అమృత్‌సర్-జామ్‌నగర్ ఆర్థిక కారిడార్‌లో 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్’ప్రెస్’వే విభాగం జాతికి అంకితం;
గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం నిర్మించిన అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార లైన్ తొలి దశ జాతికి అంకితం;
బీకానేర్-భివాడి విద్యుత్‌ ప్రసార లైన్ జాతికి అంకితం;
బీకానేర్‌లో 30 పడకల ఇఎస్‌ఐసి ఆస్పత్రి జాతికి అంకితం;
బీకానేర్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి శంకుస్థాపన;
చురు-రత్నగఢ్‌ మధ్య 43 కిలోమీటర్ల రైలు మార్గం డబ్లింగ్‌కు పునాది;
“జాతీయ రహదారుల విషయంలో రాజస్థాన్‌ ద్విశతకం సాధించింది”;
“అపార సామర్థ్యం.. అవకాశాలకు రాజస్థాన్‌ ఓ కూడలి”;
“గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్’ప్రెస్’వే ద్వారా పశ్చిమ భారతంలో ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం”;
“సరిహద్దు గ్రామాలను దేశానికి ప్రవేశ గ్రామాలుగా మేం ప్రకటించాం”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బీకానేర్‌లో రూ.24,300 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా అమృత్‌సర్-జామ్‌నగర్ ఆర్థిక కారిడార్‌లో రూ.11,125 కోట్లతో నిర్మించిన 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్’ప్రెస్’వే విభాగాన్ని జాతికి అంకితం చేశారు. అలాగే గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ.10,950 కోట్లతో నిర్మించిన అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార లైన్ తొలి దశను; బీకానేర్-భివాడి మధ్య రూ.1,340 కోట్లతో పవర్‌ గ్రిడ్‌ సంస్థ నిర్మించిన విద్యుత్‌ ప్రసార లైన్‌ను; బీకానేర్‌లో ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ (ఇఎస్‌ఐసి)కి చెందిన 30 పడకల కొత్త ఆస్పత్రి తదితరాలను ఆయన జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా రూ.450 కోట్లతో చేపట్టే బీకానేర్ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు; చురు-రత్నగఢ్ మధ్య 43 కిలోమీటర్ల మేర రైలు మార్గం డబ్లింగ్‌ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

   అనంతరం అసమాన యోధుల పురిటిగడ్డకు నివాళి అర్పిస్తూ అక్కడి జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి సదా అంకితమైన ప్ర‌జ‌లు వివిధ అభివృద్ధి పథకాలను తన చేతులమీదుగా జాతికి అంకితం చేసే అవకాశం ఎల్లప్పుడూ ఇస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇవాళ రూ.24,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన గురించి ప్రస్తావిస్తూ- రాజస్థాన్‌కు కేవలం నెల వ్యవధిలోనే రెండు ఆధునిక 6 వరుసల ఎక్స్’ప్రెస్’వేలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో  ఢిల్లీ-ముంబై ఎక్స్’ప్రెస్’వే కారిడార్‌లో భాగమైన ఢిల్లీ-దౌసా- లాల్సోట్ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమృత్‌సర్-జామ్‌నగర్ ఎక్స్’ప్రెస్’వేలో భాగమైన 500 కిలోమీటర్ల 6 వరుసల విభాగాన్ని జాతికి అంకితం చేసే అవకాశం లభించిందంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “జాతీయ రహదారుల విషయంలో ఒక విధంగా రాజస్థాన్‌ ద్విశతకం సాధించింది” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌తోపాటు ‘ఇఎస్‌ఐసి’ ఆస్పత్రి అందుబాటులోకి రావడంపై బీకానేర్‌, రాజస్థాన్‌ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

 

   రాజస్థాన్ రాష్ట్రం సదా సామర్థ్య సమృద్ధి, అపార అవకాశాల నిలయమని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఇలాంటి అభివృద్ధి సామర్థ్యం ఫలితంగానే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పారిశ్రామిక ప్రగతికి అంతులేని అవకాశాలు ఉన్నందున అనుసంధానం అత్యంత ఆధునికంగా మారుతోందని చెప్పారు. ఆ మేరకు వేగవంతమైన ఎక్స్’ప్రెస్’వేలు, రైల్వేలు రాష్ట్రంలో పర్యాటక వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా ఇక్కడి యువతకు ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరించారు.

   రాష్ట్రంలో ఇవాళ ప్రారంభించిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్’ప్రెస్’వే హర్యానా, పంజాబ్, గుజరాత్, జమ్ముకశ్మీర్‌తో రాజస్థాన్‌ను కలుపుతుందని చెప్పారు. అంతేకాకుండా రాజస్థాన్‌ నుంచి జామ్‌నగర్, కాండ్లా వంటి కీలక వాణిజ్య ఓడరేవులు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రధాని తెలిపారు. బీకానేర్‌-అమృత్‌సర్, జోధ్‌పూర్ల మధ్య; జోధ్‌పూర్-గుజరాత్ మధ్య దూరం తగ్గుతుందన్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు, వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆయన నొక్కిచెప్పారు. “ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్’ప్రెస్’వే ద్వారా పశ్చిమ భారతంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత బలోపేతం కాగలవు” అని ప్రధాని పేర్కొన్నారు. చమురు క్షేత్ర-శుద్ధి కర్మాగారాలతో అనుసంధానం పెరగడాన్ని ప్రస్తావిస్తూ- ఇది సరఫరాను పటిష్టం చేయడంతోపాటు దేశంలో ఆర్థిక పరిణామ వేగాన్ని పెంచుతుందని చెప్పారు.

   రైలు మార్గాల డబ్లింగ్‌ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- రాజస్థాన్‌లో రైల్వేల వృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమన్నారు. ఈ మేరకు 2004-2014 మధ్య రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి వార్షిక కేటాయింపులు సగటున రూ.1,000 కోట్లు కాగా, ఆ తర్వాత రూ.10,000 కోట్లకు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. మౌలిక సదుపాయాలతో ప్రధానంగా చిన్న వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు లబ్ధిపొందుతాయని ప్రధానమంత్రి అన్నారు. బీకానేర్‌లోని చిన్న వ్యాపారుల పచ్చళ్లు, అప్పడాలు, తినుబండారాల వంటి ఉత్పత్తులు ప్రస్తుత అనుసంధాన సౌలభ్యంతో ప్రపంచంలోని ప్రతి మూలకూ వెళ్లగలవని చెప్పారు. 

   రాజస్థాన్ అభివృద్ధికి ప్రయత్నాలను కొనసాగిస్తూ, దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన సరిహద్దు గ్రామాల కోసం వైబ్రంట్ విలేజ్ పథకాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. “మేము సరిహద్దు గ్రామాలను దేశంలోని ‘మొదటి గ్రామాలు’గా ప్రకటించాము. ఈ ప్రాంతాలలో అభివృద్ధికి దారి తీస్తుంది మరియు ఈ ప్రాంతాలను సందర్శించడం పట్ల దేశ ప్రజలలో కొత్త ఆసక్తిని పెంచింది” అని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషితోపాటు చిరకాలం నుంచీ నిర్లక్ష్యానికి గురైన సరిహద్దు గ్రామాల కోసం ‘పటిష్ట గ్రామాల పథకం’ ప్రవేశపెట్టామని ప్రధాని చెప్పారు. ఇందులో భాగంగా “సరిహద్దు గ్రామాలను దేశానికి తొలి గ్రామాలుగా మేం ప్రకటించాం. ఈ ప్రాంతాల అభివృద్ధితోపాటు దేశీయ పర్యాటకులలో ఈ గ్రామాల సందర్శనాసక్తి పెరిగింది” అని ఆయన వివరించారు.

   రాజస్థాన్‌లో కర్ణిమాత, సలాసర్ బాలాజీ ఆశీర్వాదాల గురించి ప్రధాని మాట్లాడుతూ- రాష్ట్రం సదా అభివృద్ధి శిఖరాగ్రాన నిలవాలని ప్రార్థించారు. తదనుగుణంగా రాష్ట్ర ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని చెప్పారు. అయితే, సమష్టి కృషితో రాజస్థాన్ ప్రగతి లక్ష్యాలన్నీ సాకారం కాగలవని ఆయన ఆశాభావం వెలిబుచ్చుతూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్రాజ్ మిశ్రా, కేంద్ర రోడ్డు  రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర న్యాయ-చట్ట శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ  శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   ప్రధానమంత్రి ఇవాళ అమృత్‌సర్-జామ్‌నగర్ ఆర్థిక కారిడార్‌లో ఆరు వరుసల హరితక్షేత్ర ఎక్స్’ప్రెస్’వే మార్గాన్ని జాతికి అంకితం చేశారు. రాజస్థాన్‌లోని హనుమాన్గఢ్ జిల్లా జఖ్‌దావలి గ్రామం నుంచి జలోర్ జిల్లా ఖెత్లావాస్ గ్రామందాకా 500 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో దాదాపు రూ.11,125 కోట్లతో పనులు పూర్తిచేశారు. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. అలాగే ప్రధాన నగరాలు-పారిశ్రామిక కారిడార్ల మధ్య అనుసంధానం పెరుగుతుంది. దీంతోపాటు నిరంతర రవాణా సౌలభ్యం వల్ల ఈ మార్గంలో పర్యాటకానికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు లభిస్తుంది.

   మరోవైపు ఈ ప్రాంత ప్రగతికి నూతనోత్తేజమిస్తూ- గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ కోసం రమారమి రూ.10,950 కోట్ల వ్యయంతో వేసిన అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా లైను తొలిదశను ప్రధాని జాతికి అంకితం చేశారు. పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో దాదాపు 6 గిగావాట్ల పునరుత్పాదక-తాప విద్యుత్తు తయారీ సమీకృతం అవుతుంది. అలాగే గ్రిడ్‌ సమతూకానికి ఈ కారిడార్‌ ఎంతగానో దోహదం చేస్తుంది. తద్వారా ఉత్తర-పశ్చిమ ప్రాంతాల సరఫరా సామర్థ్యం బలోపేతమవుతుంది. దీంతోపాటు బీకానేర్‌-భివాడి విద్యుత్‌ సరఫరా లైన్‌ను కూడా ప్రధామంత్రి జాతికి అంకితం చేశారు. పవర్‌గ్రిడ్‌ ఆధ్వర్యంలో రూ.1,340 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ లైను రాజస్థాన్‌లో ఉత్పత్తయ్యే 8.1 గిగావాట్ల సౌరశక్తి తరలింపులో తోడ్పడుతుంది.

   బీకానేర్లో నిర్మించిన కొత్త 30 పడకల ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ (ఇఎస్‌ఐసి) ఆస్పత్రిని ప్రధాని జాతికి అంకితం చేశారు. దీన్ని 100 పడకల స్థాయికి పెంచగలిగేలా అదనపు సదుపాయాలతో నిర్మించారు. తద్వారా ఇదొక కీలక ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా రూపొంది,  స్థానిక సమాజ వైద్య అవసరాలు తీర్చడంతోపాటు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతకు భరోసా ఇస్తుంది. ఇవేకాకుండా రూ.450 కోట్లతో చేపట్టే బీకానేర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో భాగంగా ఫ్లోరింగ్, సీలింగ్ సహా అన్ని ప్లాట్‌ఫామ్‌ల పునరుద్ధరణ చేపడతారు. స్టేషన్‌ ఆధునికీకరణ చేపట్టినప్పటికీ దీని వారసత్వ హోదా చెక్కుచెదరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరోవైపు చురు-రతన్‌గఢ్ సెక్షన్‌లో 43 కిలోమీటర్ల రైలుమార్గం డబ్లింగ్ పనులకూ ప్రధాని పునాదిరాయి వేశారు. దీంతో అనుసంధానం మెరుగుపడి బీకానేర్‌ ప్రాంతం నుంచి జిప్సం, సున్నపురాయి, ఆహార ధాన్యాలు, ఎరువుల ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు సులువుగా రవాణా చేసే వెసులుబాటు కలుగుతుంది. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage