ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంకురసంస్థలతో సంభాషించి, అనంతరం, ‘ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ నుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిమ్-స్టెక్ సభ్య దేశాలకు చెందిన మంత్రులతో పాటు కేంద్రమంత్రులు శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోమ్ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంకురసంస్థలు నేటి వ్యాపార జనాభా లక్షణాలను మారుస్తున్నాయని అన్నారు. 44 శాతం గుర్తింపు పొందిన అంకురసంస్థల్లో మహిళా డైరెక్టర్లు ఉన్నారనీ, అదేవిధంగా ఈ అంకురసంస్థల్లో పనిచేసే మహిళల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, 45 శాతం అంకురసంస్థలు 2 టైర్, 3 టైర్ నగరాల్లో ఉన్నాయి. ఇవి స్థానిక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నాయి. ప్రతి రాష్ట్రం స్థానిక అవకాశాల ప్రకారం అంకురసంస్థలకు మద్దతు ఇస్తున్నాయి. అదేవిధంగా, దేశంలోని 80 శాతం జిల్లాలు ఇప్పుడు స్టార్టప్-ఇండియా మిషన్‌లో భాగంగా ఉన్నాయి. అన్ని రకాల నేపథ్యాల నుండి వచ్చిన యువత ఈ పర్యావరణ వ్యవస్థలో తమ సామర్థ్యాన్ని గ్రహించగలుగుతారు. దాని ఫలితం గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, "మీరు ఎందుకు పని చేయకూడదు? అంకురసంస్థ ఎందుకు?" అనే భావన నుండి "ఉద్యోగం బాగానే ఉంది, కానీ, స్వంతంగా అంకురసంస్థ ఎందుకు ప్రారంభించకూడదు?" అనే వైఖరికి మారిన పరిస్థితిని ఇప్పడు మన ముందు చూస్తున్నామని, చెప్పారు. 2014 లో కేవలం 4 భారతీయ అంకురసంస్థలు మాత్రమే ‘యునికార్న్ క్లబ్’లో ఉండగా, అవి ఇప్పుడు 30 కి పైగా పెరిగి, 1 బిలియన్ మార్కును దాటాయని శ్రీ మోదీ, తెలియజేశారు.
కరోనా సమయంలో, 2020 లో, 11 అంకురసంస్థలు, ‘యునికార్న్ క్లబ్’లోకి ప్రవేశించాయనే విషయాన్ని, ప్రధానమంత్రి తెలియజేస్తూ, సంక్షోభ సమయంలో స్వావలంబనకు వారి సహకారాన్ని నొక్కిచెప్పారు. శానిటైజర్లు, పి.పి.ఈ. కిట్లు, సంబంధిత సరకుల సరఫరా లభ్యతను నిర్ధారించడంలో, ఈ అంకురసంస్థలు ప్రధాన పాత్ర పోషించాయని, ఆయన పేర్కొన్నారు. కిరాణా మరియు ఔషధాలను ఇంటి వద్దకే పంపిణీతో పాటు, ఫ్రంట్-లైన్ కార్మికుల రవాణా మరియు ఆన్-లైన్ స్టడీ మెటీరియల్ వంటి స్థానిక అవసరాలను తీర్చడంలో వారు అమూల్యమైన పాత్ర పోషించారని అన్నారు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితుల్లో అవకాశాన్ని కనుగొనే ప్రారంభ స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఈ రోజు చాలా ‘ప్రారంభ’ మవుతున్నాయి, అంటే ఈ రోజు మొదలవుతున్నాయి, అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ రోజు, బిమ్-స్టెక్ సభ్యదేశాలకు చెందిన అంకురసంస్థల మొదటి సమావేశం జరిగింది. "స్టార్టప్-ఇండియా" ఉద్యమం ఈ రోజు విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. అదేవిధంగా, ఈ రోజు, భారతదేశ వ్యాప్తంగా టీకాలు వేసే అతి పెద్ద కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు మన యువత, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల సామర్థ్యాలకూ, అలాగే, మన వైద్యులు, నర్సులు, ఆరోగ్య రంగ సిబ్బంది కృషి, అంకితభావానికీ, సాక్షిగా నిలిచిందని, ప్రధానమంత్రి అభివర్ణించారు.
బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్ వంటి బిమ్-స్టెక్ సభ్య దేశాలలో అంకురసంస్థలకు శక్తివంతమైన అవకాశాలున్నాయని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ శతాబ్దం డిజిటల్ విప్లవం మరియు నూతన యుగ ఆవిష్కరణల శతాబ్దం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇది ఆసియా శతాబ్దమని కూడా ఆయన పేర్కొన్నారు. అందువల్ల, భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థాపకులు ఈ ప్రాంతం నుండే రావాలి అనేది మన ప్రస్తుత డిమాండు. ఇందుకోసం, పరస్పర సహకారం కోసం సంకల్పం ఉన్న ఆసియా కౌంటీలు బాధ్యత తీసుకొని కలిసి రావాలని ప్రధాని నొక్కి చెప్పారు. ఈ బాధ్యత, సహజంగానే బిమ్-స్టెక్ దేశాలపై ఉంటుంది. మనం ఐదవ వంతు మానవత్వం కోసం పనిచేస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు.
అంకురసంస్థల విషయంలో భారతదేశానికి ఉన్న 5 సంవత్సరాల అనుభవాలను వివరించే ‘స్టార్టప్-ఇండియా పరిణామం’ అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద అంకురసంస్థల పర్యావరణ వ్యవస్థలో 41 వేల కంటే ఎక్కువ అంకురసంస్థలను సృష్టించడానికి ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్లను ఆయన గుర్తు చేశారు. ఈ మొత్తం అంకురసంస్థలలో 5,700 మంది ఐ.టి. రంగంలో, 3,600 ఆరోగ్య రంగాల్లో, 1,700 మంది వ్యవసాయ రంగంలో చురుకుగా ఉన్నారు. ప్రజలు తమ ఆహారం గురించి మరింత అవగాహన పెంచుకుంటున్నందున ఆహారం, వ్యవసాయ రంగాల్లో కొత్త అవకాశాలను ప్రధానమంత్రి ఎత్తి చూపారు. లక్ష కోట్ల రూపాయల మూలధనంతో "అగ్రి ఇన్-ఫ్రా ఫండ్" ను రూపొందించినందున ఈ రంగాల వృద్ధిపై భారతదేశం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ కొత్త మార్గాలు, అంకురసంస్థల రైతులతో సహకరిస్థాయి. మంచి సౌలభ్యం, నాణ్యతతో వ్యవసాయం నుండి టేబుల్‌కు ఉత్పత్తులను తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
అంకురసంస్థల ప్రపంచంలో అతిపెద్ద యు.ఎస్.పి. దాని అంతరాయం మరియు వైవిధ్య సామర్థ్యం అని ప్రధానమంత్రి, పేర్కొన్నారు. అంతరాయం, అవి కొత్త విధానాలు, కొత్త సాంకేతికతతో పాటు, కొత్త మార్గాలకు దారితీస్తున్నాయి; అదేవిధంగా, వైవిధ్యీకరణ ఎందుకంటే, వారు, అపూర్వమైన స్థాయి, విభిన్న రంగాలతో, విప్లవాన్ని తీసుకువచ్చే విభిన్న ఆలోచనలతో వస్తున్నారు. ఈ పర్యావరణ వ్యవస్థ యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే, ఇది వ్యావహారికసత్తావాదం కంటే అభిరుచి ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఈ రోజు భారతదేశం అనుసరిస్తున్న పని విధానంలో ఈ ‘చేయగలను’ అనే స్ఫూర్తి స్పష్టంగా కనబడుతుందని శ్రీ మోదీ, వివరించారు.
చెల్లింపు విధానంలో విప్లవాత్మకమైన భీమ్ యు.పి.ఐ. ని ఉదాహరణగా పేర్కొంటూ, 2020 డిసెంబర్ లోనే, భారతదేశంలో యు.పి.ఐ. ద్వారా 4 లక్షల కోట్ల రూపాయల మేర విలువైన బదిలీలు జరిగాయని చెప్పారు. అదే విధంగా సౌర, ఏ.ఐ. రంగాలలో భారతదేశం ముందుంది. పేదలు, రైతులు, విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లో సహాయాన్ని అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ గురించి కూడా శ్రీ మోదీ వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా వారి ఇబ్బందులను తొలగించడంతో పాటు, 1.75 లక్షల కోట్ల రూపాయల మేర అవకతవకలను వెలికి తీసి, వాటిని అరికట్టడం జరిగింది. జి.ఈ.ఎమ్. పోర్టల్‌లో ఎనిమిది వేల అంకురసంస్థలు నమోదు కావడంతో, ప్రభుత్వ సేకరణ పోర్టల్ జి.ఈ.ఎమ్. ద్వారా అంకురసంస్థలకు కొత్త అవకాశాలు వస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. జి.ఈ.ఎమ్. ద్వారా ఈ అంకురసంస్థలు 2300 కోట్ల రూపాయల వ్యాపారం చేశాయి. భవిష్యత్తులో, జి.ఈ.ఎమ్. లో అంకురసంస్థల ఉనికి మాత్రమే పెరుగుతుందని, ఆయన, చెప్పారు. ఇది స్థానిక తయారీ, స్థానిక ఉపాధి, అంకురసంస్థల పరిశోధన, ఆవిష్కరణల్లో మంచి పెట్టుబడిని ప్రోత్సహించడానికి దారితీస్తుంది.
అంకురసంస్థలను ప్రారంభించడానికి నిధుల కొరత లేకుండా చూడడానికి, వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్-ఇండియా సీడ్ నిధిని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. కొత్త అంకురసంస్థలను ప్రారంభించడానికీ, పెంపొందించడానికీ ఇది సహాయపడుతుంది. అంకురసంస్థల ఈక్విటీ క్యాపిటల్ పెంచడానికి, నిధుల పథకం నిధులు ఇప్పటికే సహాయ పడుతున్నాయి. హామీల ద్వారా మూలధనాన్ని సమీకరించడంలో అంకురసంస్థలకు ప్రభుత్వం కూడా తగిన సహాయం చేస్తుంది. ‘యువత, యువత ద్వారా, యువత కోసం’ అనే మంత్రం ఆధారంగా అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ కోసం భారతదేశం కృషి చేస్తోంది. రాబోయే ఐదేళ్ళకు మన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. ఈ లక్ష్యాలతో, మన అంకురసంస్థలు, అంతర్జాతీయ భారీ సంస్థలుగా అభివృద్ధి చెంది, భవిష్యత్ సాంకేతికతకు మార్గదర్శనం చేయాలని, ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తూ, తమ ప్రసంగాన్ని ముగించారు.