ప్రగతి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన ప్రత్యేక రవాణా కారిడార్ ప్రాజెక్టులోని పలు కీలక విభాగాలు జాతికి అంకితం;
మొత్తం 10 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని;
ద‌హేజ్‌లోని పెట్రోనెట్‌ ‘ఎల్ఎన్‌జి’లో పెట్రో రసాయనాల సముదాయానికి శంకుస్థాపన;
‘‘ఈ ఏడాది తొలి 75 రోజుల్లోనే రూ.11 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన.. ప్రారంభం.. 10-12 రోజుల్లోనే రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం’’;
‘‘గడచిన పదేళ్ల కృషి ఆరంభం మాత్రమే... నా భవిష్యత్ లక్ష్యాలు మరెన్నో ఉన్నాయి’’;
‘‘రైల్వే రంగంలో పరివర్తనాత్మక మార్పులకు వికసిత భారత్ గ్యారంటీ’’;
‘‘ఈ రైళ్ల తయారీ.. మార్గాల నిర్మాణం.. ఆధునిక స్టేషన్లు ‘మేడ్ ఇన్ ఇండియా’ పర్యావరణ సృష్టికి నిదర్శనాలు’’;
‘‘ఈ ప్రగతి ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదు... అవన్నీ దేశ ప్రగతిలో భాగం’’;
‘‘స్వయం సమృద్ధ భారతం.. స్థానికత కోసం నినాదం’ విజయానికి ఒక మాధ్యమంగా భారత రైల్వేలకు రూపమివ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యం’’;
‘‘ఆధునికతకు దీటుగా భారత రైల్వేల పరుగు కొనసాగింపు... ఇది మోదీ గ్యారంటీ’’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన ప్రగతి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో రైల్వే మౌలిక సదుపాయాలు సహా అనుసంధానం, పెట్రో రసాయనాల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమాలతోపాటు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200కుపైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాలతో మమేకమైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి ఈ కార్యక్రమం స్థాయి, పరిణామం రైల్వేల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగనిదని ప్రధాని అభివర్ణించారు. దీనికి సంబంధించి రైల్వే రంగానికి అభినందనలు తెలిపారు.

  దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయబడుతున్న నేపథ్యంలో వికసిత భారత్ సృష్టికి సంబంధించిన ప్రగతి పనులు నిరంతరం  విస్తరిస్తున్నాయని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘ఈ ఏడాది (2024) తొలి 75 రోజుల్లోనే రూ.11 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయబడగా, గత 10-12 రోజుల్లోనే రూ.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు. ఈ మేరకు దాదాపు రూ.1 లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేయగా, వీటిలో రూ.85,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రైల్వేలకు సంబంధించినవని వివరించారు. అలాగే దహేజ్‌లో  పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి వద్ద రూ.20,000 కోట్లకుపైగా విలువైన పెట్రో రసాయనాల సముదాయానికి శంకుస్థాపన చేశామన్నారు. దేశంలో ఉదజని ఉత్పాదన, పాలీప్రొఫైలిన్‌ డిమాండ్‌  పెంపు దిశగా ఇది ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ఇక మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఏక్తామాల్‌ శంకుస్థాపనను ప్రస్తావిస్తూ- ఇది భార‌త్‌లోని కుటీర పరిశ్రమలు-హస్తకళా ఉత్పత్తులను దేశం నలుమూలలకూ చేరువ చేస్తుందన్నారు. తద్వారా స్థానికత కోసం నినాదం కార్యక్రమాన్ని బలోపేతం చేయడంతోపాటు వికసిత భారత్ పునాదులను శక్తిమంతం చేసేదిశగా ప్రభుత్వ కృషిని ముమ్మరం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. భారత యువజన శక్తి గురించి పునరుద్ఘాటిస్తూ- నేటి ప్రారంభోత్సవాలు వారి వర్తమానం కోసం కాగా, శంకుస్థాపనలు వారి ఉజ్వల భవిష్యతకు గ్యారంటీ ఇచ్చే పునాదులని వివరించారు.

 

   దేశంలో 2014కు ముందు రైల్వే బడ్జెట్‌ పెంపు విధానాన్ని ప్రస్తావిస్తూ- దీన్ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం గురించి ప్రధానమంత్రి వివరించారు. దీనివల్ల సాధారణ బడ్జెట్ నుంచి రైల్వేల కోసం నిధుల వ్యయానికి వీలు ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇక 2014కు ముందు సమయపాలన, పరిశుభ్రత, ప్రజా సౌకర్యాల కొరతతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 6 రాజధానులకు రైల్వే అనుసంధానం ఉండేది కాదని గుర్తుచేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా 10,000కుపైగా మానవరహిత రైల్వే క్రాసింగ్‌లు ఉండేవి కాగా, రైలు మార్గాల విస్తరణ, విద్యుదీకరణ 35 శాతానికే పరిమితమని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే రైల్వే రిజర్వేషన్లు అవినీతికి, తెగబారెడు బారులు తీరడానికి నిదర్శనాలుగా ఉండేవని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ‘‘ఇటువంటి నరకప్రాయ దుస్థితి రైల్వేలను గట్టెక్కించడానికి మా ప్రభుత్వ దృఢ సంకల్పం పూనింది... తదనుగుణంగా ఇవాళ రైల్వేల అభివృద్ధి ప్రభుత్వ కీలక ప్రాథమ్యాలలో ఒకటిగా మారింది’’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో 2014 నుంచి రైల్వే బడ్జెట్ 6 రెట్లు పెరిగిందని, రాబోయే ఐదేళ్లలో రైల్వేల పరివర్తన అనూహ్య స్థాయిలో దూసుకెళ్లగలదని దేశప్రజలకు గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు. ఆ మేరకు ‘‘గడచిన పదేళ్ల కృషి ఆరంభం మాత్రమే... నా భవిష్యత్ లక్ష్యాలు మరెన్నో ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాలకు ఇప్పుడు వందే భారత్ రైళ్లు వచ్చాయని, వందే భారత్ రైళ్ల శకం ఇప్పటికే అన్నివైపులా విస్తరిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ మేరకు వందే భారత్ నెట్‌వర్క్ దేశంలోని 250 జిల్లాలకు చేరగా, ప్రజాకాంక్షలకు అనుగుణంగా ఈ మార్గాలను పొడిగిస్తున్నట్లు తెలిపారు.

   దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థిక సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడంలో రైల్వేల పాత్ర కీలకమని ప్రధాని పేర్కొన్నారు. ‘‘రైల్వే రంగంలో పరివర్తనాత్మక మార్పులకు వికసిత భారత్ గ్యారంటీ ఇస్తోంది’’ అన్నారు. రైల్వేల రూపాంతరీకరణ ముఖచిత్రాన్ని వివరిస్తూ- శరవేగంగా రైలు మార్గాల నిర్మాణం, 1300కుపైగా రైల్వే స్టేషన్ల నవీకరణ, వందే భారత్/నమో భారత్/అమృత్ భారత్ వంటి భవిష్యత్తరం రైళ్లకు శ్రీకారం, ఆధునికీకరించిన రైల్వే ఇంజిన్ల/కోచ్ ఫ్యాక్టరీల ఆవిష్కరణ తదితరాలను ప్రధాని ఏకరవు పెట్టారు. గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ల్ విధానం కింద, భూమి లీజు విధానాన్ని సరళం చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో సరకు రవాణా టెర్మినళ్ల  నిర్మాణం పెరిగిందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే గతిశక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రైల్వేల ఆధునికీకరణ-సంబంధిత కార్యక్రమాల గురించి కూడా ప్రధాని వివరించారు. మానవరహిత క్రాసింగుల తొలగింపు, స్వయంచలిత సిగ్నలింగ్ వ్యవస్థల ప్రాజెక్ట్ గురించి తెలిపారు. రైల్వే రంగంలో 100 శాతం విద్యుదీకరణ దిశగా దేశం నేడు దూసుకెళ్తోందని తెలిపారు. అలాగే స్టేషన్లు సౌరశక్తితో పనిచేయడంతోపాటు ప్లాట్ ఫారాలపై జనౌషధి కేంద్రాలు కూడా కొలువు దీరనున్నాయని చెప్పారు.

   దేశంలో ‘‘ఈ రైళ్ల తయారీ, రైలు మార్గాల నిర్మాణం, ఆధునిక స్టేషన్లు వంటివి ‘మేడ్ ఇన్ ఇండియా’ పర్యావరణ సృష్టికి నిదర్శనాలు’’ అని ప్రధానమంత్రి అన్నారు. శ్రీలంక, మొజాంబిక్, సెనెగల్, మయన్మార్, సూడాన్ వంటి దేశాలకు నేడు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఇంజిన్లు, రైలుపెట్టెలు ఎగుమతి అవుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీ హైస్పీడ్ రైళ్లకు డిమాండ్ పెరగడం వల్ల వీటి తయారీకోసం అనేక కర్మాగారాలు ఆవిర్భవించనున్నట్లు తెలిపారు. ‘‘రైల్వేల పునరుద్ధరణ, కొత్త పెట్టుబడులు సరికొత్త ఉపాధి అవకాశాలకు హామీ ఇస్తాయి’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రగతి పనులన్నిటినీ ఎన్నికలతో ముడిపెడుతున్న వారిని ప్రధాని విమర్శించారు. ‘‘ఈ ప్రగతి ప్రాజెక్టులన్నీ మళ్లీ మా ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదు... ఇవన్నీ దేశ ప్రగతిలో అంతర్భాగం’’ అని స్పష్టం చేశారు. మునుపటి తరాల దుస్థితి భవిష్యత్తరానికి రానివ్వబోమంటూ, ‘‘ఇది మోదీ గ్యారంటీ’’ అని ఆయన భరోసా ఇచ్చారు.

 

   దేశంలో గత 10 సంవత్సరాల ప్రగతికి తూర్పు-పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లే ప్రత్యక్ష ఉదాహరణలని ప్రధానమంత్రి వివరించారు. గూడ్స్ రైళ్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక మార్గం సరకు రవాణా వేగాన్ని మరింత పెంచుతుందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఎగుమతి వ్యాపారం వగైరాలకు ఇదెంతో కీలకం కాగలదని చెప్పారు. గత పదేళ్లలో తూర్పు-పశ్చిమ తీరాలను సంధానించే ఈ సరకు రవాణా కారిడార్ దాదాపు పూర్తయిందన్నారు. ఇందులో భాగమైన దాదాపు 600 కిలోమీటర్ల కారిడార్ ఇవాళ ప్రారంభించబడిందని, దీంతోపాటు అహ్మదాబాద్‌లో కార్యకలాపాల నియంత్రణ కేంద్రం కూడా ప్రారంభమైందని వెల్లడించారు. ప్రభుత్వ నిర్మిరామ కృషితో ఈ కారిడార్‌లో గూడ్స్ రైళ్ల వేగం నేడు రెట్టింపైందని తెలిపారు. ఈ కారిడార్‌ పొడవునా పారిశ్రామిక కారిడార్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. నేటి కార్యక్రమాల్లో భాగంగా రైల్వే గూడ్స్ షెడ్, గతిశక్తి బహుళార్థ సరకు రవాణా టెర్మినల్, డిజిటల్ నియంత్రణ కేంద్రం, రైల్వే వర్క్‌షాప్, లోకో షెడ్, రైల్వే డిపో వంటివి పలుచోట్ల ప్రారంభించబడినట్లు పేర్కొన్నారు. ఇవన్నీ సరకు రవాణాపై అత్యంత సానుకూల ప్రభావం చూపగలవని ఆయన చెప్పారు.

   ‘‘స్వయం సమృద్ధ భారతం, స్థానికత కోసం నినాదం’ కార్యక్రమాల విజయానికి ఒక మాధ్యమంగా భారత రైల్వేలకు రూపమివ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యం’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. దేశంలోని విశ్వకర్మలు, చేతివృత్తులవారు, హస్తకళాకారులు, మహిళా స్వయం సహాయ సంఘాలు వంటివి తయారుచేసే ఉత్పత్తులను నేడు రైల్వే స్టేషన్‌లలో విక్రయిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ పథకం కింద ఇప్పటికే 1500 విక్రయ కేంద్రాలు తెరవబడ్డాయని చెప్పారు. భారతీయ రైల్వేరంగం ప్రగతి సాధనతోపాటు వారసత్వ మంత్రాన్ని అనుసరిస్తూ ప్రాంతీయ సంస్కృతి, విశ్వాసాల సంబంధిత పర్యాటకానికి ఇతోధిక ప్రోత్సాహం ఇస్తున్నదని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘‘నేడు రామాయణ సర్క్యూట్, గురు-కృప సర్క్యూట్, జైన యాత్ర వంటి మార్గాల్లో ‘భారత్ గౌరవ్’ రైళ్లు నడుస్తుండగా, ‘ఆస్తా’ ప్రత్యేక రైలు దేశం నలుమూలల నుంచి శ్రీరామ భక్తులను అయోధ్యకు తీసుకెళ్తోంది’’ అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ మేరకు శ్రీరాం లాలా దర్శనం కోసం ప్రస్తుతం 350 వరకూ ఆస్తా రైళ్లు అయోధ్యకు ఇప్పటిదాకా 4.5 లక్షల మందికిపైగా భక్తులను తీసుకువచ్చాయని తెలిపారు. చివరగా- ‘‘భారతీయ రైల్వేలు ఆధునికతకు దీటుగా తమ పరుగును కొనసాగిస్తాయి.. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు. ఈ ప్రగతి ప్రయాణాన్ని ఒక వేడుకలా కొనసాగించడంలో పౌరులు తమవంతు సహకారం అందించాలని పిలుపునిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

 

నేపథ్యం

      రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, అనుసంధానం, పెట్రో రసాయనాల రంగానికి ఉత్తేజమిస్తూ, అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన పలు రైల్వే, పెట్రో రసాయనాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. అలాగే ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో- రైల్వే వర్క్‌షాప్‌లు, లోకో షెడ్లు, పిట్ లైన్‌లు/కోచింగ్ డిపోలు; ఫాల్టాన్-బారామతి కొత్త మార్గం; విద్యుత్ ప్రసార వ్యవస్థ ఉన్నతీకరణ పనులు ఉన్నాయి. అలాగే తూర్పు ‘డిఎఫ్‌సి’ పరిధిలోని న్యూ ఖుర్జా-సాహ్నేవాల్ (401 రూట్ కి.మీ) విభాగం, పశ్చిమ ‘డిఎఫ్‌సి’ కార్యకలాపాల నియంత్రణ కేంద్రం (ఒసిసి) పరిధిలోని న్యూ మకర్‌పురా-న్యూ ఘోల్వాడ్ 244 రూట్ కి.మీ) విభాగాలను ప్రధాని జాతికి అంకితం చేశారు.

   అంతేకాకుండా అహ్మదాబాద్-ముంబై సెంట్రల్, సికింద్రాబాద్-విశాఖపట్నం, మైసూరు-డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై), పాట్నా-లక్నో, న్యూ జల్పాయ్ గురి-పాట్నా, పూరీ-విశాఖపట్నం, లక్నో- డెహ్రాడూన్, కలబురగి- సర్ ఎం.విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు, రాంచీ-వారణాసి, ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) మార్గాల్లో పది కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

   వీటితోపాటు నాలుగు వందేభారత్ రైళ్ల గమ్యాల పొడిగింపు నేపథ్యంలో వాటిని కూడా ప్రధాని జెండా ఊపి సాగనంపారు. ఈ రైళ్లలో అహ్మదాబాద్-జామ్‌నగర్ రైలును ద్వారకదాకా; అజ్మీర్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా రైలును చండీగఢ్ వరకూ; గోరఖ్‌పూర్-లక్నో రైలును ప్రయాగ్‌రాజ్ దాకా; తిరువనంతపురం-కాసర్‌గోడ్ రైలును మంగళూరు వరకు పొడిగించబడ్డాయి. మరోవైపు అసన్సోల్- హతియా; తిరుపతి-కొళ్లం మార్గాల్లో రెండు కొత్త ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించారు.

   ఇక ప్రత్యేక రవాణా కారిడార్ పరిధిలోని న్యూ ఖుర్జా జంక్షన్, సాహ్నేవాల్, న్యూ రేవారీ, న్యూ కిషన్‌గఢ్, న్యూ ఘోల్వాడ్, న్యూ మకర్‌పురా తదితర ప్రాంతాల నుంచి సరకు రవాణా రైళ్లను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి సాగనంపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన 50 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి విక్రయ కేంద్రాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రాల్లో ప్రజలకు చౌకధరతో నాణ్యమైన జనరిక్ మందులు లభ్యమవుతాయి. అంతేకాకుండా 51 ‘గతిశక్తి బహుళ సరకు రవాణా కూడళ్ల’ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ కూడళ్ల నుంచి వివిధ రవాణా సాధనాల ద్వారా సరకు రవాణా నిరంతరాయంగా సాగుతుంది.

 

   ఈ రైల్వే ప్రాజెక్టులతోపాటు 80 సెక్షన్లలో 1045 రూట్ కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన స్వయం చలిత సిగ్నలింగ్‌ వ్యవస్థను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. ఈ ఉన్నతీకరణ కార్యక్రమాల వల్ల రైలు కార్యకలాపాల్లో భద్రత-సామర్థ్యం ఇనుమడిస్తాయి. ఇవేకాకుండా 2,646 స్టేషన్ల డిజిటల్ నియంత్రణ సదుపాయాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. తద్వారా రైళ్ల నిర్వహణ సామర్థ్యం, భద్రత మెరుగవుతాయి. ఈ పర్యటనలో ప్రధానమంత్రి 35 రైల్ కోచ్ రెస్టారెంట్లను కూడా జాతికి అంకితం చేశారు. వీటిద్వారా రైల్వేలకు ప్రయాణిక చార్జీయేతర ఆదాయం సమకూరడంతోపాటు ప్రయాణికులుసహా, ఇతర ప్రజల ఆహార అవసరాలు కూడా తీరుతాయి. ఇక దేశవ్యాప్తంగా 1500కుపైగాగల ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ విక్రయ కేంద్రాలను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ విక్రయ కేంద్రాలు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు స్థానిక చేతివృత్తులవారు, హస్తకళాకారుల ఆదాయార్జనకు తోడ్పడతాయి.

   ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి దేశంలోని 975 ప్రాంతాల్లో సౌరశక్తి సదుపాయం కల్పించబడిన రైల్వే స్టేషన్లు/ఇతర ప్రభుత్వ భవనాలను జాతికి అంకితం చేశారు. ఈ వినూత్న కార్యక్రమం భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు దోహదం చేయడంతోపాటు రైల్వే రంగంలో కర్బన ఉద్గారాల తగ్గుదలకు తోడ్పడుతుంది. కాగా, దహేజ్‌లోని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి ప్రాంగణంలో రూ.20,600 కోట్లతో పెట్రో రసాయనాల సముదాయం నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ఎల్‌ఎన్‌జి రీగ్యాసిఫికేషన్ కూడలికి సమీపాన ఈ సముదాయం ఏర్పాటుతో ప్రాజెక్ట్ క్యాపెక్స్/ఒపెక్స్ (మూలధన/నిర్వహణ వ్యయం) గణనీయంగా ఆదా అవుతుంది.

   ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో 50,000 మందికి ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉండగా, కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత 20,000 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఈ ప్రాంతంలో భారీ సామాజిక-ఆర్థిక వృద్ధికి బాటలు పడతాయి. మరోవైపు గుజరాత్, మహారాష్ట్రలలో రూ.400 కోట్లతో ఏక్తామాల్స్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు; వీటిద్వార భారత చేనేత, హస్తకళా, సందాయ చేతి ఉత్పత్తులు, ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ కింద సుసంపన్న, వైవిధ్య భరిత వారసత్వం వికసించడంతోపాటు అనేక మందికి ప్రోత్సాహం లభిస్తుంది. ఏక్తా మాల్స్ ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భారతీయ విలువకు ప్రతీకగా నిలుస్తాయి. అలాగే మన సంప్రదాయ నైపుణ్యాలు, రంగాల అభివృద్ధికి, సాధికారతకు ప్రేరణనిస్తాయి.

   దేశవ్యాప్తంగా కొత్తగా విద్యుదీకరించబడిన సెక్షన్లు, ట్రాక్‌ డబ్లింగ్/మల్టీ-ట్రాకింగ్, రైల్వే గూడ్స్ షెడ్‌ల నిర్మాణం, వర్క్‌ షాప్‌లు, లోకో షెడ్‌లు, పిట్ లైన్‌లు/కోచింగ్ డిపోలు వంటి అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఇవన్నీ అత్యాధునిక, పటిష్ట రైల్వే నెట్‌వర్క్‌ నిర్మాణంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచే ప్రాజెక్టులు కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ పెట్టుబడులతో అనుసంధానం మెరుగుపడటంతోపాటు యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందిరావడంసహా ఆర్థిక వృద్ధికి ఎనలేని తోడ్పాటు లభిస్తుంది.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."