దీపావళి పండుగ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో మన సాహస భద్రత దళాలతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జవాన్లనుద్దేశించి మాట్లాడుతూ- దీపావళి పండుగనాడు ఈ కలయిక, జవాన్ల ధైర్యసాహసాల ప్రతిధ్వనులు దేశంలోని ప్రతి పౌరునికీ చైతన్యం కలిగించే క్షణాలని అభివర్ణించారు. దేశంలోని చివరి గ్రామంగా ఉండి, నేడు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన లెప్చా పరిధిలో సరిహద్దు ప్రాంతాల జవాన్లతో సంయుక్తంగా ఆయన దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో తన అనుభవాలను వివరిస్తూ… కుటుంబం ఎక్కడుంటే అక్కడ పండుగలు, సంబరాలు సహజమని వ్యాఖ్యానించారు. అయితే, కర్తవ్య నిర్వహణ నిబద్ధత మేరకు సరిహద్దుల రక్షణలో వీర సైనికులు పండుగ రోజున కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే, 140 కోట్ల మంది భారతీయులూ తమ కుటుంబసభ్యులనే భావన భద్రత సిబ్బందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. “అందుకే దేశం మీకెంతో రుణపడి ఉంటుంది… మీకు సదా కృతజ్ఞతలు తెలుపుతుంది. మీ భద్రతను ఆకాంక్షిస్తూ ఇంటింటా ఒక ‘దివ్వె’ను వెలిగిస్తారు” అని ఆయన అన్నారు. ‘‘జవాన్లు విధులు నిర్వర్తించే ప్రదేశం నాకు దేవాలయంతో సమానం. మీరెక్కడుంటే అక్కడే నా పండుగ సంబరం. ఈ ఆనవాయితీని దాదాపు 30-35 సంవత్సరాలుగా కొనసాగుతోంది’’ అన్నారు.
జవాన్లకు, సాయుధ బలగాల త్యాగ సంప్రదాయానికి ప్రధాని నివాళి అర్పించారు. దేశ సరిహద్దులో అత్యంత బలమైన రక్షణ కవచంగా వీర జవాన్లు తమను తాము రుజువు చేసుకున్నారని ఆయన అన్నారు. ‘‘మన వీర సైనికులు ఓటమి అంచుల నుంచి విజయాన్ని ఒడిసిపడుతూ పౌరుల హృదయాలను సదా గెలుచుకుంటుంటారు’’ అని ప్రధాని కొనియాడారు. దేశ నిర్మాణంలో సాయుధ బలగాల సేవలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు, భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు… ముఖ్యంగా అంతర్జాతీయ శాంతి మిషన్లలో భాగంగానూ ప్రజల ప్రాణరక్షణలో మన సాయుధ బలగాల చొరవ అపూర్వమని ప్రధాని పేర్కొన్నారు. ఈ విధంగా మన వీర జవాన్లు భారత ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చారు’’ ఆయన వివరించారు. శాంతి పరిరక్షక సేవలందించిన సైనికుల కోసం స్మారక మందిర నిర్మాణంపై గత ఏడాది ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించినట్లు ప్రధాని గుర్తుచేశారు. దీనికి ఏకగ్రీవ ఆమోదం లభించిందని, ప్రపంచ శాంతిని సుస్థిరం చేయడంలో వారి సేవలను ఇది చిరస్మరణీయం చేస్తుందని తెలిపారు.
భారత పౌరుల రక్షణలోనే కాకుండా విదేశీయులకు ఆపన్న హస్తం అందించే కార్యకలాపాల్లోనూ భారత సాయుధ బలగాల పాత్రను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు సూడాన్‌లో కల్లోల పరిస్థితుల నుంచి ప్రజల తరలింపు, తుర్కియేలో భూకంపం అనంతర రక్షణ కార్యకలాపాల్లో మన సైనికుల అవిశ్రాంత సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘యుద్ధ క్షేత్రం నుంచి రక్షణ కార్యకలాపాలదాకా భారత సాయుధ దళాలు ప్రజల ప్రాణ రక్షణకు అంకితమయ్యాయి’’ అని ప్రధాని ప్రశంసించారు. ఆపన్న హస్తం అందించడంలో వారి నిబద్ధత చూసి ప్రతి పౌరుడూ గర్విస్తున్నారని పేర్కొన్నారు. నేటి భౌగోళిక పరిస్థితులలో భారతదేశంపై ప్రపంచం అంచనాలను ప్రధాని ప్రస్తావిస్తూ- సురక్షిత సరిహద్దులతోపాటు దేశంలో శాంతి, సుస్థిరతల ప్రాధాన్యాన్ని కూడా పునరుద్ఘాటించారు. ‘‘మన వీర సైనికులు హిమాలయాల్లా దృఢ సంకల్పంతో మన సరిహద్దులను పరిరక్షిస్తున్నారు కాబట్టే భారతదేశం సురక్షితంగా ఉంది’’ అని ఆయన వివరించారు.
గత దీపావళి నుంచి ఏడాది కాలంలో దేశం సాధించిన అనేక ప్రధాన విజయాలను ప్రధాని ఈ సందర్భంగా ఏకరవు పెట్టారు. ఈ మేరకు చంద్రునిపైకి చంద్రయాన్ ప్రయోగంతోపాటు ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ సంబంధిత ప్రయోగాత్మక పరీక్ష, స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్, తుమకూరులో హెలికాప్టర్ల తయారీ కర్మాగారం, శక్తిమంతమైన గ్రామాల కార్యక్రమం, క్రీడా రంగంలో రికార్డు విజయాలు వగైరాల గురించి వివరించారు. అలాగే గత సంవత్సర కాలంలో ప్రపంచ స్థాయిలో, ప్రజాస్వామ్య ప్రయోజనాల సాధన గురించి వివరిస్తూ- కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం, మహిళా రిజర్వేషన్ల చట్టం, జి-20 శిఖరాగ్ర సదస్సు, జీవ ఇంధన కూటమి ఏర్పాటు, ప్రపంచంలో ప్రత్యక్ష చెల్లింపులకు ప్రాధాన్యం, ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించడం, భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం, ఐదో తరం (5జి) సదుపాయం ప్రారంభం గురించి కూడా విశదీకరించారు. మొత్తంమీద ‘‘దేశ నిర్మాణంలో గత సంవత్సరం ఒక మైలురాయి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ గణనీయ ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ల నెట్‌వర్క్, అత్యంత పొడవైన నదీ విహార నౌక, రాపిడ్ రైలు నమో భారత్ ప్రవేశం, 34 కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లు, భారత-మధ్యప్రాచ్య-ఐరోపా కారిడార్, రెండు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు: ఢిల్లీలో భారత మండపం, యశోభూమి నిర్మాణం, అత్యధిక సంఖ్యలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ధోర్డో గ్రామానికి ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు, శాంతి నికేతన్/హోయసల ఆలయ సముదాయాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం వంటి ఘనతలు భారత కీర్తికిరీటంలో చేరాయని వివరించారు.
సరిహద్దులను సురక్షితంగా చూసుకున్నంత కాలం దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా మనం నిర్విరామ కృషి చేయగలమని ప్రధాని ఉద్ఘాటించారు. ఆ మేరకు సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలు, దృఢ సంకల్పం, త్యాగాల వల్లనే భారత్ పురోగమించిందని ఆయన పేర్కొన్నారు. సంఘర్షణాత్మక పరిస్థితుల నుంచి భారత్ అవకాశాలను సృష్టించిందని ప్రధాని గుర్తుచేశారు. కాబట్టే దేశం ఇవాళ స్వయం సమృద్ధ పథంలో పాదం మోపిందని అన్నారు. రక్షణ రంగంలో భారత అద్భుత వృద్ధిని, ప్రపంచంలో కీలక స్థానం ఆక్రమించడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భారత సైన్యం, భద్రత దళాల బలం నిరంతరం పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో లోగడ చిన్నచిన్న అవసరాలకు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి నేడు మిత్రదేశాల అవసరాలను తీర్చే స్థాయికి చేరామని వివరించారు. ప్రధానమంత్రి 2016లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన నాటినుంచి భారత రక్షణ ఎగుమతులు 8 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు. ‘‘దేశం నుంచి ప్రస్తుతం ₹లక్ష కోట్లకుపైగా విలువైన రక్షణ ఉత్పత్తులు తయారవుతున్నాయి... ఇదొక సరికొత్త రికార్డు’’ అని ఆయన తెలిపారు.
అత్యున్నత సాంకేతికత, ‘సిడిఎస్’ వంటి కీలక వ్యవస్థల ఏకీకరణ గురించి ప్రధాని ప్రస్తావించారు. భారత సైన్యం నిరంతరం మరింత ఆధునికత సంతరించుకుంటున్నదని పేర్కొన్నారు. ఇకపై సమీప భవిష్యత్తులో అత్యవసరమైతే భారత్ ఇకపై ఇతర దేశాలవైపు చూసే అవసరం లేదన్నారు. సాంకేతికత విస్తరణ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో మానవ అవగాహన పాత్రను సదా గుర్తుంచుకోవాలని శ్రీ మోదీ సాయుధ బలగాలను కోరారు. సాంకేతికత ఎన్నడూ మానవ అవగాహనను అధిగమించరాదని ఆయన ఉద్ఘాటించారు.
‘‘నేడు స్వదేశీ వనరులతోపాటు అత్యున్నత స్థాయి సరిహద్దు మౌలిక సదుపాయాలు కూడా మనకు నిజమైన బలంగా రూపొందుతున్నాయి. ఇందులో నారీశక్తి కూడా కీలక పాత్ర పోషిస్తుండటం ఎంతో సంతోషం’’ అని ప్రధాని అన్నారు. గడచిన ఏడాది వ్యవధిలో 500 మంది మహిళా సైనికాధికారుల నియామకం, రాఫెల్ యుద్ధ విమానాలను నడిపిన మహిళా పైలట్లు, యుద్ధ నౌకల్లో మహిళా అధికారుల నియామకం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. సాయుధ దళాల అవసరాలను జాగ్రత్తగా గమనిస్తూండాల్సిన అవసరం గురించి ప్రధాని ప్రస్తావించారు. విపరీత శీతల-ఉష్ణోగ్రతలకు తగిన దుస్తులు, జవాన్ల రక్షణ వేగిరం చేయడంతోపాటు సదుపాయం పెరిగేలా డ్రోన్ల వినియోగం, ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ పథకం కింద ₹90 వేల కోట్లు చెల్లించడం వగైరాలను ప్రధాని వివరించారు.
చివరగా ఒక ద్విపదను ఉటంకిస్తూ- సాయుధ దళాల ప్రతి అడుగు చరిత్రకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. సాయుధ దళాలు తమ నిత్య సంకల్పంతో భరతమాతకు సేవలు కొనసాగించగలవన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ‘‘మీ మద్దతుతో దేశం ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహించడం ఇకపైనా కొనసాగిస్తుంది. దేశం నిర్దేశించుకున్న ప్రతి సంకల్పాన్నీ సాకారం చేసేందుకు సమష్టిగా శ్రమిద్దామంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.