



స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగంలో ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి ప్రయత్నం) అవసరమని పునరుద్ఘాటించిన సంగతిని గుర్తు చేశారు. నేటి కాలపు భారతదేశం ‘అందరి ప్రయత్నం’తో చాలా వేగంగా పురోగమించగలుగుతుందని, ఈ రోజున నిర్వహించుకొంటున్న ఈ కార్యక్రమమే దీనికొక ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే కోసం నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు. యువ నూతన ఆవిష్కర్తలతో భేటీ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం నేర్చుకొనే అవకాశంతోపాటు అర్థం చేసుకొనే అవకాశం కూడా తనకు లభిస్తుందని ఆయన అన్నారు. నూతన ఆవిష్కర్తల నుంచి తాను ఎంతో ఆశిస్తున్నానని ప్రధాని చెబుతూ, 21వ శతాబ్ది భారతదేశమంటే వారికి ఒక భిన్న దృష్టికోణం ఉందన్నారు. ఈ కారణంగా మీరు అందించే పరిష్కారాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి; ఏదైనా కొత్త సవాలు వచ్చిందంటే మీరు నూతన, విశిష్ట పరిష్కారాలతో ముందుకు వస్తారని శ్రీ మోదీ అన్నారు. గతంలో జరిగిన హ్యాకథాన్‌లలో తాను భాగం పంచుకొన్న విషయాన్ని ప్రధాని గుర్తుకుతెస్తూ, వాటిలో అందే ఫలితాల విషయంలో తాను ఎన్నడూ నిరుత్సాహానికి గురికాలేదన్నారు. ‘‘మీరు నా నమ్మకాన్ని బలపరచారంతే’’ అని ఆయన అన్నారు. గతంలో అందించిన పరిష్కారాలు వివిధ మంత్రిత్వ శాఖల్లో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న వారిని గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని శ్రీ మోదీ అంటూ, వారితో మాట్లాడడం మొదలుపెట్టారు.
ఎన్ఐటి, శ్రీనగర్ నోడల్ కేంద్రం నుంచి వచ్చిన ‘బిగ్ బ్రెయిన్స్ టీమ్’ సభ్యురాలు సయీదాతో ప్రధాని మాట్లాడారు. ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతతో, మేధోపరమైన వైకల్యంతో బాధపడుతున్న బాలలపట్ల శ్రద్ధ తీసుకొనే సామాజిక న్యాయం-సాధికారిత శాఖ ఇచ్చిన సమస్యను పరిశీలించి, ‘వర్చువల్ రియాలిటీ ఫ్రెండ్’ అనే ఒక ఉపకరణాన్ని ఆవిష్కరించే ప్రాజెక్టులో సయీదా పాలుపంచుకొన్నారు. పిల్లలు ఈ సాధనాన్ని ఉపయోగిస్తారని, ఇది వారిలో ఇతరులతో సంప్రదింపుల ప్రావీణ్యాన్ని మెరుగుపరిచే (ఇంటరాక్టివ్ స్కిల్స్ ఎన్హాన్సర్) ఒక ‘నేస్తం’గా ఉంటుందన్నారు. ఈ టూల్‌ను దివ్యాంగులు వారి స్మార్ట్‌ఫోన్‌లలో, ల్యాప్‌టాప్ వంటివాటిలో ఉపయోగించుకోవచ్చని ఆమె చెప్పారు. ఇది కృత్రిమ మేధ (ఏఐ)ని ఊతంగా తీసుకొని సేవను అందించే ఒక వర్చువల్ రియాలిటీ సొల్యూషన్; ఇది భాషను నేర్చుకోవడం, ఇతరులతో మాట్లాడడం వంటి రోజూవారీ పనులు చేసుకోవడంలో దివ్యాంగ జనులకు సాయపడుతుందని ఆమె తెలిపారు. ఆ పరికరం దివ్యాంగ బాలల జీవనంపై ఎలాంటి ప్రభావాన్ని కలగజేస్తుందని శ్రీ మోదీ అడగగా, సయీదా జవాబిస్తూ, దీని సాయంతో వారు ఒక కృత్రిమ ప్రయోగశాల వంటి వాతావరణంలో సమాజంలో ఎవరితోనైనా మాట్లాడవలసి వచ్చినప్పడు ఏది సరైందో, ఏదీ సరైంది కాదో నేర్చుకోగలుగుతారని, ప్రజలపట్ల ఎలా నడుచుకోవాలో తెలుసుకొంటారని, వారికి ఎదురైన అనుభవాలను ఆ తరువాత నిజజీవితంలో కూడా వర్తింప చేసుకోవచ్చని వివరించారు. తమ జట్టులో ఆరుగురు సభ్యులు ఉన్నారని, ఈ సభ్యులకు సాంకేతిక విజ్ఞానపరంగా, భౌగోళిక స్థితి పరంగా భిన్న నేపథ్యాలు ఉన్నాయన్నారు. జట్టు సభ్యుల్లో భారతదేశానికి చెందినవారుకాని వ్యక్తి కూడా ఒకరున్నారు. దివ్యాంగ బాలల ప్రత్యేక అవసరాలను గురించి తెలుసుకోవడానికి, వారికి ఎదురయ్యే కష్టాలు ఎలాంటివో గ్రహించడానికి వారిని జట్టు సభ్యుల్లో ఎవరైనా ఎప్పుడైనా కలిసి మాట్లాడారా? అని శ్రీ మోదీ తెలుసుకోగోరారు. దీనికి సయీదా బదులిస్తూ, జట్టు సభ్యుల్లో ఒకరి బంధువు ఆటిజంతో బాధపడుతున్నారని, అంతేకాక ఆటిజంతో బాధపడుతున్న బాలలకు ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడానికి తాము ఆ తరహా పిల్లల సంరక్షక కేంద్రాలతో కూడా మాట్లాడామన్నారు. ఈ జట్టు సభ్యులలో యెమన్ విద్యార్థి శ్రీ మొహమ్మద్ అలీ కూడా ఒకరు. ఈయన కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ సబ్జెక్టులలో ఇంజినీరింగ్ కోర్సు చదువుతున్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఈ విద్యార్థి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో ఈ తరహా కార్యక్రమాల్లో భాగం పంచుకోవడానికి అంతర్జాతీయ విద్యార్థులు కూడా ముందుకురావాలని కూడా ఆయన ఆహ్వానించారు. దివ్యాంగ బాలల అవసరాలను, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అర్థం చేసుకున్నందుకు ఈ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్క బాలునికి, బాలికకు జీవితంలో మరింతగా ఎదిగేందుకు హక్కు ఉందని, ఎవ్వరూ సమాజంలో వెనుకబడిపోకూడదని ప్రధాని అన్నారు. అలాంటి సవాళ్ళను అధిగమించడానికి కొత్త పరిష్కారాలను కనుగొనడం అవసరమని ఆయన అన్నారు. వీరు కనుగొన్న పరిష్కారం లక్షలాది బాలలకు మేలు చేస్తుందని, ఈ సాధనాన్ని స్థానికంగానే తయారు చేస్తున్నప్పటికీ దీని అవసరం ప్రపంచస్థాయిలో కూడా ఉంటుందని, కాబట్టి ఇది ప్రపంచస్థాయిలో ప్రభావాన్ని కలుగజేయగలదన్నారు. భారతదేశం అవసరాలకు సరిపడేటట్టు రూపొందే సాధనాలు ప్రపంచంలో ఏ దేశం అవసరాలనైనా తీర్చగలుగుతాయని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. కొత్త ప్రయత్నాన్ని చేపట్టినందుకు జట్టు సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
భారతదేశంలో సైబర్ దాడులు పెరుగుతూ ఉన్న కారణంగా సైబర్ భద్రత విషయంలో నేషనల్ టెక్నికల్ రిసర్చ్ ఆర్గనైజేషన్ తమ జట్టుకు ఇచ్చిన ఒక సమస్య గురించి ఐఐటీ ఖరగ్‌పూర్ నోడల్ కేంద్రం నుంచి వచ్చిన ‘హ్యాక్ డ్రీమర్స్’ జట్టు నాయకురాలు ప్రధానమంత్రికి వివరించారు. ఒక్క 2023లోనే దేశంలో 73 మిలియన్ (7 కోట్ల 30 లక్షల)కు పైగా సైబర్ దాడులు జరిగాయని, సైబర్ దాడుల సంఖ్య పరంగా చూస్తే ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద స్థాయి అని ఆమె చెప్పారు. దీని విషయంలో ఒక వినూత్న, ఆచరణసాధ్యమైన పరిష్కారాన్ని గురించి ఆమె ప్రధానమంత్రికి వివరించారు. తాము రూపొందించిన పరిష్కారం ప్రపంచంలో ఉపయోగిస్తున్న యాంటీ వైరస్ మల్టిపుల్ ఇంజిన్‌ల కన్నా భిన్నమైందని, ఇది సిస్టమ్‌ను సేఫ్ మోడ్‌లో ఉంచుతూ, ప్రభావవంతమైన పద్ధతులలో వైరస్‌ల జాడ తెలుసుకోవడానికి సమాంతర స్కానింగ్‌ను నిర్వహిస్తూ ఒక ఆఫ్‌లైన్ ఆర్కిటెక్చర్ డిజైన్‌ను, త్రెడ్ డిజైనును అందిస్తుందని జట్టు సభ్యుల్లో ఒకరు వివరించారు. ప్రధానమంత్రి తన ఇటీవలి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ప్రసంగంలో సైబర్ మోసం గురించి మాట్లాడిన సంగతిని గుర్తుచేశారు. చాలా మంది ఈ తరహా దగా బారినపడి నష్టపోతున్నారని ఆయన అన్నారు. సైబర్ బెదిరింపులు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని, ఈ నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలో అగ్రగామి డిజిటల్ ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉందని ఆయన చెబుతూ, మన దేశం వేరు వేరు స్థాయిలలో డిజిటల్ మాధ్యమం ద్వారా సంధానమవుతోందని తెలిపారు. సైబర్ నేరాలు పరిష్కారాలను కనుగొనడం భారత్ భవిష్యత్తుకు కీలకమని ప్రధానమంత్రి అన్నారు. ఆ తరహా పరిష్కారాలు ప్రభుత్వానికి సైతం చాలా ప్రయోజనకరంగా ఉంటాయని, ఈ పోటీలో పాల్గొంటున్నవారికి ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. జట్టు సభ్యులలో ఉరకలేస్తున్న ఉత్సాహాన్ని కూడా శ్రీ మోదీ గమనించి, ప్రోత్సహించారు.
గుజరాత్ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన టీమ్ కోడ్ బ్రో ప్రధానితో మాట్లాడుతూ, ఇస్రో - తమకు ఒక సమస్యను పరిష్కరించాల్సిందిగా సూచించగా, తాము దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది. చంద్రుని ఉపరితలంలో దక్షిణ ధ్రువ ప్రాంతానికి చెందిన చీకటి నిండిన ఛాయాచిత్రాల నాణ్యతను పెంచడమనేదే వారికి అప్పగించిన సమస్య. ఈ సమస్యకు తాము ఒక పరిష్కారాన్ని కనిపెట్టి, దానికి ‘చాంద్ వధానీ’ అనే పేరును పెట్టినట్లు జట్టు సభ్యులు ఒకరు వివరించారు. ఇది ఛాయాచిత్రాల లో కాంతిని పెంచడమొక్కటే కాకుండా, నిర్ణయాలను తీసుకొనే నేర్పు కూడా దీనిలో ఒక భాగంగా ఉంటుందన్నారు. ఇది నిర్దిష్ట స్థలాన్ని వాస్తవ కాల ప్రాతిపదికన ఎంపిక చేస్తూనే గోతులు, బండరాళ్ళను ఆనవాలు పడుతుందన్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో పనిచేస్తున్న వారితో, ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ఉన్న విశాల అంతరిక్షకేంద్రంలో పనిచేసేవారితో సంభాషించే అవకాశం టీమ్ సభ్యుల్లో ఎవరికైనా దక్కిందా అనే విషయాన్ని ప్రధాని తెలుసుకోగోరారు. చంద్రగ్రహం భూ విజ్ఞాన, పర్యావరణ స్థితిగతులను మరింత మెరుగైన పద్ధతిలో అవగాహనను ఏర్పరచుకోవడాన్ని గురించి ఏమంటారు? అని ప్రధాని ఆరా తీసినమీదట జట్టు సభ్యులు ఒకరు అవునని చెబుతూ, అలాంటి అనుభవం కలిగితే అది చంద్రగహ అన్వేషణలో సహాయకారి అవుతుందన్నారు. జట్టు సభ్యుల్లో మరొకరు కలగజేసుకొని డార్క్ నెట్, ఫోటో నెట్ అనే పేర్లుగల రెండు వ్యవస్థలతో కూడిన ఒక మెషిన్ లెర్నింగ్ నమూనాను ఉపయోగించినట్లు కూడా వెల్లడించారు. భారతదేశం చేపట్టిన అంతరిక్ష యాత్ర పట్ల ప్రపంచం ఎన్నో ఆశలు పెట్టుకుందని, ప్రతిభావంతులైన యువతను ఈ రంగంలోకి ప్రవేశించడం వల్ల ఈ నమ్మకం మరింత బలపడుతుందని ప్రధాని అన్నారు. ప్రపంచ అంతరిక్ష సాంకేతిక విజ్ఞాన సంబంధిత శక్తియుక్తులలో భారతదేశం తన పాత్ర పరిధిని విస్తరించుకొంటుందనడానికి యువ నూతన ఆవిష్కర్తలే ఒక రుజువని ఆయన వ్యాఖ్యానిస్తూ, జట్టు సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ముంబయిలోని వెలింగ్‌కర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్, రిసర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన మిస్టిక్ ఒరిజినల్స్ అనే జట్టు నాయకురాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తమకు ఇచ్చిన ఒక భద్రతాపరమైన సవాలును పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్య ఏమిటంటే, మైక్రో డాప్లర్‌ను ఆధారంగా చేసుకొని టార్గెట్‌ను వర్గీకరించడమనేదే. ఇది వారికి ఇచ్చిన వస్తువు ఒక పక్షియా లేదా ఒక డ్రోనా అన్నది కనుగొనడంలో సాయపడుతుంది. రాడార్లో చూసినప్పుడు ఒక పక్షి, ఒక డ్రోన్ ఒకే విధంగా కనిపిస్తాయి. ఈ కారణంగా ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో తప్పుడు హెచ్చరికలు లేదా ఇతరత్రా భద్రతపరమైన సంభావిత అపాయాలు ఎదురవ్వొచ్చు. జట్టు సభ్యుల్లో మరొకరు ఇంకొన్ని వివరాలు చెబుతూ, తాము కనుగొన్న పరిష్కారం వేరు వేరు వస్తువులవల్ల ఏర్పడే విశిష్ట ఆకృతుల మైక్రో డాప్లర్ సంతకాలను ఉపయోగించుకొంటుందని తెలిపారు. ఈ సంతకాలు మానవుల అద్వితీయ వేలిముద్రలవంటివని వివరించారు. ఈ పరిష్కారం వేగాన్ని, దిశను, దూరాన్ని గుర్తించగలుగుతుందా? అని ప్రధానమంత్రి అడిగారు. ఆ అంశాలను త్వరలోనే సాధిస్తామని జట్టు సభ్యుల్లో ఒకరు జవాబిచ్చారు. డ్రోన్‌లను వివిధ రకాలుగా మంచి కార్యాలకు వినియోగించుకోవచ్చునని ప్రధానమంత్రి అంటూ, కొన్ని శక్తులు డ్రోన్‌లను ఇతరులకు హాని చేయడానికి వినియోగిస్తున్నాయి. దీనితో భద్రతకు సవాలు ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరహా సవాలును కూడా పరిష్కరించగలిగే సమాధానం దొరుకుతుందా? అని ప్రధాని అడగగా, జట్టు సభ్యులు ఒకరు ప్రక్రియను వివరిస్తూ, తాము కనుగొన్న పరిష్కారాన్ని తక్కువ ఖర్చుతో రూపొందించిన సాధనాల్లో ఉపయోగించవచ్చని, అంతేకాకుండా భిన్నమైన వాతావరణాల్లోనూ ఇది పని చేస్తుందని చెప్పారు. రాజస్థాన్‌లో ఓ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన జట్టు సభ్యుడొకరు పుల్వామా దాడి తరువాత, శ్రతు డ్రోన్లు మన గగనతలంలోకి చొచ్చుకురావడం పెరిగిపోతోందని, డ్రోన్ విధ్వంసక (యాంటీడ్రోన్) వ్యవస్థను రాత్రిపూట ఏ సమయంలో అయినా పనిచేయించవచ్చన్నారు. పౌరులు అనేక కష్టాలపాలవుతున్నందువల్ల ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇవ్వాల్సిందిగా కోరారని ఆ జట్టు సభ్యుడు అన్నారు. దేశంలో వివిధ రంగాల్లో డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారని, ప్రధానమంత్రి చెబుతూ ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని ఒక ఉదాహరణగా ప్రస్తావించారు. దేశంలో దూర ప్రాంతాలకు మందుల రవాణాకు, అత్యవసర సరఫరాలకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆయన చెప్పారు. శత్రువులు డ్రోన్‌లను సరిహద్దు అవతలివైపు నుంచి మారణాయుధాలను, మత్తుమందులను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆయన అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ తరహా సమస్యలను పరిష్కరించడానికి యువ నూతన ఆవిష్కర్తలు ఎంతో శ్రద్ధతో పనిచేస్తూ ఉండడం సంతోషదాయకమని ప్రధానమంత్రి అన్నారు. వారి నూతన ఆవిష్కరణలు, రక్షణరంగ సాంకేతికతను ఎగుమతి చేయడానికి కొత్తదారులను తెరుస్తాయని ఆయన అన్నారు. సరిహద్దు ప్రాంతాలకు చెందిన జట్టు సభ్యులు ఒకరు ఈ సమస్యను లోతుగా అర్థం చేసుకొని, పరిష్కారాలను చూపవలసిన అవసరం గుర్తించడం మంచి విషయమంటూ ప్రధానమంత్రి తన శుభాకాంక్షలను తెలియజేశారు. అత్యాధునిక టెక్నాలజీని గురించి తెలుసుకుంటూ ఉండాల్సిందిగా వారిని ఆయన కోరారు. డ్రోన్‌లను దుర్మార్గపు పనులకు ఉపయోగించుకొంటున్నవారు ప్రతిరోజు కొత్త టెక్నాలజీని వాడుతున్నారని ఆయన అన్నారు. యువ ఆవిష్కర్తల కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
బెంగళూరుకు చెందిన న్యూ హొరైజన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ‘నిర్వాణ వన్’ జట్టు సభ్యులు ఒకరు జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్య నదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి, నదుల సంరక్షణలో మెరుగుదలకు సంబంధించింది. గంగా నదికి సాంస్కృతికంగాను, ఆధ్యాత్మికంగాను ఉన్న ప్రాముఖ్యాన్ని గమనించి ఈ ప్రాజెక్టు కోసం గంగానదిని ఎంపిక చేశారని జట్టు సభ్యులు మరొకరు చెప్పారు. నమామి గంగే, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగలలో భాగంగా చేపట్టిన పరిశోధనను ఆధారం చేసుకొని ఈ ప్రాజెక్టు మొదలైందని ఆమె అన్నారు. నదీతీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు సాయపడడానికి అందుబాటులో ఉన్న గణాంకసమాచారం ఆధారంగా ఒక నిర్ణయాత్మక మద్దతు వ్యవస్థను రూపొందించినట్లు కూడా ఆమె వివరించారు. 38 కీలక ప్రదేశాలను గుర్తించి, ఫెడరేటెడ్ లెర్నింగ్ సాయంతో స్థానిక నమూనాను తయారు చేశాం, ఇది ఒక మదర్ మాడల్ తో సంప్రదింపులు ఏర్పరుచుకోగలదు, దీంతో కచ్చితత్వాన్ని పెంచామని జట్టు సారధి తెలిపారు. ప్రతి ఆసక్తిదారు (స్టేక్ హోల్డరు)కు ఒక అధునాతన డాష్ బోర్డును రూపొందించినట్లు కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నూతన ఆవిష్కరణను మహాకుంభ్‌లో పాల్గొనేవారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలియజేయవలసిందిగా ప్రధానమంత్రి అడిగారు. దీనికి జట్టు సారధి సమాధానమిస్తూ, సమాచార విశ్లేషణ ద్వారా వ్యక్తిగత స్థాయిలో క్రిమిసంహారక ప్రక్రియలో సహాయపడి అంటురోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని, అందరూ మంచి ఆరోగ్య ప్రమాణాలు పాటించవచ్చన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య పదార్థాల పర్యవేక్షణకు, మురుగునీటి శుద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు, జీవవైవిధ్య నిర్వహణవంటి వాటికి వేరు వేరు పోర్టల్స్‌ను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాగునీటి సరఫరా వ్యవస్థను గురించి ఆయన ప్రస్తావిస్తూ, కాలుష్య కారకాలు ఒక్కసారిగా పెరిగాయంటే వాటిని విడుదల చేసిన పరిశ్రమ ఏదన్నది తెలుసుకోవచ్చని, పెద్దఎత్తున కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను ఒక కంట కనిపెట్టవచ్చని తెలిపారు. పర్యావరణ ప్రతిష్టంభన కోణంలోంచి చూసినప్పుడు ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైందని ప్రధాని అన్నారు. ఈ తరహా సున్నితమైన అంశాలపై జట్టు కసరత్తు చేస్తున్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్)లో పాల్గొన్నవారందరికీ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వారందరితో కలసి మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో జ్ఞానం, నూతన ఆవిష్కరణల పాత్ర కీలకం కాబోతున్నాయని, మారుతున్న పరిస్థితుల్లో భారతదేశం ఆశ, ఆకాంక్ష దాని యువతేనని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వారి ఆలోచనలు, వారి శక్తి, వారి దృష్టికోణం విభిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి లక్ష్యం ఒకే విధంగా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ, ప్రపంచంలో భారతదేశం అత్యంత వినూత్నంగా, ప్రగతి ప్రధానమైందిగా, సమృద్ధమైందిగా రూపొందాలని స్పష్టం చేశారు. భారతదేశానికి ఉన్న శక్తి దాని యువతరమే, వారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. భారతదేశం టెక్నాలజీ శక్తిగా ఉందని ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన అన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో పాలుపంచుకొంటున్న అందరిలోను భారత్ సత్తా స్పష్టంగా కనిపిస్తోందని కూడా ఆయన అన్నారు. భారతదేశ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమైందిగా తీర్చిదిద్దడానికి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఒక శ్రేష్ఠమైన వేదికగా రూపొందినందుకు శ్రీ మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను మొదలుపెట్టినప్పటినుంచీ చూస్తే, దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు. 2 లక్షల జట్లు (టీమ్స్) ఏర్పడి, సుమారు మూడు వేల సమస్యలపై పనిచేశాయని ఆయన తెలిపారు. 6,400కు పైగా సంస్థలు దీనితో ముడిపడ్డాయని, హ్యాకథాన్ వందలాది కొత్త అంకుర సంస్థ (స్టార్ట్ అప్)లు ఏర్పడడానికి దారితీసిందని ఆయన వివరించారు. 2017లో విద్యార్థులు 7,000కన్నా ఎక్కువ ఆలోచనలను నివేదికలుగా సమర్పించారని, ఈ సంవత్సరం ఇలా అందిన ఆలోచనలు 57,000కు మించిపోయాయని ప్రధాని తెలిపారు. ఇది దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడానికి భారతదేశ యువత ఎంతగా ముందుకు వస్తోందో చాటిందని ఆయన అన్నారు.
గత 7 హ్యాకథాన్లలో లభించిన అనేక పరిష్కారాలు ప్రస్తుతం దేశ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు రుజువైందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ హ్యాకథాన్లు అనేక ప్రధాన సమస్యలకు పరిష్కారాలను అందించాయని ఆయన స్పష్టంచేశారు. 2022 హ్యాకథాన్‌లో పాల్గొన్న ఒక యువ బృందం తుపానుల తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే వ్యవస్థపై పనిచేసిందని, ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధిపరిచిన టెక్నాలజీతో ప్రస్తుతం కలిపారని ఆయన ఒక ఉదాహరణగా చెప్పారు. సమాచారాన్ని సులభంగా సేకరించడానికి వీలుకల్పించే ఒక వీడియో జియోట్యాగింగ్ యాప్‌ను ఒక బృందం రూపొందించిందని, దీనిని ప్రస్తుతం అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనలో వినియోగిస్తున్నారంటూ ప్రధానమంత్రి మరొక ఉదాహరణనిచ్చారు. ఏదైనా ప్రాకృతిక విపత్తు సంభవించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న బ్లడ్ బ్యాంకు (రక్తనిధి)ల వివరాలను వాస్తవ కాల ప్రాతిపదికన అందించే ఒక వ్యవస్థను మరో టీం రూపొందించింది. ఇది ప్రస్తుతం ఎన్‌డీఆర్ఎఫ్ వంటి సహాయక సంస్థలకు ఎంతగానో సాయపడుతోందని ఆయన చెప్పారు. హ్యాకథాన్ అందించిన మరొక విజయగాథను గురించి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, కొన్నేళ్ళ కిందట దివ్యాంగజనుల కోసం ఒక వస్తువును మరొక జట్టు తయారు చేసిందని, ఆ సాధనం వారి జీవితాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడంలో సహాయకారిగా ఉంటోందన్నారు. ఇప్పటివరకు చూస్తే, ఆ తరహాలో విజయవంతమైన ప్రయోగాలు హ్యాకథాన్‌లో పాల్గొనే యువజనులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడంలోను, దేశాభివృద్ధిలోను ప్రభుత్వంతో దేశ యువత కలిసికట్టుగా ఏ విధంగా శ్రమిస్తోందీ ఈ హ్యాకథాన్లు చాటిచెబుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. దీంతో దేశ సమస్యలను పరిష్కరించడంలో తమకు కూడా ఒక ముఖ్య పాత్ర ఉందన్న భావన వారిలో ఉదయిస్తోందని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌గా మారేందుకు దేశం సరైన దారిలో పయనిస్తోందన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూతన్న పరిష్కారాలను కనుగొనడంలో యువత కనబరుస్తున్న ఆసక్తిని, నిబద్ధతను ఆయన మెచ్చుకొన్నారు.
ప్రస్తుత కాలంలో దేశం ఆకాంక్షలను నెరవేర్చుకొనే క్రమంలో ఎదురయ్యే ప్రతి సవాలును మూస పద్ధతికి భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రతి రంగంలో మన అలవాట్ల విషయంలో విభిన్న ఆలోచనా దృక్పథాన్ని అవలంబించాల్సి అవసరం ఉందని కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. ఈ హ్యాకథాన్‌కు ఉన్న ప్రత్యేకతను గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, దీనిలో అనుసరించాల్సిన ప్రక్రియ ఎంత ముఖ్యమో కనుగొనాల్సిన ఫలితం కూడా అంతే ముఖ్యమన్నారు. దేశ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదేనని చెప్పుకొన్న కాలమంటూ ఒకటి ఉండిందని శ్రీ మోదీ అన్నారు. అయితే, ప్రస్తుతం ఈ తరహా హ్యాకథాన్ల రూపంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సలహాదారులు (మెంటార్స్) కూడా పరిష్కారాల సాధనతో ముడిపడుతున్నారని శ్రీ మోదీ అన్నారు. ఇది భారత్ నూతన పాలన నమూనాగా ఉందనీ, ఈ నమూనాకు ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి ప్రయత్నాలు) ప్రాణశక్తి అనీ స్పష్టం చేశారు.
దేశానికి రాబోయే 25 సంవత్సరాలకు చెందిన తరం భారత్ కు ‘అమృత తరం’ అని ప్రధానమంత్రి చెబుతూ, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత యువతది కాగా, సరైన కాలంలో అవసరమైన ప్రతి వనరునూ సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విభిన్న వయోవర్గాలకు చెందినవారికి వారి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకాలపై ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని అన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్ర ప్రధాన మనస్తత్వాన్ని పెంచిపోషించడానికి ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలుచేసిందని ఆయన అన్నారు. దేశ నవతరం నూతన ఆవిష్కరణలపై పనిచేయడానికి పాఠశాలల్లో అవసరమైన శక్తియుక్తులను సంపాదించుకొనేందుకు వీలుగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ ప్రయోగశాలలు ప్రస్తుతం కొత్త ప్రయోగాలకు కేంద్రంగా మారుతున్నాయని, ఒక కోటి మంది కన్నా ఎక్కువ బాలలు పరిశోధనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 14,000కు పైగా ‘పిఎమ్ శ్రీ పాఠశాలలు’ 21వ శతాబ్దం నైపుణ్యాల విషయంలో కృషి చేస్తున్నాయని, విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలకు మెరుగులు దిద్దేందుకు కళాశాల స్థాయిలో ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. విద్యను అభ్యాససహితంగా నేర్చుకోవడానికి అడ్వాన్డ్ రోబోటిక్స్‌తోపాటు కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోగశాలలను కూడా ఉపయోగించుకొంటున్నారని శ్రీ మోదీ చెప్పారు. యువజనులు వారి సందేహాలను తీర్చుకోవడానికి శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడానికి ‘జిజ్ఞాస’ ప్లాట్‌ఫాంను రూపొందించారని ఆయన వివరించారు.
ప్రస్తుతం యువతకు శిక్షణకు తోడు ‘స్టార్ట్-అప్ ఇండియా’లో భాగంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారని, అంతేకాకుండా, వారికి పన్నులలో మినహాయింపును కూడా ఇస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు. యువతకు వ్యాపారాలు చేసుకోవడానికిగాను రూ. 20 లక్షల వరకు ‘ముద్ర రుణాన్ని’ కూడా సమకూర్చుతున్నారని ఆయన అన్నారు. కొత్త కంపెనీలను దృష్టిలోపెట్టుకొని దేశమంతటా టెక్నాలజీ పార్కులను, కొత్త ఐటీ కూడళ్ళను (ఐటీ హబ్స్) ఏర్పాటు చేస్తున్నారని శ్రీ మోదీ తెలిపారు. అంతేకాకుండా, ప్రభుత్వం రూ. ఒక లక్ష కోట్లతో ఒక పరిశోధన నిధిని ఏర్పాటుచేసిందన్నారు. యువత ఉద్యోగ జీవనంలో ప్రతి దశలోనూ ప్రభుత్వం వారి వెన్నంటి నిలుస్తోందని, వారి అవసరాలను తీర్చడానికి అనుగుణంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. హ్యాకథాన్లు నామమాత్ర లాంఛనప్రాయ కార్యక్రమాలు కాదు, మన యువతకు కొత్త కొత్త అవకాశాలను కూడా అవి కల్పిస్తున్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఇది (ఈ హ్యాకథాన్ల వ్యవస్థ) ఒక శాశ్వత వ్యవస్థను రూపుదిద్దే ప్రక్రియ అని శ్రీ మోదీ చెబుతూ, ప్రజలకు అనుకూలంగా పరిపాలన ఉండాలన్న తమ నమూనాలో ఇది ఒక భాగమని తెలిపారు.
భారత్‌ను ఒక ఎకనామిక్ సూపర్ పవర్ (ఆర్థిక మహాశక్తి)గా రూపుదిద్దడానికి కొత్తగా ఉనికిలోకి వస్తున్న రంగాలపై దృష్టిని కేంద్రీకరించడం ముఖ్యమని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్, గేమింగ్ వంటి రంగాలు పదేళ్ల కిందట అంతగా వృద్ధిలోకి రాలేదని, అయితే ఇవి ప్రస్తుతం భారత్‌లో వేగంగా పురోగమిస్తున్నాయని ఆయన స్పష్టంచేశారు. ఈ రంగాలు కొత్త కొత్త వృత్తులకు బాటలను వేస్తున్నాయని, యువతీయువకులకు అన్వేషించే, ప్రయోగాలను చేసే అవకాశాలను అందిస్తున్నాయి. సంస్కరణలు తెస్తూ, అడ్డంకులను తొలగించి యువతలో ఉన్న ఆసక్తికి, దృఢవిశ్వాసానికి ప్రభుత్వం చాలా మద్దతిస్తోంది. కంటెంట్‌ను సృష్టిస్తున్నవారి ప్రయత్నాలను, సృజనాత్మకతను గుర్తించి ఇటీవల జాతీయ సృజనశీలుర పురస్కారాలను ప్రదానం చేసిన సంగతిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఖేలో ఇండియా, టీఓపీఎస్ (TOPS) పథకం వంటి కార్యక్రమాలతో క్రీడలను ఒక జీవనవృత్తి ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సైతం ప్రధాని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ పథకాలు క్రీడాకారులు పల్లె స్థాయి ఆటల పోటీల మొదలు ఒలింపిక్స్ వరకు ప్రధాన పోటీలలో పాల్గొనడానికి సంసిద్ధం కావడంలో సాయపడుతున్నాయన్నారు. దీనికి తోడు, గేమింగ్ ఒక ఆశాభరిత జీవనవృత్తి ఎంపికగా ఉనికిలోకి రావడంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ కోసం ఉద్దేశించిన నేషనల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఈసరికే తన ప్రభావాన్ని కలగజేస్తోందని ఆయన అన్నారు.
‘వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ప్రధానంగా చెబుతూ, దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. ఈ పథకం భారతదేశ యువతకు, పరిశోధకులకు, నూతన ఆవిష్కర్తలకు అంతర్జాతీయ పత్రికలను అందుబాటులోకి తెస్తుందనీ, ఏ యువతీ లేదా ఏ యువకుడూ విలువైన సమాచారాన్ని అందుకోకుండా మిగిలిపోకుండా తోడ్పడుతుందనీ ఆయన చెప్పారు. ఈ పథకం కింద, ప్రతిష్టాత్మక పత్రికలకు చందాలను ప్రభుత్వమే చెల్లించడంతో జ్ఞానార్జనకు మార్గం సుగమం అవుతుంది. ఈ పథకంతో హ్యాకథాన్లలో పాల్గొనేవారికి మేలు కలగడంతోపాటు ప్రపంచంలో ప్రవీణులైన వారితో పోటీపడడానికి భారతీయ యువతను సమర్థులుగా తీర్చిదిద్దాలన్న విస్తృత లక్ష్యం కూడా నెరవేరుతుందని ప్రధాని స్పష్టంచేశారు. యువత విజన్‌కు తగినట్లుగా ప్రభుత్వ మిషన్ ఉందని, అంతేకాక వారు రాణించడానికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు, మౌలిక సదుపాయాలనూ వారికి అందేటట్లు చూస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
కుటుంబ సభ్యులు ఎవ్వరికీ రాజకీయాల్లో పాల్గొన్న చరిత్రంటూ లేని ఒక లక్ష మంది యువతీయువకులను దేశ రాజకీయ రంగంలోకి తీసుకు వస్తానని తాను చేసిన ప్రకటనను శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. భారతదేశం భవిష్యత్తుకు ఇది అవసరం అని ఆయన చెబుతూ, ఈ దిశలో వివిధ పద్ధతులపై ఆలోచనలు సాగుతున్నాయన్నారు. ‘‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’’ (వికసిత్ భారత్ యువ నేతల సంభాషణ)ను 2025 జనవరిలో నిర్వహించనున్నారని ఆయన ప్రకటించారు. దీనిలో దేశమంతటి నుంచీ కోట్లాది యువజనులు పాల్గొని అభివృద్ధి చెందిన భారతదేశం అంశంపై తమకున్న ఆలోచనలను తెలియజేస్తారని ఆయన అన్నారు. ’ యువజనులను, వారిచ్చే ఆలోచనలను ఎంపిక చేసి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 11-12 తేదీల్లో న్యూఢిల్లీలో ‘యంగ్ లీడర్స్ డైలాగ్’ (యువ నేతల సంభాషణ) పేరిట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాలనుంచి వచ్చే ప్రముఖ వ్యక్తులతో పాటు తాను కూడా పాల్గొంటానని ఆయన ప్రకటించారు. ఎస్ఐహెచ్‌తో ముడిపడ్డ యువజనులందరిని ‘‘వికసిత్ భారత్ యువ నేతల సంభాషణ’’లో పాలుపంచుకోవాల్సిందిగా శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు. దీంతో వారికి దేశ నిర్మాణంలో వారి వంతు పాత్రను పోషించే మరో గొప్ప అవకాశం లభించగలదని కూడా ఆయన అన్నారు.
రాబోయే కాలాన్ని ఒక అవకాశంగానే కాక ఒక బాధ్యతగా కూడా భావించాల్సిందిగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో పాల్గొంటున్న వారిని శ్రీ మోదీ ప్రోత్సహించారు. ఒక్క భారతదేశ సవాళ్లను పరిష్కరించడంపైన మాత్రమే దృష్టిని సారించడం కాకుండా, ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలను ఎక్కువ ప్రభావాన్ని చూపే విధంగా కృషి చేయండని బృందాలను ఆయన కోరారు. వచ్చే హ్యాకథాన్ నాటికి, ప్రపంచ సంక్షోభాలను పరిష్కరించగల పరిష్కారాల ఉదాహరణలు ముందుకు రాగలవన్న ఆశాభావాన్ని ప్రధాని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కర్తల, సమస్యా సాధకుల సామర్థ్యాలపై దేశానికి విశ్వాసం, గర్వం ఉన్నాయని ఆయన స్పష్టంచేస్తూ వారు జయించాలంటూ తన శుభాకాంక్షలనూ, కృతజ్ఞతనూ తెలియజేశారు.
నేపథ్యం
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్)లో ఏడో సంచికను 2024 డిసెంబర్ 11న ఏకకాలంలో దేశమంతటా 51 నోడల్ కేంద్రాలలో మొదలుపెట్టారు. దీని సాఫ్ట్‌వేర్ ఎడిషన్‌ను వరుసగా 36 గంటలపాటు ఎలాంటి విరామాన్నీ ఇవ్వకుండా నిర్వహిస్తూ, హార్డ్‌వేర్ ఎడిషన్ ను 2024 డిసెంబరు 11 మొదలు 15 వరకు కొనసాగించనున్నారు. ఇదివరకు నిర్వహించిన సంచికల్లో మాదిరిగానే విద్యార్థి బృందాలు మంత్రిత్వ శాఖలుగానీ, విభాగాలు గానీ, పరిశ్రమలు గానీ ఇచ్చిన సమస్యలపై కసరత్తు చేయడమో లేదా జాతీయ ప్రాముఖ్యమున్న రంగాలకు సంబంధించిన 17 ఇతివృత్తాల్లో ఏదైనా ఒక ఇతివృత్తంపై‘స్టూడెంట్ ఇనొవేషన్ కేటగిరీ’ కింద అయినా తమ ఆలోచనలను సమర్పిస్తాయి. జాతీయ ప్రాముఖ్యమున్న రంగాల్లో ఆరోగ్య సేవ, వస్తు సరఫరా యాజమాన్యం- ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), స్మార్ట్ టెక్నాలజీలు, వారసత్వం-సంస్కృతి, స్థిరత్వం, విద్య-నైపుణ్యాభివృద్ధి, నీరు, వ్యవసాయం-ఆహారం, కొత్తగా వృద్ధిలోకి వస్తున్న టెక్నాలజీలు, విపత్తు నిర్వహణ రంగాలున్నాయి.
ఈ సంవత్సరం పరిష్కరించడానికి ఇచ్చిన ఆసక్తిదాయకమైన సమస్యల్లో.. ఇస్రో ఇచ్చిన ‘చంద్ర గ్రహంలో చీకటి నిండి ఉన్న ప్రాంతాల చిత్రాల్లో స్పష్టతను పెంచడం’; జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ‘కృత్రిమ మేధ (ఏఐ), ఉపగ్రహం అందించే సమాచారం, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)తో పాటు డైనమిక్ మోడల్స్‌ను ఉపయోగించుకొంటూ వాస్తవ కాల ప్రాతిపదికన గంగానదిలో నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రణాలికను అభివృద్ధిపరచడం’; ఆయుష్ శాఖ ఇచ్చిన ‘ఏఐ సాయంతో ఏకీకరించిన ఒక స్మార్ట్ యోగ మ్యాట్‌ను అభివృద్ధిపరచడం’ వంటివి భాగంగా ఉన్నాయి.
మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు.. ఇవన్నీ కలిసి మొత్తం 54, ఈ సంవత్సరం సంచికలో 250 కన్నా ఎక్కువ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరాయి. సంస్థల స్థాయిలో నిర్వహించిన అంతర్గత హ్యాకథాన్లలో 150 శాతం వృద్ధి నమోదైంది. ఎస్ఐహెచ్ 2023లో అంతర్గత హ్యాకథాన్లు 900కు పైగా ఉంటే, ఎస్ఐహెచ్ 2024లో సుమారు 2,247కు పెరిగాయి. దీంతో ఎస్ఐహెచ్ 2024 ఇంతవరకు అతి పెద్ద సంచికగా మారింది. ఎస్ఐహెచ్ 2024లో సంస్థల స్థాయిలో 86,000కన్నా ఎక్కువ బృందాలు పాల్గొన్నాయి. ఈ సంస్థలు దాదాపు 49,000 విద్యార్థి బృందాలను (ప్రతి ఒక్క బృందంలోనూ ఆరుగురు విద్యార్థులతోపాటు ఇద్దరు సలహాదారులు కూడా ఉన్నారు) జాతీయ స్థాయి పోటీకి సిఫార్సు చేశాయి.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
आज दुनिया कह रही है कि भारत की ताकत, हमारी युवाशक्ति है, हमारा innovative youth है, हमारी tech power है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 11, 2024
बीते 7 सालों में जितने भी हैकाथॉन हुए हैं, उनके बहुत सारे Solutions आज देश के लोगों के लिए बहुत उपयोगी सिद्ध हो रहे हैं।
— PMO India (@PMOIndia) December 11, 2024
कई बड़ी समस्याओं का समाधान इन हैकॉथान्स ने दिया है: PM @narendramodi
Students में Scientific Mindset को Nurture करने के लिए हमने नई नेशनल एजुकेशन पॉलिसी लागू की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 11, 2024
One Nation-One Subscription स्कीम अपने आप में दुनिया की अनूठी स्कीम्स में से एक है।
— PMO India (@PMOIndia) December 11, 2024
जिसके तहत सरकार, प्रतिष्ठित जर्नल्स की सब्स्क्रिप्शन ले रही है, ताकि किसी भी जानकारी से भारत का कोई भी युवा वंचित ना रहे: PM @narendramodi