ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భారత మండపంలో జి-20 కార్యనిర్వాహక బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- జి-20ని విజయవంతంగా నిర్వహించడంపై వెల్లువెత్తుతున్న ప్రశంసల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో కార్యభారం స్వీకరించి కీలక పాత్ర పోషించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విస్తృత ప్రణాళిక-అమలు ప్రక్రియను ప్రస్తావిస్తూ- కార్యనిర్వాహకులంతా తాము అనుసరించిన విధానాలను, అనుభవాలను అక్షరబద్ధం చేయాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ విధంగా రూపొందించే అనుభవ పత్రం భవిష్యత్ కార్యక్రమాలకు మార్గదర్శకాల రూపకల్పనలో కరదీపిక కాగలదని ఆయన చెప్పారు.
కార్యభారం వహించడంలోగల ప్రాధాన్యం గుర్తించడంతోపాటు అందులో తామే కేంద్రకమనే భావన ప్రతి ఒక్కరిలో ఉండటం ద్వారానే ఇంతటి బృహత్ కార్యక్రమాల విజయ రహస్యం అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతలు నిర్వర్తించి వారంతా ఇష్టాగోష్ఠిగా సమావేశమై తమతమ శాఖల అనుభవాలను పంచుకోవాలని సూచించారు. ఇది వారివారి పనితీరును విస్తృత దృక్పథంలో విశ్లేషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇతరుల కృషి గురించి ఒకసారి తెలుసుకుంటే, అది మన స్వీయ మెరుగుదలకు తోడ్పడి, ముందడుగు వేయిస్తుందని చెప్పారు. “నేటి కార్యక్రమ ప్రధానాంశం కార్మికుల ఐక్యత.. మీరే కాదు... నేనూ శ్రామికుడినే” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
దైనందిన కార్యాలయ విధుల్లో సహోద్యోగుల సామర్థ్యాలేమిటో మనకు తెలియవన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కలసిమెలసి పనిచేస్తున్నపుడు అడ్డం-నిలువు-సమాంతర ఒంటెద్దు పోకడలన్నీ మటుమాయమై జట్టు స్ఫూర్తి వెల్లివిరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా స్వఛ్చబారత్ కార్యక్రమాన్ని ఉదాహరిస్తూ- అన్ని శాఖల్లో ఆ తరహా సమష్టి కృషి సాగాలని సూచించారు. తద్వారా ప్రాజెక్టులన్నీ పనుల్లా కాకుండా పండుగలా మారుతాయని చెప్పారు. ఆ విధంగా సమష్టి స్ఫూర్తికి ఎంతో బలం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యాలయ అధికార దర్పం నుంచి బయటపడి, సహోద్యోగుల బలాబలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఉన్నతాధికారులకు హితవు పలికారు.
మానవ వనరులు, అనుభవజ్ఞాన దృక్కోణంతో కార్యక్రమాలు విజయవంతం కావడంలోనని ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఒక కార్యక్రమం మొక్కుబడిగా సాగడం కన్నా ప్రణాళికబద్ధంగా పూర్తయినపుడు అది చాలా విస్తృత ప్రభావం చూపుతుందన్నారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడలను ఉదాహరిస్తూ- అది దేశానికి ఒక ముద్రను సాధించే గొప్ప అవకాశం. అందుకు భిన్నంగా దానివల్ల అందులో పాల్గొన్న వారితోపాటు దేశం పరువు కూడా పోయింది. అంతేగాక పాలన వ్యవస్థలో ఒక విధమైన నిరుత్సాహం నింపింది. అయితే, ప్రస్తుత జి-20 సంచిత ప్రభావం దేశం శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటడంలో విజయం సాధించింది. “ఈ విజయంపై సంపాదకీయాల్లో లభించే ప్రశంసలతో పోలిస్తే- ఎంతటి బృహత్ కార్యక్రమాన్నయినా నేడు అత్యుత్తమ రీతిలో అలవోకగా నిర్వహించగలమనే విశ్వాసం నా దేశానికి కలగడమే నాకు ఎనలేని సంతోషం కలిగిస్తోంది” అని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
విపత్కర పరిస్థితులు తలెత్తినపుడు భారత్ తొట్టతొలుత స్పందించి, చేయూతకు సదా సిద్ధంగా ఉంటుందనే దృఢ విశ్వాసం నేడు ప్రపంచ దేశాల్లో నెలకొన్నదని ప్రధాని వివరించారు. ఈ మేరకు నేపాల్ భూకంపం, ఫిజీ-శ్రీలంకలలో తుఫాను బీభత్సం సమయాల్లో అవసరమైన సామగ్రి తరలించడాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా మాల్దీవ్స్‌లో విద్యుత్తు-జల సంక్షోభం, యెమెన్ నుంచి ఆపన్నుల తరలింపుసహా టర్కీ భూకంపం వంటి వైపరీత్యాల వేళ భారత్ ఆపన్న హస్తం అందించిందని పేర్కొన్నారు. మానవాళి సంక్షేమానికి భారతదేశం సదా అండగా నిలుస్తూ ఆపత్సమయాల్లో చేయూతకు సిద్ధంగా ఉంటుందనే వాస్తవాన్ని ఇవన్నీ నిరూపిస్తున్నాయని ఆయన చెప్పారు. జోర్డాన్‌లో భూకంపం సంభవించిన పరిస్థితిలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా, మరోవైపు జి-20 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతుండగా సహాయక చర్యల సన్నాహాలు చేపట్టడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. కాగా, ఈ సమావేశంలో మంత్రులు, సీనియర్ అధికారులంతా వెనుక కుర్చీల్లో ఆసీనులు కాగా, క్షేత్రస్థాయి సిబ్బంది ముందువరుసలో్ ఉండటాన్ని ప్రధాని ప్రస్తావించారు. “నా పునాది బలంగా ఉందన్న హామీ ఇస్తున్న ఈ ఏర్పాటు నాకెంతో ఆనందమిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
మనం ఇంకా మెరుగుపడటం కోసం మరింతగా అంతర్జాతీయ పరిస్థితులకు అలవాటు పడాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఇప్పుడు ప్రపంచ విధానం, సందర్భం మన యావత్ కృషినీ గమనంలో ఉంచుకోవాలన్నారు. జి-20 నేపథ్యంలో లక్ష మంది కీలక విధాన నిర్ణేతలు భారత్‌ను సందర్శించారని, వారు తిరుగు ప్రయాణంలో భారత పర్యాటక దూతలుగా వెళ్లారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది చక్కగా కృషి చేయడమే ఈ పర్యాటక దౌత్యానికి బీజం వేసిందన్నారు. పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడానికి ఇది సరైన తరుణమన్నారు. ఈ సందర్భంగా వారందరితోనూ ముచ్చటించిన ప్రధాని వారి అనుభవాలను ఎంతో శ్రద్ధతో విన్నారు.
జి-20 సదస్సు విజయవంతం కావడంలో దోహదం చేసిన దాదాపు 3000 మంది ఈ ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. వీరిలో వివిధ మంత్రిత్వ శాఖల క్లీనర్లు, డ్రైవర్లు, వెయిటర్లు, ఇతరత్రా సిబ్బందిసహా సదస్సు సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో కృషిచేసిన వారంతా ఉన్నారు. అలాగే ఆయా శాఖల మంత్రులు, అధికారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.