“యావద్భారతాన్నీ పెనవేసుకున్న సాంస్కృతిక కేంద్రం కాశీ..భారత ప్రాచీనత-వైభవాల సాంస్కృతిక కేంద్రం తమిళనాడు”;
“మన సంస్కృతి.. నాగరికతలకు శాశ్వత కేంద్రాలు కాశీ.. తమిళనాడు”;
“యావద్దేశ ఐక్యతతో అమృతకాలంలో మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి”;
“తమిళ వారసత్వ పరిరక్షణ.. సుసంపన్నత 130 కోట్ల భారతీయుల బాధ్యత”

   త్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక నెలపాటు నిర్వహించే ‘కాశీ-తమిళ సంగమం’ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. కాశీ-తమిళనాడు నగరాలు దేశంలో అత్యంత కీలక, పురాతన విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాయి. ఈ నేపథ్యంలో రెండింటి మధ్యగల ప్రాచీన సంబంధాల వైభవాన్ని స్మరించుకోవడంతోపాటు వాటి పునరుద్ఘాటన, పునరాన్వేషణ లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు నుంచి 2,500 మందికిపైగా ప్రతినిధులు కాశీని సందర్శించనున్నారు. కాగా, ఈ వేడుకలకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి తమిళ ప్రాచీన గ్రంథం ‘తిరుక్కురళ్‌’ సహా 13 భాష‌ల అనువాద ప్రతులను కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత హారతి కార్యక్రమంలో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

   ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న, నిత్యచైతన్య న‌గ‌రం కాశీలో ఈ వేడుకల నిర్వహణపై ఆయన హర్షం వ్య‌క్తం చేశారు. నదీ సంగమం, తత్త్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం లేదా విజ్ఞానం వంటివి ఏవైనప్పటికీ మన దేశంలో అన్నిటికీ ప్రాముఖ్యం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు ప్రతి సంస్కృతి-సంప్రదాయాల సంగమానికీ ఆదరణ, ఆరాధన భారతదేశంలో సహజమని పేర్కొన్నారు. వాస్తవానికి ఇది భారతదేశ శక్తి, విలక్షణతలతో కూడిన వేడుకగనుక కాశీ-తమిళ సంగమం విశిష్టమైనదని ఆయన వ్యాఖ్యానించారు.

   కాశీ, తమిళనాడు మధ్య అనుబంధాన్ని ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ- కాశీ నగరం భార‌త‌ సాంస్కృతిక రాజ‌ధాని కాగా- త‌మిళ‌నాడు, త‌మిళ సంస్కృతి దేశ ప్రాచీనతకు, ప్రతిష్టలకు కేంద్రంగా అభివర్ణించారు. గంగ-యమునా నదీ సంగమంతో కాశీ-తమిళ సంగమం సారూప్యాన్ని వివరిస్తూ- రెండూ సమాన పవిత్రత కలిగినవేగాక అంతర్గతంగా అపార శక్తి,  అవకాశాలకు నిలయాలని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహణపై కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానమంత్రి అభినందించారు. దీనికి పూర్తి తోడ్పాటునిస్తున్న ఐఐటీ-మద్రాస్‌, బీహెచ్‌యూ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కృతజ్ఞతలతోపాటు కాశీ, తమిళనాడు నగరాల పండితులకు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాశీ, తమిళనాడు నగరాలు అనాదిగా మన సంస్కృతి, నాగరికతలకు కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచంలో నేటికీ ఉనికిని చాటుకుంటున్న అత్యంత ప్రాచీన భాషలలో సంస్కృతం, తమిళం కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా “కాశీలో విశ్వనాథుడు... రామేశ్వరంలో రామేశ్వరుడు మనలను ఆశీర్వదిస్తారు. ఆ విధంగా కాశీ, తమిళనాడు శివుని సన్నిధిలోని నగరాలే” అన్నారు. సంగీత-సాహిత్యాలైనా.. కళలైనా అటు కాశీ, ఇటు తమిళనాడు వాటికి సదా మూల కేంద్రాలని ప్రధాని పేర్కొన్నారు.

   భారతదేశ సుసంపన్న సంస్కృతి-సంప్రదాయాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- ఈ రెండు నగరాలూ మన దేశపు అత్యుత్తమ గురువులకు జన్మభూమి, కర్మభూమిగా గుర్తింపు పొందాయని చెప్పారు. కాశీ, తమిళనాడులలో ఆ శక్తి వైశిష్ట్యం ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు “తమిళనాడు సంప్రదాయ వివాహ వేడుకలలో కాశీయాత్ర ఔచిత్యాన్ని మనం నేటికీ గమనించవచ్చు” అన్నారు. కాశీపై తమిళనాడుకుగల అనంత ప్రేమాభిమానాలు మన పూర్వికుల ‘ఐక్య భారతం-శ్రేష్ట భారతం’ భావనతో కూడిన జీవనశైలికి ప్రతిరూపాలని ఆయన అభివర్ణించారు.

   కాశీ నగరాభివృద్ధిలో తమిళనాడు పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. తమిళనాడులో జన్మించిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ బీహెచ్‌యూ ఉప-కులపతిగా పనిచేశారని గుర్తుచేశారు. అలాగే మూలాలు తమిళనాడులో ఉన్నప్పటికీ కాశీలో ప్రసిద్ధులైన వేద పండితుడు రాజేశ్వర శాస్త్రి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాశీలోని హనుమాన్ ఘాట్‌ వద్ద నివసించిన పట్టవీరం శాస్త్రిని కూడా కాశీ ప్రజలు స్మరించుకుంటారని పేర్కొన్నారు. హరిశ్చంద్ర ఘాట్ వద్దగల తమిళ దేవాలయం కాశీ కామకోటేశ్వర పంచాయతన్‌ మందిర్, కేదార్ ఘాట్‌లోని 200 ఏళ్లనాటి కుమారస్వామి మఠం, మార్కండేయ ఆశ్రమం గురించి ప్రధానమంత్రి తెలిపారు. తమిళనాడు నుంచి వచ్చిన చాలామంది యాత్రికులు కేదార్ ఘాట్, హనుమాన్ ఘాట్ల ఒడ్డున నివసిస్తున్నారని పేర్కొన్నారు. తరతరాలుగా వారు కాశీ అభివృద్ధి కోసం అపారంగా కృషి చేశారని చెప్పారు. తమిళ మహాకవి, విప్లవకారుడైన శ్రీ సుబ్రహ్మణ్య భారతి గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆయన చాలా ఏళ్లు కాశీలో నివసించారని, బీహెచ్‌యూలో సుబ్రహ్మణ్య భారతి పేరిట ప్రత్యేక పీఠం ఏర్పాటు ఒక అదృష్టమేగాక, గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

   కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని స్వాతంత్ర్య అమృత కాలంలో నిర్వహిస్తుండటాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో “యావద్భారత ఐక్యతతో అమృతకాలంలో మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది ఏళ్లుగా భారత్‌ సహజ సాంస్కృతిక ఐక్యతగల దేశమని ఆయన పేర్కొన్నారు. నిద్ర లేవ‌గానే 12 జ్యోతిర్లింగాల‌ స్మ‌రణ సంప్రదాయం గురించి వివరిస్తూ- ఆ విధంగా దేశ ఆధ్యాత్మిక ఐక్య‌త‌ను స్మరించుకుంటూ మ‌నం మ‌న రోజును ప్రారంభిస్తామ‌ని ప్రధాని గుర్తచేశారు. వేల ఏళ్లనాటి ఈ సంప్రదాయం, వారసత్వాల బలోపేతానికి మనం కృషి చేయకపోవడం విచారకరమని శ్రీ మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో కాశీ-తమిళ సంగమం ఇవాళ ఈ సంకల్పం పూనడానికి ఒక వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఆ మేరకు మన కర్తవ్యాన్ని మనం గుర్తెరిగేలా జాతీయ ఐక్యత బలోపేతానికి శక్తివనరుగా మారుతుందన్నారు.

   భాషాపరమైన అవరోధాలను బద్దలు కొట్టి, మేధో దూరాన్ని అధిగమించే ఈ వైఖరితో కాశీకి వచ్చి ఈ నగరాన్ని కర్మభూమిగా చేసుకున్న స్వామి కుమారగురువర్ కేదారేశ్వర ఆలయాన్ని నిర్మించారని ప్రధాని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆయన శిష్యులు కావేరీ నది ఒడ్డున తంజావూరులో కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. తమిళ రాష్ట్ర గీతాన్ని రచించిన మనోన్మణియం సుందరనార్ వంటి మహనీయులను, ఆయన గురువుకు కాశీతోగల అనుబంధాన్ని ప్రస్తావించారు. తమిళ పండితులకు, కాశీకి మధ్యగల సంబంధాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. ఉత్తర-దక్షిణ భారత రాష్ట్రాల అనుసంధానంలో రాజాజీ రాసిన రామాయణ, మహాభారతాల పాత్రను కూడా ప్రధాని గుర్తుచేసుకున్నారు. “దక్షిణ భారత తత్త్వవేత్తలు రామానుజాచార్య, శంకరాచార్యసహా రాజాజీ నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి పండితులను అర్థం చేసుకోనిదే భారతీయ తత్వశాస్త్రం మనకు అర్థంకాదన్నది నా అనుభవం” అని శ్రీ మోదీ అన్నారు.

   ‘పంచ్‌ప్రాణ’ సూత్రాన్ని ప్రస్తావిస్తూ- సుసంపన్న వారసత్వంగల దేశం అందుకు గర్వించాలని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన సజీవ భాషల్లో ఒకటైన తమిళం మనదైనప్పటికీ మనం దానికి తగిన గౌరవం ఇవ్వలేపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. “తమిళ వారసత్వ పరిరక్షణ, దానిని సుసంపన్నం చేయడం 130 కోట్ల మంది భారతీయుల బాధ్యత. మనం తమిళాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశంపట్ల ఎంతో అపచారం చేసినట్లే. తమిళాన్ని పరిమితుల నడుమ బంధిస్తే మనం దానికి చాలా హాని చేసినట్టే. భాషా భేదాలను తొలగించి భావ ఐక్యత నెలకొల్పడం అవసరమని మనం గుర్తుంచుకోవాలి” అని ప్రధానమంత్రి అన్నారు. సంగ‌మం అంటే- మాట‌కు మించి ఎక్కువ‌ అనుభ‌వం పొందడమని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఆ మేరకు కాశీవాసులు చిరస్మ‌ర‌ణీయ ఆతిథ్యమివ్వడంలో ఏ మాత్రం లోటు చేయబోరన్నఆశాభావం వ్య‌క్తం చేశారు. తమిళనాడుతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని ప్రధాని ఆకాంక్షించారు. అంతేకాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల యువకులు ఆ రాష్ట్రాలను సందర్శించి అక్కడి సంస్కృతిని అవగాహన చేసుకోవాలని కోరారు. ఈ సంగమం ఫలితాలను పరిశోధనల ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఈ విత్తనం మహావృక్షంగా ఎదగాలని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   ఉత్తరప్రదేవ్‌ గవర్నర్‌ శ్రీమతి ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రులు డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌, పార్లమెంటు సభ్యులు శ్రీ ఇళయరాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   ప్రధానమంత్రి దార్శనికత మేరకు ‘ఐక్య భారతం-శ్రేష్ఠ భారతం’ దృక్పథాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ దృక్పథాన్ని ప్రతిబింబించే మరో వినూత్న ప్రయత్నంలో భాగంగా కాశీ (వారణాసి)లో ఒక నెలపాటు ‘కాశీ-తమిళ సంగమం’ కార్యక్రమం నిర్వహించబడుతోంది.

   తమిళనాడు, కాశీ నగరాల మధ్యగల ప్రాచీన సంబంధాల వైభవ స్మరణతోపాటు వాటి పునరుద్ఘాటన, పునరాన్వేషణ లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు నగరాలు దేశంలో అత్యంత కీలక, పురాతన విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాయి. రెండు ప్రాంతాల పండితులు, విద్యార్థులు, తత్త్వవేత్తలు, వ్యాపారులు, చేతివృత్తుల నిపుణులు, కళాకారులు తదితర అన్ని వర్గాల ప్రజలు ఒకచోట చేరి తమ జ్ఞానం, సంస్కృతి, ఉత్తమాచరణలను, అనుభవాలను పంచుకునే కల్పించడం ఈ కార్యక్రమ ధ్యేయం. ఇందులో పాల్గొనడానికి తమిళనాడు నుంచి 2,500 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఇక్కడ నిర్వహించే సదస్సులు, చర్చగోష్ఠులలో పాలుపంచుకోవడమే కాకుండా యాత్రాస్థలాల సందర్శనకు వెళ్తారు. తద్వారా తమ తరహాలోనే వృత్తులు, వ్యాపారాలు, ఆసక్తులుగల స్థానికులతో వారంతా మమేకం అవుతారు. అలాగే వారణాసిలో కాశీ, తమిళనాడు నగరాలకు చెందిన చేనేత, హస్తకళా వస్తువులు, ‘ఒకేజిల్లా-ఒకే ఉత్పత్తి’ వస్తువులు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు, వంటలు, కళారూపాలు, చరిత్ర, పర్యాటక ప్రదేశాలపై నెలపాటు ప్రదర్శన కూడా కొనసాగుతుంది.

   భారతీయ విజ్ఞాన విధానాల సంపదను ఆధునిక విజ్ఞాన వ్యవస్థలతో ఏకీకృతం చేయడంపై ‘ఎన్‌ఈపీ-2020' ఇస్తున్న ప్రాధాన్యానికి అనుగుణంగా ఐఐటీ-మద్రాస్‌, బీహెచ్‌యూ ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi