ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ రిషి సునాక్ కు మధ్య ఈ రోజు టెలిఫోన్ సంభాషణ జరిగింది. భారత్ -యుకె రోడ్ మాప్ 2030 లో భాగంగా అనేక ద్వైపాక్షిక అంశాలలో పురోగతిని ఇద్దరు ప్రధానులూ సమీక్షించారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుకున్న అంశాలను, ముఖ్యంగా వర్తక, ఆర్థిక రంగాలలో పెరుగుతున్న సహకారాన్ని చర్చించారు. ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వ్యవహారాన్ని త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాలని వారు అంగీకరించారు.
యుకె లోని భారత దౌత్య సంస్థల భద్రత విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులమీద కఱహయిన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ ప్రధానిని కోరారు. భారత రాయబార కార్యాలయం మీద దాడి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, భారత దౌత్య కార్యాలయాలకు, సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని ఈ సందర్భంగా రిషి సునాక్ జవాబిచ్చారు.
బ్రిటన్ లో ఆశ్రయం తీసుకున్న ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా లేవనెత్తారు. అలాంటి వాళ్ళను భారతదేశానికి తిప్పి పంపే విషయంలో పురోగతి కావాలని కోరారు. వాళ్ళని అప్పగిస్తే భారత న్యాయస్థానాల ముందు నిలబెట్టే వీలుకలుగుతుందని చెప్పారు.
2023 సెప్టెంబర్ లో జరిగే జి-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాల్సిందిగా ప్రధాని సునాక్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. జి-20 అధ్యక్ష హోదాలో భారత్ సాధిస్తున్న పురోగతిని సునాక్ అభినందించారు. భారత్ తీసుకునే చొరవలకు తమ పూర్తి అండ ఉంటుందని చెబుతూ భారత్ కు విజయం దక్కాలని ఆకాంక్షించారు.
బైశాఖీ సందర్భంగా ప్రధాని సునాక్ కు, యుకె లోని భారతీయులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తరచూ సంభాషించుకోవాలని ఇద్దరు నాయకులూ నిర్ణయించుకున్నారు.