రోజ్‌గార్ మేళా ద్వారా 51 వేల మంది యువతకు నియామక పత్రాలు అందించడం ఆనందదాయకం
దేశ నిర్మాణం దిశగా అడుగు వేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు: పీఎం
దేశ యువతకు గరిష్ఠ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలనేదే మా ప్రభుత్వ విధానం: పీఎం
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ ప్రయాణిస్తోంది: పీఎం
ప్రతి నూతన సాంకేతికతలో మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహించాం

వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు నియామకపత్రాలు అందించారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉద్యోగాలను కల్పించే అంశంలో ప్రధానమంత్రి కృతనిశ్చయాన్ని ఈ రోజ్‌గార్ మేళా తెలియజేస్తుంది. ఇది యువతకు తగిన అవకాశాలు కల్పించి జాతి నిర్మాణానికి సహకరిస్తుంది.

ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి... ధంతేరాస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సుమారుగా 500 ఏళ్ల తర్వాత అయోధ్య నగరంలో నిర్మించిన ఆలయంలో రాముడు కొలువు తీరిన నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి ప్రత్యేకమని అన్నారు. ఇలాంటి దీపావళి కోసం ఎన్నో తరాలు ఎదురుచూశాయని, దీనికోసం కొందరు ప్రాణత్యాగం చేస్తే, మరికొందరు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ సంబరాలను ప్రత్యక్షంగా చూసి, వాటిలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నందుకు ప్రస్తుత తరానికి చెందినవారు ఎంతో అదృష్టవంతులని ప్రధానమంత్రి అన్నారు. ఈ పండుగ వాతావరణంలో 51 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. నూతనంగా ఎంపికైన వారిని అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

లక్షలాది యువతకు శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి అన్నారు. బీజేపీ, ఎన్డీయే మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో సైతం లక్షల సంఖ్యలో యువతకు నియామకప్రతాలు అందజేశారని ఆయన తెలిపారు. హర్యానాలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం నుంచి 26,000 మంది యువతీ యువకులు ఉద్యోగాలు పొందడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొందని శ్రీ మోదీ అన్నారు. ఎలాంటి లంచాలు లేదా సిఫార్సులు లేకుండా ఉద్యోగాలు ఇస్తుందనే ప్రత్యేక గుర్తింపు హర్యానాలోని తమ ప్రభుత్వానికి ఉందని శ్రీ మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేళాలోని 51 వేల మందితో పాటు త్వరలోనే నియామక పత్రాలు అందుకోనున్న హర్యానాలోని 26,000 మందిని ఆయన అభినందించారు.  

దేశంలోని యువతరానికి వీలైనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి మరోసారి తెలియజేశారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం అనుసరించే విధానాలు, తీసుకునే నిర్ణయాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు, రోడ్లు, రైళ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల అభివృద్ధి, ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు, మొబైల్ టవర్ల ఏర్పాటు, దేశంలోని అన్ని ప్రాంతాలకూ నూతన పరిశ్రమల విస్తరణ తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. నీరు, గ్యాస్ పైప్‌లైన్ల ఏర్పాటు, నూతన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను స్థాపించడం, మౌలిక సదుపాయాలపై నిధులు వెచ్చించడం ద్వారా రవాణా ఖర్చును తగ్గించడం గురించి ప్రస్తావిస్తూ, ఇవి ప్రజలకు మేలు చేకూర్చడంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని శ్రీ మోదీ తెలిపారు. 

గుజరాత్‌లోని వడోదరాలో నిన్న రక్షణ రంగానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. విడిభాగాలు, ఇతర పరికరాలను తయారుచేయడం, బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఎంఎస్ఎంఈలు భారీగా ప్రయోజనం పొందడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఒక విమానం తయారు చేయడానికి 15,000 నుంచి 25,000 వరకు విడిభాగాలు అవసరమవుతాయని ప్రధాని తెలిపారు. ఒక భారీ పరిశ్రమ అవసరాలను తీర్చడంలో వేలాది చిన్న కర్మాగారాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని, తద్వారా భారత్ లోని ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

 

ఏదైనా పథకాన్ని ప్రారంభించినప్పుడు వ్యక్తులకు చేకూరే ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా విస్తృతంగా ఆలోచించి మొత్తం ఉపాధి కల్పన వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ప్రధానమంతి అన్నారు. సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ఉదహరిస్తూ.. గడచిన ఆరు నెలల్లో ఈ పథకానికి రెండు కోట్ల మంది వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 9,000 మందికి పైగా విక్రేతలు ఈ పథకంతో అనుసంధానమయ్యారని, ఇప్పటి వరకూ 5 లక్షలకు పైగా గృహాలకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా సమీప భవిష్యత్తులో 800 సోలార్ మోడల్ గ్రామాలను తీర్చిదిద్దేందకు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఇంటి పైకప్పుపై సోలార్ పలకలను ఏర్పాటు చేయడంలో 30 వేల మంది శిక్షణ పొందారన్నారు. ఫలితంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం దేశవ్యాప్తంగా తయారీదారులు, విక్రేతలు, పరికరాలను బిగించేవారు, మరమత్తు చేసేవారికి ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఆయన తెలిపారు.

గడచిన పదేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఖాదీ పరిశ్రమ రూపాంతరం చెందిందని, గ్రామీణ ప్రజలపై ప్రభావం చూపిందని, ప్రస్తుతం ఖాదీ గ్రామోద్యోగ్ ద్వారా చేస్తున్న వ్యాపారం రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ప్రధానమంత్రి తెలిపారు. పదేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే.. ప్రస్తుతం ఖాదీ విక్రయాలు 400 శాతం పెరిగాయని, ఫలితంగా కళాకారులు, చేనేత కార్మికులు, వ్యాపారులు లాభపడతారని, కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రధాని వివరించారు. గ్రామీణ మహిళలకు నూతన ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లఖ్‌పతి దీదీ పథకం గురించి శ్రీ మోదీ మాట్లాడారు. ‘‘గత దశాబ్దంలో 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరారు’’ అని తెలిపారు. ప్రస్తుతం 10 కోట్ల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని ఆయన అన్నారు. వారికి ప్రభుత్వం అడుగడుగునా సహకారం అందిస్తోందని, మూడు కోట్ల లఖ్‌పతి దీదీలను తయారుచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. "ఇప్పటి వరకు 1.25 కోట్ల మందికి పైగా మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారు. వారి వార్షిక ఆదాయం లక్ష రూపాయల కంటే ఎక్కువే" అని ఆయన వివరించారు.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ ముందుకు వెళుతోందని ప్రధానమంత్రి అన్నారు. భారత్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ... గతంలో దేశం ఎందుకు ఈ వేగాన్ని సాధించలేదన్న యువత ప్రశ్నను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వాల్లో స్పష్టమైన విధానాలు, ఉద్దేశాలు లేకపోవడమే దానికి కారణమని ప్రధానమంత్రి స్పష్టత ఇచ్చారు. అనేక రంగాల్లో, ముఖ్యంగా సాంకేతికతలో దేశం వెనుకబడి ఉండేదన్నారు.  అప్పట్లో ప్రపంచం నలుమూలల్లో తయారవుతున్న కొత్త టెక్నాలజీల కోసం భారత్ ఎదురుచూసేదని, పాశ్చాత్య దేశాల్లో కాలం చెల్లిన తర్వాత అవి మన దేశానికి వచ్చేవని గుర్తుచేశారు. ఆధునిక టెక్నాలజీని భారత్‌లో అభివృద్ధి చేయడం అసాధ్యమనే అభిప్రాయం ఉండేదని, ఇది దేశాన్ని వృద్ధి పరంగా వెనక్కు నెట్టిందని, అనేక ఉద్యోగ అవకాశాలను దూరం చేసిందని అన్నారు.

 

పాత ఆలోచనా ధోరణుల నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలను వివరించిన ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం ద్వారా అంతరిక్షం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు తదితర రంగాల్లో పాత విధానాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని పేర్కొన్నారు. సాంకేతిక పురోగతి, పెట్టుబడుల ఆవశ్యకతను వివరించిన ప్రధాని... నూతన టెక్నాలజీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావడానికి పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించామని వివరించారు. ఇది మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉద్యోగాల కల్పనను వేగవంతం చేసిందని తెలిపారు. యువతకు అవకాశాలు కల్పించే దిశగా ప్రతి రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ‘‘ప్రస్తుతం భారత దేశం భారీగా పెట్టుబడులను సమీకరిస్తోంది. రికార్డు స్థాయిలో అవకాశాల కల్పన జరుగుతోంది’’ అని వివరించారు. అలాగే గడచిన ఎనిమిది ఏళ్లలో 1.5 లక్షల అంకుర సంస్థలు దేశంలో ప్రారంభమయ్యాయని ప్రధాని తెలిపారు. అంకుర సంస్థల్లో భారత్ మూడో అతిపెద్ద వ్యవస్థగా అవతరించింది. ఈ సంస్థలు యువతకు ఎదిగేందుకు, ఉపాధిని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు.

నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని, దేశంలోని యువత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందని ప్రధాన మంత్రి వెల్లడించారు. అందుకే, స్కిల్ ఇండియా తరహా కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించిందని, అనేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువత శిక్షణ పొందుతున్నారని ఆయన అన్నారు. భారతీయ యువత అనుభవం సంపాదించేందుకు, అవకాశాలు పొందేందుకు కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా చూసేందుకు ఏర్పాట్లు చేశామని శ్రీ మోదీ అన్నారు. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ యోజనను ఉదహరిస్తూ, భారతదేశంలోని 500 అగ్రశ్రేణి సంస్థల్లో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు నిబంధనలు రూపొందించామన్నారు. ప్రతి ఇంటర్న్‌కు ఏడాది పాటు నెలకు రూ.5,000 చెల్లించి, రాబోయే 5 ఏళ్లలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో వాస్తవ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం యువతకు లభిస్తుందని, ఇది వారి కెరీర్‌కు ప్రయోజనకరమైన అనుభవాన్ని జోడిస్తుందని ఆయన అన్నారు.

భారత యువత విదేశాల్లో ఉద్యోగాలు సులభంగా పొందేందుకు భారత ప్రభుత్వం సరికొత్త అవకాశాలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలే జర్మనీ విడుదల చేసిన భారత్‌తో నైపుణ్య శ్రామిక విధానం గురించి వివరిస్తూ.. మన దేశ యువతకు ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచిందని శ్రీమోదీ తెలియజేశారు. దీని ద్వారా దేశ యువత ఎనలేని ప్రయోజనం పొందుతుందని అన్నారు. గల్ఫ్ దేశాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, మారిషస్, ఇజ్రాయెల్, యూకే, ఇటలీతో సహా ఇటీవల కాలంలో 21 దేశాలతో వలసలు, ఉపాధికి సంబంధించిన ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మూడు వేల మంది భారతీయులు యూకేలో పని చేయడానికి, చదువుకోవడానికి రెండేళ్ల వ్యవధి ఉన్న వీసా పొందవచ్చని తెలిపారు. ఆస్ట్రేలియాలో చదువుకొనేందుకు 3 వేల మంది భారతీయ విద్యార్థులకు అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. "భారత్ ప్రతిభ దేశ పురోగతికి మాత్రమే కాకుండా ప్రపంచ అభివృద్ధికి సైతం దిశానిర్దేశం చేస్తుంది" అని శ్రీ మోదీ అన్నారు. ఆ దిశగా భారత్ ముందుకు సాగుతోందని అన్నారు.

 

దేశంలోని యువత మొత్తానికి వారికి తగిన అవకాశాలు లభించి, తమ ఆకాంక్షలు నెరవేర్చుకొనేందుకు అనువైన ఆధునిక వ్యవస్థను రూపొందించడంలో ప్రభుత్వం పోషిస్తున్న పాత్రను శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో దేశంలోని యువత, ప్రజలకు వీలైనంత మేర సౌకర్యాలను కల్పించడమే నూతనంగా నియామకాలు పొందిన వారి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వోద్యోగాన్ని పొందడంలో పన్ను చెల్లింపుదారులు, పౌరులు పోషిస్తున్న క్రియాశీలక పాత్ర గురించి వివరించిన ప్రధానమంత్రి, వారి వల్లే ప్రభుత్వం ఉనికిలో ఉందని, వారికి సేవ చేసేందుకే విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పోస్ట్ మ్యాన్ అయినా, ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్నా దేశానికి సేవచేయడమే ప్రథమ కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పించుకున్న ఈ తరుణంలో కొత్తగా నియామకాలు పొందిన వారు విధుల్లో చేరారని శ్రీమోదీ వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి రంగంలోనూ రాణించాలని, పూర్తి సామర్థ్యాన్ని వినియోగించాలని కోరారు. కొత్తగా నియమితులైన వారు మంచి పనితీరుతో పాటు ప్రతిభ కనబరిచేందుకు కృషి చేయాలని కోరారు. ‘‘మన దేశంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు. వారిపై దేశానికి ఎన్నో అంచనాలున్నాయని, విధులను నిర్వర్తించే విషయంలో వాటిని అందుకోవాలని స్పష్టం చేశారు.

నూతనంగా నియామకాలు పొందినవారు కొత్తగా తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారని, ఎల్లప్పుడూ వినయంగా ఉంటూ నేర్చుకునే అలవాటును కొనసాగించాలని కోరారు. ఐజీవోటీ కర్మయోగి ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వారి సౌలభ్యం మేరకు డిజిటల్ శిక్షణ పాఠాలను నేర్చుకోవాలని ప్రోత్సహించారు. ‘‘ఈ రోజు నియామకపత్రాలు అందుకున్నవారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.  

నేపథ్యం

రెవెన్యూ, ఉన్నత విద్యా విభాగం, హోం మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన వారితో దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో రోజ్‌గార్ మేళా నిర్వహించారు.

కొత్తగా నియమకాలు పొందిన వారు ఐజీవోటీ కర్మయోగి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ మాడ్యూల్ ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా ప్రారంభ శిక్షణను పొందే అవకాశం ఉంటుంది. దీనిలో అందుబాటులో ఉన్న 1400కు పైగా ఇ-లెర్నింగ్ కోర్సులు వారిలో అవసరమైన నైపుణ్యాలను పెంచి, సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చడానికి, వికసిత్ భారత్‌ను నిర్మించడానికి దోహదపడతాయి.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"