మోదీ ప్రభుత్వ హయాం లో ‘పిఎమ్-ఆవాస్ యోజన’ తో ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు లబ్ధి చేకూరింది
January 20, 2021
Share
వర్తమాన ప్రభుత్వ పాలన కాలం లో ‘పిఎమ్ ఆవాస్ యోజన’ శర వేగంగా పురోగమిస్తోందని, ఉత్తర్ ప్రదేశ్ లో నిరు పేదలకు ఈ పథకం తోడ్పడిందని ప్రధాన మంత్రి అన్నారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్’ పథకం లో భాగం గా ఉత్తర్ ప్రదేశ్ లో 6 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగిన కార్యక్రమం లో విడుదల చేసి, ఆ సందర్భం లో ప్రసంగించారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ దేశ పౌరుల ఆత్మవిశ్వాసం తో నేరు గా ముడిపడివుందని, ఒక వ్యక్తి తాలూకు ఇల్లు ఈ ఆత్మవిశ్వాసాన్ని అనేక రెట్లు పెంచుతుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. తనకంటూ ఒక సొంత ఇంటి ని కలిగివుండడం జీవితానికి ఒక హామీ ని తీసుకు వస్తుందని, అంతేకాకుండా పేదరికం నుంచి వెలికి రాగలమన్న ఆశ ను కూడా కల్పిస్తుందన్నారు.
ఇదివరకటి ప్రభుత్వాల పాలన కాలాల్లో పేదలకు వారికంటూ ఒక ఇంటి ని ఏర్పరచుకొనేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందుకోగలుగుతామన్న విశ్వాసం లేకపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదివరకటి పథకం లో గృహాల నాణ్యత సైతం ఆశించిన మేరకు లేదు అని కూడా ఆయన అన్నారు. పేదవారు తప్పుడు విధానాల తాలూకు తీవ్రమైన దాడి కి లోనుకావలసి వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ దుర్దశ ను దృష్టి లో పెట్టుకొని, స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు పూర్తి కాక ముందే ప్రతి పేద కుటుంబానికి ఒక ఇంటి ని సమకూర్చాలి అనే లక్ష్యం తో ‘పిఎమ్ ఆవాస్ యోజన’ ను మొదలు పెట్టడమైందన్నారు. ఇటీవలి కొన్నేళ్ళలో 2 కోట్ల గృహాల ను నిర్మించడం జరిగిందని, ‘పిఎమ్ ఆవాస్ యోజన’ లో 1.25 కోట్ల గృహాల నిర్మాణం లో కేంద్ర ప్రభుత్వం అందించిన దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల తోడ్పాటు ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రం లో ఇదివరకటి ప్రభుత్వాలు ప్రతిస్పందించక పోవడాన్ని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లో 22 లక్షల గ్రామీణ ఆవాసాలు నిర్మాణం కావలసి ఉందని, వాటిలో 21.5 లక్షల నిర్మాణానికి ఆమోదముద్ర వేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వ హాయాము లో 14.5 లక్షల పరివారాలకు వారి గృహాలు ఈసరికే అందాయన్నారు.