలను 100 శాతం అమలు చేయడం ద్వారా వాటిని సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేరువ చేసి, సంతృప్తస్థాయిని సాధించే తన దార్శనిక యోచనకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రధాని ప్రారంభించారు.

 

|

   మహారాష్ట్రలోని ఓబీసీ వర్గాల లబ్ధిదారుల కోసం ‘మోదీ ఆవాస్ ఘర్కుల్ యోజన’ను ప్రధాని  ప్రారంభించారు. ఈ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 మధ్య కాలంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించబడింది. ఈ మేరకు 2.5 లక్షల మంది లబ్ధిదారుల కోసం తొలి విడతగా రూ.375 కోట్ల మేర నిధులను ప్రధానమంత్రి బదిలీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే పలు నీటిపారుదల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇవన్నీ ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పిఎంకెఎస్‌వై), బలిరాజా జల సంజీవని యోజన (బిజెఎస్‌వై) పథకాల కింద రూ. 2750 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిచేయబడ్డాయి.

   మహారాష్ట్రలో రూ. 1300 కోట్లకుపైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ మేరకు వార్ధా-కలంబ్ బ్రాడ్ గేజ్ మార్గం (వార్ధా-యావ‌త్‌మ‌ల్‌-నాందేడ్ కొత్త బ్రాడ్ గేజ్ మార్గం ప్రాజెక్టులో అంతర్భాగం), న్యూ అష్టి - అమల్నేర్ బ్రాడ్ గేజ్ లైన్ (అహ్మద్‌నగర్-బీద్-పర్లీ కొత్త బ్రాడ్ గేజ్ మార్గం ప్రాజెక్టులో అంతర్భాగం) ఉన్నాయి. ఈ కొత్త బ్రాడ్ గేజ్ మార్గాలతో విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుపడటమే కాకుండా సామాజిక-ఆర్థిక వృద్ధి ఇనుమడిస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రెండు రైళ్లను ప్ర‌ధానమంత్రి వర్చువ‌ల్‌ మాధ్యమం ద్వారా జెండా ఊపి సాగనంపారు. వీటిలో ఒకటి కలాంబ్-వార్ధాలను కలిపేది కాగా, మరొకటి అమల్నేర్- న్యూ అష్టిని కలుపుతూ ప్రయాణికులకు సేవలందిస్తాయి. ఈ కొత్త రైలు సేవతో రైల్వే అనుసంధానం మెరుగుపడి, విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది.

 

|

   రాష్ట్రంలో రహదారి రంగం బలోపేతం దిశగా పలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. వీటిలో ఎన్‌హెచ్‌-930 పరిధిలోని వరోరా-వనీ విభాగం 4 వరుసలుగా విస్తరణ; సకోలి-భండారా, సలైఖుర్ద్-తిరోరాలను కలిపే కీలక రహదారుల కోసం రోడ్డు ఉన్నతీకరణ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో అనుసంధానం పెరిగి, ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక ప్రగతికి మార్గం సుగమమవుతుంది. కాగా, యావ‌త్‌మ‌ల్‌ నగరంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు.

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India flash PMI surges to 65.2 in August on record services, mfg growth

Media Coverage

India flash PMI surges to 65.2 in August on record services, mfg growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Kyndryl, Mr Martin Schroeter meets Prime Minister Narendra Modi
August 21, 2025

Chairman and CEO of Kyndryl, Mr Martin Schroeter meets Prime Minister, Shri Narendra Modi today in New Delhi. The Prime Minister extended a warm welcome to global partners, inviting them to explore the vast opportunities in India and collaborate with the nation’s talented youth to innovate and excel.

Shri Modi emphasized that through such partnerships, solutions can be built that not only benefit India but also contribute to global progress.

Responding to the X post of Mr Martin Schroeter, the Prime Minister said;

“It was a truly enriching meeting with Mr. Martin Schroeter. India warmly welcomes global partners to explore the vast opportunities in our nation and collaborate with our talented youth to innovate and excel.

Together, we all can build solutions that not only benefit India but also contribute to global progress.”