“అస్సాంలోని కేన్సర్ ఆసుపత్రులు ఈశాన్య భారతంతోపాటు దక్షిణాసియాలో ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి”
“ఆరోగ్య సంరక్షణ దిశగా 7 స్తంభాల గురించి 'స్వాస్థ్య్‌ కే స‌ప్త‌రుషి' వివరిస్తుంది”
“దేశంలోని పౌరులంతా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందగలగడంసహా దేశంలో ఎక్కడైనా దీనికి ఎలాంటి పరిమితులూ ఉండరాదన్న‌దే మా ప్ర‌య‌త్నం.. ‘ఒక దేశం-ఒకే ఆరోగ్యం’ స్ఫూర్తి ఇదే”
“తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని ఇచ్చేందుకు కేంద్రం, అస్సాం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి”

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ దిబ్రూగఢ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అస్సాంలో ఏర్పాటు చేసిన 6 కేన్స‌ర్ ఆస్ప‌త్రుల‌ను జాతికి అంకితం చేశారు. దిబ్రూగఢ్‌, కోక్రఝార్‌, బార్పేట, దర్రాంగ్, తేజ్‌పూర్, లఖింపూర్, జోర్హాట్‌లలో ఇవి నిర్మితమయ్యాయి. కాగా, వీటిలో దిబ్రూగఢ్‌ కొత్త ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా ప్రధాని నిన్ననే దీన్ని జాతికి అంకితం చేశారు. మరోవైపు ఈ ఆస్పత్రుల ప్రాజెక్టు రెండో దశ కింద ధుబ్రి, నల్బరి, గోల్‌పడా, నౌగావ్‌, శివసాగర్, తీన్‌సుకియా. గోలాఘాట్‌లలో నిర్మించనున్న ఏడు కొత్త కేన్సర్ ఆసుపత్రులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ రామేశ్వర్ తేలి, సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు శ్రీ రంజన్ గొగోయ్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా ప్ర‌ధాని ప్రసంగిస్తూ- ముందుగా ఈ సీజ‌న్ సంబంధిత వేడుకల స్ఫూర్తిని ప్రస్తావించి, అస్సాం గడ్డపై జన్మించిన గొప్ప పుత్రులు, పుత్రికలకు నివాళి అర్పించారు. రాష్ట్రంలో నేడు జాతికి అంకితం చేసిన కేన్సర్ ఆస్పత్రులతోపాటు ఇవాళ శంకుస్థాపన చేసిన మరో ఏడు ఆస్పత్రులు ఈశాన్య భారతంతోపాటు దక్షిణాసియాలో ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రధాని అన్నారు.

   స్సాంలోనే కాకుండా ఈశాన్య భారతంలోనూ కేన్సర్ పెద్ద సమస్యగా ఉందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “మన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు దీనివల్ల అధికంగా ప్రభావితం అవుతున్నాయి” అని పేర్కొన్నారు. కేన్సర్ చికిత్స కోసం కొన్నేళ్ల కిందటిదాకా ఇక్కడి ప్రజలు పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి రావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడిందని తెలిపారు. ఈ పరిస్థితుల నడుమ అస్సాంను దీర్ఘకాలం నుంచి వేధిస్తున్న ఈ సమస్య పరిష్కారం కోసం అనేక చర్యలు చేపట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శర్మతోపాటు కేంద్ర మంత్రి శ్రీ సోనోవాల్, టాటా ట్రస్టు ప్రధాని అభినందించారు. ఈశాన్య రాష్ట్రాల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1500 కోట్లతో ‘ప్రధానమంత్రి ప్రగతి కార్యక్రమం’ (పీఎం-డివైన్‌) పథకాన్ని రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం కింద కూడా కేన్సర్ చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు గువహటిలోనూ ఒక ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని తెలిపారు.

   రోగ్య సంరక్షణ రంగంపై ప్రభుత్వ దార్శనికతను ప్రధానమంత్రి వెల్లడిస్తూ- ‘స్వాస్థ్య్‌ కే స‌ప్త‌రుషి’ కింద ఏడు కీలకాంశాల గురించి వివరించారు. అసలు వ్యాధి రాకుండా చూడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం. “అందుకే మా ప్రభుత్వం రోగనిరోధక ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. యోగా, శరీర దారుఢ్యం సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ఇందుకే” అని పేర్కొన్నారు. ఇక రెండోది... ఒకవేళ వ్యాధి సోకితే దాన్ని ప్రారంభ దశలోనే పసిగట్టాలన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్షలాది కొత్త నిర్ధారణ పరీక్ష కేంద్రాలు నిర్మితమవుతున్నాయని తెలిపారు. మూడో అంశం... ప్రజలకు వారి ఇళ్ల ముంగిటే మెరుగైన ప్రథమ చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నారు. ఈ దిశగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. నాలుగో అంశం... పేదలకు అత్యుత్తమ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందుబాటులో ఉండటమేనని తెలిపారు. ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకూ ఉచిత చికిత్స సౌకర్యం కల్పించిందన్నారు. ఐదో అంశంగా... మెరుగైన చికిత్స కోసం పెద్ద నగరాలపై ఆధారపడాల్సి రావడాన్ని తగ్గించడమేన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలపై ఎన్నడూ లేని రీతిలో పెట్టుబడులు పెడుతున్నది గుర్తుచేశారు.

   “దేశంలో 2014కు ముందు కేవలం 7 ‘ఎయిమ్స్‌’ మాత్రమే ఉండేవి. వీటిలో ఢిల్లీలో ఉన్నదానిలో తప్ప మిగిలిన వాటిలో ఎంబీబీఎస్‌ కోర్సుగానీ, అవుట్‌ పేషెంట్‌ విభాగం కానీ లేవు. పైగా కొన్నిటి నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. ఈ సమస్యలను సరిదిద్దడమే కాకుండా దేశంలో 16 కొత్త ‘ఎయిమ్స్‌’ నిర్మాణం చేపట్టాం. వీటిలో ‘ఎయిమ్స్‌-గువహటి’ కూడా ఒకటి” అని ప్రధానమంత్రి వివరించారు. ప్రభుత్వ దార్శనిక దృక్పథంలోని ఆరో అంశం గురించి మాట్లాడుతూ- “వైద్యుల కొరతను మా ప్రభుత్వం పరిష్కరిస్తోంది. ఈ మేరకు గడచిన ఏడేళ్లలో ఎంబీబీఎస్‌, పీజీ కోర్సులలో 70 వేలకుపైగా అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా 5 లక్షల మందికిపైగా ఆయుష్ వైద్యులను ప్రభుత్వం అల్లోపతి వైద్యులతో సమానంగా పరిగణిస్తోంది” అని ప్రధాని తెలిపారు. ప్రభుత్వం దృష్టి సారించిన ఏడో అంశం... ఆరోగ్య సేవల డిజిటలీకరణ, చికిత్సకు పెద్దపీట, చికిత్స పేరిట కలిగే ఇబ్బందుల నివారణకు కృషి చేయడమేనని ఆయన తెలిపారు. ఈ దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్నామని శ్రీ మోదీ వెల్లడించారు. “దేశంలోని పౌరులంతా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలగాలి. దేశంలో ఎక్కడా ఇందుకు ఎలాంటి పరిమితులూ ఉండరాదన్న‌దే మా ప్ర‌య‌త్నం. ‘ఒక దేశం-ఒకే ఆరోగ్యం’ స్ఫూర్తి ఇదే. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ ఎరుగని అతిపెద్ద మహమ్మారి సవాలును ఎదుర్కొనడంలో ఇది దేశానికి ఎనలేని బలాన్నిచ్చింది” అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

   కేన్సర్ చికిత్సకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉండటం ప్రజల మనసును తొలచివేసే సమస్య అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల కుటుంబం అప్పుల ఊబిలోకి, పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉన్నందున రోగులు... ముఖ్యంగా మహిళలు చికిత్సకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక ఔషధాల ధరను దాదాపు సగానికి తగ్గించడం ద్వారా కేన్సర్ మందులను అందరికీ అందుబాటులోకి తెస్తోందన్నారు. తద్వారా రోగులకు కనీసం రూ.1000 కోట్లదాకా ఆదా అవుతున్నదని చెప్పారు. జనౌషధి కేంద్రాల్లో ప్రస్తుతం 900కన్నా ఎక్కువ సంఖ్యలో మందులు సరస ధరతో అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు వచ్చే చాలామంది లబ్ధిదారులు కేన్సర్‌ రోగులేనని గుర్తుచేశారు.

   యుష్మాన్ భారత్, శ్రేయో కేంద్రాలు కేన్సర్ కేసులను తొలిదశలోనే పసిగట్టే విధంగా  పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. అస్సాం సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోగల ఈ కేంద్రాల్లో 15 కోట్ల మందికిపైగా ప్రజలు కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినందుకు అస్సాం ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుపై జాతీయ హామీ అమలుకు ముఖ్యమంత్రి, ఆయన బృందం అద్భుతంగా కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ ప్రశంసించారు. అస్సాంలో ఆక్సిజన్ నుంచి వెంటిలేటర్ల దాకా సకల సౌకర్యాలూ ఉండేవిధంగా చూడటానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నదని ఆయన పునరుద్ఘాటించారు. పిల్లలకు టీకాలు వేయడంతోపాటు పెద్దలకు ముందు జాగ్రత్త మోతాదుకు ఆమోదం తెలపడం ద్వారా టీకా పరిధిని ప్రభుత్వం విస్తరించిందని గుర్తుచేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని శ్రీ మోదీ కోరారు.

   తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌సహా ‘ప్రతి ఇంటికీ కొళాయి నీరు’ వంటి పథకాల ద్వారా మరిన్ని సౌకర్యాలను తేయాకు తోటల్లో పనిచేసే కుటుంబాలకు చేరువ చేస్తున్నదని ప్రధాని తెలిపారు.

   ప్రజా సంక్షేమానికి నేడు నిర్వచనం మారడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇవాళ దీని పరిధి ఎంతో విస్తరించబడిందని, లోగడ కేవలం కొన్ని రాయితీలు మాత్రమే ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉండేవని గుర్తుచేశారు. మౌలిక సదుపాయాలు, అనుసంధాన ప్రాజెక్టులు ప్రజా సంక్షేమంతో ముడిపడినవేననే ధ్యాస ఆనాడు లేదన్నారు. దీనివల్ల ప్రజలకు సేవా ప్రదానం చాలా కష్టంగా మారింది. ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు మారాయి... దేశం గత శతాబ్ద భావనలను వీడి ముందడుగు వేస్తోంది. అస్సాంలో రోడ్డు, రైలు, విమాన సేవల విస్తరణ విదితమవుతోంది. పేదలు, యువత, మహిళలు, పిల్లలు, అణగారిన, గిరిజన వర్గాలకు ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్... సబ్‌కా ప్రయాస్ స్ఫూర్తితో అసోంతోపాటు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని ప్రధానమంత్రి ముగించారు.

   స్సాం కేన్సర్ కేర్ ఫౌండేషన్, అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల సంయుక్త ప్రాజెక్టు కింద  రాష్ట్రవ్యాప్తంగా 17 కేన్సర్ ఆస్పత్రులతో దక్షిణాసియాలో అందరికీ అందుబాటులోగల అతిపెద్ద కేన్సర్ చికిత్స నెట్‌వర్క్‌ రూపకల్పనకు కృషి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ తొలిదశ కింద చేపట్టిన 10 ఆస్పత్రులకుగాను ఏడింటి నిర్మాణం పూర్తికాగా, మరో 3 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కాగా, ప్రాజెక్ట్ రెండో దశ కింద మరో 7 కొత్త కేన్సర్ ఆస్పత్రుల నిర్మాణం చేపడతారు.

 

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi