హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సు 2023లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ప్రధానమంత్రి హెచ్ టి గ్రూప్ నకు ధన్యవాదాలు తెలిపారు. లీడర్ షిప్ సదస్సుల ద్వారా భారతదేశం ఏ విధంగా పురోగమిస్తుందో తెలియచేయడంలో హెచ్ టి గ్రూప్ ఎప్పుడూ ముందు వరుసలో ఉందని ఆయన నొక్కి చెప్పారు. 2014లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ‘‘రీషేపింగ్ ఇండియా’’ (భారత రూపు మార్పు) అనే ధీమ్ ఎంచుకున్నదన్న విషయం గుర్తు చేశారు. దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఏ విధంగా భారతదేశం కొత్త రూపం సంతరించుకుంటోంది అన్న అవగాహన గ్రూప్ నకు ఉన్నదని ఆయన అన్నారు. 2019 సంవత్సరంలో ప్రస్తుత ప్రభుత్వం మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ‘‘కాన్వర్సేషన్స్ ఫర్ ఎ బెటర్ టుమారో’’ (మంచి రేపటి కోసం చర్చలు) అనే థీమ్ ఎంచుకున్న విషయం కూడా గుర్తు చేశారు. 2023 సార్వత్రిక మరికొద్ది రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ‘‘బ్రేకింగ్ బారియర్స్’’ (అవరోధాల ఛేదన) అనే థీమ్ ను ఈ సదస్సు ఎంచుకున్నదని, ప్రస్తుత ప్రభుత్వం అన్ని రికార్డులను ఛేదించుకుంటూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే సందేశం అందులో అంతర్లీనంగా ఉన్నదని శ్రీ మోదీ అన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికలు అన్ని అవరోధాలకు అతీతంగా ఉంటాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘రీ షేపింగ్ ఇండియా’’ నుంచి ‘‘బియాండ్ బారియర్స్’’ వరకు భారతదేశ ప్రయాణం ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాదులు వేసిందని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశం సుదీర్ఘ కాలం పాటు ఎదుర్కొన్న బహుళ అవరోధాలు చెరిగిపోయి అభివృద్ధి చెందిన, మహోన్నతం, సుసంపన్నమైన భారత్ ఈ పునాదుల పైనే నిర్మాణం అవుతుందన్నారు. దేశం సుదీర్ఘ కాలం పాటు ఎదుర్కొన్న బానిసత్వం, దాడులు పలు పగ్గాలు వేశాయని చెప్పారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శ్రీ మోదీ గుర్తు చేస్తూ ఆ సమయంలో భావోద్వేగంతో ఉప్పొంగిన అల కారణంగా ప్రజల్లో సంఘటితత్వాన్ని పెంచిందని, ఫలితంగా పలు అవరోధాలు తొలగించుకుంటూ ముందుకు సాగిపోయారని అన్నారు. ‘‘స్వాతంత్ర్యం తర్వాత కూడా ఆ ఉత్తేజం కొనసాగుతుందని ఆశించారు. ‘కాని దురదృష్టవశాన అది జరగలేదు, ఈ కారణంగానే మన దేశం తన సామర్థ్యం మేరకు ఎదగలేకపోయింది‘‘ అని ఆయన చెప్పారు. మానసిక అవరోధాలు మనం ఎదుర్కొన్న అనేక సమస్యల్లో ఒకటని, వాస్తవానికి స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం ఎదుర్కొన్న సమస్యల్లో కొన్ని వాస్తవమైనవయితే, మరి కొన్ని ఊహించుకున్నవని, ఇంకా కొన్నింటిని వాటి తీవ్రతకు మించి వెలుగులోకి తెచ్చారని ఆయన పేర్కొన్నారు.
2014 తర్వాత అలాంటి అవరోధాలన్నింటినీ ఛేదించేందుకు భారత్ నిరంతరం శ్రమిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. మనం ఎన్నో ప్రతిబంధకాలను దాటుకుంటూ ఇప్పుడు వాటిని దాటిపోయి ప్రయాణించడం గురించి మాట్లాడుకోగలుగుతున్నామని చెప్పారు. ‘‘నేడు భారతదేశం చంద్రునిపై ఇంతవరకు ఎవరూ అడుగు పెట్టలేని ప్రదేశానికి చేరింది. నేడు భారత్ డిజిటల్ లావాదేవీల్లో ఎన్నో అవరోధాలు తొలగించుకుని నంబర్ 1 స్థానంలో నిలిచింది. మొబైల్ తయారీలో అగ్రస్థానంలో ఉంది, స్టార్టప్ ల విభాగంలో ప్రపంచంలోని మూడు అగ్రదేశాల్లో ఒకటిగా ఉంది, నిపుణులైన మానవ వనరుల ఖని కలిగి ఉంది’’ అన్నారు. నేడు భారత్ జి-20 శిఖరాగ్రం వంటి ప్రపంచ వేదికలపై తన పతాకం ఎగురవేస్తోందని చెప్పారు.
ప్రముఖ కవి, రాజకీయ నాయకుడు అల్లామా ఇక్బాల్ ఘజల్ నుంచి ‘‘సితారోం కే ఆగే జహాం ఔర్ భీ హైం’’ అన్న ఒక పంక్తిని ఉటంకిస్తూ భారతదేశం ఇంక ఇక్కడ ఆగిపోవాలనుకోవడంలేదని చెప్పారు.
దేశంలో నెలకొన్న ఆలోచనా ధోరణి, మానసిక పరిస్థితి కూడా భారీ అవరోధాలని, అవి నిరంతరం విమర్శలకు గురవుతుండేవని చెబుతూ గత ప్రభుత్వాలు అనుసరించిన నిర్లిప్త వైఖరి ఇందుకు కారణమన్నారు. కాలనియమం, అవినీతి, తాను పని చేయాల్సిన ప్రమాణాల కన్నా దిగువన ప్రభుత్వ ప్రయత్నాలు వంటివి ప్రత్యేకంగా గమనించదగినవని; మానసిక అవరోధాలను ఛేదించుకుంటూ ముందుకు దూసుకుపోయేందుకు జాతి యావత్తుకు కొన్ని సంఘటనలు స్ఫూర్తి ఇస్తాయని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన దండి యాత్ర ఏ విధంగా జాతిని మేల్కొలిపి భారత స్వాతంత్ర్య జ్వాలలు రగిలింపచేసిందో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మనం సాధించిన చంద్రయాన్-3 విజయం ప్రతీ ఒక్క భారత పౌరునిలో గర్వం, ఆత్మ విశ్వాస భావం ఇనుమడింపచేసిందని, ప్రతీ ఒక్క రంగంలోనూ ముందుకు అడుగు వేయాలన్న స్ఫూర్తిని నింపిందని ఆయన చెప్పారు. ‘‘నేడు ప్రతీ ఒక్క భారతీయుడు ఆత్మ-విశ్వాసంతో ఉప్పొంగుతున్నాడు’’ అని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ప్రధానమంత్రి స్వయంగా ఎర్రకోట బురుజుల నుంచి ప్రస్తావించిన స్వచ్ఛత, మరుగుదొడ్లు, పారిశుధ్యం వంటి అంశాలు ప్రజల మనోభావాల్లో ఎలాంటి మార్పు తెచ్చిందో గుర్తు చేశారు. ‘‘స్వచ్ఛత నేడు ప్రజా ఉద్యమంగా మారింది’’ అని శ్రీ మోదీ చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో ఖాదీ అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు.
జన్ ధన్ బ్యాంకు ఖాతాలు పేదల మానసిక అవరోధాలను ఛేదించి ఆత్మవిశ్వాసం పాదుగొల్పాయో ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తు చేశారు. బ్యాంకు ఖాతాలు సంపన్నులకేనన్న ప్రతికూల భావాన్ని తొలగించడమే కాకుండా జన్ ధన్ యోజనతో బ్యాంకులే పేదల ముంగిటికి వెళ్లి అందరికీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. భారతదేశం సరిహద్దుల వెలుపల ఉన్న వారి మానసిక ఆలోచనా ధోరణి గురించి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ పెరుగుతున్న సామర్థ్యాలు ఉగ్రవాద చర్యల నుంచి రక్షణ పొందగల బలం ఇవ్వడంతో పాటు వాతావరణ కార్యాచరణ తీర్మానాల్లో కూడా గడువు కన్నా ముందుగానే మంచి ఫలితాలు సాధించగలిగిందని చెప్పారు. క్రీడల్లో భారతదేశం ప్రదర్శిస్తున్న అద్భుత ప్రతిభ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మానసిక ధోరణుల్లో మార్పులే ఈ ఫలితాలు రావడానికి దోహదపడ్డాయన్నారు.
‘‘భారతదేశానికి సామర్థ్యాలు, వనరుల కొరత ఏ మాత్రం లేదు’’ అని ప్రధానమంత్రి చెప్పారు. పేదరికానికి చెందిన వాస్తవిక అవరోధాల గురించి ప్రస్తావిస్తూ కేవలం నినాదాలతోనే పేదరికంపై పోరాటం సాధ్యం కాదని, కేవలం పరిష్కారాలే కీలకమని పిఎం శ్రీ మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు పేదలను సామాజికంగా గాని, ఆర్థికంగా గాని సాధికారం చేయలేదని ఆయన విమర్శించారు. కనీస మౌలిక వసతులు కల్పించగలిగితే పేదలు పేదరికం నుంచి వెలుపలికి రాగలరంటూ పేదలను సాధికారం చేయడమే కేంద్ర ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యత అన్నారు. ‘‘ప్రభుత్వం జీవితాలను పరివర్తింపచేయడమే కాదు, పేదరికం నుంచి వెలుపలికి వచ్చేందుకు సహాయపడింది’’ అని చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో 13 కోట్ల మంది అన్ని అవరోను ఛేదించుకుంటూ పేదరికం నుంచి వెలుపలికి వచ్చి సరికొత్త మధ్యతరగతిలో చేరారన్నారు.
ఆశ్రిత పక్షపాతం కూడా ఒక అవరోధమని చెబుతూ క్రీడలు, రాజకీయాలు, చివరికి పద్మ అవార్డుల్లో కూడా సామాన్య ప్రజలకు స్థానం ఉండేది కాదని, కొన్ని వర్గాలకు చెందిన వారైతేనే వాటిలో వారు విజయం సాధించగలిగే వారని శ్రీ మోదీ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పరివర్తిత చర్యల ద్వారా సామాన్య ప్రజలు సాధికారత సాధించామనే భావం పొందారని ‘‘నిన్న ఏ మాత్రం ప్రాచుర్యంలో లేని వారు నేడు దేశానికి హీరోలుగా నిలిచారు’’ అని వ్యాఖ్యానించారు.
దేశం ఆధునిక మౌలిక వసతులు అనే అవరోధం ఏ విధంగా అధిగమించింది చెబుతూ ప్రస్తుతం దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద మౌలిక వసతుల ఉద్యమం నడుస్తున్నదన్నారు. మౌలిక వసతుల విస్తరణలో భారతదేశంలో చోటు చేసుకుంటున్న వేగం, పరిధి గురించి ప్రస్తావిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం 2013-14 సంవత్సరంలో రోజుకి 12 కిలోమీటర్లుంటే 2022-23 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. మెట్రో కనెక్టివిటీ 2014లో 5 నగరాలకే పరిమితం కాగా 2023 నాటికి 20 నగరాలకు విస్తరించిందని, విమానాశ్రయాల సంఖ్య 2014 సంవత్సరంలో 70 ఉండగా నేడు 150కి పెరిగిందని, వైద్య కళాశాలలు 2014లో 380 ఉండగా నేడు అవి 700 అయ్యాయని వివరించారు. అదే విధంగా గ్రామాల కనెక్టివిటీ కోసం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ 350 కిలోమీటర్ల నుంచి 2023 నాటికి 6 లక్షల కిలోమీటర్లకు చేరిందని, 4 లక్షల కిలోమీటర్లకు రోడ్లు విస్తరించడంతో పిఎం గ్రామ్ సడక్ యోజన కింద రోడ్డు వసతి గల గ్రామాలు 2014 నాటికి 55 శాతం కాగా ఇప్పుడు 99 శాతానికి చేరిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి కేవలం 20,000 కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ మాత్రమే జరుగగా గత 10 సంవత్సరాల కాలంలో సుమారు 40,000 కిలోమీటర్ల లైన్ల విద్యుదీకరణ జరిగిందని చెప్పారు. ‘‘ నేడు భారతదేశంలో అభివృద్ధి వేగం, విస్తరణ ఆ తీరులో ఉంది. భారత విజయానికి ఇదో చిహ్నం’’ అని ప్రధామంత్రి వ్యాఖ్యానించారు.
గత కొద్ది సంవత్సరాల కాలంలో భారత్ ఎన్నో ఊహాత్మకమైన అవరోధాలు దాటి బయటకు వచ్చిందని ఆయన చెప్పారు. మంచి ఆర్థిక శాస్ర్తం మంచి రాజకీయం కాబోదని విధానకర్తలు, రాజకీయ నిపుణుల అభిప్రాయమన్నారు. చాలా ప్రభుత్వాలు కూడా ఈ వాస్తవాన్ని అంగీకరించాయంటూ ఈ కారణంగానే నేడు దేశం అనేక రాజకీయ, ఆర్థిక సమస్యలు ఎదుర్కొటున్నదన్నది వారి అభిప్రాయమని తెలిపారు. నేడు భారతదేశ విధానాలు కొత్త అవకాశాలను తెరిచాయని ఆయన అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం పరిష్కారం, జిఎస్ టి అమలు, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి సమయాల్లో ప్రజలకు ప్రభుత్వ విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించాయని చెప్పారు.
ఇటీవల ఆమోదించిన నారీశక్తి వందన్ అధినియమ్ గురించి ప్రస్తావిస్తూ ఇది మరో ఊహాత్మక అవరోధమని ప్రధానమంత్రి అన్నారు. దశాబ్దాల పాటు పెండింగులో ఉంచిన బిల్లు ఎన్నటికీ ఆమోదం పొందదనే అభిప్రాయం ఏర్పడడానికి కారణమయిందని చెప్పారు.
గతంలోని ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం అనేక సమస్యలను వాస్తవం కన్నా పెంచి చూపించాయని ఆయన తెలిపారు. జమ్ము & కశ్మీర్ లో 370వ అధికరణం ఇందుకు ఉదాహరణ అని పేర్కొంటూ దాన్ని ఉపసంహరించడం సాధ్యం కాదనే ఒక మానసికమైన ఒత్తిడి గతంలో ఏర్పడిందని ఆయన చెప్పారు. నేడు ఆ అధికరణం రద్దు ఆ ప్రాంత పురోగతికి, శాంతితకి బాటలు వేసిందని ఆయన అన్నారు. జమ్ము & కశ్మీర్ ఏ విధంగా మారిందో లాల్ చౌక్ చిత్రాలు తెలియచేస్తున్నాయని, నేడు కేంద్ర పాలిత ప్రాంతంలో ఉగ్రవాదం అంతమైపోయి పర్యాటకం నిరంతరం పెరుగుతున్నదని ఆయన చెప్పారు. జమ్ము & కశ్మీర్ ను కొత్త శిఖరాలకు చేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా సోదర ప్రముఖులనుద్దేశించి మాట్లాడుతూ 2014 నుంచి చోటు చేసుకుంటున్న బ్రేకింగ్ న్యూస్, పరివర్తన ఇందుకు నిదర్శనమని చెప్పారు. 2013 కాలంలో రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధిరేటును నిరంతరం తగ్గిస్తూ ఉండేవారని చెబుతూ నేడు దానికి పూర్తి వ్యతిరేక ప్రభావం కనిపిస్తోందని, నిరంతరం వృద్ధి అవకాశాలను పెంచుతున్నాయని ఆయన అన్నారు. 2013 సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో పడిందని, అలాంటిది 2023 సంవత్సరంలో భారతీయ బ్యాంకులు అత్యుత్తమ చారిత్రక లాభాలు ఆర్జిస్తున్నాయని తెలిపారు. అలాగే 2013 సంవత్సరంలో హెలీకాప్టర్ల కుంభకోణం చోటు చేసుకోగా ఇప్పుడు 2013-14తో పోల్చితే రక్షణ ఎగుమతులు 20 రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు.
2013 సంవత్సరం సమయంలో కఠిన ఆర్థిక స్థితి ఏ రకంగా మధ్యతరగతిని దెబ్బ తీసిందనేది తెలుపుతూ నాటి జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రతికూల పతాక శీర్షికలు వచ్చేవని ప్రధానమంత్రి గుర్తు చేశారు. కాని నేడు భారతదేశం స్టార్టప్ లు, క్రీడలు, అంతరిక్షం వంటి భిన్న రంగాల్లో అభివృద్ధి క్రమంలో దూసుకుపోతోందని ఆయన చెప్పారు. నేడు వారి ఆదాయాలు పెరగడంతో పాటు 2023లో 7.5 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేశారని, 2013-14లో 4 కోట్ల నుంచి ఈ స్థాయికి పెరిగిందని ఆయన తెలిపారు. 2014 సంవత్సరంలో సగటు ఆదాయం రూ.4.5 లక్షలుండగా 2023లో అది రూ.13 లక్షలకు పెరిగిందని, లక్షలాది మంది అల్పాదాయ వర్గం న చి అధికాదాయ వర్గంలోకి చేరిందని ఆయన పేర్కొన్నారు. ఒక జాతీయ దినపత్రికలో ప్రచురించిన నివేదికలోని ఆసక్తికరమైన అంశం గురించి ప్రస్తావిస్తూ రూ.5.5 లక్షల నుంచి రూ.25 లక్షల వేతన వర్గీకరణలో ఉన్నవారి సంఖ్య 2011-12లో 3.25 లక్షలైతే 2021 నాటికి రూ.14.5 లక్షలకు పెరిగిందని, నాటి కన్నా ఇది 5 రెట్లు అధికమని ఆయన చెప్పారు. వేతనాల ద్వారా వచ్చే ఆదాయం ఆధారంగానే ఈ విశ్లేషణ జరిగిందని, మరే ఇతర ఆదాయాన్ని చేర్చలేదని ఆయన స్పష్టం చేశారు.
పెరుగుతున్న మధ్యతరగతి, పేదరికం తగ్గుదల అతి పెద్ద ఆర్థిక కాలచక్రంలో రెండు ప్రధానాంశాలని ప్రధానమంత్రి అన్నారు. నవ్య మధ్యతరగతి పేదరికం నుంచి వెలుపలికి రావడమే కాకుండా దేశంలో వినియోగం వృద్ధికి కూడా చోదకశక్తి అయ్యారని చెప్పారు. పేదరికం రేటు తగ్గడం అంటే మధ్యతరగతి అధికంగా ప్రయోజనం పొందుతున్నారని అర్ధమని తెలిపారు. ఈ వర్గాల ప్రజల ఆకాంక్షలు, సంసిద్ధత అభివృద్ధికి బలం చేకూర్చుతున్నాయని చెప్పారు. వారి బలంతోనే నేడు భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని, త్వరలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నదని ఆయన వివరించారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యంతో భారతదేశం ఈ అమృత కాలంలో భారత్ పురోగమిస్తున్నదని ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం పర్తీ ఒక్క అవరోధాన్ని విజయవంతంగా అధిగమించగలుగుతుందన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. ‘‘నేడు నిరుపేదల నుంచి ప్రపంచంలోని అమిత సంపన్నుల వరకు ప్రతీ ఒక్కరూ ఇది భారతదేశ సమయం’’ అని విశ్వసిస్తున్నారని చెప్పారు. ఆత్మ విశ్వాసమే ప్రతీ ఒక్క భారతీయుని బలం అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ బలంతో మనం ఏ విధమైన అవరోధాన్నైనా దాటగలం’’ అని చెప్పారు. 2047లో జరుగనున్న హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సు అభివృద్ధి చెందిన దేశం, మరి తర్వాతేమిటి? అనే థీమ్ తో ఉండవచ్చునంటూ ఆయన ముగించారు.
India is progressing by breaking free from barriers. pic.twitter.com/glp3PEKhX0
— PMO India (@PMOIndia) November 4, 2023
Today, every Indian is brimming with enthusiasm and energy. pic.twitter.com/b3uncNsval
— PMO India (@PMOIndia) November 4, 2023
India's actions have changed the mindset of the world. pic.twitter.com/dbEW6sKN94
— PMO India (@PMOIndia) November 4, 2023
Fight against poverty can only be waged with solutions, not mere slogans. pic.twitter.com/qmwTGa0RoU
— PMO India (@PMOIndia) November 4, 2023
The citizens of the country have now started feeling empowered and encouraged. pic.twitter.com/q4ZWWhuqIj
— PMO India (@PMOIndia) November 4, 2023
The country's middle class is taking a leading role in every developmental endeavour. pic.twitter.com/KIJShSYugz
— PMO India (@PMOIndia) November 4, 2023
ये भारत का वक्त है।
— PMO India (@PMOIndia) November 4, 2023
This is Bharat’s Time. pic.twitter.com/MJpRYscAoB