క్రిస్మస్ పర్వదినం సందర్భంగా భారత ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ కమ్యూనిటీ ప్రజలతో సమావేశమై సంభాషించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఒక గీతాలాపన ప్రదర్శన కూడా ఇచ్చారు.
ప్రతీ ఒక్కరికీ...ప్రత్యేకించి క్రైస్తవ కమ్యూనిటీ ప్రజలకు మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ ప్రత్యేకమైన, పవిత్ర సమయంలో తనను కలిసినందుకు ప్రతీ ఒక్కరికీ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. క్రిస్మస్ ను అందరూ కలిసికట్టుగా నిర్వహించుకోవాలన్న ఇండియన్ మైనారిటీ ఫౌండేషన్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నందుకు హర్షం ప్రకటిస్తూ ఈ చొరవ ప్రదర్శించినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. క్రైస్తవ కమ్యూనిటీతో తనకు గల దీర్ఘకాలిక, సన్నిహిత సంబంధాల గురించి ప్రస్తావిస్తూ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రైస్తవ కమ్యూనిటీ ప్రజలను, నాయకులను తరచు కలుసుకుంటూ ఉండేవాడినన్న విషయం ఆయన గుర్తు చేశారు. కొద్ది సంవత్సరాల క్రితం పోప్ తో తాను జరిపిన సంభాషణ చిరస్మరణీయమైనదని చెబుతూ ఈ భూమండలాన్ని మెరుగైన ప్రదేశంగా నిలపడానికి సామాజిక సామరస్యం, ప్రపంచ సౌభ్రాతృత్వం, వాతావరణ మార్పులు సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యత వంటి అంశాలు తమ మధ్య చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు.
క్రిస్మస్ కేవలం జీసస్ క్రీస్తు జన్మదినంగా నిర్వహించుకునే వేడుక మాత్రమే కాదని, ఆయన జీవితం, సందేశం, విలువలు గుర్తు చేసుకునే మధుర క్షణమని ప్రధానమంత్రి అన్నారు. జీసస్ ఎల్లప్పుడూ సజీవంగా ఉండే కరుణ, సేవా భావనల విలు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీసస్ అందరికీ న్యాయం అందించగల సమ్మిళిత సమాజం నెలకొల్పడానికి నిరంతరం శ్రమించారని, ఆ విలువలే భారతదేశ అభివృద్ధి పథానికి వెలుగు చూపాయని ప్రధానమంత్రి తెలిపారు.
మనందరినీ ఐక్యంగా నిలిపే సామాజిక జీవనంలోని విభిన్న రంగాల్లో పాటించే విలువల మధ్య సారూప్యతను ప్రధానమంత్రి గుర్తు చేస్తూ పవిత్ర బైబిల్ ప్రవచించిన సేవాభావమే ఇందుకు చక్కని ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘‘సేవ అనేదే సమున్నతమైన మతం. పవిత్ర బైబిల్ సేవకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చింది. సత్యం ద్వారా మాత్రమే ముక్తికి మార్గం సాధ్యం’’ అని ప్రవచించిందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే అంతిమ సత్యమే మనని మనం విముక్తం చేసుకునేందుకు మార్గమని పవిత్ర ఉపనిషత్తులు ప్రవచించాయని చెప్పారు. భాగస్వామ్య విలువలు, వారసత్వ బాటలోనే మనం ముందుకు సాగాలని పిఎం శ్రీ మోదీ నొక్కి చెప్పారు. ‘‘21వ శతాబ్దికి చెందిన ఆధునిక భారతం సహకారం, సామరస్యం పాటిస్తూ సబ్ కా ప్రయాస్ స్ఫూర్తితో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే ప్రయత్నం చేస్తుంది’’ అని నొక్కి చెప్పారు.
పోప్ ఒక క్రిస్మస్ సందేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న వారికి ఆశీస్సులు లభించాలని ప్రార్థించిన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు. పేదరికం ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నదని పోప్ విశ్వసిస్తారని ఆయన అన్నారు. తాము అనుసరిస్తున్న సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ మంత్రం ఇందులో ప్రతిధ్వనిస్తుందంటూ ‘‘ఏ ఒక్కరూ వెనుకబడి ఉండిపోకుండా అభివృద్ధి ఫలాలు ప్రతీ ఒక్కరికీ చేరేలా తమ ప్రభుత్వం హామీ ఇస్తోంది’’ అని ప్రధానమంత్రి చెప్పారు. క్రైస్తవ మత విశ్వాసాన్ని పాటించే పలువురు ప్రత్యేకించి పేదవర్గాల వారు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు.
‘‘క్రైస్తవ కమ్యూనిటీ అందించిన సేవలను జాతి గర్వంగా గుర్తుంచుకుంటుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో కూడా క్రైస్తవ కమ్యూనిటీ వారు విశేషమైన సేవలందించారని ప్రధానమంత్రి శ్రీ మోదీ కొనియాడుతూ పలువురు మేథావులు, నాయకులు అందించిన సేవలను ప్రస్తావించారు. వాస్తవానికి సహాయ నిరాకరణోద్యమం అనేది సెయింట్ స్టీఫెన్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుశీల్ కుమార్ రుద్ర మాటల ద్వారా మనసులో మెదిలిన ఆలోచన అని గాంధీజీ చెబుతూ ఉండేవారని ప్రధానమంత్రి చెప్పారు. సమాజానికి దిశానిర్దేశం చేయడంలో క్రైస్తవ కమ్యూనిటీ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వారు పేదలు, నిరాదరణకు గురవుతున్న వారికి సామాజిక సేవ చేయడంలో వారి క్రియాశీల భాగస్వామ్యం ఉన్నదని చెప్పారు. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన రంగాలకు వారు అందించిన సేవలను కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కావాలన్న భారతదేశ సంకల్పం, ఈ ప్రయాణంలో యువత పోషించవలసిన ప్రధాన పాత్ర గురించి మాట్లాడుతూ వారు భౌతికంగాను, మానసికంగాను, భావోద్వేగపరంగాను బలంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఫిట్ నెస్, చిరుధాన్యాలు, పోషకాహారం, మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాల గురించి ప్రజలందరికీ తెలిసేలా చేయాలని కమ్యూనిటీ నాయకులకు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
క్రిస్మస్ బహుమతులు అందించే సంప్రదాయం గురించి మాట్లాడుతూ రాబోయే తరాలకు మెరుగైన భూమండలాన్ని కానుకగా ఇవ్వాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ‘‘సుస్థిరత నేటి ఆవశ్యకత’’ అని పిఎం శ్రీ మోదీ చెబుతూ సుస్థిరతతో కూడిన జీవన విధానాలు అనుసరించాలన్నదే మిషన్ లైఫ్ సందేశమని, అందుకోసం భారతదేశం నాయకత్వంలో అంతర్జాతీయ ఉద్యమం జరుగుతున్నదని తెలిపారు. భూమండలం గురించి ఆలోచించే వ్యక్తులు భూమండలానికి అనుకూలమైన జీవనశైలిని ఆచరించేలా స్ఫూర్తి నింపడమే ఈ ప్రచారంలో ప్రధానాంశమని ఆయన పునరుద్ఘాటించారు. రీ సైక్లింగ్, పునర్వినియోగం, ప్రకృతిలో కలిసిపోయే బయో డీగ్రేడబుల్ మెటీరియల్స్ వినియోగం, చిరుధాన్యాల వినియోగం, తక్కువ కర్బన వ్యర్థాలకు దోహదపడే వస్తువులు మాత్రమే కొనుగోలు చేయడం వంటివి ఆచరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. సామాజిక చైతన్యం గల క్రైస్తవ కమ్యూనిటీ ఈ మిషన్ లో కీలక పాత్ర పోషించగలదన్న విశ్వాసం ఆయన ప్రకటించారు.
స్థానికం కోసం నినాదం గురించి కూడా ప్రధానమంత్రి సంభాషించారు. ‘‘మనం స్థానిక ఉత్పత్తులను ఉపయోగించి, భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రచారకర్తలుగా మారితే అది కూడా ఒక సామాజిక సేవ అవుతుంది. అందుకే స్థానికం కోసం మరింత అధికంగా నినదించాలని క్రైస్తవ కమ్యూనిటీని నేను అభ్యర్థిస్తున్నాను’’ అన్నారు.
పండుగ సీజన్ జాతి యావత్తును ఐక్యం చేస్తుందని, ప్రతీ ఒక్క పౌరుని సంఘటితం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘భిన్నత్వంలో కూడా మనందరినీ ఐక్యంగా నిలపడంలో ఈ పండుగ మన మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచుగాక. ఈ క్రిస్మస్ మీ అందరికీ ఆనందం కలిగించుగాక, రాబోయే కొత్త సంవత్సరం అందరికీ సుసంపన్నత, ఆనందం, శాంతి అందించుగాక’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన క్రైస్తవ కమ్యూనిటీ నాయకులందరూ ఈ సంభాషణలో పాల్గొన్నారు. భారత్ లో రోమన్ కాథలిక్ చర్చి కార్డినల్ , బొంబాయి ఆర్చిబిషప్, పోప్ కౌన్సిల్ ఆఫ్ ద కార్డినల్ అడ్వైజర్స్ సభ్యుడు ఓస్వాల్డ్ గ్రేసియస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇది మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి అని గుర్తు చేస్తూ ఇతరుల అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడాలన్న జీసస్ క్రైస్ట్ బోధనలే స్ఫూర్తిగా ఆయన సత్పరిపాలన కోసం ఎంతో ఇష్టపూర్వకంగా మాట్లాడేవారని గుర్తు చేశారు. దేశం కోసం, క్రైస్తవ కమ్యూనిటీ కోసం ప్రధానమంత్రి శ్రీ మోదీ చేస్తున్న ప్రయత్నాల పట్ల కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ క్రీడాకారిణి అంజు బాబీ జార్జి తన సుదీర్ఘ క్రీడా కెరీర్ లో క్రీడల్లో వచ్చిన మార్పును గురించి ప్రస్తావించారు. తన కాలంలో క్రీడల పట్ల ఒక మోస్తరు స్పందన మాత్రమే ఉండేదని, కాని నేడు అథ్లెటిక్స్ సాధిస్తున్న విజయాలను దేశం, నాయకత్వం వేడుకగా చేసుకుంటున్న తీరు అభినందనీయమని ఆమె అన్నారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాల ద్వారా క్రీడల గురించి అధికంగా మాట్లాడుకుంటున్నారని, అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ మార్పునకు ప్రధానమంత్రి సమర్థ నాయకత్వమే కారణమని ఆమె అన్నారు. మహిళా సాధికారత ఏ విధంగా వాస్తవంగా ఆచరణీయం అవుతున్నది కూడా ఆమె ప్రస్తావించారు. ‘‘ఏదో ఒక రోజు తమ కల నిజమవుతుందన్న విశ్వాసంతో ప్రతీ ఒక్క భారతీయ బాలిక కలలు కనేందుకు సిద్ధంగా ఉంది’’ అంటూ 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారతదేశం ప్రతిపాదించడం పట్ల ఆమె హర్షం ప్రకటించారు.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రికి డయోసెస్ ఆఫ్ ఢిల్లీ, నార్త్ ఇండియా చర్చి బిషప్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం జీసస్ క్రైస్ట్ చేసిన త్యాగాలకు, నేడు ప్రధానమంత్రి ప్రజల కోసం, సమాజం కోసం చేస్తున్న కృషికి మధ్య సారూప్యతను డాక్టర్ స్వరూప్ ప్రముఖంగా ప్రస్తావించారు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియచేశారు.
ప్రధానమంత్రి విశాల హృదయం, కట్టుబాటు, దార్శనికత నూనత విద్యావిధానంలోను, ప్రభుత్వం అనుసరిస్తున్న ఇతర విధానాల్లోనూ కనిపిస్తున్నాయని విద్యారంగం ప్రతినిధి అయిన ఢిల్లీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ జాన్ వర్గీస్ ప్రశంసించారు. ఎన్ఇపి పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందంటూ ఎన్ఇపిలో గల స్థానిక, ప్రపంచ కోణాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే మాతృ భాషకు ప్రోత్సాహం, 12వ తరగతి వరకే బోర్డు పరీక్షలను పరిమితం చేయడం వంటివి ప్రగతిశీలక చర్యలని ఆయన అన్నారు. ఉన్నత విద్యారంగానికి వనరుల్లో వాటా కల్పించడం, అత్యున్నత పని తీరు ప్రదర్శిస్తున్న పరిశ్రమలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి చర్యలను ఆయన ప్రశంసించారు. ఇన్నోవేషన్, ఆరోగ్యం, క్రీడలకు ఇటీవల కాలంలో ఇస్తున్న ప్రోత్సాహం పట్ల హర్షం ప్రకటించారు. పొరుగువారు ప్రథమం అనే ప్రధానమంత్రి దార్శనిక వైఖరికి దీటుగానే సెయింట్ స్టీఫెన్స్ కళాశాల యంగ్ లీడర్స్ నైబర్ హుడ్ ఫస్ట్ ఫెలోషిప్ కార్యక్రమం అమలుపరుస్తున్నదని శ్రీ జాన్ వర్గీస్ చెప్పారు. జి-20 శిఖరాగ్రంలో భారతదేశ నాయకత్వ విజయం గురించి ప్రస్తావిస్తూ ప్రపంచ దక్షిణ ప్రాంత ప్రజల వాక్కుగా ప్రధానమంత్రి వ్యవహరించడాన్ని ప్రశంసించారు. ‘‘భారతదేశానికి అద్భుత నాగరికత. మీరు అనుసరిస్తున్న విధానాలు, మీరు వేస్తున్న అడుగులు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. డిజిటల్ ఇండియా, జాతీయ విద్య, పొరుగువారే ప్రథమం వంటి విధానాల ద్వారా మీరు వేస్తున్న అడుగులు యువతకు ఎంత ప్రయోజనకారిగా ఉన్నాయో ఒక ఉపాధ్యాయునిగా నేను స్వయంగా చూస్తున్నాను. ఇవన్నీ భారతదేశానని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నాయి’’ అని వర్గీస్ అన్నారు. ప్రపంచంలోని ప్రాచీన భాష పట్ల ప్రధానమంత్రికి గల ప్రేమను గుర్తించిన ప్రిన్సిపల్ ప్రధానమంత్రికి ఆనందం కలిగించే రీతిలో తమిళ భాషలో తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రధానమంత్రి తన నివాసంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించినందుకు ఢిల్లీకి చెందిన ఆర్చడయోసెస్ ఆర్చిబిషప్ అనిల్ కోటో ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ చర్యతో అది క్రైస్తవ కమ్యూనిటీ పండుగగా కాకుండా జాతీయ పండుగ అయిందన్నారు. శాంతి, ప్రేమ, ఐక్యత సందేశాన్ని ప్రసరింపచేస్తూ దేశ పౌరులందరి సంక్షేమాన్ని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి ‘‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’’ మంత్రం పరిపూర్ణ ఫలితాలనివ్వాలని శుభాకాంక్షలు తెలియచేశారు. క్రైస్తవ కమ్యూనిటీ ఎప్పుడూ దేశ సంక్షేమం కోసమే పాటు పడిందంటూ భారతదేశ అభివృద్ధి , పురోగతికి తమ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. భగవంతుని తెలివి, దృష్టి, బలం ఎల్లప్పుడూ దేశంలోను, అంతర్జాతీయంగాను తన నాయకత్వాన్ని ముందుకు నడిపించడంలో ప్రధానమంత్రికి లభిస్తాయని ఆయన ఆశీస్సులు అందచేశారు. ప్రతీ ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జాతి, పౌరులు అందరి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమానికి అనుబంధంగా జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి అధికారిక నివాసంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నందుకు రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ తమ హర్షం పునరుద్ఘాటించారు. క్రిస్మస్ పవిత్ర దినాన తనతో సంభాషించి, చర్చించే అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రికి బిషప్ థామస్ మార్ ఆంటోనియోస్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి ఆలోచనలు దేశంలో ప్రతీ ఒక్కరినీ తాకుతున్నాయని, ప్రపంచానికే మన దేశాన్ని నాయకత్వ దేశంగా నిలుపుతాయని కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్ అన్నారు. ప్రధానమంత్రి అనుసరిస్తున్న సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ పట్ల ఆర్చి బిషప్ అనిల్ కోటో హర్షం ప్రకటిస్తూ ప్రపంచ యవనికపై దేశానికి సమర్థ నాయకత్వం అందిస్తున్నందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్క రంగంలోను ప్రపంచశ్రేణి బెంచ్ మార్క్ లు నెలకొల్పే ప్రస్తుత విధానాన్ని సెయింట్ స్టీఫెన్ కలాశాల ప్రిన్సిపల్ జాన్ వర్గీస్ ప్రశంసిస్తూ ‘‘భారతదేశం గెలిచినట్టయితే ప్రపంచం గెలుస్తుంది’’ అన్నారు. జాతిని పరివర్తిత బాటలో నడపడంతో పాటు మెరుగైన భవిష్యత్తు అందిస్తామని హామీ ఇవ్వడంలో ప్రధానమంత్రి కీలక పాత్రను క్రైస్తవ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క కమ్యూనిటీ వీక్షిస్తున్నదని ముత్తూట్ గ్రూప్ జాయింట్ ఎండి అలెగ్జాండర్ జార్జి అన్నారు. ప్రధానమంత్రి అందరికీ అందుబాటులో ఉండే వైఖరి, నిరాడంబరత, స్నేహపూర్వక స్వభావాన్ని జాయ్ అలుక్కాస్ చైర్మన్ అలుక్కాస్ జాయ్ వర్గీస్ కొనియాడారు. గల్ఫ్ దేశాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో భారతదేశం పట్ల సానుకూల వైఖరి కలిగించడంలో ప్రధానమంత్రి ప్రయత్నాలను బహ్రేన్ కు చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త కురియెన్ వర్గీస్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఒక అద్భుత నాయకుడని అథ్లెట్ అంజు బాబీ జార్జి ప్రశంసిస్తూ ఆయన యకత్వంలో క్రీడా స్ఫూర్తి రగులుతున్నదని కొనియాడారు. ‘‘సమీప భవిష్యత్తులోనే మనం అగ్రస్థానంలో నిలుస్తాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. భారతదేశ అభివృద్ధికి ప్రధానమంత్రి సేవలను నటుడు డినో మోరియా కొనియాడుతూ ప్రజలతో పాటు దేశం సరైన బాటలో పురోగమిస్తున్నదన్నారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతమైనదిగా ప్రశంసలు అందుకుంటోందని పేర్కొంటూ భారతదేశం పట్ల భారీ మద్దతు సమీకరించడంలో ఆయన నాయకత్వం కీలకంగా ఉన్నదని క్యుఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ విభాగాల రీజినల్ డైరెక్టర్ అశ్విన్ జెరోమ్ ఫెర్నాండెజ్ అన్నారు. భారత ప్రజలకు సేవలందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా నిలపడంలో ప్రధానమంత్రి అంకిత భావాన్ని హోలీ సీ వాటికన్ ఎంబసీ సెకండ్ సెక్రటరీ కెవిన్.జె.కింటిస్ ప్రశంసించారు. క్రిస్మస్ వేడుకలు తన నివాసంలో నిర్వహించుకోవలసిందిగా ఒక ప్రధానమంత్రి క్రైస్తవ కమ్యూనిటీని ఆహ్వానించడం దేశచరిత్రలో ఇదే ప్రథమమని బిషప్ సైమన్ జాన్ హర్షం ప్రకటించారు. ప్రధానమంత్రి దయా హృదయం గల మానవతావాది అని అపోలో 24x7 సిఇఒ అంథోనీ జాకబ్ ప్రశంసిస్తూ ఆయనతో సంభాషించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి అద్భుత అవకాశం కల్పించినందుకు క్రైస్ట్ విశ్వవిద్యాలయం అడ్మినిస్ర్టేటర్ సన్నీ జోసెఫ్ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియచేస్తూ భవిష్యత్తు పట్ల ఆయన దార్శనికత, ఆయన సందేశం ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తిని తట్టి లేపాయని అన్నారు. మార్పును కోరడమే ప్రధానమంత్రి నాయకత్వ శైలి అని ఢిల్లీకి చెందిన వెల్స్ ఫార్గో బ్యాంక్ ఎండి యాకూబ్ మాథ్యూస్ అన్నారు.
A few years ago, I had the privilege of meeting The Holy Pope. It was a moment that left a lasting impression on me: PM @narendramodi pic.twitter.com/3UQz1EnJly
— PMO India (@PMOIndia) December 25, 2023
Christmas is the day when we celebrate the birth of Jesus Christ. This is also a day to remember his life, message and values. pic.twitter.com/3KZmh3POuk
— PMO India (@PMOIndia) December 25, 2023
We believe in the mantra of 'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas': PM @narendramodi pic.twitter.com/ygjHqcYqab
— PMO India (@PMOIndia) December 25, 2023
India's youth are the most important partners in the country's development journey: PM @narendramodi pic.twitter.com/N6zWrBgerX
— PMO India (@PMOIndia) December 25, 2023
Let us gift a better planet to the coming generations: PM @narendramodi pic.twitter.com/Y3vZwoomga
— PMO India (@PMOIndia) December 25, 2023