అస్సాంలోని గౌహతిలో ఒక భారీ ఝుమోర్ కార్యక్రమం అయిన ‘ఝుమోర్ బినందిని 2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఆహూతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో ఎటు చూసినా శక్తి, ఉత్సాహం, ఉత్సుకత వెల్లివిరుస్తున్నాయన్నారు. ఝుమోయిర్ కళాకారులు వారు పనిచేసే తేయాకు తోటల్లోని సుగంధాన్ని, శోభను తమ నృత్యంలో ఆవిష్కరించారంటూ ఆయన ప్రశంసలను కురిపించారు. ఝూమోయిర్‌తోనూ, తేయాకు తోటల సంస్కృతితోనూ ప్రజలకొక విశిష్ట అనుబంధం ఉన్నట్లే ఈ విషయంలో తాను కూడా ఇదే తరహా అనుభూతిని పొందానని ఆయన అభివర్ణించారు. ఇంత పెద్ద సంఖ్యలో కళాకారులు ఈ రోజు ప్రదర్శించిన ఝూమోయిర్ నృత్యం ఒక రికార్డును సృష్టించగలదని కూడా ఆయన అన్నారు. 2023లో తాను అస్సాంను సందర్శించినప్పుడు కూడా 11,000 మంది కళాకారులు బిహూ నృత్యం చేయగా అదొక రికార్డును సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. అది తాను మరచిపోలేని ఓ జ్ఞాపకమని చెబుతూ అలాంటి ఒక సమ్మోహక ప్రదర్శనను తిలకించడానికి తాను సంసిద్ధుడినై వచ్చినట్లు చెప్పారు. ఒక ఉజ్వల సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు అస్సాం ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ రోజు అస్సాంకూ, తేయాకు తోటల్లో పనిచేసేవారికి, వేడుకల్లో పాలుపంచుకొనే ఆదివాసీలకు గర్వించాల్సిన రోజు అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున అందరికీ ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ తరహా గొప్ప కార్యక్రమాలు అస్సాం గౌరవానికి ప్రమాణంగా నిలవడం ఒక్కటే కాకుండా, భారత్‌లోని ఘనమైన భిన్నత్వాన్ని కూడా కళ్లెదుట నిలుపుతాయని ప్రధాని అన్నారు. అభివృద్ధి విషయంలోనూ, సంస్కృతికి సంబంధించిన వ్యవహారంలోనూ అస్సాంనూ, ఈశాన్య ప్రాంతాలను ఉపేక్షించిన కాలమంటూ ఒకటి ఉండిందని ఆయన అన్నారు. ప్రస్తుతం, స్వయంగా తానే ఈశాన్య ప్రాంత సంస్కృతికొక బ్రాండ్ అంబాసడర్‌గా మారినట్లు ఆయన వెల్లడించారు. అస్సాంలోని కాజీరంగాలో బస చేసి అక్కడి జీవవైవిధ్యాన్ని ప్రపంచంలో గుర్తించేటట్లు చూసిన తొలి ప్రధానిని తానేనని ఆయన అన్నారు. కొన్ని నెలల కిందట అస్సాం భాషకు శాస్త్రీయ భాష హోదాను ఇచ్చిన సంగతిని తెలియజేస్తూ, అస్సాం ప్రజ ఇలాంటి గుర్తింపు కోసం దశాబ్దాల నుంచి వేచిఉన్నారన్నారు. అంతేకాకుండా, చరాయిదేవ్ మొయిదమ్‌ను యూనెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారని, ఇది తమ ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఒక సార్థక విజయమని ఆయన అన్నారు.
అస్సాం గౌరవశాలిత్వాన్ని గురించీ, సాహసిక యోధుడు లాచిత్ బోర్‌ఫుకన్‌ను గురించీ శ్రీ మోదీ మాట్లాడారు. లాచిత్ బోర్‌ఫుకన్ మొగలులపై ధ్వజమెత్తి అస్సాం సంస్కృతినీ, అస్తిత్వాన్ని పరిరక్షించారని శ్రీ మోదీ అన్నారు. లాచిత్ బోర్‌ఫుకన్ 400వ జయంతిని ఘనమైన వేడుకగా నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ, ఆయన శకటాన్ని (టేబ్లో) గణతంత్ర దినోత్సవ కవాతులో చేర్చినట్లు కూడా గుర్తుకు తీసుకువచ్చారు. లాచిత్ బోర్‌ఫుకన్ 125 అడుగుల కంచు విగ్రహాన్ని అస్సాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధాని వెల్లడించారు. ఆదివాసీ సమాజ వారసత్వాన్ని పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్’ను నిర్వహించడం మొదలుపెట్టిన సంగతిని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఆదివాసీ శూర వీరుల తోడ్పాటులను సదా స్మరించుకోవడానికి ఆదివాసీ మ్యూజియమ్‌లను దేశమంతటా నెలకొల్పుతున్నట్లు వివరించారు.
అస్సాంను అభివృద్ధి చేయడంతోపాటు ‘తేయాకు తెగ’ సముదాయానికి (‘టీ ట్రైబ్’ కమ్యూనిటీ) తమ ప్రభుత్వం సేవలను అందిస్తోందని ప్రధాని చెబుతూ, అస్సాం టీ కార్పొరేషన్ శ్రామికుల ఆదాయాన్ని పెంచడానికి గాను వారికి బోనసును ప్రకటించిన సంగతిని ప్రధానంగా ప్రస్తావించారు. తేయాకు తోటలలో పనిచేసే సుమారు 1.5 లక్షల మంది మహిళలకు అందజేస్తున్న సహాయాన్ని గురించి ఆయన చెబుతూ, గర్భవతులుగా ఉన్న కాలంలో వారికి ఆర్థిక బాధలను తొలగించడానికి 15,000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. దీనికి తోడు, కుటుంబాల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తేయాకు తోటల ప్రాంతాలలో అస్సాం ప్రభుత్వం 350 కన్నా ఎక్కువ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేస్తోందన్నారు.
తేయాకు తెగ వారి పిల్లల కోసం తేయాకు తోట ప్రాంతాలలో 100కు పైగా ఆదర్శ పాఠశాలలను తెరిచారు. అంతేకాక ఇలాంటివే మరో 100 పాఠశాలలను తెరవాలన్న ప్రణాళిక కూడా ఉందని ప్రధాని తెలిపారు. తేయాకు తెగ యువతకు ఓబీసీ కోటాలో 3 శాతం రిజర్వేషన్ నిబంధన, స్వతంత్రోపాధికల్పనకు రూ.25,000 సాయాన్ని అస్సాం ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. తేనీటి (చాయ్) పరిశ్రమ, అందులో పనిచేసే శ్రామికుల అభివృద్ధితో అస్సాం సమగ్ర అభివృద్ధి జోరందుకోగలదన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. ప్రదర్శనలో పాలుపంచుకొంటున్న వారందరికీ వారి భావి ప్రదర్శన విజయవంతం కావాలంటూ ఆయన ముందస్తు ధన్యవాదాలు పలికారు. వారికి తన శుభాకాంక్షలను కూడా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ సర్‌మా, కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్. జైశంకర్, శ్రీ సర్బానంద సొనొవాల్, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, కేంద్ర సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గెరిటాలు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఝుమోయిర్ బినందిని (మెగా ఝుమోయిర్) 2025 ఒక అద్భుత సాంస్కృతిక ఆడంబర ప్రదర్శన. దీనిలో 8,000 మంది ఝుమోయిర్ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇది అస్సాంలో తేయాకు తోటల్లో పనులు చేసే వారితోపాటు అస్సాంలోని ఆదివాసీ సముదాయాల వారు ఆడే ఒక జానపద నృత్యరీతి. దీనిలో కలుపుగోలుతనం, సాంస్కృతిక ఆభిజాత్యంలకు తోడు అస్సాం సమన్విత సాంస్కృతిక సమ్మేళనం ఉట్టిపడుతుంది. మెగా ఝుమోయిర్ కార్యక్రమం తేయాకు పరిశ్రమకూ, అస్సాం పారిశ్రామికీకరణకూ 200 సంవత్సరాలు పూర్తి అయిన ఘట్టాన్ని ప్రతిబింబిస్తుంది.