రాణీ లక్ష్మీబాయితోపాటు 1857 నాటి స్వాతంత్ర్య పోరాట వీరులు.. వీరనారులకు నివాళి; మేజర్‌ ధ్యాన్‌చంద్‌ సంస్మరణ;
ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం తొలి సభ్యులుగా నమోదు చేసుకున్న ప్ర‌ధానమంత్రి; “ఒకవైపు మన బలగాల శక్తి పెరుగుతోంది.. మరోవైపు భవిష్యత్తులో
దేశరక్షణకు సమర్థులైన యువత కోసం రంగం సిద్ధం చేయబడుతోంది”;“సైనిక్‌ స్కూళ్లలో బాలికల ప్రవేశానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది..
ఈ ఏడాదినుంచే 33 సైనిక్‌ స్కూళ్లలో బాలికల ప్రవేశం మొదలైంది”;
“చిరకాలంగా భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారు దేశాల్లో ఒకటిగా ఉంది.. కానీ- నేడు ‘మేక్‌ ఇన్‌ ఇండియా.. మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ అన్నదే మన మంత్రం”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్‌ పర్వ్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ సిమ్యులేషన్‌ ట్రైనింగ్‌’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్‌’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌ రక్షణ పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.

   ఝాన్సీలోని గ‌రౌతా‌లో రూ. 3000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించే 600 మెగావాట్ల అల్ట్రామెగా సౌరశక్తి పార్కు నిర్మాణానికి కూడా ప్ర‌ధానమంత్రి శంకుస్థాప‌న చేశారు. ఇది చౌక విద్యుత్తును అందించడమే కాకుండ గ్రిడ్ స్థిరత్వం సాధనలో దోహదపడుతుంది. ఝాన్సీలో ‘అటల్ ఏక్తా పార్కు’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీదుగా రూ.11 కోట్లతో దాదాపు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పార్కు నిర్మితమైంది. ఇందులో గ్రంథాలయంతోపాటు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం కూడా ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖ శిల్పి శ్రీ రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు.

   ఈ కార్యక్రమాలకు హాజరైనవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- శౌర్యపరాక్రమాలకు ప్రతిరూపమైన రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా నేడు ఝాన్సీ నగరం స్వాతంత్ర్య పోరాటానికి చెందిన ఘనమైన అమృత మహోత్సవాలకు ప్రత్యక్షసాక్షిగా ఉన్నదని అభివర్ణించారు. ఈ గడ్డమీద నేడు బలమైన, శక్తిమంతమైన సరికొత్త భారతదేం రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. రాణీ లక్ష్మీబాయి జన్మస్థలమైన కాశీ నగరం నుంచి తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడంపై తానెంతో గర్విస్తున్నానని ప్రధానమంత్రి ప్రకటించారు. గురు నానక్‌ దేవ్‌ జయంతి ప్రకాష్‌ పరబ్‌, కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాహసం, త్యాగాల చరిత్రలో తమవంతు పాత్ర పోషించిన అనేకమంది వీరులు, వీరనారులకు ప్రధాని నివాళి అర్పించారు. “రానీ లక్ష్మీబాయికి అనుంగు స్నేహితురాలైన వీరంగన ఝల్కారీ బాయి ధైర్యసాహసాలు, యుద్ధ పరాక్రమానికీ ఈ నేల ప్రత్యక్ష సాక్షి... 1857నాటి స్వాతంత్ర్య పోరాటంలో అమరత్వం పొందిన ఆ వీరవనిత పాదాలకు శిరసాభివందనం చేస్తున్నాను. ఈ గడ్డపై జన్మించి భారతదేశం గర్వపడేలా భారతీయ పరాక్రమం, సంస్కృతి సంబంధిత చిరస్మరణీయ గాథలకు స్ఫూర్తిదాతలైన చందేలాలు-బుందేలాలకూ నమస్కరిస్తున్నాను! మాతృభూమి పరిరక్షణలో ఆత్మత్యాగాలతో త్యాగానికే ప్రతీకలుగా నిలిచిన సాహసులు అల్హా-ఉడల్స్, వారికి ఆలవాలమైన బుందేల్‌ఖండ్‌ ప్రతిష్టకు నేను నమస్కరిస్తున్నాను” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ఝన్సీ వాస్తవ్యుడైన హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ను ప్రధానమంత్రి స్మరించుకున్నారు. క్రీడా నైపుణ్యానికి గుర్తింపుగా ప్రదానం చేసే అత్యున్నత పురస్కారానికి ఆయన పేరు పెట్టడాన్ని గుర్తుచేశారు.

నేడు ఒకవైపు మన బలగాల శక్తి పెరుగుతోందని, మరోవైపు భవిష్యత్తులో దేశరక్షణకు సమర్థులైన యువత కోసం రంగం సిద్ధం చేయబడుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 

దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్న 100 సైనిక్ స్కూళ్లు రానున్న కాలంలో దేశ భవిష్యత్తును శక్తిమంతమైన చేతుల్లో పెట్టడానికి కృషిచేస్తాయన్నారు. సైనిక్ స్కూళ్లలో బాలికల ప్రవేశాలను ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ మేరకు 33 సైనిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే బాలికల ప్రవేశం మొదలైందని తెలిపారు. దేశ రక్షణ-భద్రత, అభివృద్ధి బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకోగల రాణి లక్ష్మీబాయి వంటి భరతమాత పుత్రికలు కూడా ఈ సైనిక పాఠశాలల నుంచి ఆవిర్భవిస్తారని పేర్కొన్నారు. ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘంలో తొలి సభ్యత్వం స్వీకరించిన సందర్భంగా- తన పూర్వ సహసభ్యులు దేశ సేవకోసం ముందుకొచ్చి, సాధ్యమైన రీతిలో సహకరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

భారతదేశం పరాక్రమ లేమితో ఎన్నడూ యుద్ధంలో ఓడిపోలేదని తన వెనుక కనిపిస్తున్న చరిత్రాత్మక ఝాన్సీ కోట సాక్షిగా చెబుతున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఆనాడు బ్రిటిష్ వారితో సమానంగా రాణీ లక్ష్మీబాయికి వనరులు, ఆధునిక ఆయుధాలు ఉంటే దేశ స్వాతంత్య్ర చరిత్ర మరొక విధంగా ఉండేదని ఆయన అన్నారు. చిరకాలం నుంచీ భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారు దేశాల్లో ఒకటిగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. కానీ, నేడు ‘మేక్‌ ఇన్ ఇండియా.. మేక్‌ ఫర్‌ ది వరల్డ్’ అన్నదే మన తారకమంత్రమని పేర్కొన్నారు. ఆ మేరకు భారత్‌ తన బలగాలకు స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తోందని, ఈ కృషిలో ఝాన్సీ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన ప్రకటించారు.

   క్షణ రంగంలో స్వయం సమృద్ధ వాతావరణ సృష్టి దిశగా ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడగలవని ప్రధానమంత్రి అన్నారు. మన జాతీయ వీరులు, వీరనారుల అమరగాథలను కూడా మనం ఘనంగా సంస్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi