ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు-2023’ను ప్రారంభించారు. జాతీయ-అంతర్జాతీయ ప్రాముఖ్యంగల వివిధ చట్టపరమైన అంశాలపై అర్థవంతమైన సంప్రదింపులు-చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడటం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అలాగే ఆలోచనలు-అనుభవాల ఆదానప్రదానాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారంతోపాటు చట్టపరమైన సమస్యలపై అవగాహనను బలోపేతం చేయడం దీని ప్రధానోద్దేశాలు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ప్రపంచ న్యాయవిజ్ఞాన సమాజంలోని ఉద్దండులతో సంభాషించే అవకాశం లభించడంపై హర్షం ప్రకటించారు. ఈ మేరకు ఇప్పుడు ఇంగ్లండ్ లార్డ్ ఛాన్సలర్ మిస్టర్ అలెక్స్ చాక్, ఇంగ్లండ్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, కామన్వెల్త్-ఆఫ్రికా దేశాల ప్రతినిధులుసహా దేశవ్యాప్త ప్రజల సమక్షంలో ఈ సదస్సులో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు-2023 ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తికి ప్రతీకగా మారిందన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ ప్రముఖులకు స్వాగతం పలికారు. అలాగే దీని నిర్వహణకు చొరవ చూపిన బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏ దేశం అభివృద్ధిలోనైనా న్యాయవాదుల పాత్ర కీలకమని ప్రధాని నొక్కిచెప్పారు. ఎందుకంటే- “న్యాయవ్యవస్థ, న్యాయవాద సంస్థలు భారత న్యాయప్రదాన వ్యవస్థకు చిరకాల సంరక్షకులుగా ఉంటున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య పోరాటంలో న్యాయ నిపుణుల పాత్రను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేడ్కర్, బాబూ రాజేంద్ర ప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, లోకమాన్య తిలక్, వీర్ సావర్కర్ తదితరులను ఈ మేరకు ఆయన ఉదాహరించారు. “న్యాయవాద వృత్తి అనుభవం స్వతంత్ర భారత పునాది బలోపేతానికి కృషి చేయగా, నేటి నిష్పాక్షిక న్యాయవ్యవస్థ భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెంచడంలో తోడ్పడింది” అని ఆయన చెప్పారు.
దేశం అనేక చరిత్రాత్మక నిర్ణయాలకు సాక్షిగా నిలుస్తున్న సమయాన ఈ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు నిర్వహించడం విశేషమన్నారు. ఈ మేరకు లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన చట్టం’ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడాన్ని గుర్తుచేశారు. “భారతదేశంలో మహిళా చోదక ప్రగతికి నారీశక్తి వందన చట్టంతో కొత్త దిశ, శక్తి లభిస్తాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో ఇటీవల ముగిసిన జి-20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రజాస్వామ్యం, జనాభా, దౌత్యం గురించి ప్రపంచానికి ఒక సంగ్రహ అవగాహన కలిగిందని ఆయన పేర్కొన్నారు.
సరిగ్గా నెల కిందట ఇదే రోజున చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా పాదం మోపిన తొలి దేశంగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని ప్రధాని గుర్తుచేశారు. ఈ విజయాలన్నిటినీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగుతున్న నేటి భారతం 2047 నాటికి ‘వికసిత భారతం’ స్వప్న సాకారానికి కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. కాగా, వికసిత భారతం సంకల్ప సాధనలో దేశంలోని న్యాయవ్యవస్థకూ బలమైన, స్వతంత్ర, నిష్పాక్షిక పునాదులు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ న్యాయవాద సదస్సు-2023 తప్పక విజయవంతం కాగలదని, ప్రతి దేశం ప్రపంచంలోని ఇతర దేశాల ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకునే అవకాశం పొందగలదని ప్రధాని ఆశాభావం వెలిబుచ్చారు.
నేటి ప్రపంచం పరస్పరం లోతుగా అనుసంధానమై ఉండటాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. సరిహద్దులను, అధికార పరిధులను లెక్కచేయని విచ్ఛిన్న శక్తులు నేడు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయన్నారు. కాబట్టి, “ముప్పు ప్రపంచవ్యాప్తం అయినప్పుడు దాన్ని ఎదుర్కొనే పరిష్కారాలు కూడా ప్రపంచానికి అనుగుణంగా ఉండాలి” అన్నారు. సైబర్ ఉగ్రవాదం, అక్రమార్జన తరలింపు, కృత్రిమ మేధ (ఎఐ) దుర్వినియోగం వంటి ముప్పుల గురించి ఆయన ప్రపంచాన్ని అప్రమత్తం చేశారు. ఈ సవాళ్లపై ఒక అంతర్జాతీయ చట్రం రూపకల్పన కేవలం ప్రభుత్వ వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. ఆ మేరకు వివిధ దేశాల చట్టసంబంధ చట్రాల మధ్య అనుసంధానం ఆవశ్యతను గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఎడిఆర్) వ్యవస్థ గురించి మాట్లాడుతూ- వాణిజ్య లావాదేవీలలో పెరుగుతున్న సంక్లిష్టతను ప్రధాని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ‘ఎడిఆర్’వైపు మొగ్గు పెరుగుతున్నదనని తెలిపారు. దేశంలో ఈ అనధికార వివాద పరిష్కార సంప్రదాయాన్ని వ్యవస్థీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వ చట్టం తెచ్చిందని గుర్తుచేశారు. అలాగే లోక్ అదాలత్‌లు కూడా ఈ దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని, గడచిన ఆరేళ్లలో అవి 7 లక్షల కేసులను పరిష్కరించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
న్యాయ ప్రదానంలో భాష, చట్టాల సరళత ఎంతమాత్రం ప్రస్తావనకు రాని కీలకాంశాలని ఈ సందర్భంగా ప్రధాని ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ విధానాన్ని ఆయన వివరిస్తూ ఏ చట్టాన్నయినా రెండు భాషల్లో… అంటే- ఒకటి న్యాయవ్యవస్థకు అలవాటైనది… మరొకటి సామాన్యులకు అర్థమయ్యేదిగా అదించడంపై చర్చలు సాగుతున్నాయని ప్రధాని తెలిపారు. తద్వారా “చట్టం తమ కోసమేనని పౌరులంతా విశ్వసించాలి” అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడిస్తూ- సమాచార రక్షణ చట్టాన్ని ఇందుకు నిదర్శనంగా ఉదాహరించారు. ఈ దిశగా తీర్పులను 4 దేశీయ భాషలు- హిందీ, తమిళం, గుజరాతీ, ఒడియాల్లోకి అనువదించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాట్లు చేయడాన్ని ప్రధాని అభినందించారు. ఈ విధంగా భారత న్యాయవ్యవస్థలో వినూత్న మార్పు రావడాన్ని ఆయన కొనియాడారు.
చివరగా- సాంకేతికత, సంస్కరణలు, కొత్త న్యాయ ప్రక్రియల ద్వారా న్యాయప్రదాన విధానాలను క్రమబద్ధీకరించే మార్గాన్వేషణ చేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. సాంకేతిక పురోగతి న్యాయ వ్యవస్థకు కొత్త బాటలు వేసిందని, న్యాయవాద వృత్తి ద్వారా ఆయా సాంకేతిక సంస్కరణలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర న్యాయ-చట్టాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, భారత అటార్నీ జనరల్ శ్రీ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా, భారత బార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ మనన్ కుమార్ మిశ్రా, యూకే లార్డ్ చాన్సలర్ మిస్టర్ అలెక్స్ చాక్ తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
నేపథ్యం
“న్యాయప్రదాన వ్యవస్థలో తలెత్తుతున్న సవాళ్లు” ఇతివృత్తంగా ‘అంతర్జాతీయ న్యాయవాద సదస్సు-2023’ను భారత బార్ కౌన్సిల్ 2023 సెప్టెంబరు 23-24 తేదీల్లో నిర్వహిస్తోంది. ఇది వివిధ జాతీయ, అంతర్జాతీయ చట్టపరమైన అంశాలకు ప్రాముఖ్యం, అర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వేదికగా ఉపయోగపడుతుంది. అలాగే ఆలోచనలు, అనుభవాల ఆదానప్రదానం పెంపు, అంతర్జాతీయ సహకారం, చట్టపరమైన సమస్యలపై అవగాహన బలోపేతానికి తోడ్పడుతుంది. దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సులో వర్ధమాన న్యాయ పోకడలు, సరిహద్దు వ్యాజ్యాల్లో సవాళ్లు, న్యాయ సాంకేతికత, పర్యావరణ చట్టం తదితరాలపై ప్రధానంగా నిపుణులు చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో ఉద్దండులైన న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, అంతర్జాతీయ న్యాయ సమాజాల నాయకులు పాల్గొంటున్నారు.
भारत में वर्षों से Judiciary और Bar भारत की न्याय व्यवस्था के संरक्षक रहे हैं। pic.twitter.com/FfNi0nd221
— PMO India (@PMOIndia) September 23, 2023
Legal Professionals के अनुभव ने आजाद भारत की नींव को मजबूत करने का काम किया। pic.twitter.com/uKILNrw8vG
— PMO India (@PMOIndia) September 23, 2023
नारीशक्ति वंदन कानून भारत में Women Led Development को नई दिशा देगा, नई ऊर्जा देगा। pic.twitter.com/fQVBL1XMnI
— PMO India (@PMOIndia) September 23, 2023
जब खतरे ग्लोबल हैं, तो उनसे निपटने का तरीका भी ग्लोबल होना चाहिए। pic.twitter.com/iWQiEREtPN
— PMO India (@PMOIndia) September 23, 2023