గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, కెవాడియాలో నిర్మించిన సర్దార్ పటేల్ జూలాజికల్ పార్కును, 'జియోడెసిక్ ఏవియరీ డోమ్'ను ప్రారంభించారు. కెవాడియా సమగ్ర అభివృద్ధి కింద చేపట్టిన 17 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 4 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టులు.. నావిగేషన్ చానెల్, కొత్త గోరా వంతెన, గరుడేశ్వర్ ఆనకట్ట, ప్రభుత్వ క్వార్టర్లు, బస్ బే టెర్మినల్, ఏక్తా నర్సరీ, ఖల్వానీ పర్యావరణ పర్యాటకం, గిరిజన గృహాల్లో బస. ఐక్యత విగ్రహం వరకు లాంచీ ప్రయాణాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.
The Fly High Indian Aviary would be a treat for those interested in birdwatching. Come to Kevadia and visit this aviary, which is a part of the Jungle Safari Complex. It will be a great learning experience. pic.twitter.com/RiZjDTcfOx
— PMO India (@PMOIndia) October 30, 2020
జంగిల్ సఫారీ &జియోడెసిక్ ఏవియరీ డోమ్
"పక్షుల పరిశీలన పట్ల ఆసక్తి ఉన్నవారికి 'ఫ్లై హై ఇండియన్ ఏవియరీ' ఒక గొప్ప అవకాశం. కెవాడియా వచ్చి, జంగిల్ సఫారీ కాంప్లెక్స్‌లో భాగంగా ఉన్న పక్షి కేంద్రాన్ని సందర్శించండి. అది గొప్ప అనుభవం అవుతుంది" అని ప్రధాని చెప్పారు.
375 ఎకరాల్లో విస్తరించిన జూలాజికల్ పార్కులో, 29-180 మీటర్ల పరిధితో, ఏడు విభిన్న స్థాయుల్లో జంగిల్ సఫారీని ఏర్పాటు చేశారు. దీనిలో 1100కు పైగా పక్షులు, జంతువులు, 5 లక్షలకు పైగా మొక్కలున్నాయి. అత్యంత వేగంగా దీనిని నిర్మించారు. జూలాజికల్ పార్కులో స్వదేశీ, విదేశీ పక్షులకు విడివిడిగా రెండు కేంద్రాలున్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డోమ్ ఉన్న పక్షి కేంద్రం. మకావ్, కాకాటూ, కుందేళ్లు, గినియా పందులు వంటివాటిని పట్టుకుని ప్రత్యేక అనుభూతిని పొందే ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఇక్కడ చేశారు.
ఏక్తా క్రూయిజ్ సర్వీస్
'ఏక్తా క్రూయిజ్ సర్వీస్' ద్వారా, లాంచీ ప్రయాణం చేస్తూ ఐక్యత విగ్రహాన్ని సందర్శించవచ్చు. శ్రేష్ఠ భారత్ భవన్ నుంచి ఐక్యత విగ్రహం వరకు 6 కి.మీ. మేర ఈ ప్రయాణం సాగుతుంది. 40 నిమిషాల ప్రయాణంలో, ఒకేసారి లాంచీలో 200 మంది ప్రయాణించవచ్చు. లాంచీల రాకపోకల కోసమే కొత్త గోరా వంతెనను నిర్మించారు. ఐక్యత విగ్రహ సందర్శకులను మరింత ఉల్లాసపరిచేలా, బోటు విహారం కోసం 'బోటింగ్ ఛానెల్' నిర్మించారు.