ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారతదేశంలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ.టి.యు) కు చెందిన ఏరియా కార్యాలయంతో పాటు, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. భారత్ 6-జి విజన్ డాక్యుమెంట్ ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు, 6-జి ఆర్.&డి. టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ‘కాల్-బి-ఫోర్-యు-డిగ్’ అనే యాప్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఐ.టి.యు. అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీల (ఐ.సి.టి.ల) ప్రత్యేక ఏజెన్సీ. ఏరియా కార్యాలయం ఏర్పాటు కోసం 2022 మార్చి నెలలో ఐ.టి.యు. తో భారతదేశం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలకు ఈ కార్యాలయం సేవలందిస్తుంది, దేశాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ కార్యాలయం ప్రోత్సహిస్తుంది.
భారతదేశం, ఐ.టి.యు. ల సుదీర్ఘ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని గుర్తించే విధంగా భారతదేశంలో కొత్త ఐ.టి.యు. కార్యాలయంతో పాటు, ఇన్నోవేషన్ సెంటర్ ను అభివృద్ధి చేయడంలో సహాయం చేసినందుకు ప్రధానమంత్రి కి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీమతి డోరీన్-బోగ్డాన్ మార్టిన్ ధన్యవాదాలు తెలియజేశారు. డిజిటల్ సేవలు, నైపుణ్యాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్‌క్లూజన్ ల నుండి వచ్చే ఫలితాలకు ప్రతిస్పందిస్తూ, ఈ ప్రాంతంలో ఐ.టి.యు. కార్యాలయం ఏర్పాటు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడానికి, సామర్థ్య అభివృద్ధిని మెరుగుపరచడానికి, వ్యవస్థాపకత, భాగస్వామ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. "తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వారి ప్రభుత్వ సేవలను పునరాలోచించుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, వాణిజ్యాన్ని పునర్నిర్మించడం తో పాటు, వారి ప్రజలను శక్తివంతం చేయడానికి డిజిటల్ పరివర్తన కోసం ఎదురు చూస్తున్న దేశాలకు భారతదేశం ఒక రోల్ మోడల్" అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ, డిజిటల్ చెల్లింపుల మార్కెట్ తో పాటు, సాంకేతిక సిబ్బందికి భారతదేశం నిలయంగా ఉందని, ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వం సాంకేతిక ఆవిష్కరణలు, గేమ్-ఛేంజింగ్ ను స్వీకరించడం, డిజిటల్ లావాదేవీలతో పాటు, భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఆధార్, యు.పి.ఏ. వంటి ఇతర కార్యక్రమాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిందని ఆమె అన్నారు.
సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ రోజు హిందూ క్యాలెండర్ యొక్క కొత్త సంవత్సరాన్ని గుర్తించే ఒక ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. విక్రమ్ సంవత్సరం 2080 సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలియ జేశారు. భారతదేశ వైవిధ్యం, శతాబ్దాలుగా ప్రబలంగా ఉన్న వివిధ క్యాలెండర్ల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, మలయాళం, తమిళ క్యాలెండర్లను ఉదహరించారు. కాగా విక్రమ్ సంవత్ క్యాలెండర్ 2080 సంవత్సరాల నుండి కొనసాగుతోందని ఆయన తెలియజేశారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం 2023 సంవత్సరం నడుస్తుండగా, విక్రమ్ సంవత్ దానికి 57 సంవత్సరాల ముందు ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఐ.టీ.యూ. ఏరియా కార్యాలయం, ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఈ శుభదినాన భారత టెలికాం రంగంలో నూతన శకం ఆరంభమయ్యిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 6-జి. టెస్ట్-బెడ్ తో పాటు, ఈ సాంకేతికతకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించామనీ, ఇది డిజిటల్ ఇండియాకు కొత్త శక్తిని సమకూర్చడంతో పాటు, గ్లోబల్-సౌత్ కు పరిష్కారాలు, ఆవిష్కరణలను అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశంలోని ఆవిష్కర్తలు, పరిశ్రమలు, అంకుర సంస్థలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ చర్య దక్షిణాసియా దేశాల ఐటీ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.
జి-20 ప్రెసిడెన్సీ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో, ప్రాంతీయ విభజనను తగ్గించడం భారతదేశ ముఖ్య ప్రాధాన్యతలలో ఒకటని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవలి గ్లోబల్-సౌత్-సమ్మిట్ ను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, గ్లోబల్-సౌత్ సాంకేతిక విభజనను వేగంగా ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తున్నందున గ్లోబల్-సౌత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతికత, డిజైన్, ప్రమాణాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. "ఐ.టి.యు. ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు ఈ దిశలో ఒక పెద్ద ముందడుగు. గ్లోబల్-సౌత్ లో సార్వత్రిక అనుసంధానతను కల్పించడానికి భారతదేశం చేపట్టిన ప్రయత్నాలు ఈ చర్యతో ఊపందుకుంటాయి." అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ విభజనను తగ్గించే విషయంలో భారతదేశానికి కొన్ని అంచనాలు ఉండటం సహజమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశ సామర్థ్యాలు, ఆవిష్కరణ సంస్కృతి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, వినూత్న మానవశక్తి, అనుకూలమైన విధాన వాతావరణం వంటివి ఈ అంచనాలకు ఆధారమని ఆయన వివరించారు. “భారతదేశానికి విశ్వాసం, స్థాయి అనే రెండు రెండు కీలక బలాలు ఉన్నాయి. ఈ రెండూ లేకుండా మనం సాంకేతికతను పూర్తిగా విస్తరించలేము. ఈ దిశగా భారతదేశం చేస్తున్న కృషి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది” అని ప్రధానమంత్రి తెలియజేశారు.
ఈ దిశగా భారతదేశం చేస్తున్న కృషి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ విజయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, వంద కోట్ల కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లతో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అనుసంధానించబడిన ప్రజాస్వామ్య దేశంగా ఉందని, చౌకైన స్మార్ట్‌ఫోన్లు, డేటా లభ్యత ఈ పరివర్తనకు కారణమని తెలియజేశారు. "భారతదేశంలో ప్రతి నెలా యు.పి.ఐ. ద్వారా 800 కోట్లకు పైగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి." అని ఆయన చెప్పారు. భారతదేశంలో ప్రతి రోజూ 7 కోట్లకు పైగా ఈ-ధృవీకరణలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. భారతదేశంలో “కో-విన్-ప్లాట్ ఫారమ్” ద్వారా 220 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్ లను అందించినట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం 28 లక్షల కోట్ల రూపాయలకు పైగా "డైరెక్ట్-బెనిఫిట్-ట్రాన్స్‌ఫర్" సౌకర్యం ద్వారా తన పౌరుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. "జన్-ధన్-యోజన" ద్వారా అమెరికాలో మొత్తం జనాభా కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను భారతదేశం విజయవంతంగా ప్రారంభించిందనీ, వాటిని ప్రత్యేక డిజిటల్ గుర్తింపు లేదా ఆధార్ నెంబర్ ద్వారా ధృవీకరించడం జరిగిందనీ, మొబైల్ ఫోన్ ద్వారా వంద కోట్ల మందికి పైగా ప్రజలను అనుసంధానించడం జరిగిందనీ, ఆయన తెలియజేశారు.
"టెలికాం సాంకేతికత అనేది భారతదేశానికి కేవలం శక్తినిచ్చే ఒక అంశం మాత్రమే కాదు, సాధికారత నిచ్చే ఒక లక్ష్యం" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీ సార్వత్రికమని, అందరికీ అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో గత కొన్నేళ్లుగా డిజిటలైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతోందనీ, 2014 కి ముందు భారతదేశంలో బ్రాడ్-బ్యాండ్ తో అనుసంధానమైన వారి సంఖ్య 60 మిలియన్లకు పైగా ఉండగా, నేడు ఆ సంఖ్య 800 మిలియన్లకు పైగా చేరుకుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2014 కి ముందు 25 కోట్లతో పోలిస్తే భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య ఇప్పుడు 85 కోట్లకు పైగా ఉందని ఆయన అన్నారు.
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం అనూహ్యంగా పెరిగిందన్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పట్టణ ప్రాంతాలను మించిపోయిందని, ఇది దేశంలోని ప్రతి మారు మూల ప్రాంతానికీ డిజిటల్ శక్తి చేరుకుందన్న వాస్తవాన్ని సూచిస్తోందని తెలియజేశారు. గత 9 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా భారతదేశంలో 25 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. “రెండు లక్షల గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ తో అనుసంధానించడం జరిగింది. ఐదు లక్షల సేవా కేంద్రాలు డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మిగిలిన ఆర్థిక వ్యవస్థల కంటే రెండున్నర రెట్లు వేగంగా విస్తరిస్తోంది.” అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.
ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ ని ఉదాహరణగా చూపుతూ, డిజిటల్ ఇండియా డిజిటల్-యేతర రంగాలకు మద్దతు ఇస్తోందని, తెలియజేశారు. ‘కాల్-బి-ఫోర్-యు-డిగ్’ యాప్ కూడా అదే ఆలోచనను ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. ఇది అనవసరమైన తవ్వకాలు, నష్టాలను తగ్గిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు.
భారతదేశంలో కేవలం 120 రోజుల్లో 125 కంటే ఎక్కువ నగరాల్లో 5-జి. సేవలు అందుబాటులోకి వచ్చి, దేశంలో దాదాపు 350 జిల్లాలకు 5-జి. సేవలు చేరుకున్న నేపథ్యంలో, “నేటి భారత దేశ డిజిటల్ విప్లవం తదుపరి దశ వైపు వేగంగా పయనిస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ విధంగా, ప్రపంచంలో అత్యంత వేగవంతంగా 5-జి. సేవలు అందుబాటులోకి తెస్తున్న దేశం భారతదేశమని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశ విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ, 5-జి. సేవలు ప్రారంభించిన ఆరు నెలల తర్వాత భారతదేశం 6-జి. సేవల గురించి చర్చిస్తోందని ప్రధానమంత్రి వివరించారు. "ఈరోజు సమర్పించిన విజన్ డాక్యుమెంట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో 6-జి. ప్రారంభానికి ప్రధాన ఆధారం అవుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో విజయవంతంగా అభివృద్ధి చెందిన టెలికాం సాంకేతికత ప్రపంచంలోని అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశం 4-జి. కి ముందు టెలికాం టెక్నాలజీని మాత్రమే ఉపయోగించేదని, కానీ నేడు టెలికాం టెక్నాలజీని ప్రపంచ దేశాలకు అత్యధికంగా ఎగుమతి చేసే దిశగా భారతదేశం పయనిస్తోందని, ఆయన ఉద్ఘాటించారు. "5-జి. శక్తితో మొత్తం ప్రపంచంలోని పని సంస్కృతిని మార్చడానికి భారతదేశం అనేక దేశాలతో కలిసి పనిచేస్తోంది", అని ఆయన పేర్కొన్నారు. 5-జి.తో అనుబంధించబడిన అవకాశాలు, వ్యాపార నమూనాలు, ఉపాధి అవకాశాలను గ్రహించడంలో ఇది చాలా ముందంజలో ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. “ఈ 100 కొత్త ల్యాబ్ లు భారతదేశ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా 5-జి. అప్లికేషన్ లను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. 5-జి స్మార్ట్ తరగతి గదులు, వ్యవసాయం, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ లేదా హెల్త్-కేర్-అప్లికేషన్‌లు ఏదైనా సరే, భారతదేశం ప్రతి దిశలో వేగంగా ముందుకు దూసుకువెళ్తోంది.” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశ 5-జి. ప్రమాణాలు అంతర్జాతీయ గ్లోబల్ 5-జి. సిస్టమ్స్ లో భాగమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ టెక్నాలజీల ప్రామాణీకరణ కోసం భారతదేశం కూడా ఐ.టి.యు. తో కలిసి పని చేస్తుందని చెప్పారు. భారతదేశంలోని నూతన ఐ.టి.యు. ప్రాంతీయ కార్యాలయం కూడా 6-జి. కి సరైన వాతావరణాన్ని కల్పించడంలో సహాయపడుతుందని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐ.టి.యు.కి చెందిన వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ ప్రామాణీకరణ సదస్సు వచ్చే ఏడాది అక్టోబర్ లో ఢిల్లీ లో జరుగుతుందని, ప్రపంచం నలుమూలల నుండి ప్రతినిధులు భారతదేశాన్ని సందర్శిస్తారని ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగిస్తూ, భారత దేశ అభివృద్ధి వేగాన్ని ప్రత్యేకంగా వివరించారు. ఈ దిశగా ఐ.టి.యు. ప్రాంతీయ కేంద్రం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. “ఈ దశాబ్దం భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. భారతదేశ టెలికాం, డిజిటల్ విధానం సాఫీగా, సురక్షితంగా, పారదర్శకంగా సాగుతోంది. దక్షిణాసియాలోని అన్ని స్నేహపూర్వక దేశాలు దీనిని సద్వినియోగం చేసుకోగలవు” అని ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీమతి డోరీన్-బోగ్దాన్-మార్టిన్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఐ.టి.యు. అనేది ఐక్యరాజ్యసమితి సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీల (ఐ.సి.టి. ల) ప్రత్యేక ఏజెన్సీ. జెనీవాలో ప్రధాన కార్యాలయంతో పాటు, క్షేత్ర స్థాయి కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాలు, ఏరియా కార్యాలయాల వ్యవస్థను కలిగి ఉంది. ఏరియా కార్యాలయం ఏర్పాటు కోసం 2022 మార్చి నెలలో ఐ.టి.యు. తో భారతదేశం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశంలోని ఏరియా కార్యాలయంలో ఒక ఆవిష్కరణల కేందం కూడా ఏర్పాటు చేయడంతో, ఐ.టి.యు. కు చెందిన ఇతర ఏరియా కార్యాలయాలకు ఇది భిన్నంగా ఉంటుంది. ఈ ఏరియా కార్యాలయానికి భారతదేశం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. ఈ కార్యాలయం న్యూ ఢిల్లీ లోని మెహ్రౌలీ లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డి.ఓ.టి) భవనంలోని రెండవ అంతస్తులో ఉంది. ఈ కార్యాలయం భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలకు అవసరమైన సేవలందిస్తుంది, ఈ దేశాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది, ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
భారత్ 6-జి. విజన్ డాక్యుమెంట్ ను 6-జి. (టి.ఐ.జి-6.జి) పై ఏర్పాటైన టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ తయారు చేసింది, దీనిని భారతదేశంలో 6-జి. కోసం రోడ్ మ్యాప్, కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యాసంస్థలు, స్టాండర్డైజేషన్ సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, పరిశ్రమల సభ్యులతో 2021 నవంబర్ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థలు, ఎం.ఎస్.ఎం.ఈ. లు మొదలైన వాటికి అభివృద్ధి చెందుతున్న ఐ.సి.టి. సాంకేతికతలను పరీక్షించి, ధృవీకరించడానికి 6-జి. టెస్ట్ బెడ్ ఒక వేదికను అందిస్తుంది. దేశంలో నూతన ఆవిష్కరణలు, సామర్థ్యం పెంపుదల మరియు వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని భారత్ 6-జి. విజన్ డాక్యుమెంట్ తో పాటు 6-జి. టెస్ట్-బెడ్ అందిస్తుంది.
ప్రధానమంత్రి గతి శక్తి కింద మౌలిక సదుపాయాల అనుసంధాన ప్రాజెక్టుల సమీకృత ప్రణాళిక, సమన్వయ అమలు కోసం ప్రధానమంత్రి ఆలోచనా సరళికి అనుగుణంగా, "కాల్-బిఫోర్-యు-డిగ్" (సి.బి.యు.డి) యాప్ ను రూపొందించడం జరిగింది. సమన్వయం లేని తవ్వకాలు, సొరంగాల వల్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వంటి భూగర్భంలోని ఆస్తులకు నష్టం జరగకుండా నిరోధించడానికి ఈ యాప్ ను రూపొందించడం జరిగింది. ఇటువంటి తవ్వకాల వల్ల దేశానికి ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల రూపాయల మేర నష్టం సంభవిస్తోంది. భూమిని తవ్వేవారు, ఆస్తి యజమానులను ఈ సి.బి.యు.డి. మొబైల్ యాప్ ఎస్.ఎం.ఎస్. / ఈ-మెయిల్ నోటిఫికేషన్ల ద్వారా అనుసంధానం చేస్తుంది, ఫోన్ చేయడానికి క్లిక్ చేస్తే చాలు, తద్వారా దేశంలో భూగర్భ ఆస్తుల భద్రతకు భరోసానిస్తూ ప్రణాళికాబద్ధంగా తవ్వకాలు జరుగడానికి దోహదపడుతుంది.
దేశ పాలనలో ‘హోల్-ఆఫ్-గవర్నమెంట్-అప్రోచ్’ ను అనుసరించడాన్ని వివరించే సి.బి.యు.డి, సులభంగా వ్యాపారం చేయడాన్ని మెరుగుపరచడం ద్వారా వాటాదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది వ్యాపారం లో సంభవించే నష్టాన్ని ఆదా చేస్తుంది, రహదారి, టెలికాం, నీరు, గ్యాస్, విద్యుత్ వంటి అవసరమైన సేవల్లో అంతరాయాన్ని తగ్గించడం వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
आज जब भारत, G-20 की Presidency कर रहा है, तो उसकी प्राथमिकताओं में Regional Divide को कम करना भी है। pic.twitter.com/aaRAC21wCX
— PMO India (@PMOIndia) March 22, 2023
जब हम technological divide को bridge करने की बात करते हैं तो भारत से अपेक्षा करना बहुत स्वाभाविक है। pic.twitter.com/vidI6KwKdH
— PMO India (@PMOIndia) March 22, 2023
In India, telecom technology is about empowering our citizens. pic.twitter.com/9ol2x2vETS
— PMO India (@PMOIndia) March 22, 2023
In recent years, India has seen a rapid surge in number of internet users in rural areas. It shows the power of Digital India. pic.twitter.com/Dm5KVGZJIX
— PMO India (@PMOIndia) March 22, 2023
डिजिटल इंडिया से नॉन डिजिटल सेक्टर्स को भी बल मिल रहा है।
— PMO India (@PMOIndia) March 22, 2023
इसका उदाहरण है हमारा पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान। pic.twitter.com/BEbilEVlYq
आज का भारत, digital revolution के अगले कदम की तरफ तेजी से आगे बढ़ रहा है। pic.twitter.com/yZ7ow91pak
— PMO India (@PMOIndia) March 22, 2023
Made in India telecom technology is attracting attention of the entire world. pic.twitter.com/FvM1LEc4Z7
— PMO India (@PMOIndia) March 22, 2023
This decade is India's tech-ade. pic.twitter.com/hnkfUPoWLF
— PMO India (@PMOIndia) March 22, 2023