‘పీఎం స్వానిధి’ కింద లక్షమందిలబ్ధిదారులకు ఆమోదిత రుణాల బదిలీ;
ముంబై మెట్రో రైలు మార్గాలు ‘2ఎ, 7’ దేశానికి అంకితం;
ఛత్రపతి శివాజీమహారాజ్ టెర్మినస్, 7 మురుగుశుద్ధియంత్రాగారాల పునరాభివృద్ధికిశంకుస్థాపన;
20 ‘హిందూహృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆప్లా దవాఖానాలు ప్రారంభం;
ముంబైలో దాదాపు 400 కిలోమీటర్ల సిమెంటు రోడ్ల ప్రాజెక్టు ప్రారంభం;
“భారతదేశ సంకల్పంపై ప్రపంచంవిశ్వాసం చూపుతోంది”;
“రెండు ఇంజన్ల ప్రభుత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రేరణ..
‘సూరజ్-స్వరాజ్’ల స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి”;
“భారత్‌ తన భౌతిక.. సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు
భవిష్యత్ దృక్పథం.. ఆధునిక విధానాలతో నిధులు వెచ్చిస్తోంది”;
“వర్తమాన.. భవిష్యత్‌ అవసరాలు రెండింటి దృష్టితో కృషి సాగుతోంది”;
“అమృత కాలంలో మహారాష్ట్రలోని పలు నగరాలు దేశాభివృద్ధిని నడిపిస్తాయి”;
“నగరాల అభివృద్ధిలో సామర్థ్యానికి.. రాజకీయ సంకల్పానికి కొదవ లేదు”;
“ముంబయి ప్రగతికి కేంద్రం.. రాష్ట్రం.. స్థానిక సంస్థల మధ్య సమన్వయం కీలకం”; “స్వానిధి కేవలం రుణ పథకం కాదు.. ఇది వీధి వర్తకుల ఆత్మగౌరవానికి పునాది”;

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని ముంబైలో దాదాపు రూ.38,800 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనతోపాటు కొన్నిటిని జాతికి అంకితం చేశారు. అలాగే ‘పీఎం స్వానిధి’ పథకం కింద లక్షమంది లబ్ధిదారులకు మంజూరైన రుణాలను వారి ఖాతాలకు బదిలీ చేశారు. ముంబైలో మెట్రో రైలు మార్గాలు ‘2ఎ, 7’లను ఆయన దేశానికి అంకితం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సహా 7 మురుగు శుద్ధి యంత్రాగారాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. వీటితోపాటు 20 ‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆప్లా దవాఖానా’లు ప్రారంభించారు. అలాగే ముంబైలో దాదాపు 400 కిలోమీటర్ల పొడవైన రోడ్ల కాంక్రీట్‌ పనులకు శ్రీకారం చుట్టారు.

 

ఈ కార్యక్రమాల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ముంబైని మెరుగైన మహా నగరంగా తీర్చిదిద్దడంలో ఈ ప‌థ‌కాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయ‌ని పేర్కొంటూ వీటి ల‌బ్ధిదారుల‌కు, ముంబై వాసులకు అభినంద‌న‌లు తెలిపారు. “స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశం తన కలలను సాకారం చేసుకోగల ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం ఇదే తొలిసారి” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒకనాడు భారతదేశంలో పేదరికం గురించి మాత్రమే ప్రపంచంలో చర్చ సాగుతూండేదని, ఇతర దేశాల సాయానికి ఎదురుచూడటం ఒక్కటే మార్గంగా ఉండేదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, ఇవాళ భారతదేశ సంకల్పంపై ప్రపంచం విశ్వాసం ప్రదర్శించడం చూపుతుండటం మన ఆత్మవిశ్వాసానికి తొలి ఉదాహరణ అని ఆయన నొక్కిచెప్పారు. వికసిత భారతం కోసం భారతీయులంతా ఆసక్తితో ఎదురుచూస్తుండగా మన దేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం ప్రస్ఫుటం అవుతున్నదని ప్రధాని అన్నారు. భారతదేశం తన సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటోందన్న నమ్మకం ఫలితంగానే ఈ సానుకూలత వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు. “భారతదేశం నేడు అపూర్వ ఆత్మవిశ్వాసంతో ఉంది.. “రెండు ఇంజన్ల ప్రభుత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రేరణ, ‘సూరజ్-స్వరాజ్’ల స్ఫూర్తి బలంగా కనిపిస్తున్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

దేశానికి, కోట్లాది పౌరులకు నష్టం కలిగించిన కుంభకోణాల శకాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. “మనం ఈ దృక్పథాన్ని మార్చుకున్నాం… ఇవాళ భారతదేశం తన భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం భవిష్యత్ దృక్పథం, ఆధునిక విధానాలతో నిధులు వెచ్చిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒకవైపు గృహాలు, మరుగుదొడ్లు, విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, ఉచిత వైద్యం, వైద్య కళాశాలలు, ‘ఎయిమ్స్‌’, ‘ఐఐటీ’లు, ‘ఐఐఎం’లు శరవేగంగా విస్తరిస్తుంటే- మరోవైపు ఆధునిక అనుసంధానం అదే వేగంతో సాగుతున్నదని ఆయన చెప్పారు. ఆ మేరకు “వర్తమాన, భవిష్యత్ అవసరాలు రెండింటినీ దృష్టిలో ఉంచుకుని పనులు చేపడుతున్నాం” అని ఆయన తెలిపారు. మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుత కష్ట సమయంలోనూ భారత్‌ తన 80 కోట్ల మంది పౌరులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయడమేగాక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులు పెడుతున్నదని ఆయన గుర్తుచేశారు. “ఇది నేటి భారతదేశ నిబద్ధతను స్పష్టం చేస్తోంది… వికసిత భారతం భావనకు ఇది ప్రతీక” అని ఆయన అన్నారు. వికసిత భారతం సృష్టిలో నగరాల పాత్రను ప్రధాని నొక్కిచెప్పారు. అమృత్‌కాలంలో మహారాష్ట్రలోని అనేక నగరాలు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. “అందుకే ముంబైని భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు రూపుదిద్దడం రెండు ఇంజన్ల ప్రభుత్వ కీలక ప్రాథమ్యాలలో ఒకటిగా ఉంది.” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంబైలోని మెట్రో రైలు సౌకర్యాన్ని శ్రీ మోదీ ఉదాహరించారు. ముంబైలో 2014 నాటికి 10-11 కిలోమీటర్లకు మించి మెట్రో మార్గం ఉండేది కాదన్నారు. అయితే, నేడు రెండు ఇంజన్ల ప్రభుత్వంతో మెట్రో కొత్త వేగం, స్థాయిని పుంజుకోగా ముంబై నగరం 300 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ వైపు జోరుగా పయనిస్తున్నదని చెప్పారు.

భారత రైల్వేలు, ముంబై మెట్రో అభివృద్ధిలో భాగంగా దేశమంతటా ఉద్యమ తరహాలో పనులు సాగుతున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. తద్వారా స్థానిక రైళ్లు కూడా ప్రయోజనం పొందుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వనరులు సమృద్ధిగా ఉన్నవారికి మాత్రమే లభించే అధునాతన సేవలు, పరిశుభ్రత, ప్రయాణ వేగం అనుభవాలను సామాన్యులకూ అందించే దిశగా రెండు ఇంజన్ల ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా నేటి రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటైన ఛత్రపతి మహారాజ్ టెర్మినస్ కూడా 21వ శతాబ్దపు ఉజ్వల భారతానికి ఒక అద్భుత ఉదాహరణగా కొత్తరూపు సంతరించుకుంటుందని ప్రధాని చెప్పారు. “సామాన్యులకూ మెరుగైన సేవలు అందించడం, ప్రయాణానుభవ సౌలభ్యం కల్పించడం ప్రధాన లక్ష్యం” అని ఆయన అన్నారు. ఈ రైల్వే స్టేషన్లు కేవలం రైల్వే సంబంధిత సేవలకే పరిమితం కాకుండా బహుళ రవాణా అనుసంధాన కేంద్రాలుగానూ పనిచేస్తాయని ఆయన తెలిపారు. “ప్రతి నగరంలోనూ అన్ని రవాణా మార్గాలు… బస్సు, మెట్రో, టాక్సీ లేదా ఆటో- ఏదైనప్పటికీ రవాణా సాధనాలన్నీ ఒకే కప్పు కింద అనుసంధానం చేయబడతాయి. తద్వారా ప్రయాణికులందరికీ నిరంతరాయ అనుసంధాన సౌలభ్యం అందివస్తుంది” అని ప్రధానమంత్రి వివరించారు.

రాబోయే ఏళ్లలో ముంబై లోకల్‌, మెట్రో నెట్‌వర్క్ విస్తరణ, వందేభారత్ రైళ్లు వంటి సాంకేతిక అభివృద్ధి బుల్లెట్ రైలుకన్నా వేగవంతమైన అధునాతన అనుసంధానంతో ముంబై నగరం సరికొత్త రూపం సంతరించుకోగలదని ప్రధాని వెల్లడించారు. “పేద కార్మికులు, సిబ్బంది నుంచి దుకాణదారులు, భారీ వ్యాపారసంస్థల యజమానులదాకా ప్రతి ఒక్కరికీ ముంబైలో నివాసం సౌకర్యవంతం అవుతుంది” అన్నారు. పొరుగు జిల్లాల నుంచి ముంబై ప్రయాణం ఇకపై మరింత సులభం కాగలదని ఆయన చెప్పారు. ‘తీరప్రాంత రహదారి, ఇందూ మిల్స్ స్మారకం, నవీ ముంబై విమానాశ్రం, ఫ్రాన్స్ ఓడరేవు సంధానం’ వంటి ప్రాజెక్టులు ముంబైకి కొత్త బలమిస్తున్నాయని ప్రధాని ప్రముకంగా ప్రస్తావించారు. ధారావి పునరాభివృద్ధి, ఓల్డ్ చౌల్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు తిరిగి గాడిలో పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ అద్భుత విజయంపై ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఆయన బృందాన్ని అభినందించారు. ముంబైలో రోడ్ల అభివృద్ధికి నేడు చేపట్టిన పనులను కూడా ప్రస్తావిస్తూ- రెండు ఇంజన్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు.

 

భారత నగరాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చే కృషి కొనసాగుతోందని ప్రధానమంత్రి చెప్పారు. కాలుష్యం, పరిశుభ్రత వంటి విస్తృత పట్టణ సమస్యలకు పరిష్కారాన్వేషణ సాగుతున్నదని తెలిపారు. విద్యుత్‌ వాహన మౌలిక సదుపాయాలు, జీవ ఇంధన ఆధారిత రవాణా వ్యవస్థ, ఉదజని ఇంధనంపై ఉద్యమ తరహా దృష్టి, వ్యర్థం నుంచి అర్థం కార్యక్రమం, నదుల స్వచ్ఛత పరిరక్షణ దిశగా నీటిశుద్ధి ప్లాంట్లు వంటివి ఈ దిశగా కొన్ని కీలక చర్యలని ఆయన వివరించారు. మొత్తంమీద “నగరాల అభివృద్ధిలో సామర్థ్యానికి, రాజకీయ సంకల్పానికి కొదవ లేదు. అయితే, నగరపాలక సంస్థ కూడా వేగవంతమైన అభివృద్ధికి ఇదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనిదే ముంబై వంటి నగరంలో అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి ముంబై అభివృద్ధిలో స్థానిక పట్టణ సంస్థ పాత్ర కీలకం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు మహా నగరానికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అభివృద్ధిపై రాజకీయం చేయవద్దని హెచ్చరించారు. ‘స్వానిధి’ వంటి గత పథకాల కింద హామీరహిత రుణ సౌలభ్యంతో దేశవ్యాప్తంగా 35 లక్షల మంది వీధి వర్తకులు లబ్ధి పొందారని ప్రధాని గుర్తుచేశారు. వీరిలో మహారాష్ట్ర వాసులు 5 లక్షల మంది ఉన్నారని, రాజకీయ కారణాలతో లోగడ వారికి రుణాలు అందకుండా అడ్డుకున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాబట్టే కేంద్రం, రాష్ట్రం, ముంబై నగరపాలక సంస్థల మధ్య సంపూర్ణ సమన్వయంతో పనిచేసే వ్యవస్థ అవసరమని నొక్కిచెప్పారు. స్వానిధి కేవలం రుణ పథకం కాదని, ఇది వీధి వర్తకుల ఆత్మగౌరవానికి పునాది వేసిందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ల‌బ్ధిదారుల‌ను ప్ర‌శంసిస్తూ- స్వల్ప సమయంలోనే వారు రూ.50 వేల కోట్ల విలువైన డిజిట‌ల్ లావాదేవీలు నిర్వహించారని ప్రధాని అభినందించారు. “సమష్టి కృషితో (సబ్‌ కా ప్రయాస్‌) అసాధ్యమేదీ లేదనడానికి ‘డిజిటల్ ఇండియా’ ప్రత్యక్ష నిదర్శనం” అని ఆయన ఉదాహరించారు.

 

చివరగా- వీధి వ్యాపారులతో మాట్లాడుతూ- “నేను మీకు తోడుగా ఉన్నాను.. మీరు పదడుగులు వేస్తే నేను పదకొండు అడుగులు వేయడానికి సిద్ధం” అన్నారు. దేశంలోని చిన్నకారు రైతుల కృషి, అంకితభావంతో దేశం కొత్త పుంతలు తొక్కగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నేటి అభివృద్ధి పనులపై ముంబై, మహారాష్ట్ర ప్రజలను అభినందించారు. షిండే, దేవేంద్రల జంట మహారాష్ట్ర కలలను సాకారం చేస్తుందని వారికి హామీ ఇస్తూ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమాల్లో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ నారాయణ్ రాణే, సహాయ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

ప్రధానమంత్రి ముంబయిలో దాదాపు రూ.38,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఆయన ప్రధానంగా దృష్టి సారించిన అంశాల్లో నిరంతరాయ పట్టణ ప్రయాణ సౌలభ్యం కల్పించడం ఒకటి. తదనుగుణంగా సుమారు రూ.12,600 కోట్లతో నిర్మించిన ముంబై మెట్రో రైలుమార్గాలు ‘2ఎ, 7’ను దేశానికి అంకితం చేశారు. వీటిలో దహిసర్ తూర్పు - డి.ఎన్‌.నగర్ (ఎల్లో లైన్)లను కలిపే మెట్రో లైన్ ‘2ఎ’ సుమారు 18.6 కిలోమీటర్లు కాగా, అంధేరి తూర్పు - దహిసర్ తూర్పు (రెడ్ లైన్)ని కలిపే మెట్రో మార్గం 7 పొడవు సుమారు 16.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు మార్గాల నిర్మాణానికి ప్రధానమంత్రి 2015లో శంకుస్థాపన చేశారు. కాగా- దాదాపు రూ.17,200 కోట్లతో మలాడ్, భాండుప్, వెర్సోవా, ఘట్కోపర్, బాంద్రా, ధారావి, వర్లీలలో 2,460 ‘ఎంఎల్‌డి’ సామర్థ్యంతో నిర్మించే 7 మురుగుశుద్ధి ప్లాంట్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

ముంబైలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల బలోపేతం దిశగా ఏర్పాటు చేసిన 20 ‘హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆప్లా దవాఖానా’లను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ వినూత్న వైద్యశాలల ఏర్పాటుతో ప్రజలకు వైద్య పరీక్షలు, మందులు, ఆరోగ్య పరీక్షలు, రోగనిర్ధారణ వంటి అవసరమైన వైద్య సేవలన్నీ పూర్తి ఉచితంగా లభిస్తాయి. దీంతోపాటు ముంబైలో మూడు ఆస్పపత్రులు- 360 పడకల భాండుప్‌ మల్టీ స్పెషాలిటీ మున్సిపల్ హాస్పిటల్, 306 పడకల సిద్ధార్థ్ నగర్ హాస్పిటల్, గోరేగావ్ (పశ్చిమ), 152 పడకల ఓషివారా మెటర్నిటీ హోమ్‌ల పునరాభివృద్ధికీ ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటిద్వారా నగరంలో నివసించే లక్షలాది ప్రజలకు అత్యున్నత వైద్య సదుపాయాలుసహా ప్రయోజనం చేకూరుతుంది.

 

గరంలో దాదాపు రూ.6,100 కోట్లతో 400 కిలోమీటర్ల రహదారుల కాంక్రీట్‌ పనుల ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ముంబైలో రోడ్ల విస్తీర్ణం 2050 కిలోమీటర్లదాకా ఉండగా, 1200 కిలోమీటర్లకుపైగా రోడ్ల కాంక్రీట్‌ పనులు శంకుస్థాపన, ప్రారంభదశల్లో ఉన్నాయి. అయితే, దాదాపు 850 కి.మీ. మేర రోడ్లలో గోతులు రవాణాకు పెనుసవాలు విసురుతున్నాయి. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో రోడ్ల బాగుకు శంకుస్థాపన చేశారు. ఈ కాంక్రీట్ రోడ్లు మెరుగైన భద్రతసహా ప్రయాణ వేగానికి దోహదం చేస్తాయి. అదే సమయంలో మెరుగైన మురుగుపారుదల, ప్రజోపయోగ పనులకు సౌలభ్య కల్పన ద్వారా రోడ్లు తరచూ తవ్వకుండా నివారించడం సాధ్యమవుతుంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ పునరాభివృద్ధికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ మేరకు దక్షిణ వారసత్వ నోడ్‌ రద్దీ తగ్గింపు సౌకర్యాల పెంపు, మెరుగైన బహుళ రవాణా సాధన ఏకీకరణ, ప్రపంచ ప్రసిద్ధ దిగ్గజ నిర్మాణ పరిరక్షణ-పూర్వవైభవ పునరుద్ధరణ వంటివి లక్ష్యంగా రూ.1,800 కోట్లకుపైగా అంచనా వ్యయంతో ఈ పునరాభివృద్ధి ప్రణాళిక రూపొందించబడింది. మరోవైపు ‘ప్రధానమంత్రి స్వానిధి’ పథకం కింద లక్ష మందికిపైగా లబ్ధిదారుల ఆమోదిత రుణాల బదిలీకి ఆయన శ్రీకారం చుట్టారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi