ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భారత మండపంలో దేశంలోని ఆకాంక్షాత్మక సమితుల కోసం ‘సంకల్ప సప్తాహం’ పేరిట విశిష్ట వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమం పోర్టల్‌ను ఆవిష్కరించడమే కాకుండా ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన ప్రారంభించారు.
అనంతరం సమితుల పరిధిలోని ముగ్గురు అధికారులతో ప్రధాని సంభాషించారు:
ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బహేరి సమితి పరిధిలోని పనిచేసే పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి రంజనా అగర్వాల్‌తో మొదట మాట్లాడారు. ఆ సమితిలో ఆలోచనా శిబిరాలు నిర్వహించిన సందర్భంగా వచ్చిన అత్యంత ప్రభావవంతమైన ఆలోచన గురించి ఆరా తీశారు. దీనిపై ఆమె స్పందిస్తూ- సమితి సర్వతోముఖాభివృద్ధి కార్యక్రమం గురించి ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజా ఉద్యమంగా మార్చడంలో భాగస్వాములందరి ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. అటుపైన పాఠశాలల్లో అభ్యసన ఫలితాల మెరుగుకు చేపట్టిన మార్పుచేర్పుల గురించి ప్రధానమంత్రి అడిగారు. శ్రీమతి అగర్వాల్ బదులిస్తూ- సంప్రదాయ బోధన పద్ధతులకు భిన్నంగా కార్యాచరణ ఆధారిత అభ్యాసన విధానాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన బాల సభలు, సంగీత పాఠాలు, క్రీడా-శరీర దారుఢ్య శిక్షణ తదితరాలను ఆమె ఉదాహరించారు. విద్యా నాణ్యత మెరుగు కోసం అత్యాధునిక తరగతి గదుల కార్యక్రమం కింద సాంకేతికత వినియోగాన్ని కూడా ప్రస్తావించారు. తమ జిల్లాలోగల 2,500 పాఠశాలల్లో అత్యాధునిక తరగతి గదుల సౌలభ్యం గురించి ఆమె వెల్లడించారు. ఆమె ఇచ్చిన సమాచారంపై ప్రధానమంత్రి స్పందిస్తూ- వికసిత భారతం ప్రాథమిక కర్తవ్యాల్లో బాలలకు నాణ్యమైన విద్యా ప్రదానం కూడా ఒకటని చెప్పారు. ఉపాధ్యాయుల అంకితభావం, చొరవ తనకెంతో సంతోషం కలిగిస్తున్నాయని ఆయన హర్షం ప్రకటించారు. ‘అంకితభావంతో సాఫల్యం’ సాధించే మార్గం ఇదేనని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత ప్రధాని జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మాన్‌కోట్ సమితి పరిధిలో పశువైద్యాధికారి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సాజిద్ అహ్మద్‌తో సంభాషించారు. వలసలు వెళ్లే గిరిజన పశుపోషకుల సమస్యలతోపాటు పశుపోషణలో నష్టాలను, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలను ఆయన తన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. తరగతి గది పరిజ్ఞానానికి, క్షేత్రస్థాయిలో అనుభవానికి మధ్యగల వ్యత్యాసం గురించి ప్రధానమంత్రి ప్రశ్నించారు. తరగతి గది పాఠాల్లో ప్రస్తావనకు రాని స్థానిక పశుజాతుల గురించి తాను తెలుసుకోవడాన్ని డాక్టర్ వివరించారు. అలాగే పశువుల్లో గాలికుంటు (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) వ్యాధి సంబంధిత టీకాల కార్యక్రమం అమలు తీరును ఆయన ప్రధానికి తెలిపారు. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున టీకాల వినియోగం గురించి వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఈ ప్రాంతంలోని గుర్జర్లు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని కచ్‌లో నివసించే పశుపోషకుల తరహాలో తనకెంతో సన్నిహితులుగా కనిపిస్తారని ప్రధాని పేర్కొన్నారు.
మేఘాలయలోని యెంఘ్ (గారో ప్రాంతం) జిల్లాలోగల రెసుబెల్‌పరా సమితిలో జూనియర్ గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీ మైకెహెన్‌చార్డ్ సిహెచ్.మోమిన్‌తో ప్రధాని సంభాషించారు. ఆ ప్రాంతంలోని విపరీత వాతావరణ పరిస్థితులవల్ల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై ఆరాతీశారు. దీనిపై శ్రీ మోమిన్ బదులిస్తూ- ముఖ్యంగా నిత్యావసర వస్తువుల నిల్వకు ప్రాథమిక ఆదేశాల జారీ, పురోగతి పర్యవేక్షణకు ఒక బృందం ఏర్పాటు గురించి వివరించారు. జీవన సౌలభ్యం మెరుగు దిశగా ‘పిఎం ఆవాస్-గ్రామీణ’ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ప్రాంతీయ డిజైన్లు, లబ్ధిదారుల అభీష్టం ఆధారంగా నిర్మాణానికి అనుమతి ద్వారా ఉత్పాదక నాణ్యతపరంగా మార్పులపై ప్రధాని ఆరాతీయగా, శ్రీ మోమిన్ అంతా సానుకూలమేనని వెల్లడించారు. ఈ ప్రాంతంలో జీడి సాగు, జీడిపప్పు ఉత్పత్తి-మార్కెటింగ్ గురించి ప్రధాని ప్రశ్నించగా- ఇక్కడి జీడిపప్పు అత్యుత్తమ నాణ్యతగలిగినదిగా దేశమంతటా ప్రసిద్ధి చెందిందని శ్రీ మోమిన్ తెలిపారు. ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ‘ఎంఎన్-రెగా’తోపాటు స్వయం సహాయ బృందాల తోడ్పాటు కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానమంత్రికి శ్రీ మోమిన్ విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అవగాహన పెంచే దిశగా ఈ ప్రాంతంలో సంగీతానికిగల ఆదరణ గురించి కూడా శ్రీ మోదీ ఆరాతీశారు. ఆకాంక్షాత్మక జిల్లాలు, సమితుల కార్యక్రమాల్లో పంచాయితీలు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
ఈ సంభాషణ కార్యక్రమం తర్వాత సమావేశానికి హాజరైన వారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సుదూర ప్రాంతాలలో అభివృద్ది పథకాలు నిర్వహిస్తున్న వారితోపాటు భారత మండపం, ఇక్కడ నిర్వహిస్తున్న సమావేశం వీటికిగల ప్రాముఖ్యం గురించి ఆయన ప్రస్తావించారు. దాదాపు ఓ నెల కిందటే ప్రపంచ వ్యవహారాలను నిర్దేశించే దేశాధినేతలు ఈ వేదికపై జి-20 సదస్సులో పాల్గొన్నారని ఆయన గుర్తుచేశారు. అటువంటి ప్రపంచ స్థాయి వేదికపై ప్రస్తుతం నిర్వహిస్తున్న సమావేశానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో మార్పు మార్గదర్శకులను స్వాగతిస్తూ- “నా విషయంలో ఈ సమావేశం నాకు జి-20తో సమానమైనదే” అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం భారత్ బృందం విజయానికి, ‘సమష్టి కృషి’ (సబ్ కా ప్రయాస్) స్ఫూర్తికి సంకేతమని స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశ భవిష్యత్తుకు ఇదెంతో కీలకమని, ‘సంకల్పంతో సత్ఫలితం’ అనే భావన ఇందులో అంతర్లీనంగా ఉందని పేర్కొన్నారు.
ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం దేశంలోని 112 జిల్లాల్లో నివసించే దాదాపు 25 కోట్ల ప్రజల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తెచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు “స్వతంత్ర భారతంలోని ఏ 10 అగ్రశ్రేణి కార్యక్రమాల జాబితాలోనైనా ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం స్వర్ణాక్షరాలతో రాయబడి ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమానికి ప్రాతిపదికగా మారిందంటూ జిల్లాల ష5 ్యాకార్యక్రమ విజయంపై ప్రపంచవ్యాప్త ప్రశంసలను ప్రస్తావించారు. ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమం విశిష్టమైనదేగాక దాని విజయం కోసం కృషి చేస్తున్న వ్యక్తుల కృషి కూడా లు అద్భుతమని, తద్వారా ఇది ఘన విజయం సాధించడం తథ్యమని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశంలోని మూడు సమితుల పరిధిలోని అధికారులతో కొద్దిసేపటి క్రితం తాను సంభాషించడాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారిలో కనిపించిన మనోస్ఠైర్యం చూశాక తనలో ఆత్మవిశ్వాసం అనేక రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ క్షణంలో క్షేత్రస్థాయి అధికారుల బృందంలో ఒకరుగా పనిచేయాలనే ఉత్సుకత తనలో కలిగిందని, శ్రీ మోదీ ఉద్ఘాటించారు. వారిలో పెల్లుబుకుతున్న ఆత్మవిశ్వాసంతో ఈ కార్యక్రమం, దాని లక్ష్యాలు నిర్దేశిత గడువుకన్నా ముందే సాకారం కాగలవన్న నమ్మకం తనకుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తాను నిశితంగా పర్యవేక్షిస్తానంటూ- ఇది వారి నైపుణ్య పరీక్ష కోసం కాదని, తాను అవిశ్రాంతంగా పనిచేయడంలో క్షేత్రస్థాయి విజయాలు తనకెంతో శక్తిని, ఉత్సాహాన్నిస్తాయని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఈ మేరకు “ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమ ప్రగతి పత్రం నాకెంతో స్ఫూర్తినిచ్చింది” అని వ్యాఖ్యానించారు.
ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమానికి ఐదేళ్లు పూర్తయ్యాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దీనిపై తృతీయ పక్ష మూల్యాంకనం సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని అత్యంత సాధారణ వ్యూహాన్ని ప్రస్తావిస్తూ- పరిపాలనలో భాగంగా సవాళ్లతో కూడిన పనుల నిర్వహణలో ఇది అత్యుత్తమ అనుభవ పాఠం కాగలదన్నారు. సర్వతోముఖాభివృద్ధి ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ- దేశంలోని అన్ని భాగాలను/ప్రాంతాలను శ్రద్ధగా చూసుకోవాల్సిందేనని ప్రధాని స్పష్టం చేశారు. “సార్వజనీనం కాని, అందరికీ చేరని, ప్రతి ఒక్కరికీ ఫలితాలు అందని అభివృద్ధి.. గణాంకాలకు పరిమితమే తప్ప ప్రాథమికంగా ప్రగతి కాబోదు. అందుకే క్షేత్రస్థాయిలో ప్రతి పారామితినీ పరిగణనలోకి తీసుకుంటూ ముందంజ వేయడం ముఖ్యం” అని చెప్పారు.
ప్రతి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడం, వెనుకబడిన జిల్లాలను చేయిపట్టి నడిపించడం అనే రెండు కొత్త దిశలలో పనిచేయాలని ఈ సమావేశానికి హాజరైన వివిధ శాఖల కార్యదర్శులకు ప్రధానమంత్రి సూచించారు. ఆయా శాఖల పరిధిలో దేశంలోని వెనుకబడిన 100 సమితులను గుర్తించి పరిస్థితుల మెరుగుకు కృషి చేయాలని కోరారు. ఈ 100 సమితులూ దేశ సగటుకు మించి ప్రగతి సాధించిన తర్వాత అభివృద్ధి సంబంధిత ప్రమాణాలన్నీ మారడం ఖాయమని ఆయన నొక్కి చెప్పారు. అభివృద్ధికి ఆస్కారంగల సమితులన్నిటి అభివృద్ధికీ కేంద్రంలోని అన్ని శాఖలూ ప్రాధాన్యమివ్వాలనని స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను ప్రస్తావిస్తూ- అత్యంత వెనుకబడిన 100 గ్రామాలను గుర్తించి, వాటిని చక్కదిద్దే నమూనాను రూపొందించాలని సూచించారు. అటుపైన అభివృద్ధి చేయాల్సిన గ్రామాల సంఖ్యను 1000కి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రధాని సూచించారు.
దేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారతం’గా మార్చే ప్రణాళికను ప్రస్తావిస్తూ- అభివృద్ధి చెందడమంటే- మహా నగరాలు-వెనుకబడిన గ్రామాలు కాదని ప్రధానమంత్రి అన్నారు. “అది మా నమూనా కానేకాదు… 140 కోట్ల మందితో సమష్టి పయనమే మా అభిమతం” అని ఆయన స్పష్టం చేశారు. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమంలో భాగంగా వాటి మధ్య ఆరోగ్యకర పోటీని ఆయన ప్రస్తావిస్తూ- గుజరాత్‌లోని కచ్ జిల్లాను ఈ సందర్భంగా ఉదాహరించారు. ఒకనాడు ఇది దండనలో భాగంగా అధికారులను బదిలీ చేసేందుకు ఉద్దేశించినదిగా భావించేవారని తెలిపారు. అయితే, అక్కడ భూకంపం సంభవించిన తర్వాత నియమితులైన అధికారుల అంకితభావం, శ్రద్ధ ఫలితంగా నేడు అధికారులకు గుర్తింపునిచ్చేందుకు నియమించే అత్యంత గౌరవనీయ జిల్లాగా మారిందని వెల్లడించారు. దేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాల్లో అభివృద్ధికి ఎనలేని కృషిచేసిన యువ అధికారులను ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు పదోన్నతి ఇవ్వడం ద్వారా యువ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు.
ప్రభుత్వ బడ్జెట్ ద్వారా ఉత్పాదకతను బేరీజు వేసుకునే ధోరణికి భిన్నంగా నేడు ఫలితాల మూల్యాంకనానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రధాని ప్రస్తావించారు. వైఖరి మార్పుతో ఫలితాల్లోనూ గుణాత్మక మార్పు సాధ్యమైందని, ప్రధానమంత్రిగా తనకుగల అపార పాలనానుభవం ప్రకారం బడ్జెట్ ఒక్కటే మార్పు తేజాలదని చెప్పారు. ఆ మేరకు అభివృద్ధి ప్రాతిపదికగా వనరుల గరిష్ఠ వినియోగం-సమన్వయం కీలకమని ఆయన స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా పథకాల సమన్వయంతో అనుబంధ కార్యకలాపాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా చక్కని పనితీరుతో మంచి ఫలితాలు సాధ్యమనే భావనపై మితిమీరి ఆధారపడుతూ అదే అపోహతో ఆ దిశగా మాత్రమే వనరులు వినియోగించే ధోరణి సరైనది కాదని ప్రధాని స్పష్టం చేశారు. “ఫలితాలిచ్చే అంశాలకే పుష్కల వనరులు వెచ్చించడం వృథాకు దారితీస్తుంది.. అలాకాకుండా అవసరం ప్రాతిపదికగా ఆయా రంగాలకు కేటాయిస్తే వినియోగం మరింత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో వనరుల పంపిణీ సమానంగా ఉండాలి” అని ఆయన ఉద్బోధించారు.
ప్రభుత్వంపై ఆధారపడే మనస్తత్వం నుంచి బయటపడాల్సిన అవసరంతోపాటు గొప్ప విజయాలు సాధించగల సామాజిక శక్తి గురించి ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ఈ మేరకు ‘ప్రజా భాగస్వామ్యం’ ఆవశ్యకతను వివరిస్తూ- ప్రతి రంగంలోనూ ఒక నాయకుడి అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజా భాగస్వామ్యం కోసం నాయకులను తీర్చిదిద్దడంలో, కొత్త ఆలోచనలకు జీవం పోయడంలో ‘సంకల్ప సప్తాహం’ వారోత్సవాల ద్వారా జట్టు స్ఫూర్తిని పెంచే అంశాన్ని ఆయన నొక్కిచెప్పారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ పరస్పరం ఆపన్నహస్తం అందించడాన్ని ఉదాహరించారు. అలాగు ప్రజల్లో భాగస్వామ్య స్ఫూర్తి నింపడానికి సమితుల స్థాయిలో సమష్టిగా పనులు చేయడాన్ని కూడా ఆయన స్పృశించారు. పోషకాహార లోపం నిర్మూలన కోసం ప్రాంతీయ సంస్థల వార్షికోత్సవాలు నిర్వహించడం, పాఠశాల విద్యార్థులకు ఆహార పంపిణీ వంటి ఉదాహరణలను ప్రస్తావించారు. “సమస్యలకు పరిష్కారాన్వేషణలో ప్రజా భాగస్వామ్య సామర్థ్యం అద్భుతం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఆ మేరకు ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన కృషికి ప్రవాస భారతీయుల సామాజిక భాగస్వామ్యం తోడుకావడంతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట ఇనుమడించడాన్ని ఈ సందర్భంగా ప్రధాని ఉదాహరించారు. అదే తరహాలో ‘సంకల్ప సప్తాహం’ వారోత్సవాలను గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతినిధులను కోరారు. వనరుల సమీకరణతోపాటు గరిష్ఠ ప్రభావం దిశగా దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. ఇది ఒంటెద్దు పోకడకు స్వస్తిచెప్పి, సంపూర్ణ ప్రభుత్వానికి బాటలు వేస్తుందన్నారు. కమ్యూనికేషన్‌లో సాంకేతికత అద్వితీయ పాత్ర పోషిస్తున్నప్పటికీ, కార్యస్థానంలో ప్రత్యక్ష ప్రమేయానికి ప్రత్యామ్నాయం లేదని నొక్కిచెప్పారు. తద్వారా దాని బలాబలాలు, లోటుపాట్లు తెలుసుకునే వీలుంటుందని, కాబట్టి ఈ విషయంలో మనం రాజీపడరాదని ప్రధాని స్పష్టం చేశారు. ‘సంకల్ప సప్తాహం’లో వారంపాటు సహోద్యోగులతో కలసిమెలసి పనిచేయడం ద్వారా బలాబలాలు, అవసరాలు పరస్పరం తెలుస్తాయని, బృంద స్ఫూర్తి మెరుగవుతుందని చెప్పారు.
ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమంలో భాగంగా కీలకమైన 5 పారామితులపై దృష్టి సారించి సత్ఫలితాలు సాధించాలని ప్రతినిధులకు ప్రధానమంత్రి సూచించారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం ఇనుమడించి, ఇలా క్రమక్రమంగా సమస్యల పరిష్కారం చేయడం వల్ల ఆయా సమితులు ఇతర సమితులలో ఆశాభావం నింపి, వాటి ఆకాంక్షలకు ఊపిరిపోయగలవని అన్నారు. “దేశంలోని 112 ఆకాంక్షాత్మక జిల్లాలు నేడు స్ఫూర్తిదాయక జిల్లాలుగా మారాయి. అదేవిధంగా ఒక్క ఏడాదిలోనే కనీసం 100 ఆకాంక్షాత్మక సమితులు స్ఫూర్తిదాయకంగా రూపొందగలవని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను” అని ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు శ్రీ సుమన్ బేరీ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమం సమర్థ అమలు అన్నది ‘సంకల్ప సప్తాహం’ వారోత్సవాలతో ముడిపడి ఉంది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి 2023 జనవరి 7న ప్రారంభించారు. పౌరుల జీవన నాణ్యత పెంచేవిధంగా సమితుల పాలనకు మెరుగులు దిద్దడం దీని లక్ష్యం. తదనుగుణంగా 329 జిల్లాల్లో మొత్తం 500 సమితులను ఈ కార్యక్రమం కింద ఎంపికచేశారు. దీని సమర్థ అమలుకు, సమితుల అభివృద్ధికి తగిన వ్యూహాల రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా గ్రామాలు-సమితుల స్థాయిలో ఆలోచన శిబిరాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంతిమ వ్యూహంగా ‘సంకల్ప సప్తాహం’ వారోత్సవాలకు ఇప్పుడు శ్రీకారం చుట్టబడింది.
దేశంలోని 500 ఆకాంక్షాత్మక సమితులలో 2023 అక్టోబరు 3 నుంచి 9 వరకూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఒకటి వంతున ప్రకటించే నిర్దిష్ట అభివృద్ధి ఆధారిత ఇతివృత్తాన్ని అన్ని ఆకాంక్షాత్మక సమితులలో అమలు చేస్తారు. ఈ మేరకు ఆరు రోజుల ఇతివృత్తాలలో- ‘సంపూర్ణ ఆరోగ్యం’, ‘పౌష్టిక కుటుంబం’, ‘పరిశుభ్రత’, ‘వ్యవసాయం’, ‘విద్య’, ‘సౌభాగ్య దినం’ వంటివి ఉంటాయి. వారోత్సవాల్లో చివరి రోజున- 2023 అక్టోబరు 9నాడు ‘సంకల్ప సప్తాహం - సమాపనోత్సవం’ నిర్వహిస్తారు.
భారత మండపంలో నిర్వహించే వారోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగాగల 3,000 మంది పంచాయతీ, సమితుల స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరవుతారు. వీరితోపాటు సమితులు, పంచాయతీల కార్యకర్తలు, రైతులు, ఇతర వర్గాలవారు సహా దాదాపు 2 లక్షల మంది ఈ కార్యక్రమంలో వర్చువల్ మాధ్యమం ద్వారా పాల్గొంటారు.