‘‘స్వల్ప కాలంలోనే 1.25కోట్ల మందికిపైగా ప్రజలు ‘మోదీ హామీ రథం’తో మమేకం’’;
‘‘ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సంతృప్త స్థాయిలో ప్రజలకు చేరడంపై ఈ యాత్ర దృష్టి సారిస్తుంది’’;
‘‘మోదీ హామీ అంటే- అది నెరవేరే వాగ్దానమన్నది ప్రజల నమ్మకం’’;
‘‘ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అందని ప్రజలతో మమేకం కావడంలో వికసిత భారతం సంకల్ప యాత్ర గొప్ప మాధ్యమంగా మారింది’’;
‘‘ఇది మా బాబు సర్కారు కాదు... దేశంలోని తల్లులు-తండ్రులకు సేవలందించే ప్రభుత్వం’’;
‘‘నిరుపేద.. మహిళ.. యువత.. రైతు- ప్రతి ఒక్కరూ నాకు ‘వీఐపీలే’’;
‘‘వికసిత భారతం సంకల్ప యాత్రకు నారీశక్తి.. యువశక్తి.. రైతులు.. పేదలు సహా ప్రతి ఒక్కరినుంచీ అద్భుతమైన మద్దతు లభిస్తోంది’’

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్ప యాత్ర (విబిఎస్‌వై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధనతోపాటు ప్రజలందరికీ సకాలంలో ప్రయోజనం అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వికసిత భారతం సంకల్ప యాత్ర చేపట్టబడింది.

   ఈ సందర్భంగా ప్రధానమంత్రి లబ్ధిదారులనుద్దేశించి ప్రసంగిస్తూ- ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఎంతో ఉత్సాహంతో ‘మోదీ హామీ రథాన్ని’ స్వాగతించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు లబ్ధిదారులతో తన సంభాషణను గుర్తుచేస్తూ, ఈ యాత్రపై 1.5 లక్షల మందికిపైగా లబ్ధిదారులు తమ అనుభవాలను పొందుపరిచారని వెల్లడించారు. పక్కా ఇల్లు, కొళాయి కనెక్షన్, మరుగుదొడ్డి, ఉచిత చికిత్స, ఉచిత రేషన్, వంటగ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ప్రారంభం సహా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం స్వానిధి యోజన, పీఎం స్వామిత్వ ఆస్తి కార్డుల జారీ వంటి పథకాల ద్వారా పొందిన ప్రయోజనాల గురించి వారు వివరించారని పేర్కొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది గ్రామీణ కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా తమకు అవసరమైన ప్రభుత్వ పథకాల లబ్ధి పొందినట్లు వివరించారు. ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి ఆ తర్వాత వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టిందన్నారు. ‘‘అందుకే ప్రజలు మోదీ హామీ అంటే- కచ్చితంగా నెరవేరే వాగ్దానంగా పరిగణిస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

   ‘‘దేశంలో ఇప్పటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందని ప్రజలతో మమేకం కావడంలో వికసిత భారతం సంకల్ప యాత్ర గొప్ప మాధ్యమంగా మారింది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘విబిఎస్‌వై’ నెలకన్నా తక్కువ వ్యవధిలోనే పలు నగరాలతోపాటు 40 వేలకుపైగా పంచాయతీలకు చేరిందని చెప్పారు. ఈ సందర్భంగా 1.25 కోట్ల మందికిపైగా ప్రజలు ‘మోదీ హామీ రథం’తో మమేకమయ్యారని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ ‘విబిఎస్‌వై’ రథాన్ని ఎంతో ఉత్సాహంతో స్వాగతిస్తున్న ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రతిచోటా వివిధ కార్యకలాపాలు చేపడుతున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం కింద ప్రభాత భేరి పేరిట అవగాహన కల్పన, పాఠశాలల్లో ప్రభాత ప్రార్థనల సందర్భంగా వికసిత భారతం కార్యక్రమంపై విద్యార్థుల నడుమ చర్చ, ప్రతి వాకిటా ముగ్గులు వేయడం, దీపాలు వెలిగించడం వంటి కార్యకలాపాల ద్వారా ప్రజా చైతన్యం మెరుగుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

   ప్రతి పంచాయతీలోనూ ‘విబిఎస్‌వై’కి స్వాగతం పలికడం కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటుపై ప్రధాని హర్షం వెలిబుచ్చారు. పాఠశాల విద్యార్థులతో పాటు వృద్ధులు కూడా పాల్గొనడం అభినందనీయమని, మొత్తంమీద ఈ సంకల్ప యాత్రం దేశం నలుమూలలకూ చేరుతున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఒడిషాలోని వివిధ ప్రదేశాల్లో గిరిజన సంప్రదాయ నృత్యంతో యాత్రను స్వాగతిస్తున్న తీరును ప్రధాని ప్రశంసించారు. ఈ మేరకు పశ్చిమ ఖాసీ హిల్‌ పరిధిలోని రాంబ్రాయ్‌లో స్థానికులు నృత్యగానాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అలాగే అండమాన్- నికోబార్, లక్షద్వీప్ దీవులుసహా కార్గిల్‌లలోనూ ‘విబిఎస్‌వై’కి స్వాగతం పలికే కార్యక్రమాల్లో 4,000 మందికిపైగా ప్రజలు పాల్గొనడాన్ని కూడా ఆయన ఉదాహరించారు. ‘విబిఎస్‌వై’ రాకకు ముందు- తర్వాత పురోగతిని అంచనావేసే విధంగా కార్యకలాపాల జాబితా తయారీ కోసం కరదీపికను రూపొందించాలని ప్రధాని సూచించారు. తద్వారా ‘‘ఈ హామీ రథం వెళ్లాల్సిన ప్రాంతాల ప్రజలకు కూడా సమాచారం అందుతుంది’’ అని ఆయన అన్నారు.

 

   గ్రామంలోకి ‘మోదీ హామీ రథం’ రాగానే ప్రతి వ్యక్తి అక్కడికి వచ్చి, ప్రభుత్వ పథకాల సంతృప్త స్థాయి సాధన సంకల్పం నెరవేరడంలో తమవంతు పాత్ర పోషించేలా ప్రభుత్వ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ కృషి ప్రభావం ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నదని, ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ కోసం కొత్తగా లక్షమంది నమోదు చేసుకోవడాన్ని శ్రీ మోదీ ఉదాహరించారు. అలాగే 35 లక్షలకుపైగా ఆయుష్మాన్ కార్డులు కూడా అక్కడికక్కడే జారీ చేయబడ్డాయని, లక్షలాది మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరోవైపు వివిధ రోగ నిర్ధారణ పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయుష్మాన్ ఆరోగ్యాలయాలకు వెళుతున్నారని చెప్పారు.

   ‘‘దేశ ప్రజలతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష సంబంధం, భావోద్వేగ బంధాన్ని మేం ఏర్పరిచాం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ‘‘ఇది మా బాబు సర్కారు కాదు... దేశంలోని తల్లులు-తండ్రులందరికీ సేవలందించే ప్రభుత్వం’’ అని ఆయన అభివర్ణించారు. ‘‘మోదీకి నిరుపేదలు, అణగారిన వర్గాలు, ప్రభుత్వ కార్యాలయాల తలుపులు మూసివేయబడినవారు నాకు వీఐపీలే’’ అన్నారు.  దేశంలోని ప్రతి పేదవాడినీ తాను అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తానని ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘‘దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తె నాకు వీఐపీలే... ప్రతి రైతు, యువకుడు కూడా నాకు ‘వీఐపీ’యే’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ముగిసిన శాసనసభల ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ- ‘మోదీ హామీ’కి లభించిన సుస్పష్ట ప్రజామోదానికి ఇవి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు తనపై అపార నమ్మకం ప్రకటించిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

   ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేసేవారికి అదొక ప్రవృత్తి మాత్రమేనని, అందుకే వారిని విశ్వసించబోమని పౌరులు తమ తీర్పుతో స్పష్టం చేశారని ప్రధాని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా ప్రజలకు చేరువ కావడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నికలలో విజయానికన్నా ముందు జనం హృదయాలను చూరగొనడం అత్యంత ప్రధానం’’ అన్నారు. ప్రజా చైతన్యంపై అంచనాలో వారు బోల్తాపడటంపై తన సానుభూతి ప్రకటిస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు కాకుండా సేవా స్ఫూర్తికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే, దేశంలోని అధికశాతం జనాభా నేడు పేదరికంలో ఉండేది కాదన్నారు. ఇవాళ మోదీ నెరవేరుస్తున్న వాగ్దానాలు 50 ఏళ్ల కిందటే నెరవేరి ఉండేవని ప్రధాని వ్యాఖ్యానించారు.

 

 

   దేశంలో మహిళా చోదక అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ- వికసిత భారతం సంకల్ప యాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన 4 కోట్ల పక్కా ఇళ్లలో 70 శాతం లబ్ధిదారులు మహిళలేనని ఆయన గుర్తుచేశారు. అలాగే ప్రతి 10 మంది ముద్ర లబ్ధిదారులలో 8 మంది మహిళలే ఉన్నారని, ఇక మహిళా స్వయం సహాయ సంఘాల్లో 10 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారని ఉటంకించారు. మరోవైపు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 2 కోట్ల మంది మహిళలు లక్షాధికారి సోదరీమణులుగా మారారని తెలిపారు.  దేశంలోని 15 వేల స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు ‘నమో డ్రోన్ సోదరీమణి కార్యక్రమం’ కింద డ్రోన్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

   వికసిత భారతం సంకల్ప యాత్రకు నారీశక్తి, యువశక్తి, రైతులు, పేదలు విశేషంగా మద్దతివ్వడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. యువ క్రీడాకారులను మరింత ప్రోత్సహించే ఈ యాత్రలో భాగంగా లక్ష మందికిపైగా వర్ధమాన క్రీడాకారులకు బహుమతులు అందించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. అలాగే ‘మై భారత్ వాలంటీర్’గా నమోదు చేసుకోవడంలో యువత అపార ఉత్సాహం చూపుతున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తద్వారా వికసిత భారతం సంకల్పం మరింత బలోపేతం కాగలదన్నారు. ‘‘ఈ స్వచ్ఛంద కార్యకర్తలందరూ ఇప్పుడు ‘సుదృఢ భారతం’ మంత్రాన్ని అనుసరిస్తూ ముందడుగు వేస్తారు’’ అని పేర్కొన్నారు. తగినంత నీరు,  పోషకాహారం, కసరత్తు లేదా ఏదైనా వ్యాయామంతోపాటు చాలినంత నిద్ర కూడా అత్యావశ్యకమని ఈ సందర్భంగా ఆయన యువతకు సూచించారు. ‘‘ఆరోగ్యకర శరీరానికి ఈ నాలుగూ చాలా అవసరం. వీటిపై మనం శ్రద్ధ వహిస్తే యువతరం ఆరోగ్యంగా ఉంటుంది. వారు ఆరోగ్యవంతులుగా ఉంటేనే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి ఉద్బోధించారు.

 

   ఈ వికసిత భారతం సంకల్ప యాత్రలో చేసే ప్రమాణాలు జీవన మంత్రాలుగా మారాలని ప్రధాని ఉద్ఘాటించారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రజాప్రతినిధులైనా, పౌరులైనా ప్రతి ఒక్కరూ పూర్తి అంకితభావంతో ఏకం కావాలి. మనందరి సమష్టి కృషితోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది’’ అని శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   దేశవ్యాప్తంగాగల వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులు వేలాదిగా వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే 2,000కుపైగా ‘విబిఎస్‌వై’ రథాలు, వేలాది వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు (కెవికె), సార్వత్రిక సేవా కేంద్రాలు (సిఎస్‌సి) కూడా ఈ కార్యక్రమంతో అనుసంధానితమయ్యాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi