ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ‘దీపావళి సమ్మేళనం’ ప్రధాని కార్యాలయ అధికారులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
మహమ్మారిపై దేశం చేస్తున్న యుద్ధం గురించి ప్రధాని వారితో చర్చించారు. అందరికీ అదృశ్య శత్రువైన కరోనాతో పోరాటంలో దేశం ఏ విధంగా ఐక్యతను, సోదరభావాన్ని ప్రదర్శించిందో ఆయన నొక్కిచెప్పారు. మహమ్మారి ఫలితంగా సమాజంలోనే కాకుండా పాలనలోనూ చోటుచేసుకున్న సానుకూల మార్పులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ మార్పులు సమాజాలను మరింత ప్రతిరోధకంగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
కష్టకాలంలో ప్రజలు, ప్రక్రియలు, సంస్థలలోని స్వాభావిక సామర్థ్యం ఎంత బలంగా వెలికి వస్తుందో ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ స్ఫూర్తిని ప్రేరణగా స్వీకరించాల్సిందిగా ఆయన ‘పీఎంవో’ అధికారులను కోరారు. దేశ భవితకు 2047దాకానే కాకుండా అంతకుమించి బలమైన పునాదులు వేయడంలో ఈ దశాబ్దపు ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. దీనికి అనుగుణంగా మన దేశం సమున్నత శిఖరాలు అందుకునేందుకు తోడ్పడేలా ప్రధానమంత్రి కార్యాలయంలోని మనమందరం సంపూర్ణ శక్తిసామర్థ్యాలతో సమష్టి కృషితో ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు.