అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ కాల్ చేసి ఆయనతో మాట్లాడారు.
అమెరికా అధ్యక్షునిగా శ్రీ ట్రంప్ మళ్ళీ ఎన్నికైనందుకు ఆయనకు, అంతేకాకుండా అమెరికాలో దిగువ సభ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ విజేతగా నిలిచినందుకు ఆ పార్టీకి కూడా ప్రధాని అభినందనలు తెలిపారు.
శ్రీ ట్రంప్ సాధించిన అద్భుత, అఖండ విజయం ఆయన నాయకత్వమన్నా, ఆయన దృష్టికోణమన్నా అమెరికా ప్రజలకు ఎంత ప్రగాఢ విశ్వాసం ఉన్నదీ తెలియజేస్తోందని ప్రధాని అన్నారు.
శ్రీ ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న కాలంలో భారత్ - అమెరికా భాగస్వామ్యం సానుకూల పురోగతిని సాధించిన సంగతిని ప్రధాని ప్రస్తావిస్తూ... ఉభయుల మధ్య మరపురాని సంభాషణలు చోటుచేసుకొన్నాయని గుర్తు చేసుకొన్నారు. 2019 సెప్టెంబరులో హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని, 2020 ఫిబ్రవరిలో అధ్యక్షుడు శ్రీ ట్రంప్ భారతదేశంలో పర్యటించినప్పుడు అహ్మదాబాద్ లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా శ్రీ మోదీ గుర్తుకు తెచ్చారు.
భారత్ - అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ రెండు దేశాల ప్రజల మేలుకే కాకుండా ప్రపంచ శాంతికి, ప్రపంచ సుస్థిరతకు కూడా ఎంత ముఖ్యమో నేతలిద్దరూ ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు.
టెక్నాలజీ, రక్షణ, ఇంధనం, అంతరిక్ష రంగం, ఇంకా అనేక ఇతర రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలపరచుకోవడానికి కలసి పనిచేస్తూనే ఉందామంటూ వారీ విషయంలో వారికున్న నిబద్ధతను మరోమారు స్పష్టం చేశారు.
Had a great conversation with my friend, President @realDonaldTrump, congratulating him on his spectacular victory. Looking forward to working closely together once again to further strengthen India-US relations across technology, defence, energy, space and several other sectors.
— Narendra Modi (@narendramodi) November 6, 2024