ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రూ.11,300 కోట్ల కు పైగా విలువ చేసే వివిధ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్, ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టులకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైల్వేకు సంబంధించిన కొన్ని ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ -తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని పెంచే అవకాశం
వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ సిటీ హైదరాబాద్ ను వేంకటేశ్వర స్వామి కొలువు ఉండే తిరుపతి తో కలిపే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గుర్తు చేశారు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ విశ్వాసం, ఆధునికత, సాంకేతికత, పర్యాటకాన్ని విజయవంతంగా అనుసంధానిస్తుందని శ్రీ మోదీ అన్నారు. రైల్వేలు, రోడ్డు కనెక్టివిటీ, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి రూ.11,300 కోట్లకు పైగా విలువైన ఈ రోజు ప్రాజెక్టులకు గానూ తెలంగాణ పౌరులను ప్రధాని అభినందించారు.
కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వంతో సమానంగా తెలంగాణ రాష్ట్రం ఉనికి ప్రారంభం అయిందని, రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని ఆయన అన్నారు.
"తెలంగాణ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత కేంద్రంలోని ప్రభుత్వానిదే" అని అంటూ, 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' స్ఫూర్తి ని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లుగా భారత్ రూపొందించిన అభివృద్ధి నమూనాను తెలంగాణ సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. నగరాలలో అభివృద్ధికి ఉదాహరణలు పేర్కొంటూ, గత తొమ్మిదేళ్లలో 70 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో నెట్ వర్క్ ను, హైదరాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం (ఎంఎంటీఎస్ ) అభివృద్ధిలో సాధించిన పురోగతిని వివరించారు. ఈ రోజు 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించడం గురించి ప్రస్తావిస్తూ, హైదరాబాద్, సికింద్రాబాద్, సమీప జిల్లాల్లోని లక్షలాది మంది పౌరులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కొత్త వ్యాపార కేంద్రాలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా తెలంగాణకు రూ.600 కోట్లు కేటాయించినట్లు ప్రధాని తెలిపారు.
కోవిడ్ -19 మహమ్మారి , రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్యంగా క్షీణించాయని పేర్కొన్న ప్రధాన మంత్రి, అయినా ఆధునిక మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టిన కొద్ది దేశాలలో భారతదేశం ఒకటని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లో భారత్ లో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రైల్వే బడ్జెట్ పదిహేడు రెట్లు పెరిగిందని, కొత్త రైలు మార్గాలు, రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులు రికార్డు సమయంలో జరిగాయన్నారు. సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ ప్రాజెక్టు విద్యుదీకరణ ఇందుకు ప్రధాన ఉదాహరణ అని, హైదరాబాద్ - బెంగళూరు మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి ప్రాజెక్టు ను చేపట్టినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.
రైల్వేలతో పాటు తెలంగాణలో హైవే నెట్ వర్క్ ను కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ ఈ రోజు శంకుస్థాపన చేసిన నాలుగు హైవే ప్రాజెక్టులను ప్రధాని ప్రస్తావించారు.
రూ.2300 కోట్లతో నిర్మిస్తున్న హైవేలో అక్కల్కోట్-కర్నూలు సెక్షన్, రూ.1300 కోట్లతో మహబూబ్నగర్-చించోలి సెక్షన్, రూ.900 కోట్లతో కల్వకుర్తి-కొల్లాపూర్ సెక్షన్, రూ.2700 కోట్లతో ఖమ్మం-దేవరపల్లి సెక్షన్ వీటిలో ఉన్నాయి. తెలంగాణలో అధునాతన రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి వనరులతో నాయకత్వం వహిస్తోందని ప్రధాని ఉద్ఘాటించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు జాతీయ రహదారుల పొడవు 2500 కిలోమీటర్లు ఉండగా నేడు 5 వేల కిలోమీటర్లకు పెరిగిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ఖర్చు చేసిందని శ్రీ మోదీ చెప్పారు. ఆటను మార్చే హైదరాబాద్ రింగ్ రోడ్డుతో సహా తెలంగాణలో రూ.60 వేల కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
తెలంగాణలో పరిశ్రమలు, వ్యవసాయం రెండింటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రైతుకు, శ్రామికుడికి బలాన్నిచ్చే పరిశ్రమల్లో టెక్స్ టైల్ ఒకటని, దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వాటిలో తెలంగాణ కూడా ఒకటని ప్రధాని తెలిపారు. తద్వారా యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ కు నేడు శంకుస్థాపన చేయడాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో విద్య, వైద్య రంగాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందన్నారు. నేటి ప్రాజెక్టులు తెలంగాణలో (సులభ ప్రయాణం ) , ఈజ్ ఆఫ్ ట్రావెల్), సులభ జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్), సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పెంచుతాయని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో పలు కేంద్ర ప్రాజెక్టులు పూర్తికావడంలో జాప్యం జరుగుతోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందువల్ల తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారని, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని, ప్రక్రియ ను. వేగవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి, అయితే అభివృద్ధి , పురోగతిని చూసి కొద్దిమంది చాలా ఆందోళన చెందుతున్నారని అన్నారు. బంధుప్రీతి, అవినీతిని పెంచిపోషిస్తున్న వారికి దేశ ప్రయోజనాలతో పాటు సమాజ శ్రేయస్సుతో సంబంధం లేదని, వారు నిజాయితీగా పనిచేసే వారికి కూడా సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. వారు ప్రతి ప్రాజెక్టులోనూ, పెట్టుబడుల విషయంలోనూ తమ కుటుంబ ప్రయోజనాలే చూసుకుంటున్నారని, అది గుర్తించాలని ఆయన తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. అవినీతికి, బంధుప్రీతికి ఉన్న సారూప్యతలను వివరిస్తూ, బంధుప్రీతి ఉన్నప్పుడు అవినీతి వృద్ధి చెందడం ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
"కుటుంబవాదం, వంశపారంపర్య రాజకీయాల ప్రధాన మంత్రం నియంత్రణ" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి సూత్రాలపై తన విమర్శలను మరింత ముందుకు తీసుకెళ్లిన ప్రధాన మంత్రి, రాజవంశాలు ప్రతి వ్యవస్థపై తమ నియంత్రణనునిలుపుకోవాలనుకుంటాయని, ఎవరైనా వారి నియంత్రణను సవాలు చేసినప్పుడు ద్వేషిస్తారని అన్నారు.
ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్) ను, దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ ను ప్రోత్సహించడాన్ని ఉదాహరణగా చూపుతూ, ఏ లబ్ధిదారుడికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నియంత్రించే కుటుంబ పాలకుల వైపు వేలెత్తి చూపుతూ, ఈ పరిస్థితి నుంచి ఉద్భవించే మూడు అర్థాలను వివరించారు. మొదటిది, కుటుంబాన్ని ప్రశంసిస్తూనే ఉండాలని, రెండోది అవినీతి సొమ్ము కుటుంబానికి వస్తూనే ఉండాలని, మూడవది పేదలకు పంపే డబ్బు అవినీతిపరుల చేతికి అందుతూనే ఉండాలని ప్రధాని అన్నారు. ‘‘ఈ రోజు మోదీ అవినీతికి అసలు మూలమైన ఈ దాడి చేశారు. అందుకే వీళ్లు వణికిపోతున్నారు, ఏ పని చేసినా కోపంతోనే చేస్తున్నారు' అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘దీనిపై కోర్టుకు కూడా వెళ్లిన రాజకీయ పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది‘‘ అన్నారు.
సబ్ కా వికాస్ (ప్రతి ఒక్కరి అభివృద్ధి) స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని నిజమైన అర్థంలో బలోపేతం చేసినప్పుడే రాజ్యాంగ నిజమైన స్ఫూర్తి సాకారమవుతుందని ఆన్నారు. 2014లో కేంద్ర ప్రభుత్వం వారసత్వ రాజకీయాల సంకెళ్ల నుంచి విముక్తి పొందిన ఫలితాన్ని దేశం మొత్తం చూస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు.
గత తొమ్మిదేళ్లలో దేశంలోని 11 కోట్ల మంది తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని, ఇందులో తెలంగాణకు చెందిన 30 లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. గత 9 ఏళ్లలో దేశంలో 9 కోట్లకు పైగా అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇందులో తెలంగాణలోని 11 లక్షలకు పైగా పేద కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.
నేడు తమ ప్రభుత్వంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నామని, పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, తెలంగాణలో తొలిసారి కోటి కుటుంబాలకు జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరిచామని, తెలంగాణలోని రెండున్నర లక్షల మంది చిరు వ్యాపారులకు గ్యారంటీ లేకుండా ముద్రా రుణాలు వచ్చాయని తెలిపారు. 5 లక్షల మంది వీధి వ్యాపారులకు తొలిసారి బ్యాంకు రుణాలు లభించగా, తెలంగాణలోని 40 లక్షల మందికి పైగా చిన్న రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు రూ.9 వేల కోట్లు అందాయి.
దేశం 'తుష్టికరణ్' (కొందరి తృప్తి) నుంచి ‘సంతుష్టికరణ్' (అందరి సంతృప్తి) వైపు మళ్లినప్పుడు నిజమైన సామాజిక న్యాయం పుడుతుంది' అని ప్రధాన మంత్రి అన్నారు. తెలంగాణతో సహా యావత్ దేశం సంతులిత బాటలో నడవాలని, సబ్ కా ప్రయాస్ తో అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటోందన్నారు. "ఆజాదీ కా అమృత్ కాల్ లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి తెలంగాణ త్వరితగతిన అభివృద్ధి చెందడం చాలా ముఖ్యం" అని ప్రధాన మంత్రి అన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో రాబోయే 25 సంవత్సరాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ముగించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
నేపథ్యం
రూ.720 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టు లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సుందరంగా డిజైన్ చేసిన ఐకానిక్ స్టేషన్ భవనంతో పెద్దఎత్తున రూపు రేఖలు మార్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రైల్ నుంచి ఇతర మార్గాల్లోకి ప్రయాణికులను నిరాటంకంగా తరలించేందుకు మల్టీమోడల్ కనెక్టివిటీతో పాటు అన్ని ప్రయాణీకుల సౌకర్యాలతో డబుల్ లెవల్ విశాలమైన రూఫ్ ప్లాజాను అభివృద్ధి చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తూ, హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల సబర్బన్ విభాగంలో 13 కొత్త మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (ఎం ఎం టి ఎస్ ) లను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ ప్రాజెక్టు డబ్లింగ్ , విద్యుదీకరణను ఆయన జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.1,410 కోట్ల వ్యయంతో 85 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు అంతరాయం లేని కనెక్టివిటీని అందిస్తుంది. రైళ్ల సగటు వేగాన్ని పెంచుతుంది.
హైదరాబాద్ బీబీనగర్ ఎయిమ్స్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్న ప్రధాని దార్శనికతకు ఇది నిదర్శనం. బీబీనగర్ ఎయిమ్స్ ను రూ.1,350 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు.
బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు తెలంగాణ ప్రజలకు సమగ్ర, నాణ్యమైన, సంపూర్ణ ఆరోగ్య సేవలను వారి ఇంటి ముంగిటకే అందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి.
ప్రధాని శంకుస్థాపన చేసిన రూ.7,850 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రహదారి అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి.
तेलंगाना-आंध्र प्रदेश को जोड़ने वाली वंदेभारत एक्सप्रेस, आस्था, आधुनिकता, टेक्नॉलॉजी और टूरिज्म को कनेक्ट करने वाली है। pic.twitter.com/gtfH3swsnA
— PMO India (@PMOIndia) April 8, 2023
आज का नया भारत, 21वीं सदी का नया भारत, तेजी से देश के कोने-कोने में मॉडर्न इंफ्रा बना रहा है। pic.twitter.com/KAf3YEYG29
— PMO India (@PMOIndia) April 8, 2023
The projects launched today in Telangana will further 'Ease of Travel,' 'Ease of Living' as well as 'Ease of Doing Business' in the state. pic.twitter.com/wOrCyfcRQW
— PMO India (@PMOIndia) April 8, 2023
हम सबका साथ-सबका विकास-सबका विश्वास-सबका प्रयास के मंत्र को लेकर आगे बढ़ रहे हैं। pic.twitter.com/0izB7Bbcck
— PMO India (@PMOIndia) April 8, 2023