హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి, అకాడమి లో ఉత్తీర్ణులైన యువ ఐపిఎస్ అధికారులతో తాను క్రమం తప్పక మాట్లాడుతూ ఉంటానని, అయితే ఈ సంవత్సరం కొరోనా వైరస్ కారణం గా వారితో భేటీ కాలేకపోతున్నానన్నారు. ‘‘అయినప్పటికీ నా పదవీకాలంలో ఎప్పుడో ఒకప్పుడు, మిమ్మల్ని నేను తప్పక కలుసుకొంటాను’’ అని ఆయన అన్నారు.
ఐపిఎస్ ప్రొబేషనర్లు వారి శిక్షణ ను విజయవంతం గా ముగించినందుకు వారికి ప్రధాన మంత్రి శుభాశీస్సులు అందజేశారు. ప్రొబేషనర్లు వారి యూనిఫార్మ్ పట్ల గౌరవాన్ని కలిగిఉండాలని, యూనిఫార్మ్ పట్ల గర్వించడం అతి ముఖ్యంగా గమనించవలసిన అంశం, అని ఆయన స్పష్టం గా చెప్పారు. ‘‘ఎన్నటికీ మీ ఖాకీ దుస్తుల పట్ల గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. పోలీసులు చేసిన మంచి పనుల కారణం గా ప్రత్యేకించి ఈ కోవిడ్-19 కాలంలో వారు అందించిన సేవల కారణంగా ఖాకీ యూనిఫార్మ్ కు ఉన్న దయాగుణం ప్రజల జ్ఞాపకాల లో చెరగని ముద్ర వేసుకొంది’’ అని ఆయన అన్నారు.
ఐపిఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ‘‘ఇంతవరకు మీరు ఇక్కడ శిక్షణలో ఉన్న వ్యక్తి గా రక్షిత వాతావరణం లో ఉంటూ వచ్చారు. అయితే మీరు అకాడమి బయటకు అడుగుపెట్టిన మరు క్షణం పరిస్థితి రాత్రికి రాత్రి మారిపోతుంది. మీ పట్ల ఉన్న అంచనాలు కూడా మారిపోతాయి. మరింత జాగ్రత్త గా ఉండండి, మొదట ఏర్పడే అభిప్రాయమే చివరి వరకు ఉంటుంది. మీరు బదిలీ అయి ఎక్కడికి వెళ్లినా మీ ఇమేజ్ మీ వెంట వస్తుంది’’, అని హితవు పలికారు.
నిజానిజాల ను గ్రహించే నైపుణ్యాన్ని అలవరచుకోవాలని ప్రొబేషనర్ల కు ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. ‘‘మీరు రోజూ అనేక విషయాలు వింటారు. అయితే మీరు వినే విషయాలను, మీ విచక్షణను ఉపయోగించి పట్టించుకొనే సామర్థ్యాన్ని అలవరచుకోవాలి. అప్పుడే మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు, అని ఆయన అన్నారు.
ప్రొబేషనర్లు వారికి పోస్టింగ్ లభించిన ప్రతి ఒక్క ఠాణా తో అనుబంధ భావనను పెంచుకొంటూ, దానిని గర్వకారణం గా భావించాలని ప్రధాన మంత్రి కోరారు. సాధారణ ప్రజానీకం పట్ల దయ ను చూపాలి అని ఆయన ప్రొబేషనర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ను భయపెట్టి వారిని అదుపుచేయడం కన్నా వారి పట్ల దయను, జాలిని చూపించడం ద్వారా వారి మనస్సులను గెలుచుకొంటే అప్పుడు అది చిరకాలం నిలిచిపోతుంది అని ఆయన చెప్పారు.
కోవిడ్-19 మహమ్మారి కాలం లో పోలీసు విభాగంలోని దయాగుణం బయటకువచ్చింది అని చెప్తూ ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించారు.
ఒక నేరాన్ని పరిష్కరించడం లో పోలీసుల తెలివితేటలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. క్షేత్ర స్థాయి ఇంటెలిజెన్స్ లో వెల్లడి అయ్యే సమాచారానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందే, దానిని మరచిపోకూడదు, అదే సమయం లో సాంకేతిక పరిజ్ఞానానాన్ని సాధ్యమైనంత ఎక్కువ గా ఉపయోగించుకోవాలి అని ప్రొబేషనర్లను ఆయన కోరారు. సమాచారానికి, బిగ్ డేటా కు, కృత్రిమ మేధస్సు (ఎఐ) కు ఏ లోటూ లేదు అని కూడా ఆయన చెప్పారు. సోషల్ మీడియా లో అందుబాటులో ఉన్న సమచారాన్ని ఒక ఆస్తి గా ఆయన అభివర్ణించారు.
గత కొన్నేళ్లలో విపత్తు సంభవించిన సమయాల్లో ఎన్ డిఆర్ఎఫ్, ఎస్ డిఆర్ఎఫ్ లు శ్రమించిన తీరు పోలీసు సేవ కు ఒక కొత్త గుర్తింపు ను తీసుకువచ్చాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను తమ తమ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకొని ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు సాయపడాలి అని ఆయన కోరారు. ప్రొబేషనర్లు వారికి లభించిన శిక్షణను ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు అని ఆయన నొక్కిచెప్పారు. శిక్షణ అనేది ఒక శిక్షతో కూడిన పోస్టింగ్ అని భావించే మనస్తత్వం నుంచి బయటకు రావాలి అని ఆయన కోరారు.
రెండు రోజుల క్రితం మిషన్ కర్మయోగి ని ప్రారంభించిన సంగతి ని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మన ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన సివిల్ సర్వీసు లో సామర్థ్యాల పెంపు పరంగా చూసినా, పని పట్ల ప్రదర్శించే వైఖరి పరంగా చూసినా, ఇది ఒక పెద్ద సంస్కరణ అని ఆయన అన్నారు. నియమాల ఆధారిత పద్దతి నుంచి విధులపై ఆధారపడే పద్ధతి కి మారడాన్ని ఇది సూచిస్తుందని ఆయన చెప్పారు.
ఇది ప్రతిభ ను గుర్తించడంలో, ప్రతిభావంతులకు శిక్షణను ఇవ్వడం లో సాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. దీనితో సరి అయిన పాత్ర లో సరైన వ్యక్తి ని నియమించడం సాధ్యమౌతుందని ఆయన చెప్పారు.
‘‘మీ వృత్తి ఎలాంటిదంటే, దీనిలో ఊహించని సంఘటనలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఈ విషయం లో మీరు తప్పనిసరి గా అప్రమత్తం గా ఉంటూ, దీనిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి. ఈ వృత్తి లో ఒత్తిడి కూడా ఎంతో ఎక్కువగానే ఉంటుంది, అందువల్లే మీ సన్నిహితులతో, మీకు ప్రియతములైన వారితో మాట్లాడుతూ ఉండటం ముఖ్యం. అప్పుడప్పుడు, సెలవు రోజు న అయినా గాని, ఒక టీచర్ నో లేదా విలువైన సలహాలను ఇస్తారని మీరు భావంచే మరెవరినైనా కలుసుకుంటూ ఉండండి’’ అని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.
పౌర రక్షణ లో శారీరక దారుఢ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. శిక్షణ కాలంలో పెంపొందించుకొన్న దృఢత్వాన్ని కాపాడుకోవాలి అని ఆయన అన్నారు. మీరు దృఢంగా ఉన్నారంటే, అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న సహచరులు కూడా దృఢంగా ఉంటారు, వారు మిమ్మల్ని చూసి ప్రేరణ ను పొందుతారు అని ప్రధాన మంత్రి అన్నారు.
మహానుభావులు ఏర్పరచిన ఉదాహరణలను ప్రజలు అనుసరిస్తారు అని బోధించే గీత లోని వచనాలను మనస్సులో నిలుపుకోవాలని ప్రధాన మంత్రి కోరారు. ఈ సందర్భం లో-
‘‘యద్యద్ ఆచరతి శ్రేష్ఠ:,
తత్తద్ ఏవ ఇతర: జన:,
స: యత్ ప్రమాణమ్ కురూతే లోక:,
తత్ అనువర్తతే।’’-
అనే శ్రీమద్భగవద్గీత లోని పంక్తులను ఆయన ప్రస్తావించారు.