ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ కేంద్రం వద్దకు చేరుకోగానే ‘గురు-శిష్య పరంపర.. ఆధునిక సాంకేతికత’ ఇతివృత్తంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తొలుత ప్రధానమంత్రి తిలకించారు. అనంతరం ‘యశోభూమి’ త్రిమితీయ (3డి) నమూనాను ఆయన పరిశీలించారు. అంతకుముందు ద్వారక సెక్టార్ 21 నుంచి ‘యశోభూమి ద్వారకా సెక్టార్ 25వరకూ విస్తరించిన ఢిల్లీ విమానాశ్రయ మెట్రో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- ముందుగా విశ్వకర్మ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారులకు అంకితమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగాగల లక్షలాది మంది విశ్వకర్మలతో మమేమయ్యే అవకాశం లభించిందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించడం, వారితో సంభాషించడం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. పౌరులు కూడా ఈ ప్రదర్శనను సందర్శించి, కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. లక్షలాది చేతివృత్తుల కళాకారులకు, వారి కుటుంబాలకు ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ ఆశాకిరణం కాగలదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం (ఐసిఇసి)- యశోభూమి గురించి మాట్లాడుతూ... ఈ అద్భుత కేంద్రం నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన శ్రామికులు, విశ్వకర్మలను ప్రధాని ప్రశంసించారు. ఈ మేరకు “దేశంలోని ప్రతి విశ్వకర్మకూ, ప్రతి కార్మికుడికీ ఈ ‘యశోభూమి’ని అంకితం చేస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. నేటి ‘యశోభూమి’తో ముడిపడిన ప్రతి విశ్వకర్మతోపాటు వారి ఉత్పత్తులకు ప్రపంచంతో, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానంలో ఈ కేంద్రం శక్తిమంతమైన కూడలి కాగలదన్నారు. దేశపౌరుల దైనందిన జీవితాల్లో విశ్వకర్మల పాత్ర, ప్రాధాన్యం ఎంతో కీలకమని ప్రధాని అన్నారు. సాంకేతికంగా ప్రపంచం ఎంత ముందడుగు వేసినా, సమాజంలో వారి ప్రాముఖ్యం సదా కొనసాగుతుందని చెప్పారు. అందువల్ల విశ్వకర్మలను గుర్తించి, ఆదుకోవడం నేటి తక్షణావసరమని ఆయన స్పష్టం చేశారు.
“విశ్వకర్మల ఆత్మగౌరవ సముద్ధరణ, సామర్థ్య వికాసం, సౌభాగ్యం దిశగా వారికోసం కృషిచేసే భాగస్వామి రూపంలో ప్రభుత్వం నేడు ముందుకొచ్చింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సంప్రదాయ వృత్తినిపుణులు, హస్తకళాకారుల సంబంధిత 18 రంగాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారుడు, శిల్పి, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, టైలర్లు, తాపీ మేస్త్రీలు, క్షురకులు, రజకులు తదితరులను రూ.13,000 కోట్లతో చేపడుతున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకం కిందకు తెస్తామని ప్రకటించారు.
విదేశీ పర్యటనల సమయంలో చేతివృత్తులవారితో తన వ్యక్తిగత అనుభవాన్ని, చేతితో తయారుచేసిన ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీలు తమ తయారీ ఆర్డర్లను ఉప-తయారీదారులైన చిన్న పరిశ్రమలకు మళ్లిస్తున్నాయని తెలిపారు. “ఇటువంటి ఔట్‌సోర్సింగ్ పనులన్నీ మన విశ్వకర్మలకు అందుబాటులోకి రావాలి. ఆ విధంగా వారు అంతర్జాతీయ సరఫరా శ్రేణిలో భాగస్వాములు కావాలి. ఈ దిశగా మేం కృషి చేస్తున్నాం. అందుకోసమే ఈ పథకం ప్రవేశపెట్టాం. వారిని ఆధునిక యుగంలోకి మళ్లించడమే దీని లక్ష్యం” అని ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే “విశ్వకర్మ మిత్రులకు కాలానుగుణ శిక్షణ, సాంకేతికత, సాధనాలు చాలా కీలకం” అని పేర్కొన్నారు. ఈ మేరకు నిపుణులైన చేతివృత్తుల వారు, హస్తకళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.
ఈ శిక్షణ సమయంలో విశ్వకర్మ మిత్రులకు రోజువారీ భత్యం కింద రూ.500 ఇవ్వబడుతుందని ప్రధాని తెలిపారు. అలాగే ఆధునిక ఉపకరణాల కోసం రూ.15,000 విలువైన కొనుగోలు పత్రం అందజేస్తారని చెప్పారు. దీంతోపాటు వారు తయారుచేసే వస్తువులకు బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అంశాల్లో ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. విశ్వకర్మలు తమ కొనుగోలు పత్రాలతో వస్తుసేవల పన్నుకింద నమోదైన దుకాణాల్లో... భారత్‌లో తయారైన ఉపకరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే వారికి హామీరహిత ఆర్థికసాయంపై వివరిస్తూ- ‘ఏదైనా హామీ కావాలంటే మోదీయే పూచీకత్తు ఇస్తాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా స్వల్ప వడ్డీతో రూ.3 లక్షలదాకా రుణం లభిస్తుందని హామీ ఇచ్చారు.
“కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తోంది” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రతి జిల్లా నుంచి ఒక విశిష్ట ఉత్పత్తిని ప్రోత్సహించే ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పథకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ‘పీఎం స్వానిధి’ పథకం ద్వారా వీధి వ్యాపారులకు బ్యాంకులు తలుపులు తెరిచాయని, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. “తమనెవరూ పట్టించుకోవడం లేదనుకునే వారికి ఈ మోదీ అండగా ఉంటాడు” అని ప్రధాని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. సేవ చేయడానికి, గౌరవప్రద జీవితం అందించడానికి, సేవా ప్రదానం సజావుగా సాగేలా చూడటానికే తానున్నానని చెప్పారు. “ఇది మోదీ ఇస్తున్న హామీ” అని ఆయన నొక్కిచెప్పారు.
సాంకేతికత-సంప్రదాయాల సమ్మేళనం వైభవాన్ని జి-20 హస్తకళా ఉత్పత్తుల బజార్‌లో ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని ప్రధానమంత్రి అన్నారు. భారత్ సందర్శించిన ప్రముఖులకు ఇచ్చిన కానుకలలో మన విశ్వకర్మ మిత్రుల ఉత్పత్తులు ఉన్నాయని చెప్పారు. “స్థానికత కోసం స్వగళం కార్యక్రమాన్ని విస్తరింపజేసే బాధ్యత దేశమంతటిపైనా ఉంది” అని ఆయన అన్నారు. “మొదట మనం స్థానికత కోసం స్వగళం వినిపించాలి.. అటుపైన దాన్ని ప్రపంచవ్యాప్తం చేసే బాధ్యత స్వీకరించాలి” అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా నిర్వహించుకునే గణేశ చతుర్థి, ధన్‌తేరస్, దీపావళి తదితర పండుగల గురించి ప్రస్తావిస్తూ- ఈ సంతోష సమయాన ప్రతి పౌరుడూ స్థానిక ఉత్పత్తులను... ముఖ్యంగా విశ్వకర్మ మిత్రులు రూపొందించిన కళాకృతులను కొనుగోలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
“నేటి వికసిత భారతం ప్రతి రంగంలో తనదైన కొత్త గుర్తింపును సృష్టించుకుంటోంది” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు ఇటీవల భారత మండపం ప్రపంచవ్యాప్త చర్చనీయాంశం కాగా, ఇప్పుడు యశోభూమి ఆ వైభవాన్ని మరింతగా విస్తరింపజేసిందని పేర్కొన్నారు. “యశోభూమి సందేశం సుస్పష్టం.. ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమానికీ విశ్వవ్యాప్త విజయం.. కీర్తి తథ్యం” అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భవిష్యత్ భారతాన్ని ఆవిష్కరించడంలో యశోభూమి కీలక మాధ్యమం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ రాజధానిలో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం ఘనమైన భారత ఆర్థిక శక్తిని, వాణిజ్య సామర్థ్యాన్ని దీటుగా ప్రదర్శించగలదని ఆయన అన్నారు. అలాగే బహుళ రవాణా అనుసంధానం, ‘పిఎం గతిశక్తి’ రెండింటినీ ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ మేరకు మెట్రో టెర్మినల్ ప్రారంభోత్సవం, మెట్రో మార్గం ద్వారా ఈ కేంద్రానికి సంధానాన్ని ఉదాహరించారు. యశోభూమి పర్యావరణ వ్యవస్థ వినియోగదారుల ప్రయాణ, అనుసంధాన, బస, పర్యాటక అవసరాలన్నిటినీ తీర్చగలదని అని ఆయన నొక్కిచెప్పారు.
అభివృద్ధి, ఉపాధి సంబంధిత కొత్త రంగాలు మారే కాలానికి అనుగుణంగా ఆవిర్భవిస్తున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మన దేశంలో నేటి సమాచార సాంకేతిక రంగం భారీ ప్రగతిని యాభై-అరవై ఏళ్ల కిందట ఎవరూ కనీసం ఊహించి ఉండరని ఆయన ఉద్ఘాటించారు. అలాగే 30-35 ఏళ్లకిందట సామాజిక మాధ్యమాలు కూడా ఊహల్లో లేనివేనని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సదస్సుల పర్యాటకం భవిష్యత్తును ప్రస్తావిస్తూ ఈ రంగంలో మన దేశానికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు దీని విలువ రూ.25,000 కోట్లకుపైగా నమోదు కాగలదని భవిష్యవాణి వినిపించారు. సదస్సు పర్యాటకం కోసం వచ్చేవారు సాధారణ పర్యాటకులతో పోలిస్తే ఎక్కువగా ఖర్చుచేస్తారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏటా 32 వేలకుపైగా భారీ ప్రదర్శనలు, ‘ఎక్స్’పో’లు నిర్వహిస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ విధంగా ఇదొక పెద్ద పరిశ్రమ కాగా, ఇందులో భారత్ వాటా కేవలం ఒక శాతమేనని గుర్తుచేశారు. పైగా భారత్‌లోని అనేక పెద్ద కంపెనీలు తమ ప్రదర్శనల నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్తున్నాయని శ్రీ మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు భారతదేశమే అలాంటి భారీ ప్రదర్శనల నిర్వహణ కూడలిగా సదస్సు పర్యాటకానికి సన్నద్ధం అవుతున్నదని ఆయన నొక్కి చెప్పారు.
వివిధ కార్యక్రమాలు, సదస్సులు, ప్రదర్శనలకు అవసరమైన వనరులుంటేనే సదస్సు పర్యాటకం పురోగమించగలదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు భారత మండపం, యశోభూమి కేంద్రాలు ఢిల్లీ నగరాన్ని ఈ రంగంలో అతిపెద్ద కూడలిగా మార్చబోతున్నాయని చెప్పారు. తద్వారా లక్షలాది యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో “అంతర్జాతీయ సదస్సులు-సమావేశాలు, ప్రదర్శనల కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, సంస్థలు తరలివచ్చే ప్రదేశంగా యశోభూమి రూపొందగలదు” అని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యశోభూమి భాగస్వాములకు ప్రధాని ఆహ్వానం పలికారు. “ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రదర్శనలు-కార్యక్రమాల నిర్వహణ పరిశ్రమ సంబంధిత సంస్థలు, వ్యక్తులను ఢిల్లీకి రావాల్సిందిగా నేనివాళ ఆహ్వానిస్తున్నాను. అలాగే భారత నలుదిక్కులలోగల ప్రతి ప్రాంతం నుంచి చలనచిత్ర-టీవీ పరిశ్రమవారిని స్వాగతిస్తున్నాను. మీ అవార్డు ప్రదాన వేడుకలు, చలనచిత్రోత్సవాలను మీరిక్కడ నిర్వహించండి. చలనచిత్ర తొలి ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేయండి. ఈ సందర్భంగా భారత మండపం, యశోభూమిలో భాగస్వాములు కావాల్సిందిగా అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణ సంస్థలు, ప్రదర్శనల రంగంతో ముడిపడిన వ్యక్తులను ఆహ్వానిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మన ఆతిథ్యం, ఔన్నత్యం, వైభవానికి భారత మండపం, యశోభూమి ప్రతీకలుగా నిలుస్తాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈ రెండు కేంద్రాలూ భారత సంస్కృతి, అత్యాధునిక సౌకర్యాల సమ్మేళనం. భారతదేశ చరిత్రను ఈ గొప్ప సంస్థలు ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అత్యుత్తమ సౌకర్యాలను కోరుకునే నవ భారతం ఆకాంక్షను కూడా ఇవి ప్రతిబింబిస్తాయన్నారు. “నేనిదే చెబుతున్నా.. భారత ప్రగతి వేగానికి ఇక కళ్లాలుండవు” అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. పౌరులు కూడా ముందడుగు వేయాలని, సరికొత్త లక్ష్యాల నిర్దేశంతో వాటి సాకారానికి శ్రమించాలని, తద్వారా 2047 నాటికి వికసిత భారతం కలను నిజం చేయాలని పిలుపునిచ్చారు.
చివరగా- పౌరులందరూ సమష్టిగా శ్రమించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “మన విశ్వకర్మ మిత్రులు ‘మేక్ ఇన్ ఇండియా’కు గర్వకారణం. మన ప్రతిష్టను ప్రపంచానికి చాటడంలో ఈ అంతర్జాతీయ కేంద్రం ఒక మాధ్యమం కాగలద”ని విశ్వాసం వ్యక్తం చేస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, వాణిజ్యం-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, విద్య-నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నేపథ్యం - యశోభూమి
దేశంలో సదస్సులు-సమావేశాలు, ప్రదర్శనల నిర్వహణ కోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఉండాలన్నది ప్రధానమంత్రి సంకల్పం. ఈ మేరకు ద్వారకలో నిర్మిస్తున్న ‘యశోభూమి’ దానికి బలం చేకూరుస్తుంది. ఈ ప్రాంగణ వైశాల్యం 8.9 లక్షల చదరపు మీటర్లు కాగా, ఇందులో 1.8 లక్షల చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో కట్టడాలు రూపొందుతాయి. ప్రపంచంలో సదస్సులు, సమావేశాలు, విశేష కార్యక్రమాలు, ప్రదర్శనలు (మైస్) నిర్వహించగల అతిపెద్ద కేంద్రంగా ‘యశోభూమి’ తనదైన స్థానాన్ని ఆక్రమించగలదు.
దాదాపు రూ.5400 కోట్ల వ్యయంతో రూపొందుతుదున్న ‘యశోభూమి’ అద్భుత కన్వెన్షన్ సెంటర్‌గా నిలుస్తుంది. ఇందులో అనేక ఎగ్జిబిషన్ హాళ్లు, ఇతర సౌకర్యాలు ఉంటాయి. మొత్తం 73 వేల చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రంలో ప్రధాన ఆడిటోరియం, భారీ బాల్‌రూమ్ సహా 11,000 మంది ప్రతినిధులు హాజరుకాగల సామర్థ్యంతో 13 సదస్సు వేదికలతో్పాటు 15 సమావేశ మందిరాలున్నాయి. దేశంలోనే అతిపెద్ద ‘ఎల్‌ఇడి’ మీడియా కేంద్రం ఇక్కడ ఉంది. ఈ కేంద్రంలోని ప్లీనరీ హాల్‌లో దాదాపు 6,000 మంది అతిథులు కూర్చోవచ్చు. ఆడిటోరియంలో అత్యంత వినూత్న స్వయంచలిత ఆసన వ్యవస్థలున్నాయి. ప్రతినిధులు ఆసీనులయ్యే ప్రదేశాన్ని చదునుగా లేదా అంచెలవారీ కుర్చీల అమరికకు తగినట్లు వివిధ రూపాలకు మార్చుకోగల సదుపాయం ఈ కేంద్రంలో ఉంది. ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కొయ్య నేలలు, శ్రవణ పరికరాల గోడలు వంటివి సందర్శకులకు ప్రపంచ స్థాయి అనుభూతిని ఇస్తాయి. భారీ బాల్‌రూమ్ ప్రత్యేకమైన రేకుల పైకప్పుతో దాదాపు 2,500 మందికి ఆతిథ్యం ఇవ్వగలదు. అలాగే 500 మంది వరకూ ఆసీనులు కాగల విస్తరిత బహిరంగ ప్రదేశం కూడా అందుబాటులో ఉంటుంది. ఎనిమిది అంతస్తులలో విస్తరించిన 13 సమావేశ మందిరాలు వివిధ స్థాయులలో రకరకాల సమావేశాల నిర్వహణకు అనువుగా ఉంటాయి.
ప్రపంచంలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ హాళ్లలో ‘యశోభూమి’ కూడా ఒకటి. ఇందులో 1.07 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన హాళ్లు వివిధ రకాల వాణిజ్య, వాణిజ్యేతర ప్రదర్శనలు సహా వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు తగినవిధంగా ఉంటాయి. వైభవోపేతంగా తీర్చిదిద్దిన విశ్రాంతి ప్రాంగణం రాగి పైకప్పుతో ప్రత్యేకంగా రూపొందించబడి స్కైలైట్ల సాయంతో ఆ ప్రదేశంలో కాంతిని వర్ణమయం చేస్తుంది. విశ్రాంతి ప్రాంగణంలో మీడియా గదులు, వీవీఐపీ లాంజ్‌లు, క్లోక్ సదుపాయాలు, సందర్శకుల సమాచార కేంద్రం, టికెటింగ్ వంటి వివిధ అనుబంధ ప్రదేశాలు కూడా ఉంటాయి. ‘యశోభూమి’లో ప్రజలు సంచరించే ప్రదేశాలన్నీ, కన్వెన్షన్ సెంటర్ బహిర్ ప్రాంగణంతో కొనసాగే విధంగా రూపొందించబడ్డాయి. ఇది రంగోలీ నమూనాను సూచించే ఇత్తడి పొదుగులతో, ధ్వనిని వడకట్టే-శోషించుకునే లోహపు సిలిండర్లు, వెలుతురు చిమ్మే నమూనా గోడలతో టెర్రాజో ప్రాంగణల్లా ఉంటాయి. వీటి రూపకల్పనలో భారతీయ సంస్కృతి ప్రేరిత పదార్థాలు-వస్తువులు వినియోగించబడ్డాయి.
‘యశోభూమి’ కేంద్రంలో వ్యర్థ జలాలను వందశాతం పునర్వినియోగానికి వీలుగా శుద్ధిచేసే అత్యాధునిక మురుగుశుద్ధి వ్యవస్థ ఉంది. అలాగే వర్షజల సేకరణ సంబంధిత సదుపాయం కూడా ఉన్నందున పర్యావరణ సుస్థిరతలో తన నిబద్ధతను ఇది నిరూపించుకుంటుంది. ఆ మేరకు ‘సిఐఐ’ పర్యవేక్షణలోని ‘భారత హరిత నిర్మాణ మండలి’ (ఐజిబిసి) నుంచి ఈ ప్రాంగణానికి ‘ప్లాటినం ధ్రువీకరణ పత్రం’ లభించింది. సందర్శకుల భద్రత కోసం ‘యశోభూమి’ కేంద్రంలో అత్యాధునిక భద్రత నిబంధనలు అమలు చేయబడతాయి. భూగర్భ పార్కింగ్ ప్రదేశంలో 3,000కుపైగా వాహనాలను నిలపవచ్చు. దీంతోపాటు 100కుపైగా విద్యుత్ వాహన చార్జింగ్ పాయింట్లు కూడా ఇక్కడ ఉంటాయి.
కొత్త మెట్రో స్టేషన్ ‘యశోభూమి ద్వారకా సెక్టార్ 25’ ప్రారంభం కావడంతో ఢిల్లీ విమానాశ్రయ మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గం కూడా ఈ కేంద్రంతో అనుసంధానం అవుతుంది. కొత్త మెట్రో స్టేషన్‌లో మూడు సబ్‌వేలు కూడా ఉంటాయి- ఇందులో ఎగ్జిబిషన్ హాళ్లు, కన్వెన్షన్ కేంద్రం, మధ్యభాగంలోని వేదికకు 735 మీటర్ల పొడవైన ఒక సబ్‌వే సంధాన మార్గంగా ఉంటుంది. అలాగే ద్వారకా ఎక్స్ ప్రెస్‌వే మీదుగా ప్రవేశం/నిష్క్రమణలకు వీలుగా మరొకటి సబ్‌వే ఉండగా; మూడో సబ్‌వే- ‘యశోభూమి’ ప్రాంగణంలో తర్వలో నిర్మితమయ్యే ఎగ్జిబిషన్ హాళ్ల సముదాయానికి మెట్రో స్టేషన్‌ను జోడిస్తుంది.
పీఎం విశ్వకర్మ
సంప్రదాయ చేతివృత్తులలో కొనసాగుతున్న వారికి చేయూతపై ప్రధానమంత్రి సదా దృష్టి సారించారు. వారిని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ప్రాచీన సంప్రదాయం, సంస్కృతి, వైవిధ్య వారసత్వాలను సజీవంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు స్థానిక ఉత్పత్తులు, కళలు, చేతిపనుల ద్వారా చైతన్యం నిత్యనూతనంగా విలసిల్లాలని సంకల్పించారు.
ఈ నేపథ్యంతోనే రూ.13,000 కోట్ల అంచనా వ్యయంతో ‘పిఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికింద సార్వత్రిక సేవా కేంద్రాల్లో ‘పిఎం విశ్వకర్మ’ పోర్టల్ ద్వారా విశ్వకర్మలను బయోమెట్రిక్ ఆధారిత పద్ధతిలో ఉచితంగా నమోదు చేస్తారు. వీరికి ‘పిఎం విశ్వకర్మ ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు, ప్రాథమిక-అధునాతన శిక్షణతో నైపుణ్య ఉన్నతీకరణ, రూ.15,000 విలువైన ఉపకరణ ప్రోత్సాహకంతోపాటు తొలివిడత కింద రూ.1 లక్షదాకా, ఆ తర్వాత రెండో విడతగా రూ.2 లక్షలు వంతున 5 శాతం వడ్డీ రాయితో, మొత్తం రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది. అంతేకాకుండా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం, ఉత్పత్తులకు మార్కెటింగ్ మద్దతు ఇవ్వబడతాయి.
విశ్వకర్మలు తమ చేతులు-పనిముట్లతో పనిచేసే గురు-శిష్య పరంపర లేదా కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాల అనుసరణను బలోపేతం చేయడం, పెంపొందించడం ఈ పథకం లక్ష్యం. చేతివృత్తుల నిపుణులు, హస్తకళాకారులు తమ ఉత్పత్తుల-సేవల నాణ్యతను పెంచుకోవడం, వారి సేవలను మెరుగుపరచడం, వారిని దేశీయ-అంతర్జాతీయ ప్రపంచ విలువ శ్రేణితో అనుసంధానించడం వగైరాలపై ‘పిఎం విశ్వకర్మ’ పథకం ప్రధానంగా దృష్టి పెడుతుంది.
దేశంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లోగల చేతవృత్తుల నిపుణులు, హస్తకళాకారులకు ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ మేరకు 18 సంప్రదాయ వృత్తులు-కళలను ‘పిఎం విశ్వకర్మ’ పథకం పరిధిలో చేర్చారు. వీటిలో (1) వడ్రంగం, (2) పడవల తయారీ (3) ఆయుధ తయారీదారు (4) కమ్మరి (5) సుత్తులు-ఉపకరణాల తయారీ (6) తాళాల తయారీదారులు (7) స్వర్ణకారులు (8) కుమ్మరి; (9) శిల్పి, శిలారూప కర్త; (10) చర్మకారులు (షూస్మిత్/ ఫుట్‌వేర్ ఆర్టిజన్); (11) తాపీమేస్త్రీ (12) బుట్టలు/చాపలు/చీపురు తయారీ/నార నేత; (13) బొమ్మలు, (సంప్రదాయ) ఆట వస్తువుల తయారీ (14) క్షురకులు (15) పూలమాలలు, పుష్పగుచ్ఛాల తయారీదారులు (16) రజకులు (17) దర్జీలు (18) చేపలవల తయారీదారులు వంటివారున్నారు.
आज भगवान विश्वकर्मा की जयंती है।
— PMO India (@PMOIndia) September 17, 2023
ये दिन हमारे पारंपरिक कारीगरों और शिल्पकारों को समर्पित है: PM @narendramodi pic.twitter.com/19nim8CHGu
मैं आज 'यशोभूमि' को देश के हर श्रमिक को समर्पित करता हूं, हर विश्वकर्मा साथी को समर्पित करता हूं: PM @narendramodi pic.twitter.com/zCVApNOf3V
— PMO India (@PMOIndia) September 17, 2023
हज़ारों वर्षों से जो साथी भारत की समृद्धि के मूल में रहे हैं, वो हमारे विश्वकर्मा ही हैं। pic.twitter.com/XEzAol2vuf
— PMO India (@PMOIndia) September 17, 2023
With PM Vishwakarma Yojana, our endeavour is to support the people engaged in traditional crafts. pic.twitter.com/wDtKfG3ipn
— PMO India (@PMOIndia) September 17, 2023
आज देश में वो सरकार है, जो वंचितों को वरीयता देती है: PM @narendramodi pic.twitter.com/edemeKUXd6
— PMO India (@PMOIndia) September 17, 2023
We have to reiterate our pledge to be 'Vocal for Local.' pic.twitter.com/bb5OSX0qQ3
— PMO India (@PMOIndia) September 17, 2023
Today's developing India is carving a new identity for itself in every field. pic.twitter.com/TrHeScAr5H
— PMO India (@PMOIndia) September 17, 2023