ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ‘యశోభూమి’ ప్రాంగణంలో జి-20 సభాపతుల 9వ శిఖరాగ్ర సదస్సు (పి20)ను ప్రారంభించారు. “ఒకే భూమి-ఒకే కుటుంబం- ఒకే భవిష్యత్తు కోసం చట్టసభలు” ఇతివృత్తంగా భారత జి-20 అధ్యక్షత పరిధిలోని విస్తృత చట్రం కింద ఈ సదస్సును భారత పార్లమెంటు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా 140 కోట్ల మంది భారతీయుల తరఫున జి-20 చట్టసభాపతులను శిఖరాగ్ర సదస్సుకు స్వాగతించారు. “ప్రపంచవ్యాప్తంగాగల అన్ని పార్లమెంటరీ విధానాలకు ఈ శిఖరాగ్ర సదస్సు ‘మహా కుంభమేళా’ అని ఆయన అభివర్ణించారు. దీనికి హాజరైన ప్రతినిధులంతా వివిధ దేశాల పార్లమెంటరీ చట్రంపై అనుభవజ్ఞులని శ్రీ మోదీ కొనియాడుతూ, నేటి కార్యక్రమంపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
భారతదేశంలోని పండుగల సమయం ప్రారంభం కావడాన్ని ప్రస్తావిస్తూ… భారత జి-20 అధ్యక్షతలో భాగంగా అనేక నగరాల్లో నిర్వహించిన సంబంధిత కార్యక్రమాలతో నెలకొన్న పండుగ వాతావరణం ఏడాది పొడవునా కొనసాగుతున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చంద్రయాన్ విజయం, జి-20 శిఖరాగ్ర సదస్సు విజయం నేపథ్యంలో ఇప్పుడు ‘పి20’ శిఖరాగ్ర సదస్సు విజయంతో ఈ సంబరాల ఉత్సాహం ఆకాశాన్ని అంటుతుదన్నదని పేర్కొన్నారు. “ఏ దేశానికైనా అతిపెద్ద బలం దాని ప్రజలు-వారి సంకల్ప శక్తే. ఆ శక్తిసామర్థ్యాలపై మనమంతా హర్షించేందుకు ఈ శిఖరాగ్ర సదస్సు ఒక మాధ్యమం” అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన మన గడ్డపై ‘పి20’ సదస్సును నిర్వహిస్తుండటాన్ని ఆయన నొక్కిచెప్పారు. ప్రపంచంలోని భిన్న దేశాల చట్టసభల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో చర్చల, సంభాషణలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు చరిత్ర నుంచి ఇదేవిధమైన చర్చలకు సంబంధించిన పలు ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. ఐదువేల ఏళ్లనాటి భారత వేదాలు, ఇతిహాసాలలో సభలు, సంఘాల ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. సమాజ శ్రేయస్సుకు సంబంధించిన సమష్టి నిర్ణయాలు తీసుకున్నదని ఈ కార్యక్రమాల్లోనేనని ఆయన తెలిపారు. భారత అతి ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదాన్ని ప్రస్తావిస్తూ- “మనమంతా కలసి నడవాలి.. కలసి మాట్లాడుకోవాలి… మన హృదయాలు సదా పెనవేసుకుని ఉండాలి” అనే అర్థాన్నిచ్చే అందులోని సంస్కృత శ్లోకాన్ని ప్రధాని పఠించారు.
గ్రామస్థాయి సమస్యలు ఇలాంటి చర్చల ద్వారా పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఇది తనకెంతో అబ్బురం కలిగించిందంటూ గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన చరిత్ర రచనలో సవివరంగా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. అలాగే తమిళనాడులో 9వ శతాబ్దంనాటి గ్రామ సభల నియమాలు-నిబంధనలను వివరించే శాసనం గురించి కూడా ప్రస్తావించారు. ఈ మేరకు “గ్రామసభ సభ్యునిపై అనర్హత సంబంధ నియమావళి ప్రస్తావన కూడా 1200 ఏళ్లనాటి ఈ శాసనంలో ఉంది” అని వివరించారు. ఆంగ్లేయుల ప్రాథమిక హక్కుల పత్రం (మాగ్నా కార్టా) ఉనికిలోకి రావడానికి ఎన్నో ఏళ్లకు ముందు.. అంటే- 12వ శతాబ్దం నాటి నుంచే మన దేశంలో అనుభవ మండపం సంప్రదాయం కొనసాగుతున్నదని గుర్తుచేశారు. ప్రతి మతం, కులం, విశ్వాసానికి చెందిన ప్రజలు తమ భావాల వ్యక్తీకరణకు వీలుగా ఈ మంటపాల్లో స్వేచ్ఛగా చర్చించడాన్ని ప్రోత్సహించినట్లు తెలిపారు. “జగద్గురు బసవేశ్వరుడు ప్రారంభించిన ఈ అనుభవ మంటప సంప్రదాయం భారతదేశాన్ని నేటికీ గర్వించేలా చేస్తుంది” అని వ్యాఖ్యానించారు. అంటే- 5000 ఏళ్లనాటి ప్రాచీన గ్రంథాల రోజుల నుంచి నేటిదాకా భారత సాంస్కృతిక పయనం మన దేశానికేగాక యావత్ ప్రపంచానికీ పార్లమెంటరీ సంప్రదాయాల వారసత్వంగా నిలిచిందని ప్రధాని నొక్కిచెప్పారు.
భారత పార్లమెంటరీ సంప్రదాయాల సుస్థిర పరిణామంతోపాటు కాలానుగుణంగా బలోపేతం కావడాన్ని ప్రధానమంత్రి స్పృశించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి దేశంలో 17 సార్వత్రిక ఎన్నికలు, 300కుపైగా శాసనసభల ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ అత్యంత భారీ ఎన్నికల కసరత్తులో ప్రజల భాగస్వామ్యం క్రమేణా పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2019నాటి సార్వత్రిక ఎన్నికలలో 60 కోట్ల మంది ఓటర్లు పాలుపంచుకోవడం మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ఆనాటికి దేశంలో నమోదిత ఓటర్ల సంఖ్య 91 కోట్లు కాగా, మొత్తం ఐరోపా జనాభాకన్నా ఎంతో అధికమని పేర్కొన్నారు. అంతటి భారీ ఓటరు గణం నుంచి 70 శాతం తమ హక్కును వాడుకున్నారని, పార్లమెంటరీ ప్రక్రియపై ప్రజలకుగల ప్రగాఢ విశ్వాసానికి అతి నిదర్శనమని చెప్పారు. అలాగే 2019నాటి ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం కూడా అత్యధికంగా ఉందని తెలిపారు. విస్తరిస్తున్న రాజకీయ భాగస్వామ్య వేదికను ప్రస్తావిస్తూ- గత సార్వత్రిక ఎన్నికల్లో 600కుపైగా రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఇక ఎన్నికల నిర్వహణలో కోటి మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారని, ఓటు వేయడానికి 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రధాని వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియ ఆధునికీకరణ గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. గడచిన 25 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) వినియోగంతో ఎన్నికల ప్రక్రియలో సామర్థ్యం, పారదర్శకతలను తెచ్చిందని గుర్తుచేశారు. అలాగే ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనూ పూర్తి ఫలితాల వెల్లడి సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో 100 కోట్లమంది పాల్గొనబోతున్నారని, ఈ ఎన్నికల పరిశీలన కోసం రావాలని ‘పి20’కి హాజరైన ప్రతినిధులకు ప్రధాని ఆహ్వానం పలికారు. ఇక పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి ప్రతినిధులకు తెలిపారు. స్థానిక పాలన సంస్థలలో ఎన్నికైన 3 కోట్ల మందికిపైగా ప్రజాప్రతినిధులలో దాదాపు 50 శాతం మహిళలేనని ఆయన చెప్పారు. “భారతదేశం నేడు ప్రతి రంగంలో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. ఆ మేరకు మా పార్లమెంటు ఇటీవల తీసుకున్న నిర్ణయం పార్లమెంటరీ సంప్రదాయాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
భారత పార్లమెంటరీ సంప్రదాయాలపై పౌరులకుగల అచంచల విశ్వాసాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దాని వైవిధ్యం, చైతన్యాన్ని ప్రశంసించారు. “మా దేశంలో అన్ని విశ్వాసాలకూ చెందిన ప్రజలున్నారు. వందల రకాల ఆహార-జీవన విధానాలు, భాషలు/మాండలికాలు ఇక్కడ వర్ధిల్లుతున్నాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజలకు తక్షణ ప్రత్యక్ష సమాచార ప్రదానం కోసం దేశవ్యాప్తంగా 28 భాషలలో 900కుపైగా టీవీ ఛానెళ్లు, 33 వేలకుపైగా వేర్వేరు వార్తాపత్రికలు సుమారు 200 భాషలలో ప్రచురితం అవుతున్నాయని విశదీకరించారు. ఇవి కాకుండా అనేక సామాజిక మాధ్యమ వేదికలలోనూ సుమారు 300 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో సమాచార స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్య స్థాయి గురించి శ్రీ మోదీ నొక్కి చెప్పారు. “ఈ 21వ శతాబ్దపు ప్రపంచంలో భారతదేశంలోని చైతన్యం, భిన్నత్వంలో ఏకత్వం మాకు గొప్ప బలం. ప్రతి సవాలుతో పోరాడటానికి, ప్రతి కష్టాన్ని సమష్టిగా అధిగమించడానికి ఈ చైతన్యం మాకెంతో స్ఫూర్తినిస్తుంది” అని ఆయన వివరించారు.
పరస్పర అనుసంధానిత ప్రపంచ స్వభావాన్ని ప్రస్తావిస్తూ- వైరుధ్యాలు, సంఘర్షణలతో నిండిన ప్రపంచం ఎవరికీ ప్రయోజనకరం కాదని ప్రధానమంత్రి కుండబద్దలు కొట్టారు. ఆ మేరకు “విభజిత ప్రపంచం మానవాళి ప్రధాన సవాళ్లను ఎన్నడూ పరిష్కరించజాలదు. ఇది శాంతి-సౌభ్రాత్రాలతో సమష్టిగా సాగాల్సిన సమయం. అందరి ప్రగతి, శ్రేయస్సు కోరాల్సిన తరుణం. ప్రపంచంలోని విశ్వాస సంక్షోభాన్ని అధిగమిస్తూ మానవాళి-కేంద్రక దృక్పథంతో మనం ముందడుగు వేయాలి. మనం ప్రపంచాన్ని ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ అనే స్ఫూర్తితో చూడాలి” అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ నిర్ణయాత్మకతలో విస్తృత భాగస్వామ్యం ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆఫ్రికా సమాఖ్యకు జి-20లో శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు స్ఫూర్తి ఇదేనని, సభ్యదేశాలన్నీ దీన్ని ఆమోదించాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ‘పి20’ శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికా దేశాలన్నీ పాల్గొనడంపై ప్రధాని హర్షం ప్రకటించారు.
భారత కొత్త పార్లమెంటు సౌధాన్ని లోక్‌సభ స్పీకర్ ‘పి20’ ప్రతినిధులకు చూపడాన్ని ప్రస్తావిస్తూ- దశాబ్దాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాద బెడదను ప్రధాని గుర్తుచేశారు. వేలాదిగా అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రవాద ముష్కరులు 20 ఏళ్ల కిందట భారత పార్లమెంటు సమావేశమై ఉండగా ఎంపీలను నిర్బంధించి అంతం చేసేందుకు యత్నించినట్లు శ్రీ మోదీ గుర్తుచేశారు. “అటువంటి ఎన్నెన్నో ఉగ్రవాద ఉదంతాలను తిప్పికొడుతూ భారత్ నేడు ఈ స్థాయికి ఎదిగింది” అని చెప్పారు. ఉగ్రవాదం విసురుతున్న పెనుసవాలును ప్రపంచం కూడా నేడు గుర్తిస్తున్నదని ఆయన ఉద్ఘాటించారు. “ఉగ్రవాదం ఎక్కడ జడలు విప్పినా, అది ఏ రూపంలో ఉన్నప్పటికీ, అందుకు కారణం ఏదైనప్పటికీ అది మానవాళికి, మానవత్వానికే విరుద్ధం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనడంలో రాజీపడే ప్రసక్తే ఉండరాదని నొక్కిచెప్పారు. ఉగ్రవాదం నిర్వచనంపై ప్రపంచం ఏకాభిప్రాయం సాధించలేకపో్వడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై అంతర్జాతీయ సమాజం నేటికీ ఐక్యరాజ్య సమితిలో ఏకాభిప్రాయం కోసం ఎలా ఎదురుచూస్తున్నదో ఆయన గుర్తుచేశారు. ప్రపంచ దేశాల ఈ ఉదాసీనతను దుష్టశక్తులు సద్వినియోగం చేసుకుంటున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో సమష్టి కృషికి మార్గాన్వేషణ చేయాలని ప్రపంచవ్యాప్త చట్టసభలు, ప్రతినిధులను ఆయన కోరారు.
చివరగా- ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యాన్ని మించిన ఉత్తమ మాధ్యమం మరొకటి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “ప్రభుత్వాలు జనాభిప్రాయ ఆధిక్యం సాధించడంద్వారా ఏర్పడతాయని నేను సదా విశ్వసిస్తాను. కానీ, దేశం మాత్రం ఏకాభిప్రాయంతోనే నడుస్తుంది. మన చట్టసభలు, ఈ ‘పి20’ వేదిక కూడా ఈ భావనను బలపరచగలవు” అన్నారు. చర్చలు-సంభాషణల ద్వారా ఈ ప్రపంచం మెరుగుకు చేసే ప్రయత్నాలు తప్పక విజయవంతం కాగలవని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు మిస్టర్ డువార్టే పచేకో తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
భారత జి-20 అధ్యక్షత ఇతివృత్తానికి అనుగుణంగా- “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు కోసం చట్టసభలు” ఇతివృత్తంగా ‘పి20’ 9వ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. జి-20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాల చట్టసభల సభాపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాగా, న్యూఢిల్లీలో 2023 సెప్టెంబరు 9-10 తేదీల్లో జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆఫ్రికా సమాఖ్యకు కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించింది. ఆ తర్వాత తొలిసారిగా ‘పి20’ శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికా దేశాల చట్టసభల అధిపతులందరూ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఇతివృత్త ఆధారిత గోష్ఠులలో నాలుగు అంశాలు- “డిజిటల్ ప్రజా వేదికల ద్వారా జనజీవనంలో మార్పు; మహిళల నేతృత్వంలో అభివృద్ధి; ‘ఎస్‌డిజి’లను వేగిరపరచడం; సుస్థిర ఇంధన పరివర్తన” తదితరాలపై చర్చలు సాగుతాయి. కాగా, ప్రకృతితో సహజీవనం ద్వారా హరిత-సుస్థిర భవిష్యత్తుకు ఉద్దేశించిన కార్యక్రమాలపై చర్చించడం కోసం 2023 అక్టోబర్ 12 ‘లైఫ్’ (పర్యావరణ హిత జీవనశైలి)పై శిఖరాగ్ర సదస్సుకు ముందు పార్లమెంటరీ వేదిక సమావేశమైంది.
P20 समिट, उस भारत-भूमि पर हो रही है, जो mother of democracy है, जो दुनिया की सबसे बड़ी democracy है: PM @narendramodi pic.twitter.com/ckiHMQjQgn
— PMO India (@PMOIndia) October 13, 2023
Magna Carta से भी पहले, 12वीं शताब्दी में हमारे यहाँ “अनुभव मंटपा” की परंपरा रही है: PM @narendramodi pic.twitter.com/Dk86b1nlpE
— PMO India (@PMOIndia) October 13, 2023
भारत, दुनिया का सबसे बड़ा election ही नहीं कराता, बल्कि इसमें लोगों का participation भी लगातार बढ़ रहा है। pic.twitter.com/532IE5ciNQ
— PMO India (@PMOIndia) October 13, 2023
समय के साथ भारत ने election process को आधुनिक technology से भी जोड़ा है। pic.twitter.com/oHE4MlfT9K
— PMO India (@PMOIndia) October 13, 2023
भारत, आज हर sector में women participation को बढ़ावा दे रहा है।
— PMO India (@PMOIndia) October 13, 2023
हमारी संसद द्वारा लिया गया हाल का फैसला, हमारी संसदीय परंपरा को और समृद्ध करेगा: PM @narendramodi pic.twitter.com/WVuEGNLrmq
यह शांति और भाईचारे का समय है, साथ मिलकर चलने का समय है, साथ आगे बढ़ने का समय है।
— PMO India (@PMOIndia) October 13, 2023
यह सबके विकास और कल्याण का समय है: PM @narendramodi pic.twitter.com/62gyOE9cik
Terrorism चाहे कहीं भी होता हो, किसी भी कारण से, किसी भी रूप में होता है, लेकिन वो मानवता के विरुद्ध होता है। pic.twitter.com/9EsqRmA6hS
— PMO India (@PMOIndia) October 13, 2023