ఏకతాటిపై నిలిచి అవ్యవస్థీకృత రంగ అవసరాల గురించి మాట్లాడారని, ఇది ఎంతో గొప్ప విషయమని మెచ్చుకుంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పారిశ్రామిక రంగ సంస్థల ప్రతినిధులను ప్రశంసించారు. ఆర్ధిక రంగంలో అందరినీ కలుపుకొని పోతూ ఒక కొత్త ఉషోదయాన్ని ఆవిష్కరిస్తున్నారని ఆయన అన్నారు. ఇంటినుంచే పని చేయడాన్ని ప్రోత్సహించడం మంచి నిర్ణయమని అన్నారు. ప్రజలు ఒకే చోటకు చేరకుండా ఇంటికి పరిమితం చేయడమనేది (సోషల్ డిస్టెన్సింగ్) కోవిడ్ 19పై చేస్తున్న పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని ప్రధాని అన్నారు. కోవిడ్ -19 కారణంగా ఆయా వ్యాపారాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఏ సంస్థ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించకూడదని ఈ సందర్భంగా ప్రధాని గట్టిగా కోరారు. కోవిడ్ -19పై ప్రధాని నాయకత్వంలో జరుగుతున్న పోరాటాన్ని పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికిగాను తమ ఆలోచనల్ని, అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు.
అసోచామ్, ఫిక్కి, సిఐఐ సంస్థల ప్రతినిధులతోపాటు దేశవ్యాప్తంగాగల 18 నగరాలకు చెందిన వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడారు.
దేశ ఆర్ధిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికిగాను ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్న సమయంలో కోవిడ్ 19 రూపంలో ఉరుములేని పిడుగులాగా ఈ ఉపద్రవం వచ్చిపడిందని దాంతో ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు సవాల్‌గా మారిందని ప్రధాని అన్నారు. గతంలో ప్రపంచ యుద్ధాలవల్ల వచ్చిన సవాళ్ల కంటే ఈ కోవిడ్ 19 కారణంగా వస్తున్న సవాళ్లే అత్యంత క్లిష్టంగా వున్నాయని అందుకే దీనిపై ఎలాంటి ఏమరుపాటు లేకుండా పర్యవేక్షణ చేస్తూ ఇది విస్తరించకుండా నిరోధిస్తున్నామని ప్రధాని అన్నారు.
ఆర్ధికరంగంలో అత్యంత ముఖ్యమైన విషయం నమ్మకమేనని ప్రధాని అన్నారు. దీన్ని ప్రత్యేకంగా కొలవడం జరుగుతుందని ఆయన అన్నారు. సంక్లిష్ట, సవాళ్లతో కూడిన సమయాల్లో దీన్ని సంపాదించుకోవడంగానీ, పోగొట్టుకోవడంగానీ ఏదో ఒకటి జరుగుతుందని ఆయన అన్నారు. ఆర్ధికవ్యవస్థలోని వివిధరంగాల్లో నమ్మకానికి సంబంధించిన పరిమితులనేవి కీలకమైన దశలో వున్నాయని ప్రధాని అన్నారు. పర్యాటక రంగం, నిర్మాణ రంగం, దినసరి పనులు చేసుకునే అవ్యవస్థీకృత రంగంపైనా కోవిడ్ 19 తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని అన్నారు. రానున్న రోజుల్లో కొంతకాలంపాటు ఆర్ధిక రంగంపై ఈ ప్రభావం కొనసాగుతుందని ఆయన అన్నారు.
వైరస్ ద్వారా ఏర్పడ్డ ప్రమాదకర పరిస్థితులను సరిదిద్దడానికిగాను ప్రధాని వెంటనే రంగంలో దిగారని, ఆయన ముందుండి వేగవంతమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని ఈ సందర్భంగా పారిశ్రామిక రంగ ప్రతినిధులు ప్రధానికి అభినందనలు తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఆరోగ్యరంగ పరికరాల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేశంలోని పరిశ్రమలు అన్నీ కలిసకట్టుగా పని చేస్తున్నాయని పారిశ్రామికరంగ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. వెంటిలేటర్లు, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, సామాజిక బాధ్యతలో భాగంగా కార్పొరేట్ సంస్థలు ఖర్చు చేసే నిధుల కేటాయింపు మొదలైన విషయాల గురించి ప్రధానికి వారు తెలిపారు. అలాగే వలస వచ్చిన కార్మికులకు అన్ని విధాలా అండగా వుంటున్నామని వారు వివరించారు.
కోవిడ్ 19 కారణంగా బ్యాంకులు, ఆర్ధిక సహాయ సంస్థలు, ఆతిథ్య , పర్యావరణ రంగాలు, ప్రాధమిక సౌకర్యాల కల్పన రంగాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యల గురించి పారిశ్రామిక రంగ ప్రతినిదులు ప్రధానికి వివరించారు. ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించడంద్వారా ఈ రంగాలను ఆదుకోవాలని వారు కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికిగాను లాక్ డౌన్ ప్రకటించడం మంచి నిర్ణయమని, ఆర్ధికరంగానికి నష్టాలు వచ్చినా సరే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమని ఈ సందర్భంగా పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు కొనియాడారు.
దేశంలోని అవ్యవస్థీకృత రంగ అవసరాల గురించి పారిశ్రామిక రంగ ప్రతినిధులు ఏకతాటిపై నిలిచి మాట్లాడడం ప్రశంసనీయమని, ఇది ఆర్ధికరంగంలో అందరినీ కలుపుకొని పోయే నూతన మార్పుకు శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ ఆయా సంస్థలు తమ ఉద్యోగులు ఇంటినుంచి పని చేసే విధంగా ప్రోత్సహించాలని ఇందుకుగాను సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రధాని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నప్పటికీ ఆయా సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యపై వేటు వేయకూడదని, మానవత్వంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు.
నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి ఈ సమయంలో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. వస్తువులను బ్లాక్ మార్కెట్లోకి తరలించడం, వాటిని భారీగా దాచుకోవడం లాంటి పనులు జరగకుండా చూడాలని ప్రధాని అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యతను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ఆరోగ్య సిబ్బంది సూచన ప్రకారం కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకుగాను ఫ్యాక్టరీలు, ఆఫీసులు, పని చేసే ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మన దగ్గర వున్న అతిపెద్ద ఆయుధం సోషల్ డిస్టెన్సింగ్ అని ప్రధాని అన్నారు. ఈ మహమ్మారి నియంత్రణలో భాగంగా ఆయా సంస్థలు తమ సిఎస్ ఆర్ నిధులను మానవతాదృక్పథంతో ఉపయోగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, పారిశ్రామిక మరియు దేశీయ వాణి్య ప్రోత్సహక విభాగ సెక్రటరీ పాల్గొన్నారు.