దేశవ్యాప్తంగా 15 విమానాశ్రయాల కొత్త టెర్మినల్ భవనాల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన;
లక్నో.. రాంచీలలో 2021 జనవరిలో శంకుస్థాపన చేసిన లైట్‌హౌస్‌ ప్రాజెక్టులు ప్రారంభం;
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రూ.19,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులతో రైలు-రోడ్డు మౌలిక సౌకర్యాలు బలోపేతం;
యూపీలో ‘పిఎంజిఎస్‌వై’ కింద నిర్మించిన రూ.3700 కోట్లకుపైగా విలువైన 744 గ్రామీణ రహదారి ప్రాజెక్టులు దేశానికి అంకితం;
‘‘తూర్పు యూపీసహా దేశ జనజీవన సౌలభ్యానికి ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తోంది’’;
‘‘ఒకనాటి వెనుకబడిన ప్రాంతం అజంగఢ్ నేడు సరికొత్త ప్రగతి అధ్యాయం లిఖిస్తోంది’’;
‘‘ప్రజా సంక్షేమ పథకాలను మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాలు.. గ్రామీణ ప్రజల వద్దకు చేర్చిన మా ప్రభుత్వం.. నేడు ఆధునిక మౌలిక వసతులనూ చేరువ చేస్తోంది’’;
‘‘భారత రాజకీయాలనే కాకుండా దేశ ప్రగతి దిశను కూడా ఉత్తరప్రదేశ్ నిర్దేశిస్తుంది’’;
‘‘రెండు ఇంజన్ల ప్రభుత్వంతో యూపీ ముఖచిత్రం.. భవిష్యత్తు రూపాంతరం చెందాయి... కేంద్ర పథకాలు అత్యుత్తమంగా అమలయ్యే రాష్ట్రాల్లో ఇప్పుడిదీ ఒకటి’’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అజంగ‌ఢ్‌లో రూ.34,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఢిల్లీలో కాకుండా అజంగ‌ఢ్ వంటి ప్రాంతంలో నిర్వహించడంలోని ప్రాధాన్యాన్నిప్ర‌ధానమంత్రి ప్రస్తావించారు. ‘‘ఒకనాడు వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడిన ఈ ప్రాంతం నేడు సరికొత్త ప్రగతి అధ్యాయాన్ని లిఖిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే ఈ రోజున రూ.34,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ఇక్కడ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన.. జాతికి అంకితం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

 

   ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి రూ.9800 కోట్లకుపైగా విలువైన 15 విమానాశ్రయ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పుణె, కొల్హాపూర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఢిల్లీ, లక్నో, అలీగఢ్, అజంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రావస్తి, అదంపూర్ విమానాశ్రయాలకు 12 కొత్త టెర్మినల్ భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే కడప, హుబ్బళ్లి, బెళగావి విమానాశ్రయాల కొత్త టెర్మినల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాల్లో అభివృద్ధి పనుల వేగాన్ని వివరిస్తూ- గ్వాలియర్ టెర్మినల్ భవనం కేవలం 16 నెలల్లో పూర్తయిందని ప్రధాని గుర్తుచేశారు. ‘‘ఈ వినూత్న కార్యక్రమాలతో విమాన ప్రయాణ సౌలభ్యం ఇనుమడించడంతోపాటు దేశంలోని సాధారణ పౌరులకూ ఆకాశ యానం అందుబాటులోకి వస్తుంది’’ అని పేర్కొన్నారు. వివిధ పథకాలను ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తి చేయడంపై ఎన్నిక‌ల మాయగా వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఈ కార్యక్రమాలు స్పష్టంగా రుజువు చేస్తున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. ‘‘మోదీ తరహాయే విభిన్నమని, వికసిత భారత్‌ సంకల్ప సాకారానికి నేను నిర్విరామంగా కృషి చేస్తున్నానని ప్రజలు గుర్తించారు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   ఆ మేరకు విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనసహా విద్య, నీరు, పర్యావరణ సంబంధిత ప్రాజెక్టులు నిర్మాణం కూడా నేడు కొత్త పుంతలు తొక్కుతున్నట్లు ప్రధాని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అజంగఢ్ ప్రజలకు కొత్త హామీ ఇస్తూ- ‘అజంగఢ్ అంటే- ‘ఆజన్మ వికాస గఢ్’ (ఆద్యంతం ప్రగతికి కోట)గా నిలిచిపోతుందని ప్రధాని అభివర్ణించారు. అటుపైన స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ- విమానాశ్రయం, ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటుతో అజంగఢ్ ఇకపై పొరుగునగల పెద్ద నగరాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు.

 

   ఈ ప్రాంతం మునుపటి బుజ్జగింపు, అనువంశిక రాజకీయాల స్థానంలో గడచిన పదేళ్లుగా అభివృద్ధి రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తోందని ప్రధాని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ ధోరణి మరింత ఊపందుకుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలుగా నిర్లక్ష్యానికి గురైన అలీగఢ్, మొరాదాబాద్, అజంగఢ్, శ్రావస్తి వంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు నేడు విమానయాన సంధానం కూడా వాటికి చేరువైందని చెప్పారు. సంక్షేమ పథకాల తరహాలోనే ఇవాళ ఆధునిక మౌలిక సదుపాయాలన్నీ మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాలు, గ్రామాలవైపు మరలినట్లు చెప్పారు. ‘‘విమానాశ్రయాలు, చక్కని రహదారుల విషయంలో మెట్రో నగరాలతో సమానంగా చిన్న నగరాలకూ హక్కుంది’’ అని ప్రధాని ఉద్ఘాటించారు. అందుకే ‘‘మేము దేశంలోని 2, 3వ అంచె నగరాలను బలోపేతం చేస్తున్నాం. తద్వారా పట్టణీకరణ నిరంతరాయంగా కొనసాగుతుంది’’ అని నొక్కిచెప్పారు.

   ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పన ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. సీతాపూర్, షాజహాన్‌పూర్, గాజీపూర్, ప్రయాగ్‌రాజ్ వంటి జిల్లాలను అనుసంధానించే పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన వేడుకల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అజంగఢ్, మౌ, బలియా వంటి ప్రాంతాలకు అనేక రైల్వే ప్రాజెక్టులు కానుకగా లభించాయని చెప్పారు. వీటితోపాటు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజి ఎస్‌వై) ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ఈ మేరకు ‘‘తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని రైతులు, యువత కోసం అనుసంధానం మెరుగు లక్ష్యంగా ‘పిఎంజి ఎస్‌వై’ కింద 5,000 కిలోమీటర్లకుపైగా రహదారులను ప్రారంభించాం’’ అని ఆయన గుర్తుచేశారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరపై ప్రభుత్వం దృష్టి సారించిందని, చెరకుసహా వివిధ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) గణనీయంగా పెంచామని పేర్కొన్నారు. ‘‘నేడు చెరకు రైతులకు ‘ఎంఎస్‌పి’ 8 శాతం మేర పెంచాం. దీంతో క్వింటాల్‌ ధర ఇప్పుడు రూ.340కి పెరిగింది’’ అని వివరించారు.

 

   అంతేకాకుండా, ఈ ప్రాంత చెరకు రైతులకుగల చారిత్రక సవాళ్లను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ- వారి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ‘‘మా ప్రభుత్వం చెరకు రైతులకు రూ.వేల కోట్ల బకాయిలను చెల్లించడంతోపాటు సకాలంలో, న్యాయమైన ధర చెల్లింపునకు భరోసా ఇచ్చింది’’ అని ఆయన గుర్తుచేశారు. బయోగ్యాస్, ఇథనాల్‌ విషయంలో చేపట్టిన వినూత్న చర్యలతో వచ్చిన పరివర్తన గురించి కూడా ఆయన వివరించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఒక్క అజంగఢ్‌లోనే 8 లక్షల మంది రైతులకు రూ.2,000 కోట్లదాకా అందినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పరివర్తన ప్రభావాన్ని ప్రస్తావిస్తూ- అభివృద్ధి పనుల్లో వేగం దిశగా నిజాయితీగల పాలన అవసరమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ‘‘మునుపెన్నడూ ఎరుగని రీతిలో అభివృద్ధి సాధించాలంటే నిజాయితీతో కూడిన పరిపాలన అవశ్యం. తదనుగుణంగా  అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన విధానాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు.

   తూర్పు ఉత్తరప్రదేశ్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాగల పరివర్తనాత్మక మార్పుపై ప్రధాని మోదీ ప్రగాఢ విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘మహారాజా సుహెల్‌దేవ్ రాజకీయ విశ్వవిద్యాలయ స్థాపన, ఇతరత్రా కార్యక్రమాలు యువతకు సాధికారత కల్పిస్తాయి. తద్వారా ఈ ప్రాంతంలో విద్యా రంగం స్వరూపాన్నే మార్చేస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు దేశ ప్రగతిలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్రను ప్రస్తావిస్తూ- దేశ ప్రగతి ప్రయాణం రాష్ట్రాల పురోగమనంతో ఎలా  ముడిపడి ఉంటుందో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రెండు ఇంజన్ల ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాలను ఆదర్శప్రాయంగా అమలు చేయడంతోపాటు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు గుప్పించారు. ఆ మేరకు రాష్ట్రంలో కొన్నేళ్లుగా గణనీయంగా పెట్టుబడులు పెట్టడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతకు అపార అవకాశాల కల్పనవంటివి సుపరిపాలన వల్ల సిద్ధించిన సత్ఫలితాలని ఆయన వ్యాఖ్యానించారు.

 

   రికార్డు స్థాయిలో పెట్టుబడులు, శంకుస్థాపనలు, ఎక్స్‌ ప్రెస్‌వే నెట్‌వర్క్‌లు, జాతీయ రహదారుల విస్తరణ వగైరాల ద్వారా ఉత్తరప్రదేశ్ ముఖచిత్రం పరివర్తనాత్మకంగా మారిందని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణం పూర్తి చేయడం ద్వారా శాంతిభద్రతలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ఆయన ప్రశంసించారు.

నేపథ్యం

   దేశంలో పౌర విమానయాన రంగానికి పెద్దపీట వేస్తూ రూ.9800 కోట్లకుపైగా విలువైన 15 విమానాశ్రయ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పుణె, కొల్హాపూర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఢిల్లీ, లక్నో, అలీగఢ్, అజంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రావస్తి, అదంపూర్ విమానాశ్రయాల్లో 12 కొత్త టెర్మినల్ భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే కడప, హుబ్బళ్లి, బెళగావి విమానాశ్రయాల కొత్త టెర్మినల్ భవనాలకు శంకుస్థాపన చేశారు.

   మొత్తం 12 విమానాశ్రయాల టెర్మినల్ భవనాల్లో ఏటా ప్రయాణిక నిర్వహణ సామర్థ్యం 62 లక్షలు కాగా, మరో మూడు కొత్త భవనాల నిర్మాణం ప్రారంభం కానుంది. ఇవి కూడా పూర్తయితే వార్షిక నిర్వహణ సామర్థ్యం 95 లక్షలకు చేరుతుంది. ఈ భవనాలన్నిటా ప్రయాణిక సౌకర్యాల రీత్యా అత్యాధునిక సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ మేరకు రెండు పొరల పైకప్పు వ్యవస్థ, ఇంధన పొదుపు నిమిత్తం కనోపీల ఏర్పాటు, ఎల్ఇడి దీపాల సౌకర్యం వంటివెన్నో కల్పించబడ్డాయి. ఆయా నగరాలు, రాష్ట్రాల్లోని వారసత్వ కట్టడాల స్ఫూర్తితో ఈ విమానాశ్రయాల స్వరూపం, నిర్మాణ శైలిని తీర్చిదిద్దారు. ఆ విధంగా ప్రాంతీయంగా స్థానిక సంస్కృతి-వారసత్వాలకు ప్రాధాన్యంతో భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి.

 

   ప్రధానమంత్రి నిశితంగా దృష్టి సారించిన అంశాల్లో ‘అందరికీ గృహవసతి’ కల్పన ఒకటి. తదనుగుణంగా లక్ష్యసాధన కోసం వినూత్న ఉపకరణంగా ‘లైట్ హౌస్ ప్రాజెక్ట్‘ (ఎల్‌హెచ్‌పి) పేరిట  కొత్త ప్రణాళికకు రూపమిచ్చారు. దీనికి లక్నో, రాంచీలలో ప్రధానమంత్రి ప్ర్రారంభోత్సవం చేశారు. తదనుగుణంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో 2000కుపైగా సరసమైన ఫ్లాట్లు నిర్మించబడ్డాయి. ఇందులో వాడిన వినూత్న నిర్మాణ సాంకేతికతవల్ల ఈ గృహాల్లో నివసించే కుటుంబాలకు సుస్థిర, భవిష్యత్ జీవన అనుభవం లభిస్తుంది. కాగా, 2021 జనవరి 1న చెన్నై, రాజ్‌కోట్, ఇండోర్‌లలో తొలుత ‘ఎల్‌హెచ్‌పి’లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

   ఇందులో భాగంగా రాంచీలో ‘ఎల్‌హెచ్‌పి’ కోసం జర్మనీకి చెందిన ‘ప్రీకాస్ట్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ సిస్టమ్- 3డి వాల్యూమెట్రిక్ టెక్నాలజీ’’ని వినియోగించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే-ప్రతి గదిని విడివిడిగా రూపొందించి, ఆ తర్వాత విడిభాగాలను జోడించి బొమ్మకు రూపమిచ్చినట్లు ఇంటిని కూడా అమరుస్తారు. ఇక లక్నోలో ‘ఎల్‌హెచ్‌పి’ని కెనడాకు చెందిన ‘స్టే ఇన్ ప్లేస్ పివిసి ఫావర్క్‌’ పద్ధతిలో ‘ప్రీ-ఇంజనీర్డ్ స్టీల్ స్ట్రక్చరల్ సిస్టమ్‌’తో ఇళ్లను నిర్మించారు.

 

   ఉత్తరప్రదేశ్‌లో దాదాపు రూ.11,500 కోట్ల విలువైన అనేక రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు. వీటితో అనుసంధానం మెరుగుసహా వాహన రాకపోకల రద్దీ తగ్గటంతోపాటు ఈ ప్రాంత సామాజికార్థిక అభివృద్ధికి బాటలు పడతాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రూ.19,000 కోట్ల విలువైన పలు రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడమే కాకుండా మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. దేశానికి అంకితం చేయబడిన ప్రాజెక్టులలో- నాలుగు వరుసల లక్నో రింగ్ రోడ్ సంబంధిత 3 ప్యాకేజీలు; జాతీయ రహదారి నం.2 పరిధిలోని చకేరీ-అలహాబాద్ విభాగం 6 వరుసల విస్తరణ పనులున్నాయి. దీంతోపాటు మంత్రి రాంపూర్-రుద్రపూర్ మార్గం 4 వరుసల పడమటి పొడిగింపు మార్గానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కాన్పూర్ రింగ్ రోడ్ 6 వరుసల మార్గంలో రెండు ప్యాకేజీల పనులు, ఎన్‌హెచ్ నం.24బి/ ఎన్‌హెచ్ నం.30 పరిధిలోని రాయ్‌బరేలీ - ప్రయాగ్‌రాజ్ విభాగం 4 వరుసల విస్తరణ వంటి రహదారి ప్రాజెక్టులు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాక వీటివల్ల వాహన రాకపోకల రద్దీ తగ్గడంతోపాటు ఈ ప్రాంతంలో సామాజికార్థిక అభివృద్ధికి బాటలు పడతాయి.

   యూపీలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) కింద నిర్మించిన రూ.3700 కోట్లకుపైగా విలువైన 744 గ్రామీణ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో మొత్తంమీద దాదాపు 5,400 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తవుతుంది. తద్వారా రాష్ట్రంలోని 59 జిల్లాలు ప్రయోజనం పొందడమేగాక అనుసంధాం మెరుగవుతుంది. అంతేగాక సామాజిక-ఆర్థిక అభివృద్ధికీ గణనీయ ప్రోత్సాహం లభిస్తుంది.

 

 

   ఈ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ప్ర‌ధానమంత్రి దాదాపు రూ.8,200 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు బలోపేతం కావడమేగాక అనేక కీలక రైలు విభాగాల డబ్లింగ్, విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేశారు. భట్నీలో ఇంజన్ వెనుకకు తెచ్చి, మళ్లీ తగిలించే సమస్యకు ముగింపు పలికి, నిరంతర రైళ్ల నిర్వహణకు మార్గం సుగమం చేశారు. అలాగే భట్నీ-పియోకోల్ బైపాస్ రహదారిని ఆయన దేశానికి అంకితం చేస్తారు. బహ్రైచ్-నాన్‌పరా-నేపాల్‌గంజ్ రోడ్డు-రైలు మార్గం గేజ్ మార్పిడికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయ్యాక ఈ ప్రాంతం బ్రాడ్ గేజ్ లైన్ ద్వారా మెట్రోపాలిటన్ నగరాలతో అనుసంధానం కాగలదు. తద్వారా ఇది వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుంది. గంగా నదిపై రైలు వంతెనసహా ఘాజీపూర్ సిటీ మరియు ఘాజీపూర్ ఘాట్ నుండి తారీఘాట్ వరకు కొత్త రైలు మార్గాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఘాజీపూర్ సిటీ-తారీఘాట్-దిల్దార్ నగర్ జంక్షన్ల మధ్య ‘మెము’ రైలును కూడా ఆయన జెండా ఊపి సాగనంపారు. అంతేకాకుండా ప్రయాగ్‌రాజ్, జాన్‌పూర్, ఇటావాలలో పలు మురుగుశుద్ధి ప్లాంట్లను, ఇతరత్రా  ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించడంతోపాటు కొన్నిటిని జాతికి అంకితం చేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi