అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయశాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సమావేశ థీమ్ సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల దిశగా పరివర్తన. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాటడమే ఈ సమావేశ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
65 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ సమావేశాన్ని నిర్వహించడంపట్ల ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 123 మిలియన్ల మంది రైతులు, 30 మిలియన్లకుపైగా మహిళా రైతులు, 30 మిలియన్ మత్స్యకార రైతులు, 80 మిలియన్ పాడి రైతుల తరఫున సమావేశ ప్రతినిధులకు ప్రధాని ఆహ్వానం పలికారు. 500 మిలియన్లకు పైగా పశుసంపదను కలిగిన దేశానికి మీరు వచ్చారు.వ్యవసాయాన్ని, పశుసంపదను ప్రేమించే భారతదేశంలోకి మీకు ఆహ్వానం పలుకుతున్నాను అంటూ ప్రధాని ఘనంగా స్వాగతం పలికారు.
వ్యవసాయరంగం, ఆహారం గురించి ప్రాచుర్యంలో వున్న ప్రాచీన భారతీయ నమ్మకాలు , అనుభవాల దీర్ఘకాలతను ప్రధాన మంత్రి తన ప్రసంగంలో గట్టిగా నొక్కి చెప్పారు. భారతీయ వ్యవసాయ సంప్రదాయంలో శాస్త్రం, తార్కిక జ్ఞానానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆహార ఔషధ గుణాల వెనుక వున్న మొత్తం శాస్త్ర విజ్ఞాన అస్థిత్వాన్ని ఆయన ప్రస్తావించారు.
సుసంపన్నమైన వారసత్వం ఆధారంగా రచించిన, దాదాపు 2000 సంవత్సరాల నాటి వ్యవసాయ గ్రంధం ‘కృషి పరాశర్’ గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ వేల సంవత్సరాల నాటి దృక్పథం ఆధారంగా వ్యవసాయం వృద్ధి చెందిందని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. భారతదేశంలో వ్యవసాయ పరిశోధన, విద్యారంగాల్లో బలమైన వ్యవస్థ వుందని ప్రధాని అన్నారు. ఐసిఏఆర్ స్వయంగా 100 కంటే ఎక్కువ పరిశోధనా సంస్థలను కలిగి ఉంది" అని ఆయన చెప్పారు. వ్యవసాయ విద్య కోసం 500లకు పైగా కళాశాలలు, 700కి పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు దేశంలో ఉన్నాయని ఆయన వివరించారు.
భారతదేశ వ్యవసాయ ప్రణాళికలోని మొత్తం ఆరు రుతువుల ఔచిత్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, దేశంలోగల 15 వ్యవసాయ-వాతావరణ మండలాల ప్రత్యేక లక్షణాలను ప్రధాన మంత్రి తన ప్రసంగంలో వివరించారు. దేశంలో వంద కిలోమీటర్లు ప్రయాణిస్తే వ్యవసాయ ఉత్పత్తులు మారిపోతాయని ప్రధాని పేర్కొన్నారు. “భూమి, హిమాలయాలు, ఎడారి, నీటి కొరత ఉన్న ప్రాంతాలు లేదా తీర ప్రాంతాలలో ఎక్కడ వ్యవసాయం చేసినా సరే, ప్రపంచ ఆహార భద్రతకు ఈ వైవిధ్యం చాలా కీలకమని ఇది భారతదేశాన్ని ప్రపంచానికి ఆశాకిరణంగా మార్చిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
65 సంవత్సరాల క్రితం భారతదేశంలో జరిగిన వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సును తన ప్రస్తంగంలో ప్రస్తావించిన ప్రధాన మంత్రి, నాడు భారతదేశం కొత్తగా స్వతంత్ర దేశంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు భారతదేశ ఆహార భద్రత, వ్యవసాయరంగాలను భారతదేశం సవాలుగా తీసుకుందని అన్నారు. నేడు భారతదేశం ఆహార మిగులు దేశమని, పాలు, పప్పులు. సుగంధ ద్రవ్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని,ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ, చేపల పెంపకంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం అని ప్రధాన మంత్రి అన్నారు. నాడు భారతదేశ ఆహార భద్రత ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయంగా వుండేదని, నేడు ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు భారతదేశం పరిష్కారాలను అందిస్తోందని ఆయన తన ప్రసంగంలో గుర్తు చేశారు. అందువల్ల, ఆహార వ్యవస్థ పరివర్తనపై చర్చల్లో భారతదేశ అనుభవం అమూల్యమైనదిగా పరిగణించాలని, ఇది ప్రపంచ దక్షిణాదికి ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
విశ్వ బంధువుగా పేరొందిన భారతదేశం ప్రపంచ సంక్షేమానికి నిబద్ధతతో కృషి చేస్తోందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశ దృక్పథాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు', 'మిషన్ లైఫ్, ఒకే భూమి ఒకే ఆరోగ్యం' సహా వివిధ వేదికలపై భారతదేశం ప్రకటించిన వివిధ మంత్రాలను (విధానాలను) ప్రసంగంలో ప్రధాని ప్రస్తావించారు. స్థిరమైన వ్యవసాయం, ఆహార వ్యవస్థల ముందున్న సవాళ్లను 'ఒకే భూమి, ఒకే కుటుంబం ఒక భవిష్యత్తు' అనే సమగ్ర విధానంలో మాత్రమే పరిష్కరించగలమని ఆయన అన్నారు.
భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయం కేంద్రబిందువుగా ఉంది అని భారతదేశంలోని 90 శాతం మంది రైతులు తక్కువ భూమిని కలిగి ఉన్నారని, వారు భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. ఆసియాలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇదే పరిస్థితి ప్రబలంగా ఉందని భారతదేశ నమూనాను ఆయా దేశాలలో వర్తింపజేయవచ్చని ఆయన సూచించారు. దేశంలో జరుగుతున్న సహజ వ్యవసాయాన్ని ఉదాహరణగా చూపుతూ, రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం వల్ల దేశంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సుస్థిరమైన, వాతావరణాన్ని తట్టుకోగలిగే వ్యవసాయంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టామని అన్నారు. భారతదేశ రైతులకు మద్దతుగా పూర్తి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల పంటలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఎత్తిచూపుతూ, గత 10 సంవత్సరాలలో కొత్త ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల 19 వందల రకాలపంటలను (విత్తనాలను) రైతులకు అందజేసినట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు. సాంప్రదాయ రకాలతో పోలిస్తే 25 శాతం తక్కువ నీరు అవసరమయ్యే భారతదేశ వరి రకాలగురించి వివరించారు. బ్లాక్ రైస్ ( నల్ల బియ్యం) సూపర్ ఫుడ్‌గా ఆవిర్భవించిందని ఆయన ఉదాహరణలు ఇచ్చారు. "మణిపూర్, అస్సాం, మేఘాలయలలో నల్ల బియ్యం ఔషధ విలువల కారణంగా అక్కడ ఎక్కువగా వాడుతున్నారని ప్రధాని అన్నారు. భారతదేశం ఇలాంటి అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఆసక్తిని చూపుతోందని ప్రధాని వివరించారు.
నీటి కొరత, వాతావరణ మార్పులతో పాటు పోషకాహార సవాళ్ల తీవ్రతను ప్రధాన మంత్రి తన ప్రసంగంలో వివరించారు. 'కనీస నీరు, గరిష్ట ఉత్పత్తిస విధానం కింద పండే పంటల గురించి తెలిపారు. సూపర్‌ఫుడ్ నాణ్యతను కలిగిన శ్రీ అన్న, చిరుధాన్యాలను ఒక పరిష్కారంగా ఆయన పేర్కొన్నారు.. భారతదేశ చిరుధాన్యాలను ప్రపంచంతో పంచుకోవడానికి భారతదేశం సుముఖంగా వుందని , గత సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకున్నామని గుర్తు చేశారు.
వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసే కార్యక్రమాలను గురించి ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. భూసార పరీక్షల వివరాలను తెలిపే కార్డ్, సౌర విద్యుత్ సాయంతో వ్యవసాయం చేసే రైతులను ఇంధన ప్రదాతలుగా మార్చడం , డిజిటల్ వ్యవసాయ మార్కెట్ అంటే ఈ-నామ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ఫసల్ బీమా యోజన వంటి వాటి గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగంలో మాట్లాడారు. సాంప్రదాయ రైతుల నుండి వ్యవసాయ అంకుర సంస్థల వరకు( అగ్రి స్టార్టప్స్) , సహజ వ్యవసాయం నుండి ఫార్మ్‌స్టే వరకు, పొలాన్నుంచి టేబుల్ మీదవరకూ ఆహారాన్ని తీసుకుపోయేదాకా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారికీకరణను (ఫార్మలైజేషన్) ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. గత పదేళ్లలో తొంభై లక్షల హెక్టార్లను సూక్ష్మ నీటి పారుదల కిందకు తీసుకొచ్చామని తెలిపారు. ఇంధనానికి 20 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యంతో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్నందున, వ్యవసాయం, పర్యావరణం రెండూ ప్రయోజనం పొందుతున్నాయని ఆయన అన్నారు.
ప్రసంగాన్ని ముగిస్తూ సమావేశానికి వచ్చినవారిలో యువ ప్రతినిధులు ఎక్కువ వున్న విషయాన్ని ప్రస్తావించారు. రాబోయే ఐదు రోజులపాటు జరిగే చర్చలు ప్రపంచాన్ని సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థలతో కలిపే విధానాలను తెలియజేస్తాయని భావిస్తున్నట్టు ప్రధాని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మనం ఒకరినుంచి మరొకరం నేర్చుకుంటామని, అంతే కాదు ఒకరికి మరొకరం బోధించడం జరుగుతుందని చెబుతూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ రమేష్ చంద్, సమావేశ అధ్యక్షులు ప్రొఫెసర్ మతిన్ ఖయామ్, డిఏఆర్ ఇ కార్యదర్శి , ఐసిఏఆర్ డీజీ డాక్టర్ హిమాంశు పాఠక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
మూడేళ్ల కొకసారి జరిగే అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్తల సంఘం సమావేశాన్ని ఈ సారి ఆగస్టు 2నుంచి 7వరకూ భారతదేశంలో నిర్వహిస్తున్నారు. 65 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది.
ఈ సంవత్సరం సదస్సు థీమ్, "సుస్థిర వ్యవసాయం-ఆహార వ్యవస్థల వైపు పరివర్తన." వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అవసరాన్ని అత్యవసరంగా గుర్తించి దాన్ని తీర్చడమే ఈ సమావేశం లక్ష్యం. ఈ సదస్సు ప్రపంచ వ్యవసాయ సవాళ్లకు సంబంధించి భారతదేశం అనుసరించే చురుకైన విధానాన్ని ( ప్రోయాక్టివ్) ఎత్తి చూపుతుంది. దేశ వ్యవసాయ పరిశోధనలు, విధాన పురోగతిని అందరికీ తెలియజేస్తుంది.
ఐసిఏఇ 2024 వేదికనేది యువ పరిశోధకులు, ప్రముఖ నిపుణులు తమ కృషిని, నెట్‌వర్క్‌ను ప్రపంచ సహచరులతో పంచుకోవడానికి దోహదం చేస్తుంది. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విధాన రూపకల్పనను ప్రభావితం చేయడం ఈ సదస్సు ద్వారా జరుగుతుంది. ఈ సమావేశం భారతదేశ వ్యవసాయ పురోగతిని ...డిజిటల్ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థల్లో పురోగతిని తెలియజేస్తుంది. ఈ సదస్సులో దాదాపు 75 దేశాల నుంచి దాదాపు 1,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
भारत जितना प्राचीन है, उतनी ही प्राचीन agriculture और food को लेकर हमारी मान्यताएं हैं, हमारे अनुभव हैं: PM @narendramodi pic.twitter.com/dWg6f40qH2
— PMO India (@PMOIndia) August 3, 2024
हमारे अन्न को औषधीय प्रभावों के साथ इस्तेमाल करने का पूरा आयुर्वेद विज्ञान है: PM @narendramodi pic.twitter.com/8HIlUZ4HLc
— PMO India (@PMOIndia) August 3, 2024
आज का समय है, जब भारत Global Food Security, Global Nutrition Security के Solutions देने में जुटा है: PM @narendramodi pic.twitter.com/f4gptn7aQM
— PMO India (@PMOIndia) August 3, 2024
भारत, Millets का दुनिया का सबसे बड़ा Producer है: PM @narendramodi pic.twitter.com/uEOjCSNYJy
— PMO India (@PMOIndia) August 3, 2024