"ప్రజల భాగస్వామ్యంతో జల, ప్రకృతి సంరక్షణ ప్రజా చైతన్య కార్యక్రమానికి శ్రీకారం"
"‘‘జల సంరక్షణ విధానపరమైన అంశమే కాదు, గొప్పకార్యం కూడా’’"
"‘‘నీటిని దైవంగా, నదులను దేవతలుగా, సరోవరాలను దేవతా నివాసాలుగా భావించడం భారతీయుల సంస్కృతి’’"
"‘‘యావత్ ప్రభుత్వం, యావత్ సమాజం అన్న విధానంతో పని చేశాం’’"
"‘‘జల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ భారతీయ సాంస్కృతిక జాగృతిలో భాగం’’"
"‘‘నీటి సంరక్షణ సామాజిక బాధ్యత’’"
" నీటి భద్రత కోసం 'పొదుపు, పునర్వినియోగించు, నిల్వ, పునరావృతం' తారకమంత్రం కావాలి’’"
"‘‘సమష్టిగా జల సంరక్షణలో మానవాళి మొత్తానికీ భారత్ ను కరదీపికగా మారుద్దాం’’"

‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్‌లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.

 

నీటి సంరక్షణ విధానపరమైన అంశం మాత్రమే కాదని, అది గొప్ప కార్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దాతృత్వంతో పాటు బాధ్యతలు సైతం ఉండాలన్నారు. “మన భవిష్యత్తు తరాలు మనల్ని అంచనా వేసేందుకు ఉపయోగించే మొదటి కొలమానం నీరు” అని శ్రీ మోదీ అన్నారు. ఎందుకంటే,  నీరు సహజ వనరు మాత్రమే కాదనీ, మానవాళి జీవితానికి, భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న అని పేర్కొన్నారు. సుస్థిర భవిష్యత్తు దిశగా చేపట్టిన తొమ్మిది తీర్మానాల్లో జల సంరక్షణ ప్రధానమైనదని చెప్పారు. అర్థవంతమైన జల సంరక్షణ ప్రయత్నాల్లో ప్రజల పాలు పంచుకోవడం పట్ల శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. జలశక్తి శాఖ, గుజరాత్ ప్రభుత్వం తో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

పర్యావరణం, జల సంరక్షణ ఆవశ్యకత వివరించిన ప్రధాన మంత్రి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచినీటిలో 4 శాతం మాత్రమే భారత్‌లో ఉందని తెలిపారు. "దేశంలో అనేక నదులు ఉన్నప్పటికీ,  పెద్ద సంఖ్యలో భౌగోళిక ప్రాంతాల్లో నీటి కొరత ఉంది. నీటిమట్టం కూడా వేగంగా తగ్గిపోతోంది" అని వివరించారు. వాతావరణ మార్పులు, నీటి కొరత ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపిస్తాయని తెలిపారు.

సవాళ్లతో కూడిన పరిస్థితులున్నప్పటికీ తన సమస్యలతో పాటు, ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగల సమర్థత భారత్ కు మాత్రమే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. భారతీయ ప్రాచీన గ్రంథాలకు ఆ ఘనత దక్కుతుందన్న ఆయన, నీరు, పర్యావరణ సంరక్షణలను కేవలం పుస్తక జ్ఞానంగానో, పరిస్థితులను బట్టి ఏర్పడిన అంశాలుగానో పరిగణించవద్దన్నారు. “నీరు, పర్యావరణ సంరక్షణ భారతీయ సాంస్కృతిక జాగృతిలో భాగం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నీటిని దైవంగా, నదులను దేవతలుగా, సరోవరాలను దేవతా నివాసాలుగా పూజించే సంస్కృతి భారతీయులదన్నారు. గంగ, నర్మద, గోదావరి, కావేరి నదులను తల్లులుగా పరిగణిస్తామన్నారు. జీవితం నీటితో మొదలై, దానిపైనే ఆధారపడి ఉందని, నీటి పొదుపును, జల దానాన్ని అత్యున్నత సేవా రూపంగా ప్రాచీన గ్రంథాలు ప్రస్తావించాయని అన్నారు. మన పూర్వీకులకు నీరు, పర్యావరణ సంరక్షణల ప్రాధాన్యం స్పష్టంగా తెలుసన్నారు. రహీమ్ దాస్ శ్లోకాన్ని పేర్కొంటూ, ఈ దేశ దూరదృష్టిని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. నీరు, పర్యావరణ సంరక్షణలో దేశం ముందుండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

‘జల్ సంచయ్ జన భాగీదారీ’ కార్యక్రమం గుజరాత్ లో ప్రారంభమై, పౌరులందరికీ విజయవంతంగా నీటిని అందుబాటులోకి తెచ్చిందని ప్రధాని ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రభుత్వాలకు జల సంరక్షణ దృక్పథం లేకపోవడంతో, రెండున్నర దశాబ్దా కిందట సౌరాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఈ తీవ్ర సంక్షోభాన్ని అధిగమించాలని తాను సంకల్పించానన్నారు. నీరు అదనంగా ఉన్న ప్రాంతాల నుంచి దానిని సేకరించి, కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు తరలించేలా సౌని యోజనను కూడా ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో చేసిన కృషి ఫలితాలు నేడు ప్రపంచానికి కనిపిస్తున్నాయని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

పౌర స్పృహ, ప్రజల భాగస్వామ్య ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ “జల సంరక్షణ విధానపరమైన అంశం మాత్రమే కాదు, సామాజిక నిబద్ధత కూడా’’ అని ప్రధాని అన్నారు. గతంలో వేల కోట్లతో నీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పటికీ, ఫలితాలు మాత్రం గత పదేళ్లలోనే కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. “సామాజిక భాగస్వామ్యంతో సంక్లిష్ట సమస్యల పరిష్కారం మా ప్రభుత్వ విధానం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో చేసిన పనులను వివరిస్తూ, నీటికి సంబంధించిన అంశాలపై సంశయాలు మొదటిసారిగా తొలగిపోయాయని, ప్రభుత్వ సంపూర్ణ భాగస్వామ్య విధాన నిబద్ధతను నెరవేర్చేలా జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటైందని ప్రధాని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీటి సరఫరా చేయాలన్న సంకల్పాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే నీటి కనెక్షన్ అందుబాటులో ఉందని, ప్రస్తుతం ఈ సంఖ్య 15 కోట్లుగా ఉందని తెలిపారు. దేశంలో 75 శాతానికి పైగా ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించిన ఘనత జల్ జీవన్ మిషన్ కు దక్కుతుందన్నారు. జల్ జీవన్ మిషన్లో స్థానిక జల సమితుల కృషిని ఆయన ప్రశంసించారు. గుజరాత్ లో పానీ సమితులలో మహిళలు అద్భుతాలు చేసినట్టుగానే, దేశవ్యాప్తంగా పానీ సమితులలో మహిళలు చురుగ్గా పనిచేస్తున్నారని అన్నారు. ఇందులో గ్రామీణ మహిళల భాగస్వామ్యమే కనీసం 50 శాతం వరకూ ఉంటోందన్నారు.

 

జలశక్తి అభియాన్ నేడు జాతీయ మిషన్ గా ఎలా మారిందో వివరిస్తూ, సాంప్రదాయక నీటి వనరుల పునరుద్ధరణ లేదా కొత్త వనరుల నిర్మాణం ఏదైనా సరే, పౌర సమాజం నుంచి పంచాయతీలు సహా అన్ని వర్గాలు ఇందులో పాల్గొంటున్నాయని ప్రధాని తెలిపారు. ప్రజల భాగస్వామ్య ఆవశ్యకతను ప్రధానంగా పేర్కొంటూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రతి జిల్లాలో ప్రారంభమైన అమృత సరోవర్ పనుల వల్ల దేశంలో 60 వేలకు పైగా సరోవరాల నిర్మాణం జరిగిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అదే విధంగా భూగర్భ జలాలను పునరుద్ధరించడంలో, జల వనరుల నిర్వహణలో అటల్ భూ జల యోజన గ్రామస్తుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఇవేకాకుండా 2021లో ప్రారంభమైన ‘వర్షాన్ని ఒడిసిపట్టండి’ ప్రచారంలో ఇప్పుడు పెద్దసంఖ్యలో భాగస్వాములున్నారని పేర్కొన్నారు. ‘నమామి గంగే’ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఇది పౌరులకు భావోద్వేగపరమైన అంశంగా మారిందన్నారు. పాత సంప్రదాయాలు, అసంబద్ధమైన ఆచారాలను వదిలి నదీ శుభ్రతను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

‘ఏక్ పెడ్ మా కే నామ్’ ప్రచారం ద్వారా ఒక చెట్టు నాటాలని ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ, అడవుల పెంపకంతో భూగర్భజల మట్టం వేగంగా పెరుగుతోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ద్వారా కోట్లాది మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇటువంటి ప్రచారాలు, సంకల్పాల్లో ప్రజల భాగస్వామ్య ఆవశ్యకతను శ్రీ మోదీ స్పష్టంగా పేర్కొన్నారు. 140 కోట్ల మంది పౌరుల భాగస్వామ్యంతో జలసంరక్షణ కృషి ప్రజా ఉద్యమంగా మారుతోందన్నారు. 

 

జల సంరక్షణ దిశగా తక్షణ కార్యాచరణ అవశ్యమని ప్రధానమంత్రి సూచించారు. జల సంబంధ సమస్యల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు 'పొదుపు, పునర్వినియోగించు, నిల్వ, పునరావృతం'

సూత్రాన్ని తప్పక అనుసరించాలన్నారు. దుర్వినియోగానికి స్వస్తి చెబితేనే జల సంరక్షణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే పొదుపు, పునర్వినియోగించు, నిల్వ, కలుషిత జల పునరావృతం ద్వారా మాత్రమే జల సంరక్షణ సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వినూత్న విధానాలు, ఆధునిక సాంకేతికతల అనుసరణ ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దేశం నీటి అవసరాలలో 80 శాతం వ్యవసాయ సంబంధితమేనని ప్రధాని గుర్తు చేశారు. కాబట్టి జల సుస్థిరత దిశగా సేద్యంలో నీటి పొదుపు కీలకమని ఆయన సూచించారు. అందుకే సుస్థిర వ్యవసాయం లక్ష్యంగా బిందుసేద్యం వంటి పద్ధతులను ప్రభుత్వం సదా ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. దీంతోపాటు ‘ప్రతి బిందువుతో మరింత ఫలం’ (పర్ డ్రాప్ మోర్ క్రాప్) వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. నీటి కొరతగల ప్రాంతాల్లో రైతుల ఆదాయం పెంపుసహా జల సంరక్షణకు ఈ సూత్రం అనుసరణీయమని చెప్పారు. మరోవైపు తక్కువ నీటితో ఫలసాయమిచ్చే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల వంటి పంటల సాగుకు ప్రభుత్వం మద్దతిస్తున్నదని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాల స్థాయిలో జల సంరక్షణ పద్ధతుల అనుసరణతోపాటు  ఈ కృషిని వేగిరపరచాలని ఆయన సూచించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై కొన్ని రాష్ట్రాలు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని ప్రధాని అభినందించారు. ఈ కృషిని ముమ్మరం చేసేందుకు రాష్ట్రాలన్నీ కలసిరావాలని, ఉద్యమ తరహాలో ముందడుగు వేయాలని కోరారు. ‘‘ఆధునిక సాంకేతిక పద్ధతులతోపాటు పొలాల సమీపంలోని చెరువులు, బావుల వంటి జల వనరులను నిల్వ చేసుకునే సంప్రదాయ పరిజ్ఞానాన్ని కూడా మనం  ప్రోత్సహించాల్సి ఉంది’’ అన్నారు.

  ‘‘జల సంరక్షణ ఉద్యమ విజయం, పరిశుభ్రమైన నీటి లభ్యతతో ఒక భారీ జల ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది’’ అని శ్రీ మోదీ స్పష్టీకరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జల్ జీవన్ మిషన్’ లక్షలాదిగా ఇంజనీర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, నిర్వాహకుల వంటి వారికి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించిందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఇంటికీ పైప్‌ లైన్లు, కొళాయిల ద్వారా నీటి సరఫరాతో పౌరులకు 5.5 కోట్ల పని గంటలు ఆదా కాగలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసినట్లు ప్రధాని తెలిపారు. దీనివల్ల మన సోదరీమణులు, కుమార్తెల సమయంతోపాటు శ్రమ ఆదా అవుతుందని, వారు ఉత్పాదక కార్యకలాపాల్లో పాలుపంచుకునే వీలుంటుందని పేర్కొన్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని ఆయన వివరించారు. జల ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యం కూడా కీలక అంతర్భాగమని శ్రీ మోదీ అన్నారు. కొన్ని నివేదికల ప్రకారం దేశంలో 1.25 లక్షల మందికిపైగా బాలల అకాల మరణాలను నివారించే వీలుందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా అతిసార వంటి వ్యాధుల బారినుంచి ఏటా 4 లక్షల మందికిపైగా ప్రజలకు రక్షణ లభిస్తున్నదని పేర్కొన్నారు. దీనివల్ల పౌరులకు ఆరోగ్య సంరక్షణ వ్యయం గణనీయంగా తగ్గుతున్నదని తెలిపారు.

   జల సంరక్షణ ఉద్యమంలో దేశంలోని పరిశ్రమల కీలక పాత్రను ప్రధాని అభినందిస్తూ, ఈ దిశగా వాటి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ‘వ్యర్థజలాల విడుదలలో నికరశూన్య ప్రమాణం’ అందుకోవడంతోపాటు పునరావృత్తి లక్ష్యం సాధించిన పరిశ్రమలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా జల సుస్థిరత సాధనలో వివిధ రంగాల కృషిని ప్రముఖంగా ప్రస్తావించారు. అనేక పరిశ్రమలు తమ ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ (సిఎస్ఆర్) కింద జల సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో కోసం ‘సిఎస్‌ఆర్‌’ వెసులుబాటును గుజరాత్ వినూత్నంగా వాడుకోవడాన్ని ప్రశంసిస్తూ- దీన్ని కొత్త రికార్డు సృష్టించే కృషిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ‘‘జల సంరక్షణ కోసం ‘సిఎస్‌ఆర్‌’ వినియోగం ద్వారా గుజరాత్ కొత్త ప్రమాణం నెలకొల్పింది. సూరత్, వల్సాద్, డాంగ్, తాపీ, నవ్‌సారి వంటి ప్రాంతాల్లో సుమారు 10,000 బోరు బావుల నిల్వ వ్యవస్థలు పూర్తయ్యాయి’’ అని వివరించారు. నీటి కొరత పరిష్కారంతోపాటు కీలక ప్రాంతాల్లో భూగర్భ జల వనరులను నిల్వ చేసుకునేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల సంయుక్త కృషి ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ- ‘‘జల్ సంచయ్-జన్ భాగీదారీ అభియాన్’’ ద్వారా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వం 24,000 వ్యవస్థల ఏర్పాటుకు ఓ  కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి’’ అని వివరించారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే నమూనాగా ఈ కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు.

 

   చివరగా-  జల సంరక్షణలో భారత్ ప్రపంచానికే ఆదర్శం కాగలదని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. ‘‘మనమంతా ఒక్కతాటిపై నిలిచి, జల సంరక్షణలో భారతదేశాన్ని యావత్ మానవాళికి కరదీపికగా మార్చగలమని నా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు. ఈ ఉద్యమం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సి.ఆర్.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   జల భద్రతపై ప్రధాని దృక్కోణానికి అనుగుణంగా సామాజిక భాగస్వామ్యం-యాజమాన్యానికి కీలక ప్రాధాన్యంతో జల సంరక్షణ ఉద్యమ విజయానికి ‘జల్ సంచయ్-జన్ భాగీదారీ’ (జెఎస్-జెబి) కార్యక్రమం ద్వారా కృషి కొనసాగుతోంది. ఇది ‘యావత్ సమాజం-యావత్ ప్రభుత్వం’ నినాదంతో ముందుకు సాగుతోంది. గుజరాత్ ప్రభుత్వ సారథ్యంలోని ‘జల్ సంచయ్’ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో జలశక్తి మంత్రిత్వ శాఖ గుజరాత్‌లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ‘జెఎస్-జెబి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద రాష్ట్రానికి జల సురక్షిత భవిష్యత్తు దిశగా గుజరాత్ ప్రభుత్వం పౌరులు, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, ఇతర భాగస్వాములను ఒకేతాటిపైకి తెచ్చేందుకు కృషిచేస్తోంది.

 ఇందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 24,800 వర్షజల సంరక్షణ వ్యవస్థలను సామాజిక భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. వర్షజల సంరక్షణ మెరుగుదలతోపాటు దీర్ఘకాలిక జల సుస్థిరతకు భరోసానివ్వడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi