‘‘వికసిత భారత్ కలలను సాకారం చేయడంలో ఇదొక కీలక దశాబ్దం’’;
‘‘జాతి సామర్థ్యం ద్వారా భారత్ స్వప్నాలను నెరవేర్చే దశాబ్దమిది’’;
‘‘ఇది భారత హై స్పీడ్ అనుసంధానం... రవాణా... శరవేగ శ్రేయస్సుల దశాబ్దం’’;
‘‘బలమైన ప్రజాస్వామ్య దేశంగా విశ్వాసానికి భారత్ వెలుగుదివ్వెగా నిలుస్తుంది’’;
‘‘మంచి ఆర్థిక వ్యవస్థతోనే మంచి రాజకీయాలు సాధ్యమని భారత్ నిరూపించింది’’;
‘‘దేశ ప్రగతిని... స్థాయిని పెంచడంపైనే నా దృష్టి మొత్తాన్నీ కేంద్రీకరించాను’’;
‘‘గత 10 సంవత్సరాల్లో ప్రజలు చూసింది పరిష్కారాలనే... నినాదాలను కాదు’’;
‘‘రాబోయే దశాబ్దంలో భారత్ అనూహ్య... అపూర్వ ఉన్నత శిఖరాలకు చేరుతుంది’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో గణతంత్ర శిఖరాగ్ర సదస్సు-2024లో  ప్రసంగించారు. ‘‘రాబోయే దశాబ్దంలో భారతదేశం’’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ- ఈ దశాబ్దం భారతదేశానిదేనని స్పష్టం చేశారు. ఇది రాజకీయ ప్రకటన కానేకాదని, ప్రపంచమంతా ఇవాళ భారత్ గురించి అనుకుంటున్నదేనని పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘ఇది భారతదేశానికి అంకితమైన దశాబ్దమని యావత్ ప్రపంచం విశ్వసిస్తోంది’’ అని దృఢ స్వరంతో ప్రకటించారు. ఈ సదస్సు ఇతివృత్తానికి అనుగుణంగా రాబోయే దశాబ్దపు భారతదేశంపై చర్చకు చొరవ చూపిన గణతంత్ర జట్టును ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. వికసిత భారత్ సంకల్పాలను నెరవేర్చడంలో ప్రస్తుత దశాబ్దం ఒక మాధ్యమం కాగలదని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

 

   స్వతంత్ర భారతావనికి ప్రస్తుత దశాబ్దపు ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ- ఎర్రకోట బురుజుల నుంచి ‘‘యహీ సమయ్ హై... సహీ సమయ్ హై’’ (ఇదే తరుణం... సముచిత తరుణం) అంటూ తాను విజయనాదం చేయడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. సమర్థ, వికసిత భారతదేశ పునాదుల బలోపేతం సహా ఒకనాడు అసాధ్యమని భావించిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ దశాబ్దమే సరైన సమయమని ఆయన ప్రస్ఫుటం చేశారు. ‘‘జాతి సామర్ధ్యంతో భారత్ కలలను సాకారం చేయడంలో ఇదొక కీలక దశాబ్దం’’ అని ఆయన నొక్కిచెప్పారు. వచ్చే దశాబ్దంలోగా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్యుత్తు, నీరు, ఇంటర్నెట్ వగైరా ప్రాథమిక అవసరాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుత దశాబ్దం ఎక్స్‌ ప్రెస్‌వేలు, హైస్పీడ్ రైళ్లు, దేశీయ జలమార్గాల నెట్‌వర్క్‌ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చెందినదని పేర్కొన్నారు. ఈ దశాబ్దంలోనే భారత్ తన తొలి బుల్లెట్ రైలును సమకూర్చుకుంటుందని, పూర్తిస్థాయి ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లను ఉపయోగంలోకి తెస్తుందని ఆత్మవిశ్వాసం ప్రకటించారు. దేశంలోని పెద్ద నగరాలు ‘నమో’ లేదా మెట్రో రైళ్లతో అనుసంధానం కాగలవని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ఈ దశాబ్దం భారతదేశ హై-స్పీడ్ అనుసంధానం, రవాణా, శరవేగపు శ్రేయస్సుకు అంకితం చేయబడుతుంది’’ అని చెప్పారు.

   ప్రపంచంలో ప్రస్తుత అనిశ్చితి-అస్థిరతలను ప్రస్తావిస్తూ- పలు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్న నేటి రోజుల్లో దాని తీవ్రత-విస్తరణ రీత్యా అత్యంత తీవ్ర అస్థిరత నెలకొన్నదని నిపుణుల అభిప్రాయపడుతున్నట్లు ప్రధాని గుర్తుచేశారు. ‘‘ఇంతటి అంతర్జాతీయ అనిశ్చితి నడుమ బలమైన ప్రజాస్వామ్య దేశమనే విశ్వసానికి భారత్ వెలుగుదివ్వెలా నిలుస్తుంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘మంచి ఆర్థిక వ్యవస్థతో మంచి రాజకీయాలు సాధ్యమని కూడా భారత్ నిరూపించింది’’ అని ఆయన పేర్కొన్నారు.

 

   భారత్ పనితీరుపై ప్రపంచవ్యాప్త ఉత్సుకతను ప్రస్తావిస్తూ-‘‘మేము దేశం అవసరాలు తీర్చడంతోపాటు ప్రజల కలలను సాకారం చేయడంవల్లనే ఇది సాధ్యమైంది. సాధికారత కల్పన కృషిలో భాగంగా ప్రజా శ్రేయస్సుపైనా మేం దృష్టి సారించాం’’ అని ప్రధానమంత్రి చెప్పారు. వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించడంతోపాటు కార్పొరేట్ పన్ను కూడా తగ్గించడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. అలాగే ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులతో కోట్లాది పక్కా ఇళ్లు నిర్మించామని, దీంతోపాటు ఉచిత వైద్యం, రేషన్‌ కూడా అందిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల కోసం ‘పిఎల్ఐ’ వంటి పథకాలు ఉండగా, రైతులకు బీమా,  అదనపు ఆదాయార్జన మార్గాలు కల్పించామని చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణలలో పెట్టుబడుల ద్వారా యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

   దశాబ్దాలుగా అనువంశిక రాజకీయాల వల్ల దేశాభివృద్ధి విషయంలో సమయం కోల్పోవడంపై ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకుంటూ వికసిత భారత్ సృష్టికోసం మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో.. రెట్టింపు వేగంతో కృషి చేయాల్సి ఉందని నొక్కిచెప్పారు. ఈ మేరకు నేడు దేశంలోని అన్ని రంగాల్లో పురోగమనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దేశాభివృద్ధి కృషిలో వేగం, స్థాయిని ఇనుమడింప జేయడంపైనే తాను ప్రధానంగా దృష్టి కేంద్రీకరించానని చెప్పారు. గడచిన 75 రోజుల్లో దేశవ్యాప్తంగా పరిణామాలను ప్రస్తావిస్తూ- దాదాపు రూ.9 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం వగైరా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అంటే- 110 బిలియన్ అమెరికన్ డాలర్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ప్రజల కోసం సిద్ధమవుతున్నాయని ప్రధాని వివరించారు. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా గత 75 రోజుల్లో పెట్టిన పెట్టుబడులు అనేక ప్రపంచ దేశాల వార్షిక బడ్జెట్ కన్నా అధికమని ఆయన వివరించారు. ఈ 75 రోజుల్లో దేశవ్యాప్తంగా 7 కొత్త ‘ఎయిమ్స్’, 3 ఐఐఎంలు, 10 ఐఐటీలు, 5 ఎన్ఐటీలు, 3 ఐఐఐటీలు, 2 ‘ఐసిఆర్’లు 10 కేంద్ర సంస్థలు, 4 వైద్య/నర్సింగ్ కళాశాలలు, 6 జాతీయ పరిశోధన ప్రయోగశాలల ప్రారంభం లేదా శంకుస్థాపన చేసినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.

 

   అంతేకాకుండా అంతరిక్ష మౌలిక సదుపాయాల రంగంలో రూ.1800 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 54 విద్యుత్తు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయబడ్డాయి. కాక్రపార్ అణు విద్యుత్తు ప్లాంటులో 2 కొత్త రియాక్టర్లు జాతికి అంకితం చేయబడ్డాయి. కల్పక్కంలో స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రారంభించబడింది, తెలంగాణలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించబడింది. జార్ఖండ్‌లో 1300 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటును ప్రారంభించగా, 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 300 మెగావాట్ల సౌరశక్తి ప్లాంటు, మెగా పునరుత్పాదక  విద్యుదుత్పాదన పార్క్, హిమాచల్‌లో జలవిద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యాయి. అలాగే దేశంలోనే తొలి హరిత ఉదజని ఇంధన సెల్ నౌక తమిళనాడులో ప్రారంభించబడింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్-సింభవాలి విద్యుత్ ప్రసార లైన్లతోపాటు కర్ణాటకలోని కొప్పల్‌లోని పవన విద్యుత్ మండలి నుంచి ప్రసార లైన్లను ప్రధాని ప్రారంభించారు.

   వీటితోపాటు గత 75 రోజుల్లో దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ వంతెనను, లక్షద్వీప్‌ వరకూ సముద్రగర్భంలో ఆప్టికల్ కేబుల్‌ లైన్ ప్రారంభించామని తెలిపారు. దేశంలోని 500కిపైగా రైల్వే స్టేషన్ల ఆధునికీరణకు శ్రీకారం చుట్టామని, 33 కొత్త రైళ్లను ప్రారంభించామని ఆయన తెలిపారు. రహదారులు, ఓవర్‌బ్రిడ్జీలు, అండర్‌పాస్‌లు వంటి 1500కుపైగా ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయని వివరించారు. దేశంలోని 4 నగరాల్లో 7 మెట్రో సంబంధిత ప్రాజెక్టులు ప్రారంభించగా, కోల్‌కతాకు దేశంలోనే తొలి జలాంతర మెట్రో రైలుమార్గం కానుకగా లభించిందన్నారు. అంతేకాకుండా రూ.10,000 కోట్లతో 30 ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామన్నారు. రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ పథకానికి శ్రీకారం చుట్టడంసహా 18 వేల సహకార సంఘాల కంప్యూటరీకరణ పూర్తిచేశామన్నారు. అలాగే రూ.21 వేల కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో  జమ చేసినట్లు వెల్లడించారు.

 

   పాలనలో వేగం గురించి ప్రస్తావిస్తూ- బడ్జెట్‌లో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ఆమోదించి, ప్రారంభించేందుకు పట్టిన సమయం కేవలం 4 వారాలేనని ప్రధాని నొక్కిచెప్పారు. పాలనలో ఈ వేగాన్ని, స్థాయిని పౌరులు నేడు ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. అలాగే రాబోయే 25 ఏళ్ల ప్రగతి ప్రణాళిక గురించి కూడా ప్రధాని మోదీ వెల్లడించారు. దేశంలో ప్రస్తుత ఎన్నికల వాతావరణ నడుమ ప్రతి సెకను సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. ‘‘గత 10 సంవత్సరాల్లో ప్రజలు నినాదాలకు బదులు పరిష్కారాలను చూశారు’’ అని ప్రధాని మోదీ సగర్వంగా ప్రకటించారు. ఆహార భద్రత, ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ, విద్యుదీకరణ, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల బలోపేతం, పక్కా ఇళ్లకు భరోసా నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకూ అన్ని ప్రాథమ్యాలపైనా ప్రభుత్వం ఏకకాలంలో కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు.

   గత పదేళ్లలో ప్రశ్నల స్వభావంలో వచ్చిన మార్పును ప్రధాని మోదీ ప్రస్తావించారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలపై నిరాశావాద ప్రశ్నలు కాస్తా నేడు- అత్యాధునిక సాంకేతికత కోసం ఎదురుచూపుల నుంచి డిజిటల్ చెల్లింపులలో నాయకత్వందాకా... నిరుద్యోగం నుంచి అంకుర సంస్థల వరకూ... ద్రవ్యోల్బణం నుంచి ప్రపంచ సంక్షోభానికి మినహాయింపుదాకా... మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగవంతమైన అభివృద్ధి వరకూ ఆశావహ, ఆసక్తికర ప్రశ్నలుగా మారాయి. అలాగే కుంభకోణాలు, సంస్కరణలు, ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో పురోగమనం నేపథ్యంలో నిస్సహాయత నుంచి ఆశావాదం వరకూ ప్రశ్నలలో వచ్చిన మార్పును ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తన శ్రీనగర్ పర్యటనను గుర్తుచేసుకుంటూ జ‌మ్ముక‌శ్మీర్‌లో మానసిక ధోరణి రూపాంతరం చెందిన తీరును వివరించారు.

   దేశానికి భారంగా ఒకనాడు పరిగణించబడిన వారిపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆకాంక్షాత్మక జిల్లాలను ఉదాహరిస్తూ- ఈ జిల్లాల్లోని ప్రజల దురదృష్టంతో ముడిపెట్టబడిన జీవన దుస్థితిని ప్రస్తుత ప్రభుత్వం తన విధానాలు, ఆలోచనలతో పరిష్కరించి వారి తలరాతను మార్చిందని తెలిపారు. ఇదే తరహా విధానాల ద్వారా సరిహద్దు గ్రామాలు, దివ్యాంగులు రూపాంతరం చెందారని,  సంకేత భాష ప్రామాణీకరణ చేపట్టామని ఆయన తెలిపారు. అవగాహన గల ప్రభుత్వం లోతైన విధాన అనుసరణ, ఆలోచనతో ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు. విస్మృత, అణగారిన వర్గాలపై దృష్టి సారిస్తూ, సంచార-పాక్షిక సంచార జనాభా, వీధి వ్యాపారులు, విశ్వకర్మల సంక్షేమం దిశగా తీసుకున్న చర్యలను కూడా ప్రధానమంత్రి ఉటంకించారు. విజయ పథంలో కృషి, దృక్పథం, సంకల్పాల పాత్రను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు ‘‘ప్రగతి ప్రయాణంలో భారత్ కూడా శరవేగంగా దూసుకెళ్తోంది. ఆ మేరకు రాబోయే దశాబ్దంలో భారతదేశం అపూర్వ, అనూహ్య సమున్నత శిఖరాలకు చేరగలదు... ఇది మోదీ గ్యారంటీ కూడా’’ అని ప్రకటిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”