ప్రధానమంత్రి నరేద్రమోడీ ఈ రోజు ప్రింట్ మీడియాకు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న ఇరవైకి పైగా పాత్రికేయులు, ఇతర భాగస్వాములతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. 11 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ, ప్రాంతీయ వార్తా పత్రికలకు చెందిన జర్నలిస్టులు, 14 ప్రాంతాల నుంచి ఈ దృశ్యసమావేశంలో పాల్గొన్నారు.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారాన్ని విస్తరింపజేయడంలో మీడియా ప్రశంసాపూర్వక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మీడియా నెట్ వర్క్ పాన్ ఇండియా గా వ్యవహరించి దేశంలోని నగరాలు, గ్రామాలకు విస్తరించిందని ఆయన అన్నారు. సవాళ్ళను ఎదుర్కొని, సూక్ష్మ స్థాయిలో వాస్తవ సమాచారాన్ని విస్తరింపచేయడంలో ఇది మీడియాను మరింత ముఖ్యమైనదిగా చేస్తుంది.
వార్తా పత్రికలు గొప్ప విశ్వసనీయతను కలిగి ఉంటాయి. ముఖ్యంగా స్థానిక సమాచారాన్ని అందించే పేజీని ప్రజలు ఎక్కువగా చదువుతారు. అందువల్ల, ఈ పేజీ లో ప్రచురించే వ్యాసాల ద్వారా, కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడం అత్యవసరం. పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు పరీక్ష చేయించుకోవాలి, పరీక్ష చేయించుకోవడానికి ఎవరిని కలవాలి, ఇంట్లో ఉండి ఎవరినీ కలవకుండా ఎలా ఉండాలి, అనే విషయాలను ప్రజలకు తెలియజేయడం చాలా అవసరం. ఈ సమాచారాన్ని వార్తా పత్రికలలోనూ, ఆయా పత్రికలకు చెందిన వెబ్ పోర్టల్ లోనూ పొందుపరచాలని, ప్రధానమంత్రి వివరించారు. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు లభించే ప్రాంతాల వివరాలు వంటి సమాచారం కూడా ప్రాంతీయ పేజీలలో ప్రచురించవచ్చునని ఆయన సూచించారు.
ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య వారధిగా మీడియా వ్యవహరించాలనీ, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో నిరంతరం ప్రతిస్పందనలను అందజేయాలనీ ప్రధానమంత్రి కోరారు. సామాజిక దూరం పాటించడం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలనీ, రాష్ట్రాలు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాల గురించి ప్రజలకు తెలియజేయాలనీ, అంతర్జాతీయ వివరాలు, ఇతర దేశాలు జరిపిన అధ్యయనాల ద్వారా వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని కూడా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలనీ ప్రధానమంత్రి మీడియాను కోరారు.
ప్రజల పోరాట పటిమను కొనసాగించడం అవసరాన్ని నొక్కి చెబుతూ చెబుతూ – నిరాశావాదం, వ్యతిరేకత, పుకార్ల వ్యాప్తి ని అరికట్టడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరులకు భరోసా కల్పించవలసిన అవసరం ఉంది.
సమాచారాన్ని సమర్ధంగా అందజేయడం, ముందుండి దేశాన్ని నడిపించడంలో ప్రధానమంత్రి పోషిస్తున్న పాత్రను ప్రింట్ మీడియాకు చెందిన పాత్రికేయులు, భాగస్వాములు అభినందించారు. స్ఫూర్తి దాయకమైన, సానుకూల కధనాలు ప్రచురించడంలో తాము, ప్రధానమంత్రి సూచనలు, సలహాలకు అనుగుణంగా పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రింట్ మీడియా విశ్వసనీయతను బలోపేతం చేసినందుకు వారు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తీవ్రమైన సవాలును ఎదుర్కోడానికి ప్రజలందరూ కలిసి రావాలన్న ప్రధానమంత్రి సందేశాన్ని దేశం యావత్తూ అనుసరించిందన్న విషయాన్ని వారు గుర్తించారు.
ప్రతిస్పందన తెలియజేసినందుకు సమావేశంలో పాల్గొన్నవారందరికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ హక్కులు కలిగిన వారి పట్ల సామాజిక బాధ్యత గురించి వారికి గుర్తుచేశారు. మన జాతీయ భద్రతను పరిరక్షించడానికి సామాజిక ఐక్యతను మెరుగుపరచడం చాలా అవసరమని ఆయన చెప్పారు.
ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సమాచారాన్ని ప్రచురించడం ద్వారా భయాందోళనలు వ్యాపించకుండా నిరోధిస్తునందుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తప్పుడు సమాచారం వ్యాపించకుండా నిరోధించాలని, ఆమె ప్రింట్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
సమాచార, ప్రసార శాఖ మంత్రి, సమాచార, ప్రసార మాంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.