ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) శ్రీ సుందర్ పిచాయ్‌తో వర్చువల్ మాధ్యమం ద్వారా సంభాషించారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ విస్తరణలో భాగస్వామ్యంపై గూగుల్ ప్రణాళిక గురించి వారిద్దరూ చర్చించారు. భారతదేశంలో ‘క్రోమ్‌బుక్’ తయారీపై ‘హెచ్‌పి’ సంస్థతో గూగుల్ భాగస్వామ్యాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు.
అలాగే 100 భాషలకు విస్తరణపై గూగుల్ కృషిని ఆయన కొనియాడారు. భారతీయ భాషలలో కృత్రిమ మేధ ఉపకరణాలను అందుబాటులో తెచ్చే కృషిని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. సుపరిపాలన ఉపకరణాల రూపకల్పన కృషిని కూడా కొనసాగించాలని కోరారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్)లో ప్రపంచ సాంకేతికార్థిక కార్యకలాపాల కేంద్రం ప్రారంభానికి గూగుల్ సన్నాహాలపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
భారత్‌లో ‘జి-పే’, ‘యూపీఐ’లకుగల ప్రజాదరణ, సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక సార్వజనీనతను మెరుగుపరచడంపై గూగుల్ ప్రణాళిక గురించి ప్రధానికి శ్రీ పిచాయ్ తెలిపారు. భారత ప్రగతి పయనంలో తోడ్పాటుపై గూగుల్ నిబద్ధతను కూడా నొక్కిచెప్పారు. కృత్రిమ మేధపై న్యూఢిల్లీలో తాము డిసెంబరులో నిర్వహించనున్న ప్రపంచ భాగస్వామ్య సదస్సుకు సహకరించాలని గూగుల్‌ను ప్రధాని ఈ సందర్భంగా ఆహ్వానించారు.