మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో రూ.55,600 కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన, మరి కొన్ని ప్రారంభం
అరుణాచల్ ప్రదేశ్ లో దిబాంగ్ బహుళార్ధసాధక హైడ్రోపవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
తవాంగ్ కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీ కల్పించే సెలా సొరంగ మార్గం జాతికి అంకితం రూ.10,000 కోట్ల విలువ గల ఉన్నతి పథకం ప్రారంభం
భారత, బంగ్లాదేశ్ మధ్య ప్రయాణికులు, సరకు రవాణాకు వీలు కల్పించే సబ్రూమ్ లాండ్ పోర్ట్ ప్రాజెక్టు ప్రారంభం
వికసిత్ అరుణాచల్ నిర్మాణం కాఫీ టేబుల్ పుస్తకం విడుదల
‘‘ఈశాన్యం భారతదేశానికి ‘అష్టలక్ష్మి’’
‘‘ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’
‘‘సూర్యుని తొలి కిరణాల వలె అభివృద్ధి ప్రాజెక్టులు అరుణాచల్ కు, ఈశాన్యానికి వస్తున్నాయి’’
‘‘ఈశాన్యంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేదే ఉన్నతి యోజన’’
ఈ ప్రాజెక్టుల్లో రైలు, రోడ్డు, ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్య, సరిహద్దు మౌలిక వసతులు, ఐటి, విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల ప్రాజెక్టులున్నాయి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్  లో వికసిత్  భారత్, వికసిత్ ఈశాన్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్  ప్రదేశ్ లలో చేపట్టనున్న రూ.55,600 కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి కొన్నింటిని శ్రీ మోదీ ప్రారంభించారు. అలాగే సెలా సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రూ.10,000 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఉన్నతి పథకాన్ని ప్రారంభించారు. ఈ  ప్రాజెక్టుల్లో రైలు, రోడ్డు, ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్య, సరిహద్దు మౌలిక వసతులు, ఐటి, విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల ప్రాజెక్టులున్నాయి. 

 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం వికసిత్  రాజ్యం నుంచి వికసిత్  భారత్ పండుగ జరుగుతున్నదని అన్నారు. వికసిత్ ఈశాన్యం పట్ల ఈశాన్య రాష్ర్టాల ప్రజల్లో కొత్త ఉత్సుకత కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి నారీశక్తి మద్దతు ఇస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధికి తన విజన్ ‘‘అష్టలక్ష్మి’’ని ఆయన పునరుద్ఘాటించారు. ఈశాన్య ప్రాంతానికి దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాలతో బలమైన పర్యాటక, వ్యాపార, సాంస్కృతిక బంధం న్నదని ఆయన అన్నారు. నేడు చేపడుతున్న రూ.55,000 కోట్ల విలువ గల ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ వీటి ద్వారా అరుణాచల్  ప్రదేశ్ లోని 35,000 కుటుంబాలు పక్కా ఇళ్లు పొందుతాయని చెప్పారు. అలాగే అరుణాచల్  ప్రదేశ్, త్రిపుర రాష్ర్టాలకు చెందిన వేలాది కుటుంబాలకు కుళాయిల ద్వారా మంచినీటి సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈశాన్య ప్రాంతాల్లోని అనేక రాష్ర్టాలకు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. విద్య, రోడ్లు, రైల్వే, మౌలిక వసతులు, ఆస్పత్రులు, పర్యాటక రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులన్నీ వికసిత్ ఈశాన్యం హామీతో వస్తున్నాయని తెలిపారు. విభిన్న ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులు గతంతో పోల్చితే నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయన్నారు.

ఈశాన్య రాష్ర్టాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని మిషన్ పామాయిల్ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారోద్యమం చేపట్టిందని, ఇందులో భాగంగా తొలి ఆయిల్ మిల్లు నేడు ప్రారంభమవుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘మిషన్  పామాయిల్ తో రైతుల ఆదాయం పెరగడంతో పాటు వంటనూనెల రంగంలో భారత్ ఆత్మనిర్భరం అవుతుంది’’ అన్నారు. పామాయిల్  సాగు చేపడుతున్నందుకు రైతులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

‘‘ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులతో ఈశాన్యం యావత్తు మోదీ కీ గ్యారంటీ అర్ధం ఏమిటో తెలుసుకోగలుగుతుంది’’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. 2019లో శంకుస్థాపన చేసిన సెలా సొరంగ మార్గం, దోనీ పోలో విమానాశ్రయం రెండింటినీ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ‘‘కాలం, నెల, సంవత్సరం ఏదైనా మోదీ ఎల్లప్పుడూ జాతి, ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తాడు’’ అని ఆయన నొక్కి చెప్పారు. 

 

ఈశాన్య రాష్ర్టాల పారిశ్రామికాభివృద్ధి కోసం కేంద్ర కేబినెట్  ఇటీవల ఉన్నతి పథకానికి ఆమోదం తెలిపిన విషయం ప్రస్తావిస్తూ దీని ద్వారా కొత్త కోణంలో అభివృద్ధిని చేపడుతూ పరిధిని కూడా విస్తరించనున్నట్టు చెప్పారు. కేవలం ఒక్క రోజులోనే ఈ పథకాన్ని నోటిఫై చేసి, మార్గదర్శకాలు కూడా జారీ చేయడంలోనే ప్రభుత్వ పనితీరు అర్ధం అవుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఆధునిక మౌలిక వసతులు కల్పించడంతో పాటు 12కి పైగా శాంతి ఒప్పందాలు, సరిహద్దు వివాద పరిష్కార అంగీకారాలపై సంతకాలు చేసినట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల విస్తరణ తదుపరి అడుగు అని ప్రధానమంత్రి అన్నారు. ‘‘రూ.10,000 కోట్లతో ప్రారంభించిన ఉన్నతి పథకం కొత్త పెట్టుబడి, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది’’ అని చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్టార్టప్ ల ఏర్పాటు,  హోమ్  స్టేల అభివృద్ధి, పర్యావరణ సంబంధిత అవకాశాలు మెరుగుపరుస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

ఈశాన్య ప్రాంతాల్లోని మహిళల జీవనం సరళతరం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న విషయం ప్రముఖంగా ప్రస్తావిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్  సిలిండర్ ధర రూ.100 రూపాయలు తగ్గించిన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు.  పౌరులందరికీ కుళాయిల ద్వారా నీటి కనెక్షన్లు అందించడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని టీమ్  చేసిన కృషిని ఆయన అభినందించారు. అభివృద్ధికి చెందిన పలు కోణాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ర్టాలు ముందు వరుసలో ఉండడం పట్ల ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. ‘‘సూర్యుని తొలి కిరణాల వలె అరుణాచల్  ప్రదేశ్, ఈశాన్య రాష్ర్టాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో 45,000 ఇళ్లకు మంచినీటి సరఫరా ప్రాజెక్టు ప్రారంభాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమృత్  సరోవర్ కార్యక్రమం కింద పలు సరోవరాల నిర్మాణం జరిగిందన్నారు. గ్రామాల్లోని స్వయం-సహాయక గ్రూప్ లకు చెందిన మహిళలను లక్షాధికారి దీదీలుగా తీర్చి దిద్దుతున్నట్టు చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది లక్షాధికారి దీదీలను తయారుచేయడం మా లక్ష్యం, దీని వల్ల ఈశాన్యంలోని మహిళలు కూడా లబ్ధి పొందుతారు’’ అని ఆయన చెప్పారు. 

 

గత ప్రభుత్వాల హయాంలో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రధానమంత్రి విమర్శించారు. సెలా సొరంగ మార్గం గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల లబ్ధి కోసం కాకుండా జాతి అవసరాల కోసం పని చేయడమే తన పనితీరు అని ఆయన వివరించారు. తదుపరి విడత అధికార కాలంలో ఈ ఇంజనీరింగ్ అద్భుతం వద్ద రక్షణ సిబ్బందిని కలుస్తానని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఈ సొరంగ మార్గంతో తవాంగ్ ప్రాంత ప్రజలకు అన్ని వాతావరణాల్లోను కనెక్టివిటీ ఏర్పడుతుందని, వారి జీవనం సరళం అవుతుందని ఆయన అన్నారు.

గతంలో అనుసరించిన వైఖరికి భిన్నంగా తాను సరిహద్దు గ్రామాలను ‘‘తొలి గ్రామాలు’’గా పరిగణిస్తానని, వైబ్రెంట్  విలేజ్ పథకం ఈ ఆలోచనా ధోరణికి దర్పణం పడుతుందని ఆయన అన్నారు. నేడు 125 గ్రామాలకు రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభించడంతో పాటు 150 గ్రామాల్లో  పర్యాటక సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్టు తెలిపారు. 

పిఎం-జన్ మన్ కార్యక్రమం కింద అత్యంత సునిశితమైన, తీవ్రంగా వెనుకబడిన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. అలాంటి తెగల వారి కోసమే నేడు మణిపూర్  లో అంగన్ వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. 
ప్రజల జీవితాలు సరళం చేయడం, వ్యాపార సరళీకరణ కోసం కనెక్టివిటీ, విద్యుత్ సంబంధిత పలు అభివృద్ధి  ప్రాజెక్టులను చేపడుతున్నట్టు ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. స్వాతంత్ర్యం  సిద్ధించిన నాటి నుంచి 2014 సంవత్సరం వరకు, 2014 సంవత్సరం తర్వాత కనెక్టివిటీని పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల మధ్య తారతమ్యం గురించి వివరించారు. గత ఏడు దశాబ్దాల  కాలంలో నిర్మించిన జాతీయ రహదారుల నిడివి 10,000 కిలోమీటర్లయితే కేవలం గత 10 సంవత్సరాల కాలంలోనే 6,000 కిలోమీటర్ల నిడివి గల రహదారులు, 2,000 కిలోమీటర్ల నిడివి గల రైల్వే లైన్లు నిర్మించినట్టు చెప్పారు. విద్యుత్ రంగం గురించి ప్రస్తావిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని దిబాంగ్ బహుళార్ధసాధక హైడ్రో పవర్ ప్రాజెక్టు, త్రిపురలోని సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతున్నాయని ప్రధానమంత్రి తెలియచేశారు. ‘‘దిబాంగ్  డామ్  భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న డామ్’’ అని ఆయన అన్నారు. ఈశాన్యంలో అత్యంత ఎత్తులో ఉండే వంతెన, డామ్  రెండూ అందించినట్టు ఆయన తెలిపారు. 

 

తన అరుణాచల్  ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ పర్యటనల షెడ్యూల్  న ప్రధానమంత్రి వెల్లడించారు. ప్రతీ ఒక్క భారతీయుడు తన కుటుంబ సభ్యుడేనని ప్రధానమంత్రి అన్నారు. అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు, ఉచిత రేషన్, స్వచ్ఛమైన మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు. గ్యాస్ కనెక్షన్, ఉచిత చికిత్స, ఇంటర్నెట్  కనెక్షన్ అందించే వరకు  తాను విశ్రమించబోనని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ‘‘మీ కలలే నా సంకల్పాలు’’ అని పేర్కొటూ నేటి అభివృద్ధి  ప్రాజెక్టుల విషయంలో ఈశాన్య రాష్ర్టాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్థన మేరకు అభివృద్ధి వేడుకగా ప్రజలు తమ మొబైల్  ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను వెలిగించారు.  ‘‘ఈ అద్భుతం జాతికి శక్తిని అందిస్తుంది’’ అని ఆయన తన ప్రసంగం ముగించారు. 

అరుణాచల్  ప్రదేశ్ గవర్నర్ (రిటైర్డ్) లెఫ్టనెంట్  జనరల్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్, అరుణాచల్  ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్వాపరాలు
ఈశాన్య రాష్ర్టాల పురోగతి, అభివృద్ధికి ప్రధానమంత్రి విజన్  ను ‘‘వికసిత్ భారత్, వికసిత్ ఈశాన్యం’’ కార్యక్రమం బలోపేతం చేస్తుంది.  ఈ సందర్భంగా మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో రైలు, రోడ్డు, ఆరోగ్యం, గృహనిర్మాణం, విద్య, సరిహద్దు మౌలిక వసతులు, ఐటి, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ సహా విభిన్న రంగాలకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ఈశాన్య ప్రాంతాల పారిశ్రామికాభివృద్ధికి ఉన్నతి (ఉత్తర్ పూర్వ పారిశ్రామిక పరివర్తన పథకం) పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.  ఈ పథకం ఈశాన్యంలో పారిశ్రామిక వాతావరణాన్ని పటిష్ఠం చేయడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తయారీ, సేవల రంగంలో కొత్త యూనిట్లు ఏర్పాటై ఈశాన్య రాష్ర్టాల్లో ఉపాధి అవకాశాలకు ఉత్తేజం ఏర్పడుతుంది. ఈశాన్యంలోని 8 రాష్ర్టాలకు విస్తరించే ఈ పథకానికి అయ్యే రూ.10,000 కోట్ల మొత్తం నిధులను కేంద్రమే సమకూర్చుతుంది. అనుమతి పొందిన తయారీ సేవల రంగంలోని పరిశ్రమలకు అందించే మూలధన పెట్టుబడులకు ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు వడ్డీ రాయితీ కూడా అందిస్తుంది. అర్హత గల యూనిట్లు సరళంగా, పారదర్శకంగా నమోదు కావడానికి వీలుగా ఒక పోర్టల్  కూడా ప్రారంభమవుతుంది. ఉన్నతి పథకం పారిశ్రామికాభివృద్ధిలో కీలకంగా నిలవడంతో పాటు ఈశాన్య ప్రాంతాల వృద్ధికి, అభివృద్ధికి దోహదకారిగా ఉంటుంది. 

రూ.825 కోట్లతో నిర్మించిన సెలా సొరంగ మార్గం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అరుణాచల్  ప్రదేశ్  లోని బలిపర-చరిదౌర్-తవాంగ్ మార్గంలో సెలా పాస్ ద్వారా తవాంగ్ కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీని కల్పిస్తుంది. ఆస్ర్టేలియాకు చెందిన నూతన టన్నెల్  విధానాన్ని ఉపయోగించి అన్ని రకాల అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను అనుసరించి ఈ సొరంగ మార్గం నిర్మించారు. ఈ ప్రాంతంలో సత్వర, సమర్థవంతమైన రవాణా మార్గం ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది. దేశానికి ఇది వ్యూహాత్మక ప్రాధాన్యం గల ప్రాజెక్టు. 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సెలా సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారు.  

ప్రధానమంత్రి అరుణాచల్  ప్రదేశ్ లో రూ.41,000 కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. 

అరుణాచల్ ప్రదేశ్ లోని లోయర్ దిబాంగ్ వేలీలో దిబాంగ్ బహుళార్ధ సాధక హైడ్రోపవర్  ప్రాజెక్టుకు కూడా ప్రఃధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.31,875 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన డామ్ గా చరిత్ర నెలకొల్పుతుంది. ఇది విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు వరదలను తగ్గించి సామాజిక, ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుంది. 
ఇవి కాకుండా ‘‘వైబ్రెంట్  విలేజ్ కార్యక్రమం’’ కింద చేపడుతున్న పలు రోడ్డు, పర్యావరణం, టూరిజం ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వివిధ పాఠశాలలను 50 గోల్డెన్  జుబిలీ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తారు. ఈ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం సహాయంతో సమీకృత విద్య బోధిస్తారు. దోన్యి-పోలో విమానాశ్రయం నుంచి నహర్లగున్ రైల్వే స్టేషన్ కు రెండు లేన్నల కనెక్టివిటీ కల్పించే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. 

అరుణాచల్ ప్రదేశ్ లో పలు రోడ్డు ప్రాజెక్టులతో పాటు అనేక ప్రధాన ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. వాటిలో జల్  జీవన్ మిషన్ కు చెందిన 1100 ప్రాజెక్టులు, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్  నిధి (యుఎస్ఓఎఫ్) కింద 170 టెలికాం టవర్లు నిర్మిస్తారు. 300 పైగా గ్రామాలకు ఇవి లబ్ది చేకూరుస్తాయి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్, రూరల్) కింద  రూ.450 కోట్లకు పైబడిన వ్యయంతో నిర్మించిన 35,000 ఇళ్లను లబ్ధిదారులకు అందచేశారు. 

మణిపూర్ లో రూ.3400 కోట్లకు పైబడిన విలువ గల అనేక  అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టుల్లో నీలకుతిలో నిర్మించనున్న యూనిటీ మాల్; మంత్రిపుఖ్రిలో మణిపూర్ ఐటి సెజ్ ప్రాసెసింగ్  జోన్ లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు; లంఫ్జెల్ పట్ లో ప్రత్యేక సైకియాట్రిక్  కేర్ అందించే 60 పడకల ఆస్పత్రి నిర్మాణం; ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని మణిపూర్ టెక్నికల్ విశ్వవిద్యాలయం మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టు వీటిలో ఉన్నాయి. వీటితో పాటు వివిధ రోడ్డు ప్రాజెక్టులు, అనేక నీటి సరఫరా ప్రాజెక్టు పథకాలు కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.  

నాగాలాండ్ లో రూ.1700 కోట్ల పైబడిన విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో పలు రోడ్డు ప్రాజెక్టులు; చుమౌకెడిమా జిల్లాలో యూనిటీ మాల్ నిర్మాణం; దిమాపూర్ ప్రాంతానికి చెందిన నగర్జాన్ లో 132 కెవి సబ్-స్టేషన్ సామర్థ్య విస్తరణ ప్రాజెక్టు ఉన్నాయి. చెందాంగ్  శాడిల్ నుంచి నోక్లాక్ (తొలిదశ) రోడ్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టు; కొహిమా-జెస్సామి రోడ్డు సహా పలు రోడ్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. 

మేఘాలయలో రూ.290 కోట్ల విలువకు పైబడిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన వాటిలో తురాలో ఐటి పార్క్  నిర్మాణం; న్యూ షిల్లాంగ్  టౌన్ షిప్ లో రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరణ ప్రాజెక్టు ఉన్నాయి. ఎగువ షిల్లాంగ్ లో రైతుల హాస్టల్ కమ్ శిక్షణ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. 
సిక్కింలో రూ.450 కోట్లకు పైబడిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన వాటిలో రంగ్ పో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం ప్రాజెక్టు, పలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. సిక్కింలోని తర్పు నుంచి దరండిన్ మధ్యన నిర్మించనున్న రోడ్డు ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించారు.

త్రిపురలో రూ.8,500 కోట్లకు పైబడిన విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన వాటిలో అగర్తల వెస్టర్న్ బైపాస్, రాష్ర్టవ్యాప్తంగా పలు రోడ్డు ప్రాజెక్టులు; సెకెర్కోట్ లో కొత్తగా నిర్మించనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపో; మాదక ద్రవ్యాల బానిసల కోసం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రాజెక్టు నిర్మాణం పనులున్నాయి.  ప్రధానమంత్రి ప్రారంభించిన వాటిలో 1.46 లక్షల ఇంటింటి కుళాయి నీటి కనెక్షన్ ప్రాజెక్టు; దక్షిణ త్రిపురలో రూ.230 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్రూమ్ లాండ్ పోర్ట్ ప్రాజెక్టు ఉన్నాయి. 

భారత, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో కొత్తగా అభివృద్ధి చేసిన సబ్రూమ్ లాండ్ పోర్ట్ ప్రాజెక్టు ఉంది. ఈ లాండ్  పోర్ట్  ప్రాజెక్టులో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కార్గో అడ్మినిస్ర్టేటివ్ భవనం, వేర్ హౌస్, అగ్నిమాపక కేంద్రన భవనం, విద్యుత్ సబ్ స్టేషన్, పంప్ హౌస్ ఉన్నాయి. దీని వల్ల భారత, బంగ్లాదేశ్ మధ్య ప్రయాణికులు, సరకు రవాణా సులభతరం అవుతుంది. పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా/హాల్దియా పోర్టు నుంచి చిట్టగాంగ్ కు 1700 కిలోమీటర్ల దూరం ఉంటే సబ్రూమ్  ప్రాజెక్టు వల్ల 75 కిలోమీటర్ల దూరంలోని కొత్త పోర్టుకు ఎవరైనా నేరుగా ప్రయాణించగలుగుతారు. 2021 మార్చిలో సబ్రూమ్ లాండ్ పోర్ట్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi