అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ- అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడంపై హర్షం ప్రకటించారు. వాల్మీకి మహర్షి రామాయణం మనల్ని శ్రీరామునితో మమేకం చేసే జ్ఞానమార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధునిక భారతంలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం మనల్ని అయోధ్య క్షేత్రం-ఆధునిక మహా రామాలయంతో అనుసంధానిస్తుందని చెప్పారు. తొలిదశలో ఈ విమానాశ్రయం ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించగలదని, రెండోదశ తర్వాత ఈ సంఖ్య 60 లక్షలకు పెరుగుతుందని తెలిపారు.
ఈ అత్యాధునిక విమానాశ్రయం తొలిదశను రూ.1,450 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిచేశారు. విమానాశ్రయం ప్రధాన (టెర్మినల్) భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించగలదు. భవనం ముందుభాగం అయోధ్యలో శ్రీరామ మందిరం ఆలయ ఆకృతిని ప్రతిబింబిస్తుంది. భవన అంతర్భాగాన్ని శ్రీరాముని జీవితగాథను వివరించేలా స్థానిక కళాకృతులు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో అలంకరించారు. అయోధ్య విమానాశ్రయ టెర్మినల్ భవనం అనేక విశిష్టతలతో నిర్మితమైంది. ఈ మేరకు పైకప్పు వ్యవస్థ విభిన్నంగా రూపొందించబడింది. అలాగే ఎల్‌ఈడీ లైటింగ్, వర్షపునీటి సంరక్షణ, ఫౌంటైన్‌లతో సుందరీకరణ, జలశుద్ధి ప్లాంటు, మురుగు శుద్ధి ప్లాంటు, సౌరశక్తి ప్లాంటుసహా అనేక ఇతర సౌకర్యాలున్నాయి. ‘‘గృహ-5 స్టార్’’ రేటింగుకు అనుగుణంగా ఈ అత్యాధునిక సదుపాయాలన్నీ కల్పించబడ్డాయి. కొత్త విమానాశ్రయం ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా పర్యాటక, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడంతోపాటు ఉపాధి అవకాశాలు అందివస్తాయి.