ఐఆర్ఎస్ (కస్టమ్స్-పరోక్ష పన్నులు) 74.. 75 బృందాలతోపాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో మాటామంతీ;
‘‘దేశానికి ఆధునిక పర్యావరణ వ్యవస్థ అందించడంలో ‘నాసిన్’ పాత్ర కీలకం’’;
‘‘శ్రీరాముడు సుపరిపాలనకు ప్రతీక.. ‘నాసిన్’కూ గొప్ప స్ఫూర్తిప్రదాత కాగలడు’’;
‘‘మేం దేశానికి జిఎస్‌టి రూపంలో ఆధునిక వ్యవస్థను అందించాం.. ఆదాయపు పన్నును సరళీకృతం చేశాం.. హాజరీ రహిత అంచనా ప్రక్రియ ప్రవేశపెట్టాం.. ఈ సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లకు దోహదం చేశాయి’’;
‘‘మేం ప్రజల నుంచి ఏది తీసుకున్నా.. తిరిగి వారికే ఇచ్చాం; సుపరిపాలన.. రామరాజ్య సందేశం ఇదే’’;
‘‘అవినీతిపై పోరాటం.. లంచగొండులపై చర్యలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం’’;
‘‘దేశంలోని పేదలకు వనరులు సమకూరిస్తే పేదరికాన్ని వారే నిర్మూలించగలరు’’;
‘‘ప్రస్తుత ప్రభుత్వ కృషితో గత 9 ఏళ్లలో దాదాపు 25 కోట్లమంది పేదరిక విముక్తులయ్యారు’’

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామంలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్-నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్-నాసిన్) కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. అలాగే ‘ఇండియన్ రెవెన్యూ సర్వీస్’ (కస్టమ్-పరోక్ష పన్నులు) 74, 75వ బృందాల ఆఫీసర్ ట్రైనీలతోపాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతోనూ ప్రధాని కొద్దిసేపు మాటామంతీలో పాల్గొన్నారు.

   అనంతరం స‌భ‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ- పాల‌స‌ముద్రంలో క‌స్టమ్స్-ప‌రోక్ష ప‌న్నులు-నార్కోటిక్స్ జాతీయ అకాడ‌మీని ప్రారంభించడంపై ప్రధానమంత్రి ప్ర‌తి ఒక్క‌రికీ అభినందనలు తెలిపారు. ఈ ప్రాంత ప్రత్యేకతను ప్రముఖంగా  ప్రస్తావిస్తూ- ఇది ఆధ్యాత్మికత, దేశ నిర్మాణం, సుపరిపాలనతో ముడిపడి ఉండటమేగాక భారత వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా జన్మస్థలం, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు, ప్రఖ్యాత తోలుబొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు, అద్భుత విజయనగర సామ్రాజ్య సుపరిపాలన వగైరాలు ఇక్కడి స్ఫూర్తిదాయక మూలాలని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ‘నాసిన్’ కొత్త ప్రాంగణం సుపరిపాలనలో కొత్త కోణాలను జోడించగలదన్నారు. అలాగే దేశంలో వాణిజ్యం, పరిశ్రమలను ప్రోత్సాహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

   ఈ సందర్భంగా ఇవాళ మహనీయుడైన తమిళ సాధువు తిరువళ్లువర్ దినోత్సవం నేపథ్యంలో ఆయన వాక్యాలను ఉటంకిస్తూ- ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమానికి దోహదం చేసే పన్ను వసూళ్లలో రెవెన్యూ అధికారులకు కీలక పాత్ర ఉంటుందని నొక్కిచెప్పారు.

   అంతకుముందు లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్లిన ప్రధానమంత్రి, అక్కడ రంగనాథ రామాయణ కావ్యాన్ని ఆలకించడంతోపాటు భక్తులతోపాటు సంకీర్తనలు ఆలపించారు. ఇక్కడికి సమీపంలోని ప్రదేశంలోనే శ్రీరామ-జటాయు సంవాదం జరిగిందన్న నమ్మకాన్ని ప్రస్తావిస్తూ- అయోధ్య క్షేత్రంలోని రామాలయంలో ప్రాణప్రతిష్టేను పురస్కరించుకుని తాను 11 రోజుల ఉపవాస వ్రతం ఆచరిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇటువంటి పవిత్ర కాలంలో ఈ ఆలయాన్ని సందర్శించడం తన సుకృతమని వ్యాఖ్యానించారు. దేశమంతటా వ్యాపించిన రామభక్తి వాతావరణాన్ని ప్రస్తావిస్తూ- శ్రీరాముని స్ఫూర్తి భక్తిభావనకు మించినదని ప్రధాని వ్యాఖ్యానించారు. సుపరిపాలనకు గొప్ప ప్రతీక అయిన శ్రీరాముడు ‘నాసిన్’కు ఎనలేని ప్రేరణ ఇవ్వగలదన్నారు.

   మహాత్మా గాంధీ వ్యాఖ్యాలను ఉటంకిస్తూ- రామరాజ్యం భావన నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని ప్రధాని అన్నారు. రామరాజ్య సిద్ధాంతానికి గాంధీజీ మద్దతు వెనుక ఆయన జీవితానుభవం ఉందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి గళం వినిపించే.. ప్రతి ఒక్కరికి తగిన గౌరవం లభించేదే రామరాజ్యం కాగలదని వివరించారు. ‘‘రామరాజ్యంలోని పౌరుల గురించి ఇలా చెప్పబడింది’’ అంటూ- ‘‘రామరాజ్య వాసీ.. న్యాయం కోసం తలెత్తుకు పోరాడు.. అందరినీ సమానంగా చూడు.. బలహీనులను రక్షించు.. ధర్మాన్ని అత్యున్నతంగా నిలుపు... మీరంతా రామరాజ్య వాసులమని గ్రహించండి’’  అనే అర్థంగల సంస్కృత శ్లోకాన్ని ప్రధాని ఉటంకించారు. రామరాజ్యానికి ఈ నాలుగూ పునాదులని, ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరూ తలెత్తుకుని సగర్వంగా నడవవచ్చని, ప్రతి పౌరుడినీ సమానంగా చూస్తారని, అణగారిన వారికి రక్షణ లభిస్తుందని, ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ ప్రస్తుత 21వ శతాబ్దంలో ఈ ఆధునిక సంస్థల నియమ నిబంధనలను అమలు చేసేవారుగా మీరంతా ఈ నాలుగు లక్ష్యాలనూ నిత్యం స్మరిస్తూ వాటిపై దృష్టి సారించాలి’’ అని శిక్షణలోగల అధికారులకు ప్రధానమంత్రి సూచించారు.

   రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ గురించి స్వామి తులసీదాస్ వివరణను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు ‘రామ్‌చరిత్ మానస్‌’ను ఉటంకిస్తూ- పన్నుల వెనుకగల సంక్షేమ అంశాన్ని ప్రముఖంగా వివరించారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి పైసా దేశ శ్రేయస్సుకు ఊతమిస్తూ ప్రజల సంక్షేమం కోసం వెచ్చించబడుతుందని చెప్పారు. ఈ అంశాన్ని మరింత విశదీకరిస్తూ- గత 10 ఏళ్లలో ప్రవేశపెట్టిన పన్ను సంస్కరణల గురించి ప్రధాని మోదీ వివరించారు. అంతకుముందు కాలంలోని బహుళ-అపారదర్శక పన్ను వ్యవస్థలను ఆయన గుర్తుచేశారు. అటువంటి పరిస్థితి నుంచి ‘‘మేం దేశానికి జిఎస్‌టి రూపంలో ఆధునిక వ్యవస్థను అందించాం.. ఆదాయపు పన్నును సరళీకృతం చేశాం.. హాజరీ రహిత అంచనా వ్యవస్థను ప్రవేశపెట్టాం.. ఈ సంస్క‌ర‌ణ‌ల‌న్నీ రికార్డు స్థాయి ప‌న్ను వ‌సూళ్ల‌ను సాధించాయి’’ అని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఇలా వచ్చిన ప్రజల సొమ్మును వివిధ పథకాల ద్వారా వారికే తిరిగి ఇస్తున్నామని ఆయన తెలిపారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి 7 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. దేశంలో 2014 తర్వాత తెచ్చిన పన్ను సంస్కరణల వల్ల పౌరులకు దాదాపు రూ.2.5 లక్షల కోట్లమేర పన్ను ఆదా అయిందన్నారు. మరోవైపు దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, తాము చెల్లించిన పన్నులు సద్వినియోగం కావడంపై వారంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ‘‘మేం  ప్రజల నుండి ఏది తీసుకున్నా, దాన్ని తిరిగి ప్రజలకే ఇస్తున్నాం.. సుపరిపాలన, రామరాజ్య సందేశం ఇదే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

   రామరాజ్యంలో వనరుల సద్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. మునుపటి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిలిపివేత, పక్కదోవ పట్టించడం, దారి మళ్లించడం వంటి దేశానికి భారీ నష్టం వాటిల్లే ధోరణి కనిపించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో శ్రీరామ భగవానుడు భరతునితో సంభాషించడంలోని సారూప్యాన్ని ప్రస్తావిస్తూ- ‘‘మీరు పూర్తి చేస్తారనే  నమ్మకం నాకుంది. సమయం వృథా కాకుండా.. తక్కువ ఖర్చుతో చేసే పనులు అధిక ఫలితమిస్తాయి. కాబట్టే గత 10 ఏళ్లలో ప్రస్తుత ప్రభుత్వం ఖర్చును దృష్టిలో ఉంచుకుంటూ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి సారించింది’’ అని వివరించారు. ఈ సందర్భంగా గోస్వామి తులసీదాస్‌ను మరోసారి ఉటంకిస్తూ- పేదలకు మద్దతునిచ్చే, అనర్హులను ఏరివేసే కలుపుతీత వ్యవస్థను సృష్టించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. గత పదేళ్లలో 10 కోట్ల నకిలీ పేర్లను పత్రాల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. ‘‘ఇవాళ ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖతాకు చేరుతోంది. అవినీతిపై పోరాటం, లంచగొండులపై చర్యలు ప్రభుత్వ ప్రాధాన్యం’’ అని ఆయన అన్నారు.

   దేశంలో గత 9 సంవత్సరాలుగా సాగుతున్న ప్రస్తుత ప్రభుత్వ కృషితో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తులైనట్లు నీతి ఆయోగ్ నిన్న తాజా నివేదిక విడుదల చేసిందని ప్రధాని గుర్తుచేశారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఫలితం సిద్ధిస్తుందని దేశంలో సాగుతున్న అభివృద్ధి పనులు రుజువు చేస్తున్నాయని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. పేదరిక నిర్మూలన కోసం దశాబ్దాలుగా నినాదాలు వినిపిస్తున్న దేశంలో ఇది కచ్చితంగా చారిత్రక, అపూర్వమైన విజయమని ప్రధాని పేర్కొన్నారు. ఇదంతా దేశంలో తాము 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమానికి ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యం ఫలితమేనన్నారు. పేద‌రిక నిర్మూలన సత్తా తమకుందని ఈ దేశంలోని పేద‌లు విశ్వసిస్తుండటాన్ని ప్ర‌ధానమంత్రి ప్రస్తావించారు. ‘‘ఇవాళ ఇది వాస్తవం కావడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అన్నారు. వైద్యం, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం నిధులు ఖర్చు చేయడం ద్వారా పేదలకు సౌకర్యాలు పెంచిందని ప్రధాని చెప్పారు. ‘‘పేదవారి సామర్థ్యాన్ని బలోపేతం చేసి సౌకర్యాలు కల్పించాం కాబట్టి, వారు పేదరికం నుంచి బయటపడటం ప్రారంభించారు’’ అన్నారు. అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన నేపథ్యంలో ఇది మరొక శుభవార్త అని ఆయన అభివర్ణించారు. ‘‘భారతదేశంలో పేదరికాన్ని తగ్గించవచ్చు. ఇది ప్రతి ఒక్కరిలో కొత్త విశ్వాసం నింపుతుంది.. ఇది దేశ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది’’ అని వ్యాఖ్యానించారు. పేదరికం తగ్గుదల నయా-మధ్యతరగతి పెరుగుదల కారణమని, మధ్యతరగతి విస్తరణకు దోహదం చేసిన ఘనత ఈ కొత్త మధ్యతరగతిదేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆర్థిక ప్రపంచంలోని ప్రజలు నయా-మధ్యతరగతి వృద్ధి సామర్థ్యాన్ని, ఆర్థిక కార్యకలాపాల్లో వారి పాత్రను గ్రహించారని ఆయన అన్నారు. ‘‘ఇటువంటి నేపథ్యంలో ‘నాసిన్’ తన బాధ్యతను మరింత పకడ్బందీగా నిర్వర్తించాల్సి ఉంటుంది’’ అన్నారు.

 

   ఎర్రకోట పైనుంచి తాను సమష్టి కృషి (సబ్‌కా ప్రయాస్) పిలుపునివ్వడాన్ని రాముడి జీవితంతో పోల్చి ప్రధాని మోదీ వివరించారు. రావణుడిపై పోరాటంలో శ్రీరాముడు వనరులను తెలివిగా ఉపయోగించుకుని, వాటిని భారీశక్తిగా మార్చాడని ఆయన గుర్తుచేశారు. అదే తరహాలో దేశ నిర్మాణంలో తమ పాత్రను గుర్తించడంతోపాటు దేశ ఆదాయాన్ని, పెట్టుబడులను పెంచడానికి సమష్టిగా కృషి చేయాల్సిందిగా అధికారులను కోరుతూ ఆయన తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర పరోక్ష పన్నులు-కస్టమ్స్ బోర్డు చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

   సివిల్ సర్వీస్ సామర్థ్య వికాసం ద్వారా దేశంలో పాలనను మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి దార్శనికత సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (నాసిన్) కొత్త అత్యాధునిక ప్రాంగణాన్ని 500 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇది పరోక్ష పన్నులు (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, వస్తుసేవల పన్నులు), మాదక ద్రవ్య నియంత్రణ వ్యవహారాల రంగంలో సామర్థ్య వికాసం దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలుగల ఈ జాతీయస్థాయి శిక్షణ కేంద్రం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్-పరోక్ష పన్నులు) అధికారులతోపాటు కేంద్ర అనుబంధ సేవలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా భాగస్వామ్య దేశాల అధికారులకూ శిక్షణ ఇస్తుంది.

   ఈ కొత్త ప్రాంగణం ఏర్పాటుతో ‘నాసిన్’ తన శిక్షణ, సామర్థ్య వికాస కార్యక్రమాల్లో ఇకపై నవతరం సాంకేతికతలు- ‘ఆగ్మెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ, బ్లాక్-చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ వంటి వర్ధమాన పరిజ్ఞానాల వినియోగంపై దృష్టి సారిస్తుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi