ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘పిఎం-కిసాన్ నిధి’ 18వ విడత నిధుల పంపిణీతోపాటు ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడతకు శ్రీకారం చుట్టారు. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్) కింద 7,500కుపైగా ప్రాజెక్టులను, 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థలు సహా మహారాష్ట్రలో 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులను దేశానికి అంకితం చేశారు. అంతేకాకుండా పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ మోదీ- తొలుత పవిత్ర వాషిమ్ గడ్డ మీది నుంచి పోహరాదేవి మాతకు నమస్కరించి, ప్రసంగం ప్రారంభించారు. ఈ తెల్లవారుజామున జగదాంబ ఆలయంలో మాత దర్శనం-పూజలు చేసినట్లు తెలిపారు. అలాగే సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్‌రావ్ మహారాజ్ సమాధుల వద్ద శ్రద్ధాంజలి ఘటించడం ద్వారా గౌరవిస్తూ, వారి ఆశీస్సులు పొందానని పేర్కొన్నారు. అసాధారణ గోండ్వానా యోధురాలు రాణి దుర్గావతి జన్మతిథిని స్మరించుకుంటూ గత సంవత్సరం దేశం ఆమె 500వ జయంతి వేడుకలు నిర్వహించుకున్నదని గుర్తుచేశారు.
హర్యానాలో ఇవాళ శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హర్యానాను సరికొత్త శిఖరాలకు చేర్చగల శక్తి వారి ఓటుకు ఉందని వ్యాఖ్యానించారు.
‘పిఎం-కిసాన్’ సమ్మాన్ నిధి కింద దాదాపు 9.5 కోట్ల మంది రైతులకు 18వ విడతగా సుమారు రూ.20,000 కోట్లు పంపిణీ చేయడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని రైతులకు రెట్టింపు ప్రయోజనాలు కల్పించేందుకు ఇక్కడి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే రాష్ట్రంలోని దాదాపు 90 లక్షల మంది రైతులకు రూ.1900 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించిన ‘నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పిఒ)లకు సంబంధించి రూ.వందల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వడాన్ని గుర్తుచేశారు. మరోవైపు ‘లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారులకు సహాయం పంపిణీని ప్రస్తావిస్తూ- ఈ పథకం నారీలోకం శక్తి సామర్థ్యాలను బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నేడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, జాతికి అంకితం చేయడంపై మహారాష్ట్రతోపాటు దేశ ప్రజలందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
పోహరాదేవిలో ఇవాళ ‘బంజారా విరాసత్ మ్యూజియం’ ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ- బంజారా సమాజం ప్రాచీన సంస్కృతి, సుసంపన్న వారసత్వాన్ని ఈ ప్రదర్శనశాల భవిష్యత్తరానికి పరిచయం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి బంజారా సమాజంతో తన సంభాషణను గుర్తు చేసుకుంటూ ఈ మ్యూజియం ప్రారంభంతో తమ వారసత్వానికి లభించిన గుర్తింపుపై వారి వదనాల్లో సంతృప్తి, గర్వం తొణికిసలాడటం తాను గమనించానని పేర్కొన్నారు. బంజారా వారసత్వ మ్యూజియం ప్రారంభంపై ఆ సామాజికవర్గ సభ్యులకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
దేశానికి బంజారా సమాజం అందించిన సేవలను కొనియాడుతూ- ‘‘భారత సామాజిక జీవనంలోనే కాకుండా దేశ ప్రగతి ప్రయాణంలో కూడా మన బంజారా సమాజం కీలక పాత్ర పోషించింది’’ అని గుర్తుచేశారు. కళ, సంస్కృతి, అధ్యాత్మికత, వాణిజ్యం సహా విభిన్న రంగాల్లో దేశం ప్రగతి సాధించడంలో ఆ సమాజం చూపిన పునరుత్థాన సామర్థ్యాన్ని, దాని అమూల్య పాత్రను ఆయన ప్రశంసించారు. బంజారా సమాజంలో ప్రసిద్ధుడైన రాజా లఖి షా బంజారా వంటి పలువురు చారిత్రక నాయకులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. పరాయి పాలనలో అంతులేని కష్టానష్టాలకు గురైనప్పటికీ సమాజ సేవకే వారు జీవితాన్ని అంకితం చేశారన్నారు. అలాగే దేశ అధ్యాత్మిక చైతన్యానికి అపరిమిత శక్తిని జోడించిన సంత్ సేవాలాల్ మహారాజ్, స్వామి హథీరామ్ జీ, సంత్ ఈశ్వరసింగ్ బాపూజీ, సంత్ లక్ష్మణ్ చైత్యన్ బాపూజీ వంటి ఇతర అధ్యాత్మిక నాయకులను కూడా ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా- ‘‘భారత ఆధ్యాత్మిక చైతన్యానికి అపారమైన శక్తిని జోడించిన అనేకమంది సాధువులను మనకు అందించింది బంజారా సమాజమే’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. శతాబ్దాలుగా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఇనుమడింపజేయడంతోపాటు పరిరక్షించడంలో వారి అవిరళ కృషిని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా బంజారా సమాజం మొత్తాన్నీ బ్రిటిష్ పాలకులు నేరస్థులుగా ముద్ర వేయడం ఓ చారిత్రక అన్యాయమని విచారం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ కృషి నేపథ్యంలో మునుపటి ప్రభుత్వాల వైఖరిని ప్రధానమంత్రి ప్రజలకు గుర్తుచేశారు. ఈ మేరకు శ్రీ దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోహరాదేవి ఆలయ అభివృద్ధి పనులు మొదలుకాగా, మహా అఘాడి ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారు. అయితే, ఇప్పుడు శ్రీ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పనులను మళ్లీ ప్రారంభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద రూ.700 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన పనుల ద్వారా ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధితోపాటు యాత్రికులకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందన్నారు. అంతేగాక పరిసర ప్రాంతాల సత్వర ప్రగతికి కూడా ఇవి దోహదం చేస్తాయని శ్రీ మోదీ వివరించారు.
దేశాభివృద్ధికి, పురోగమనానికి ఎదురయ్యే ముప్పుల గురించి ప్రధానమంత్రి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ‘‘ప్రజల మధ్య ఐక్యత మాత్రమే అటువంటి సవాళ్ల నుంచి దేశాన్ని రక్షించగలదు’’ అని స్పష్టం చేశారు. మాదకద్రవ్య వ్యసనం, దాని ప్రమాదకర పర్యవసానాలపై హెచ్చరిస్తూ- దీనిపై విజయం దిశగా సమష్టి పోరుకు కలసిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘‘మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, అమలు చేసే ప్రతి విధానం వికసిత భారత్ స్వప్న సాకారానికి లోబడి ఉంటాయి. ఈ దార్శనికతకు మన రైతులే కీలక పునాది’’ అని ప్రధాని మోదీ అన్నారు. కర్షకలోకానికి మరింత చేయూత అందించే దిశగా అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలను ఆయన వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, శుద్ధి, నిర్వహణ సామర్థ్యాలను పెంచడంలో 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్‌పిఒ) అంకిత భావాన్ని ప్రస్తావించారు. అలాగే అనేక కీలక వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ ఇందులో భాగముందని చెప్పారు. వీటన్నిటి వల్ల రైతుల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వ పాలన ద్వారా రైతులు రెట్టింపు ప్రయోజనం పొందుతున్నారు’’ అని చెబుతూ- ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం రైతుల కోసం ‘జీరో విద్యుత్ బిల్లు’ విధానం అమలు చేయడాన్ని ప్రధాని ప్రశంసించారు.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత రైతులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాని విచారం వెలిబుచ్చారు. గత ప్రభుత్వాల నిర్వాకంతో రైతులు దుర్భర పేదరికంలో కూరుకుపోయారని వ్యాఖ్యానించారు. మహాకూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చలాయించినంత కాలం రైతు సంబంధిత ప్రాజెక్టులు నిలిపేడయం, ఆ పనులలో అవినీతికి పాల్పడటం అనే రెండు కార్యక్రమాలే ధ్యేయంగా పెట్టుకున్నదని ఆరోపించారు. కేంద్రం నుంచి అందే నిధులు లబ్ధిదారులకు చేరకుండా పక్కదోవ పట్టించారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇటువంటి దుస్థితిని ఎదుర్కొన్న రైతులకు ప్రస్తుత మహాయుతి ప్రభుత్వం నేడు కిసాన్ సమ్మాన్ నిధితోపాటు ప్రత్యేకంగా ఆర్థిక చేయూతనిస్తున్నదని పేర్కొన్నారు. ఇదే తరహాలో కర్ణాటకలో ‘బిజెపి’ ప్రభుత్వం ఉన్నపుడు కూడా ఇచ్చేదని చెప్పారు. కానీ, ప్రస్తుత కొత్త ప్రభుత్వం ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పిందని ప్రధాని అన్నారు. మరోవైపు రుణమాఫీ చేస్తామన్న ఎన్నికల హామీ నెరవేర్చకపోవడంపై తెలంగాణ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని ప్రధానమంత్రి ప్రజలకు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు అమరావతి, యావత్మల్, అకోలా, బుల్దానా, వాషిమ్, నాగ్‌పూర్, వార్ధాలలో నీటి కొరతను తీర్చేందుకు దాదాపు రూ.90,000 కోట్లతో వైనగంగ-నల్‌గంగ నదుల అనుసంధాన ప్రాజెక్టును ఆమోదించిందని పేర్కొన్నారు. పత్తి, సోయాబీన్ సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల వంతున ఆర్థిక సాయం అందజేయడాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఇటీవలే అమరావతిలో టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారని, దీనివల్ల పత్తి రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.
దేశ ఆర్థిక ప్రగతికి నాయకత్వం వహించగల అపార శక్తిసామర్థ్యాలు మహారాష్ట్రకు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశంలోని పేదలు, రైతులు, కార్మికులు, దళితులు, అణగారిన వర్గాల సాధికారత దిశగా బలమైన కృషి ద్వారానే అది నెరవేరగలదని చెప్పారు. చివరగా, ‘వికసిత మహారాష్ట్రతోపాటు వికసిత భారత్ స్వప్నం సాకారం కాగలదని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్, కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ, మత్స్య- పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీ రాజీవ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
రైతులకు సాధికారత కల్పనపై తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి ‘పిఎం-కిసాన్’ సమ్మాన్ నిధి 18వ విడత కింద 9.4 కోట్లమంది రైతులకు దాదాపు రూ.20,000 కోట్లు పంపిణీ చేశారు. దీంతో ఈ పథకం కింద ఇప్పటిదాకా పంపిణీ చేసిన నిధులు రూ.3.45 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు సుమారు రూ.2,000 కోట్లతో ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడతను ప్రారంభించారు.
అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్) కింద రూ.1,920 కోట్ల విలువైన 7,500కుపైగా ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. వీటిలో ‘‘నిర్దిష్ట పరికరాలు అద్దెకిచ్చే కేంద్రాలు, ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగులు, వేరుపరచి-వర్గీకరించే యూనిట్లు, శీతల గిడ్డంగులు, పంట అనంతర నిర్వహణ ప్రాజెక్టులు వంటి కీలక ప్రాజెక్టులున్నాయి. ఇక సుమారు రూ.1,300 కోట్ల సమష్టి టర్నోవర్‌గల 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్‌పిఒ)ను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.
మహారాష్ట్రలో పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన ప్రారంభించారు. దీనివల్ల పశుపోషణ చేసే రైతులకు సరసమైన ధరలతో లింగ క్రమబద్ధీకృత పశువీర్య లభ్యత పెరుగుతుంది. ఒక్కో మోతాదుపై దాదాపు రూ.200 దాకా ఖర్చు తగ్గించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో భాగంగా జన్యుక్రమ నిర్ధారణ సేవలతోపాటు దేశీయ పశువుల కోసం ‘గౌచిప్’, గేదెల కోసం ‘మహిష్’ చిప్‌లను రూపొందించారు. జన్యు క్రమ నిర్ధారణ ద్వారా అధిక-నాణ్యతగల ఎద్దులను దూడల దశలోనే గుర్తించే వీలుంటుంది.
ఈ కార్యక్రమాలన్నిటితోపాటు మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి సౌర కృషి వాహిని యోజన 2.0’ కింద 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారులను ఆయన సత్కరించారు.
Click here to read full text speech
हमारे बंजारा समाज ने भारत के सामाजिक जीवन में, भारत की निर्माण यात्रा में बहुत बड़ी भूमिका निभाई है: PM @narendramodi pic.twitter.com/HSzxLxjunh
— PMO India (@PMOIndia) October 5, 2024
हमारे बंजारा समाज ने ऐसे कितने ही संत दिये, जिन्होंने भारत की आध्यात्मिक चेतना को असीम ऊर्जा दी: PM @narendramodi pic.twitter.com/GqM37S4ZCf
— PMO India (@PMOIndia) October 5, 2024