‘‘సంస్కరణ... అమలు... పరివర్తన’ మా తారకమంత్రం’’;
‘‘గత దశాబ్దంలో 25 కోట్లమంది ప్రజలు పేదరిక విముక్తులై కొత్త-మధ్య తరగతిని సృష్టించారు’’;
‘‘దేశాన్ని ప్రపంచ తయారీ కూడలిగా మార్చడం ప్రతి భారతీయుడి ఆకాంక్ష’’;
‘‘పౌరులకు సౌకర్యాలు... జీవన సౌలభ్యం మెరుగు దిశగా మౌలిక సదుపాయాల కల్పన ఒక ఉపకరణం’’;
‘‘ఈ 21వ శతాబ్దంలో ప్రస్తుత మూడో దశాబ్దం భార‌త్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చే కాలం’’;
‘‘మా విధానాలను గతం ప్రాతిపదికనగాక భవిష్యత్ దార్శనికతతో రూపొందిస్తున్నాం’’;
‘‘నేటి భారత్ అవకాశాల అక్షయ పాత్ర ... సంపద సృష్టికర్తలను నేటి భారతం గౌరవిస్తుంది’’;
‘‘సుసంపన్న భారతం ప్రపంచ సౌభాగ్యానికీ బాటలు వేయగలదు’’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ఎకనమిక్ టైమ్స్ యాజమాన్యం నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ వేదికపై దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా విలక్షణ రీతిలో చర్చలు సాగి ఉంటాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి భార‌త్‌పై నమ్మకం ఇనుమడిస్తున్న తరుణంలో సాగుతున్న ఈ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.

   భారత్ నేడు తన విజయగాథలో కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నదని ప్రధానమంత్రి  వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పనితీరును బట్టి సంస్కరణల ప్రభావం ఎంతటిదో స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో మన దేశం అంచనాలను మించి రాణిస్తున్నదని నొక్కిచెప్పారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 90 శాతం వృద్ధిని  నమోదు చేయగా, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి 35 శాతం మాత్రమేనని ప్రధాని గుర్తుచేశారు. ఈ మేరకు సుస్థిర వృద్ధిపై తమ వాగ్దానం నెరవేర్చడమే ఈ ఘనతకు కారణమని, భవిష్యత్తులోనూ ఇదే కృషిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

   దేశ ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా గ‌త సంవ‌త్స‌రాల్లో తెచ్చిన అనేక మార్పులను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ కృషి కోట్లాది పౌరుల జీవితాల‌పై సానుకూల ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ‘‘ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగా ‘సంస్కరణ, అమలు, పరివర్తన’ అనే తారకమంత్రంతో ముందడుగు వేశాం’’ అని ప్రధాని చెప్పారు. గ‌డ‌చిన పదేళ్లలో ప్ర‌భుత్వ సేవా స్ఫూర్తిని, దేశం సాధించిన విజ‌యాల‌ను ప్రజలు ప్రత్యక్షంగా చూశార‌న్నారు. అందుకే, వారిలో విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఆ మేరకు తమపై తమకుగల ఆత్మవిశ్వాసంతోపాటు దేశ ప్రగతి, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ఉద్దేశాలపై నమ్మకం ఇనుమడించిందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నికల నిర్వహణను ప్రస్తావిస్తూ- చాలా సందర్భాల్లో ప్రజలు మార్పును కాంక్షిస్తూ తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ పలు దేశాల్లో ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భారత ఓటర్లు 60 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా తొలిసారి వరుసగా మూడోసారి ఒక ప్రభుత్వానికి విజయం కట్టబెట్టారని చెప్పారు. దేశంలోని ఆకాంక్షాత్మక యువతరం, మహిళలు అవిచ్ఛిన్నతతోపాటు రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఓటు వేశారని పునరుద్ఘాటిస్తూ వారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

 

   అలాగే ‘‘భారతదేశ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కుతోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రగతికి గణాంకాలపరంగా ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఎన్ని జీవితాల్లో పరివర్తన వచ్చిందో కూడా ప్రాధాన్యాంశమేనని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత్ భవిష్యత్ పురోగమన రహస్యం ఆ రెండో అంశంలోనే ఇమిడి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఎలాగంటే- గత దశాబ్దంలో 25 కోట్లమంది ప్రజలు పేదరిక విముక్తులై కొత్త-మధ్యతరగతి స్థాయికి ఎదిగారు’’ అని ఉదాహరించారు. ఈ పరిణామ వేగం, పరిమాణాలు చారిత్రకమైనవని, ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య సమాజంలోనూ లోగడ ఇలాంటి అద్భుతం చోటుచేసుకోలేదని చెప్పారు. పేదల విషయంలో ప్రభుత్వ విధానాలతోనే ఈ పరివర్తన సాధ్యమైందని శ్రీ మోదీ వివరించారు. సవాళ్లతో పోరాడగల స్ఫూర్తి, జీవితంలో ఎదగాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వంటి ఎన్నో అవరోధాలను పేదలు ఎదుర్కొన్నారని చెప్పారు. అలాంటి అవరోధాల తొలగింపుతోపాటు చేయూతనివ్వడం ద్వారా వారికి సాధికారత కల్పించే మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకున్నదని వ్యాఖ్యానించారు.

   ఈ మేరకు డిజిటల్ లావాదేవీలు, హమీరహిత రుణాలు వంటి సదుపాయాలతో పేదల జీవన పరివర్తనకు బాటలు పరిచిందని తెలిపారు. ఈ తోడ్పాటు ఫలితంగా ఇవాళ చాలామంది పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారని చెప్పారు. అంతేకాకుండా అనుసంధానం, ఆధునిక ఉపకరణాల సాయంతో వారిప్పుడు ‘అవగాహన మెరుగుపరచుకుంటున్న పౌరులు'గా  మారుతున్నారని ఆయన తెలిపారు. పేదరిక విముక్తులైన ప్రజలు పురోగమనం దిశగా బలమైన ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారని, అవి నెరవేరడమంటే కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం సుగమమైనట్లేనని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. వారి సృజనాత్మకత ఆవిష్కరణల వైపు కొత్త మార్గం చూపుతుండగా- వారి నైపుణ్యాలు పరిశ్రమలకు, వారి అవసరాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పారు. మరోవైపు వారి ఆదాయ వృద్ధితో  మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతున్నదని ఆయన వివరించారు. ‘‘మన కొత్త-మధ్యతరగతి నేడు దేశ ప్రగతి సాధనలో బలమైన శక్తిగా తననుతాను నిరూపించుకుంటోంది’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.

 

   ఎన్నికల ఫలితాల రోజున- వరుసగా మూడోదఫా ఏర్పడిన ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో పనిచేస్తుందని తాను అనడాన్ని గుర్తుచేశారు. నేడు తమ లక్ష్యాలు మరింత శక్తిమంతంగా ఉన్నాయని ఆయన ధీమాగా చెప్పారు. పౌరుల తరహాలోనే ప్రభుత్వం కూడా తన ఆలోచనల నిండా కొత్త ఆశలు, ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. ప్రభుత్వ మూడో పదవీకాలంలో ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలేదంటూ- భౌతిక మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సామాజిక మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యమిస్తూ సంస్కరణలతో ముందుకెళ్తామని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా గత మూడు నెలల్లో దేశంలోని పేద‌లు, యువ‌కులు, మ‌హిళ‌లు, రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నదని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఇటీవలి విజయాలను ప్రస్తావిస్తూ- పేదలకు 3 కోట్ల పక్కా ఇళ్లు, ఏకీకృత పెన్షన్ పథకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల విస్తరణకు రూ.1 లక్ష కోట్టు కేటాయింపు, రైతులకు నాణ్యమైన పలు రకాల విత్తనాల పంపిణీ వంటివాటిని ఉదాహరించారు. దేశంలో 4 కోట్ల మందికిపైగా యువతకు, ‘లక్షాధికారి సోదరీమణుల’ కార్యక్రమం కింద గ్రామీణ నేపథ్యంగల 11 లక్షల మంది మహిళలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తూ రూ.2 లక్షల కోట్లతో ‘పిఎం ప్యాకేజీ’ ప్రకటించామని వివరించారు. మహిళల ఆర్థిక సాధికారతలో ఈ కార్యక్రమం గణనీయ పాత్ర పోషిస్తున్నదని శ్రీ మోదీ అన్నారు.

   మరోవైపు రూ.75,000 కోట్లకుపైగా అంచనా వ్యయంతో వడవాన్ రేవు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం మహారాష్ట్రలోని పాల్గ‌ఢ్‌లో పర్యటించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. దీంతోపాటు మూడు రోజుల కిందట దాదాపు రూ.30,000 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక నగరాల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఇవేగాక  రూ.50,000 కోట్లకుపైగా విలువైన 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం, రూ.30,000 కోట్లతో పుణె,  థానే, బెంగళూరు మెట్రోల విస్తరణ గురించి కూడా ఆయన పేర్కొన్నారు. లద్దాఖ్‌లో నిర్మాణం మొదలైన సొరంగ మార్గం ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన మార్గాల్లో ఒకటని తెలిపారు.

   మూడు కొత్త వందే భారత్ రైళ్లను ఇవాళ జెండా ఊపి ప్రారంభించామని, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఇదొక కీలక మలుపని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పరివర్తనాత్మక విధానాన్ని వివరిస్తూ- ‘‘మౌలిక సదుపాయాలంటే పొడవు, వెడల్పు, ఎత్తు పెంచడం ఒక్కటే కాదు... ఇది పౌరుల జీవన సౌలభ్యం మెరుగుకు ఒక ఉపకరణం’’ అని వ్యాఖ్యానించారు. భారతీయ రైల్వేల ప్రగతిశీల పరిణామాన్ని ప్రస్తావిస్తూ- రైలు బోగీల నిర్మాణం నేడు నిరంతర ప్రక్రియగా మారిందన్నారు. అలాగే వందేభారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణ వేగంతోపాటు సౌకర్యం కూడా ప్రజలకు అందివచ్చిందని చెప్పారు. అలాగే ‘‘దేశం నేడు ఆధునికత వైపు వేగంగా దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో పెరిగే అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక రవాణా మౌలిక సదుపాయాలను కల్పించే విస్తృత దార్శనికతలో ఈ కొత్త రైళ్ల ప్రారంభం ఒక భాగం’’ అని చెప్పారు.

   దేశంలో అనుసంధాన ఉన్నతీకరణపై ప్రభుత్వ నిబద్ధతను వివరిస్తూ- ‘‘మన దేశంలో ఇంతకుముందు కూడా రహదారులు నిర్మితమయ్యాయి. అయితే, మా హయాంలో ఆధునిక ఎక్స్‌ ప్రెస్‌ వే నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నాం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చిన్న నగరాలకు విమానయాన సంధానం పెంచే కృషిని ప్రస్తావిస్తూ- లోగడ కూడా విమానాశ్రయాలు ఉండేవని, అయినా ఉపయోగంలో లేవని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ 2, 3 అంచెల నగరాలను కూడా అనుసంధానించామని తెలిపారు. తద్వారా దేశం నలుమూలలకూ ఆధునిక రవాణా ప్రయోజనాలు అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పారు.

 

   ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఒనగూడుతున్న విస్తృత ఆర్థిక ప్రయోజనాలను ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ శాఖల మధ్యగల అడ్డుగోడలు తొలగించామని గుర్తుచేశారు. అన్నిశాఖల సమన్వయంతో ఏకీకృత విధాన రూపకల్పన లక్ష్యంగా ‘ప్రధానమంత్రి గతిశక్తి’ జాతీయ బృహత్ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ‘‘ఈ కృషితో గణనీయ ఉపాధి అవకాశాలను సృష్టించగలిగాం. అంతేగాక ఆర్థిక వ్యవస్థపైనా, పరిశ్రమల మీద అత్యంత సానుకూల ప్రభావం కూడా ప్రస్ఫుటమైంది’’ అని ఆయన అన్నారు.

   భ‌విష్య‌త్ భార‌తం గురించి వివ‌రిస్తూ- ఈ 21వ శతాబ్దపు మూడో దశాబ్దం దేశాన్ని అత్యున్నత శిఖరానికి చేర్చే కాలమని శ్రీ మోదీ ప్రకటించారు. ప్రగతి ఫలితాలు పౌరులందరికీ చేరేలా ఈ వేగాన్ని కొనసాగించడంలో సమష్టి బాధ్యత ప్రాధాన్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ భాగస్వాములతోపాటు ప్రైవేట్ రంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘వికసిత భారత్’గా దేశం పురోగమనానికి సారథ్యం వహించే మూలస్తంభాల గురించి వివరించారు. ‘‘ఇవి దేశ సౌభాగ్యానికి మాత్రమేగాక ప్రపంచ శ్రేయస్సుకూ పునాదులు’’ అని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో భారత్ అవకాశాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో ఈ దిశగా దీర్ఘకాలిక దృక్పథానికి తోడ్పడే అన్ని కార్యక్రమాలకూ ప్రభుత్వ మద్దతు ఉంటుందని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో పనిచేస్తున్నందున భారీ అంగలతో ముందడుగు వేయాల్సి ఉందన్నారు.

 

 

   ‘‘దేశాన్ని ప్రపంచ తయారీ కూడలిగా మార్చడం ప్రతి భారతీయుడి ఆకాంక్ష’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారత్ నుంచి ప్రపంచం ఆశిస్తున్నది కూడా ఇదేనని, ఈ దిశగా నేడు దేశంలో విప్లవం కొనసాగుతున్నదని ఆయన అన్నారు. మునుపటితో పోలిస్తే ‘ఎంఎస్ఎంఇ’లకు దేశంలో తగిన చేయూత లభిస్తున్నదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను ఏకరవు పెడుతూ- కీలక ఖనిజోత్పత్తికి ప్రోత్సాహంతోపాటు పరిశ్రమల స్థాపనకు సకల సదుపాయాలతో పారిశ్రామిక పార్కులు, ఎకనమిక్ కారిడార్లు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘పిఎల్ఐ’ పథకాలు సంపూర్ణంగా విజయవంతం అయ్యాయని తెలిపారు.

   బానిసత్వ కాలానికి ముందున్న స్థితిగతులను వివరిస్తూ- ఆనాడు దేశ సౌభాగ్యానికి మన విజ్ఞాన వ్యవస్థే పునాదిగా ఉండేదని, వికసిత భారత్ విషయంలోనూ ఇదే కీలక మూలస్తంభమని ప్రధాని అన్నారు. దేశాన్ని నైపుణ్య, విజ్ఞాన, పరిశోధన-ఆవిష్కరణల కూడలిగా మార్చే కృషిలో పరిశ్రమలను-విద్యాసంస్థలను ప్రభుత్వం భాగస్వాములుగా చేస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యమిచ్చామని, రూ.1 లక్ష కోట్లతో పరిశోధన నిధిని ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. విదేశాల్లో తమ పిల్లల విద్యాభ్యాసం కోసం మధ్యతరగతి కుటుంబాలు తమ కష్టార్జితాన్ని పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నాయని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ మితిమీరిన వ్యయం నుంచి ప్రజలను ఆదుకునే దిశగా అగ్రశ్రేణి విదేశీ విశ్వవిద్యాలయాల శాఖలను మన దేశంలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలి 7 దశాబ్దాల్లో వైద్యవిద్యలో సీట్ల సంఖ్య 80 వేల వద్ద ఆగిపోయిందన్నారు. దీంతో పోలిస్తే ‘ఎంబిబిఎస్, ఎం.డి’ కోర్సులలో కేవలం పదేళ్లలోనే దాదాపు లక్ష సీట్లు అదనంగా అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదేళ్లకల్లా 75 వేల అదనపు సీట్లు అందుబాటులోకి రాగలవని ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తాను ప్రకటటించడాన్ని ఆయన గుర్తుచేశారు. సమీప భవిష్యత్తులో దేశాన్ని ప్రపంచంలోనే కీలక వైద్య-ఆరోగ్య కూడలిగా మార్చడంలో ఈ చర్యలన్నీ దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

   భారత్ ‘ప్రపంచ ఆహార ప్రదాత’గా రూపొందే దిశగా దేశం నిబద్ధతను ప్రధాని మోదీ వివరించారు. ఆ మేరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి భోజనపు బల్లపై భారత్ తయారీ ఆహారోత్పత్తి కనీసం ఒకటైనా ఉండాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా పాడి, మత్స్య ఉత్పత్తుల నాణ్యత పెంపుసహా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఏకకాలంలో ప్రోత్సహిస్తామని తెలిపారు. మన దేశం చొరవతో యావత్ ప్రపంచం ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం’ వేడుకలు నిర్వహించుకున్నదని, ఇది భారత్ సాధించిన ఇటీవలి విజయమని పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో అతపెద్ద చిరుధాన్య ఉత్పత్తిదారు ఎవరు? భారతదేశమే’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ అద్భుత ఆహార ధాన్యాలతో ప్రకృతి, ప్రగతి.. రెండింటికీ ఒనగూడే జంట ప్రయోజనాలను సగర్వంగా ఉటంకించారు. ఆహార పరిశ్రమలో దేశం ఎదుగుదల స్థాయిని వివరిస్తూ- ప్రపంచ అగ్రశ్రేణి ఆహార బ్రాండ్లలో భారత్ తనదైన స్థానాన్ని క్రమంగా సాధిస్తుండటంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.

 

   ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో హరిత ఇంధన రంగం మరో కీలక స్తంభమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తాము ప్రారంభించిన హరిత ఉదజని కార్యక్రమానికి అన్ని దేశాల నుంచి మద్దతు లభించడం జి-20లో భారత్ విజయానికి సంకేతమని ఆయన అన్నారు. అలాగే 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పాదన సహా 5 మిలియన్ టన్నుల హరిత ఉదజని ఉత్పత్తి సామర్థ్యం సాధించడాన్ని ప్రతిష్టాత్మక లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రకటించారు.

   సాంకేతిక పరిజ్ఞానం దేశ ప్రగతిని ఇప్పటికే వేగవంతం చేసిన నేపథ్యంలో పర్యాటక రంగం కూడా వృద్ధికి బలమైన మూలస్తంభం కాగలదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాల మెరుగుకు, చిన్నచిన్న బీచ్‌లను అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లోనూ భార‌త్‌ను అగ్రశ్రేణి పర్యాటక గమ్యంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. ఇప్పటికే ‘దేఖో అప్నా దేశ్, పీపుల్స్ ఛాయిస్’ పేరిట నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను ఉదాహరించారు. ఇందులో భాగంగా పౌరులు స్వదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల గుర్తిస్తూ ఓటు చేస్తారు. అటుపైన ఆయా ప్రదేశాలను ఉద్యమ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ‘‘ఈ కార్యక్రమాలన్నీ గణనీయ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

   సార్వజనీన ప్రపంచ ప్రగతి... విశేషించి దక్షిణార్థ గోళ దేశాల అభివృద్ధికిగల ప్రాధాన్యాన్ని ప్ర‌ధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు ‘‘జి-20కి అధ్యక్షత సందర్భంగా దక్షిణార్థ గోళం గళాన్ని భారత్ గట్టిగా వినిపించింది. ఆఫ్రికాఖండంలోని మిత్రదేశాలను శక్తిమంతం చేయడంలో తనవంతు తోడ్పాటునిచ్చింది’’ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో దక్షిణార్థ గోళ దేశాల సామర్థ్యానికి గుర్తింపు లభించనున్నదని, ప్రపంచ సౌభ్రాత్ర స్ఫూర్తితో ఆ దేశాలకు భారత్ ఒక గళంగా మారుతుందని ఆయన చెప్పారు. ‘‘అందరికీ... ముఖ్యంగా దక్షిణార్థ గోళం  సర్వతోముఖాభివృద్ధికి భరోసా ఇవ్వగల ప్రపంచ క్రమాన్ని మేం అభిలషిస్తున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

 

   ప్రపంచ గతిశీల స్వభావాన్ని ప్రస్తావిస్తూ- భారత ప్రభుత్వ విధానాలు, వ్యూహాలకుగల  అనుసరణీయతను నొక్కిచెప్పారు. ‘‘మా దృష్టంతా భవిష్యత్తుపైనే... రేపటి సవాళ్లు, అవకాశాలకు తగినట్లు మన దేశాన్ని నేడు సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రకటించారు. హరిత ఉదజని కార్యక్రమం, క్వాంటం మిషన్, సెమి-కండక్టర్ మిషన్, డీప్ ఓషన్ మిషన్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉటంకించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి కోసం ప్రభుత్వం ఇటీవల రూ.1,000 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. ‘‘నేటి భారత్ అవకాశాల అక్ష‌య‌పాత్ర... అందువల్ల దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలం కాగలదని మా ప్రగాఢ విశ్వాసం’’ అని స్పష్టం చేశారు.

 

 

   చివరగా- మన దేశం 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందాలనే జాతి సంకల్పాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ స్వప్న సాకారం దిశగా పయనంలో పౌరులతోపాటు భాగస్వాములంతా తమవంతుగా చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని మరిన్ని కంపెనీలు ప్రపంచ బ్రాండ్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండాలన్నది మా లక్ష్యం’’ అన్నారు. అలాగే ‘‘ఈ దిశగా సదుపాయాల కల్పన, సంస్కరణలు, విధానబద్ధ సుస్థిర పాలన, వృద్ధికి మేము హామీ ఇస్తున్నాం. మీ వంతుగా ఆవిష్కరణలపై దృష్టి సారించండి. సంపూర్ణ సామర్థ్యంతో అత్యుత్తమ నాణ్యతతో సానుకూల ఫలితాలను సాధిస్తామని మీరు వాగ్దానం చేయాలి’’ అని నిర్దేశించారు. భారత విజయగాథ రచనలో ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో ఆలోచించాలని, సహకరించాలని ఆయన కోరారు, ‘‘నేటి భారతదేశం సంపద సృష్టికర్తలను గౌరవిస్తుంది. అలాగే సుసంపన్న భారతం ప్రపంచ సౌభాగ్యానికి బాటలు వేస్తుంది’’ అన్నారు. ఆవిష్కరణలు, సార్వజనీనత, అంతర్జాతీయ సహకారం అనే మంత్రాలను సదా గుర్తుంచుకోవాలని కోరారు. ఈ మేరకు ‘‘భారత శ్రేయస్సులోనే ప్రపంచ శ్రేయస్సు కూడా ఇమిడి ఉంది. అందువల్ల దేశవిదేశాల్లోని భారతీయులమంతా ఈ బాటలో సమష్టిగా సాగుతూ లక్ష్యాన్ని చేరగలమన్న విశ్వాసం నాకుంది’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”