‘‘ప్రపంచం ఆందోళనలో మునిగితే భారత్ ఆశల ఊపిరి పోస్తుంది’’
‘‘భారత్ నేడు ప్రతి రంగంలో... ప్రతి అంశంలో అనూహ్య వేగంతో పురోగమిస్తోంది’’
‘‘భారత్ వర్ధమాన దేశం మాత్రమే కాదు... ప్రపంచ శక్తిగానూ ఎదుగుతోంది’’
‘‘ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరే సామర్థ్యంగల అత్యంత యువ దేశాలలో భారత్ ఒకటి’’
‘‘భారత్ ఇప్పుడు దూరదృష్టిగల ఆలోచన విధానాలతో ముందడుగేస్తోంది’’
‘‘వికసిత భారత్ సంకల్పంలో భాగస్వాములైన 140 కోట్ల మంది ప్రజలే దాని సాకారానికి సారథులు’’
‘‘భార‌త్‌కు రెండు రకాల ‘ఎఐ’ సానుకూలత ఉంది... అందులో ఒకటి కృత్రిమ మేధ కాగా- మరొకటి ఆకాంక్షాత్మక భారతం’’
‘‘నామమాత్రపు బంధాలను భారత్ విశ్వసించదు... మా సంబంధ బాంధవ్యాలకు నమ్మకం.. విశ్వసనీయతలే పునాదులు’’
‘‘సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ ద్వారా ప్రపంచం కోసం సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలకు భారత్ కొత్త బాటలు వేసింది’’
‘‘డిజిటల్ ఆవిష్కరణలు... ప్రజాస్వామ్య విలువల జమిలి మనుగడ సాధ్యమేనని భారత్ రుజువు చేసింది’’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి ప్రపంచ సదస్సు-2024లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత ప్ర‌ముఖుల‌ందరికీ స్వాగ‌తం ప‌లుకుతూ- శిఖరాగ్ర  స‌దస్సు అనేక అంశాల‌పై చ‌ర్చిస్తుందన్నారు. వివిధ రంగాల నుంచి హాజరైన ప్రపంచ అగ్రశ్రేణి ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని కూడా ఆయన ప్రకటించారు.
   గ‌త నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భ‌విష్య‌త్తు సంబంధిత ఆందోళ‌న‌ల‌పై చ‌ర్చ‌లు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భార‌త్‌ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.
 

   ఈ మేరకు ‘‘ప్రస్తుత ప్రపంచవ్యాప్త కల్లోల పరిస్థితుల నడుమ భారత్ ఒక్కటే ఆశా కిరణంగా నిలుస్తోందని చెప్పారు. ప్రపంచం వ్యాకులపడితే భారత్ కొత్త ఊపిరి పోస్తుంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. నేటి ప్రపంచ పరిస్థితులు, అనేక దేశాల ముందున్న సమస్యలు భార‌త్‌ను ప్రభావితం చేసినా, ఈ దేశం ఆశావహ ధోరణిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
   ‘‘భారత్ నేడు ప్రతి రంగంలోనే కాకుండా, ప్రతి అంశంలో అనూహ్య వేగంతో పురోగమిస్తోంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 125 రోజులు పూర్తి కావడాన్ని ప్రస్తావిస్తూ- ఈ సమయంలో దేశ ప్రగతి కోసం చేసిన కృషిని వివరించారు. ఈ మేరకు పేదల కోసం 3 కోట్ల కొత్త పక్కా ఇళ్లకు ఆమోదం, రూ.9 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, 15 కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం, 8 కొత్త విమానాశ్రయాలకు శంకుస్థాపన, యువత కోసం రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటనలను ఆయన ఉదాహరించారు. అలాగే రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.21,000 కోట్లు బదిలీ చేశామని, దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స పథకం, దాదాపు 5 లక్షల ఇళ్ల పైకప్పు మీద విద్యుదుత్పాదన యూనిట్ల ఏర్పాటు, ‘తల్లి పేరిట ఓ మొక్క’ కార్యక్రమం కింద 90 కోట్ల మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలు చేపట్టామని వివరించారు. దీంతోపాటు 12 కొత్త పారిశ్రామిక సంగమాలకు ఆమోదం తదితరాలను కూడా ఆయన ఏకరవు పెట్టారు. దీంతో  సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు 5 నుంచి 7 శాతందాకా వృద్ధి నమోదు చేశాయన్నారు. భారత విదేశీ మారక నిల్వలు 700 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగినట్లు పేర్కొన్నారు. గడచిన 125 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ‘ఎస్ఎంయు’, గ్లోబల్ ఫిన్‌టెక్ వేడుకలు, గ్లోబల్ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ, నవ్య-పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయానంపై అంతర్జాతీయ సదస్సు వంటివాటిని ఉదహరించారు. ‘‘ఇది కేవలం కార్యక్రమాల జాబితా కాదు... దేశానికి దిశానిర్దేశం సహా భార‌త్‌పై ప్రపంచానికిగల ఆశాభావాన్ని ప్రస్ఫుటం చేసే ఆశల జాబితా’’ అని అభివర్ణించారు. ఇవన్నీ ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే అంశాలని, వీటిపై చర్చలకు భారత్ కీలక వేదికగా మారిందని ప్రధాని గుర్తుచేశారు.
   ప్రస్తుత ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చాక దేశ ప్రగతి మరింత వేగం పుంజుకోవడంతో రేటింగ్ సంస్థలన్నీ తమ ముందస్తు అంచనాలను సవరించక తప్పలేదని ఆయన అన్నారు. ఈ మేరకు భార‌త్‌లో పెట్టుబడులపై మార్క్ మోబియస్ వంటి మార్కెట్ నిపుణుడి ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ- అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు తమ నిధుల్లో 50 శాతాన్ని మన షేర్ మార్కెట్లో పెట్టాలని ఆయన సూచించినట్లు గుర్తుచేశారు. ‘‘భార‌త్‌లో భారీ పెట్టుబడులపై ఇలాంటి అనుభవంగల నిపుణులిచ్చే సలహా మన సామర్థ్యంపై ప్రపంచానికి బలమైన సందేశాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు.
   ‘‘భారత్ ఇవాళ వర్ధమాన దేశంగా మాత్రమే కాకుండా ప్రపంచ శక్తిగానూ వేగంగా ఎదుగుతోంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పేదరికం విసిరే సవాళ్లపై పూర్తి అవగాహన ఉన్నందున ప్రగతికి బాటలు వేయడం ఎలాగో మన దేశానికి చక్కగా తెలుసునన్నారు. విధాన రూపకల్పన, నిర్ణయాత్మక ప్రక్రియలు, కొత్త సంస్కరణల విషయంలో ప్రభుత్వం వేగాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకనాటి అలసత్వ ధోరణిని గుర్తుచేస్తూ- ఇలాంటి ఆలోచన దృక్పథం ఉంటే దేశం ముందడుగు వేయజాలదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరిక విముక్తులు కాగా, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం, 16 కోట్ల గ్యాస్‌ కనెక్షన్ల జారీ వంటి అంశాలను ఉదహరిస్తూ, ఇక్కడితో అంతా అయిపోలేదని వ్యాఖ్యానించారు.
 

   భారత్ గ‌త పదేళ్లలో 350కిపైగా వైద్య క‌ళాశాల‌లు, 15కుపైగా ‘ఎయిమ్స్‌’ నిర్మించిందని ప్రధాని చెప్పారు. అలాగే 1.5 ల‌క్ష‌ల అంకుర సంస్థల ఏర్పాటుతోపాటు 8 కోట్ల మంది యువ‌త‌కు ముద్ర పథకం కింద రుణాలిచ్చిందని తెలియపారు. అయితే, ‘‘ఇదీ సరిపోదు’’ అంటూ- దేశ యువత నిరంతర పురోగమనం కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలకు చేరగల అత్యంత యువ దేశాల్లో భారత్ ఒకటని ప్రధానమంత్రి గుర్తుచేశారు. మన యువత సామర్థ్యంతో ఈ లక్ష్యాన్ని మరింత త్వరగా, సమర్థంగా అందుకోగల అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు.
   దేశం ఆలోచన ధోరణిలో మార్పును ప్రస్ఫుటం చేస్తూ- ఏ ప్రభుత్వమైనా తన విజయాలను మునుపటి ప్రభుత్వాల హయాంతో పోల్చి చూసుకుంటుందని ప్రధాని అన్నారు. ఆ మేరకు 10-15 ఏళ్లు వెనక్కి చూస్తే వాటిని అధిగమించడాన్ని ఒక విజయంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. అయితే, భారత్ నేడు ఈ విధానాన్ని మార్చేసిందని, మునుపటి విజయాల ప్రాతిపదికన కాకుండా భవిష్యత్తు దిశను బట్టి ప్రస్తుత ముందంజపై అంచనాలు వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దూరదృష్టితో ముందంజ వేసే దృక్పథాన్ని విశదీకరిస్తూ... భవిష్యత్తు-కేంద్రక విధానంతో దేశం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పారు. “మన దేశం 2047  నాటికి వికసిత భారత్ కావాలన్నది మా లక్ష్యం మాత్రమే కాదు... అది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం. అది ప్రజా భాగస్వామ్యం కోసం నిర్వహించే ఓ కార్యక్రమం కాదు... జాతి ఆత్మవిశ్వాసాన్ని చాటే ఉద్యమం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వికసిత భారత్ దార్శనిక పత్రం రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినపుడు లక్షలాది ప్రజలు తమ సూచనలు, సలహాలతో సహకరించారని ఆయన గుర్తుచేశారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకూ... వివిధ సంస్థల ద్వారా చర్చోపచర్చలు సాగాయన్నారు. అనంతరం అందరి అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభుత్వం క్రోడీకరించి, రాబోయే 25 ఏళ్లకు తగిన లక్ష్యాలను నిర్దేశించిందని వివరించారు. ‘‘వికసిత భారత్‌పై నేటి మన చర్చలు జాతీయ చైతన్యంలో భాగం మాత్రమే కాదు... ప్రజాశక్తిని జాతి శక్తిగా మార్చే వాస్తవ ఉదాహరణగా రూపొందాయి’’ అన్నారు.
   కృత్రిమ మేధ (ఎఐ) గురించి ప్రస్తావిస్తూ- ఈ 21వ శతాబ్దం ‘ఎఐ’ యుగమని, ప్ర‌పంచ వ‌ర్తమానం-భ‌విష్య‌త్తు రెండూ దీనితో ముడిప‌డి ఉన్నాయ‌ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భార‌త్‌కు రెండు రకాల ‘ఎఐ’ సానుకూలత ఉందంటూ- అందులో ఒకటి ‘కృత్రిమ (ఎఐ) మేధ’ కాగా, మరొకటి ‘ఆకాంక్షాత్మక భారత్’ (యాస్పిరేషనల్ ఇండియా) అని అభివర్ణించారు. దేశానికి ఇదొక కొత్త సాంకేతికత మాత్రమే కాదని, యువతకు కొత్త అవకాశాల బాటలు పరిచే మార్గమని స్పష్టం చేవారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘ఇండియా ‘ఎఐ’ మిషన్‌’ను ప్రారంభించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య, అంకుర సంస్థల వంటి రంగాల్లో దీని వినియోగం పెంపుపైగా దృష్టి సారించామని తెలిపారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ‘ఎఐ’ పరిష్కారాల ప్రదానానికి భారత్ సిద్ధంగా ఉంది. క్వాడ్ వంటి వేదికల ద్వారా దీన్ని మరింత ముందుకు  తీసుకెళ్లేలా మేము కీలక కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని ఆయన వెల్లడించారు. అలాగే ఆకాంక్షాత్మక భారత్‌ను ప్రస్తావిస్తూ- సామాన్య, మధ్యతరగతి పౌరుల జీవన నాణ్యత మెరుగుదలసహా చిన్న వ్యాపారాలు, ‘ఎంఎస్ఎంఇ’లు, యువతరం, మహిళల సాధికారత వంటివి ప్రభుత్వ విధాన రూపకల్పన ప్రక్రియలలో ప్రధానాంశాలుగా ఉన్నాయన్నారు. అనుసంధానం దిశగా దేశం సాధించిన అద్భుత పురోగమనాన్ని జాతి ఆకాంక్షలు నెరవేర్చడంలో ఒక ఉదాహరణగా ప్రధానమంత్రి ఉటంకించారు. ప్రగతిశీల సమాజానికి, విశేషించి... భారత్ వంటి సువిశాల, వైవిధ్యభరిత దేశానికి తగిన సమ్మిళిత, వేగవంతమైన భౌతిక అనుసంధానంపై ప్రభుత్వం నేడు దృష్టి సారించిందని చెప్పారు.
   ఈ క్రమంలో విమాన యానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని తెలిపారు. ‘హవాయి చెప్పులు’ ధరించే అతి సామాన్యులు కూడా ఆకాశయానం చేయగలగాలన్నదే చౌక విమాన ప్రయాణంపై తన ఆలోచనగా వెల్లడించారు. తదనుగుణంగా రూపొందిన ‘ఉడాన్’ పథకానికి ఇప్పుడు 8 సంవత్సరాలు నిండాయని గుర్తుచేశారు. దేశంలోని 2, 3వ అంచె నగరాల్లో కొత్త విమానాశ్రయ నెట్‌వర్క్‌లు ప్రజలందరికీ విమాన యానాన్ని అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు. దీనికింద ఇప్పటిదాకా నడిపిన 3 లక్షల విమాన సర్వీసులు 1.5 కోట్ల మంది  సామాన్య ప్రయాణికులను గమ్యం చేర్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద నేడు చిన్న పట్టణాలను కలుపుతూ 600కుపైగా మార్గాల్లో విమాన సేవలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలో 2014నాటికి 70 విమానాశ్రయాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 150 దాటిందని చెప్పారు.
 

   భారత యువతను ప్రపంచ వృద్ధికి సారథులుగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని ఉటంకించారు. ఈ మేరకు విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఉపాధి కల్పనపై నిశితంగా దృష్టి సారించామని గుర్తుచేశారు. గత 10 ఏళ్ల కృషి ఫలితాలకు నిదర్శనంగా ‘టైమ్స్’ పత్రిక ఉన్నత విద్య ర్యాంకులతోపాటు పరిశోధన నాణ్యతలోనూ అంతర్జాతీయంగా భారత్ స్థానం ఎగువకు దూసుకెళ్లిందని తెలిపారు. అలాగే గత 8-9 ఏళ్లుగా అంతర్జాతీయ ర్యాంకులలో మన విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం 30 నుంచి 100కు పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘క్యుఎస్’ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులలో భారత్ స్థాయి పదేళ్లలో 300 శాతానికి మించి పెరిగిందన్నారు. అలాగే దేశం నుంచి దాఖలైన పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల సంఖ్య రికార్డు స్థాయికి చేరిందని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోని 2,500కుపైగా కంపెనీలకు భార‌త్‌లో పరిశోధన కేంద్రాలున్నాయని తెలిపారు. మరోవైపు అంకుర సంస్థల వ్యవస్థ అనూహ్య వృద్ధిని సాధిస్తుండగా, పరిశోధన-ఆవిష్కరణలకు మన దేశం ప్రపంచ కూడలిగా మారుతున్నదని చెప్పారు.
   ప్రపంచానికి విశ్వసనీయ మిత్రదేశంగా భారత్ ప్రాముఖ్యం విస్తరిచడాన్ని ప్రస్తావిస్తూ- అనేక రంగాల్లో మానవాళి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయడంలో మన దేశం ముందుంటుందని శ్రీ మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను ప్రస్తావిస్తూ- ఆనాటి సంక్షోభం నడుమ మందులు, టీకాల సరఫరా సామర్థ్యం సాధించిన మనకు లక్షల కోట్ల డాలర్లు ఆర్జించే అవకాశం ఉందని గుర్తుచేశారు. ‘‘ఆనాడు మనం భారీ ఆదాయం సంపాదించే అవకాశాన్ని వాడుకుని ఉంటే మానవత్వమనే సుగుణాన్ని మనం పోగొట్టుకుని ఉండేవారం. మన విలువలు అటువంటివి కావు కాబట్టే- ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి నుంచి మానవాళి రక్షణ లక్ష్యంగా వందల దేశాలకు మందులు, ప్రాణరక్షక టీకాలను సరఫరా చేశం’’ అని ఆయన వివరించారు. ‘‘అటువంటి సంక్లిష్ట సమయంలో ప్రపంచానికి మన దేశం చేయూతనివ్వడం నాకెంతో సంతృప్తినిచ్చింది” అన్నారు.
   దృఢమైన అంతర్జాతీయ సంబంధాలు ఏర్పరచుకోవడంపై భారత్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ- నామమాత్రపు బంధాలను భారత్ విశ్వసించదని, బాంధవ్యానికి నమ్మకం, విశ్వసనీయతలే పునాదులని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దృక్పథాన్ని ప్రపంచం కూడా అవగతం చేసుకుంటున్నదని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలతో భారత్ సామరస్య పూర్వక సంబంధాలను వివరిస్తూ- ‘‘భారత పురోగమనంపై ప్రపంచంలో ఎక్కడా ఈర్ష్య, అసూయ కనిపించవు’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘‘మన ప్రగతి యావత్ మానవాళికీ ప్రయోజనకరం కాబట్టి, ప్రపంచం భారత పురోగమనాన్ని హర్షిస్తుంది’’ అన్నారు. ప్రపంచ వృద్ధికి భారత్ గతంలోనూ సానుకూల పాత్ర పోషించిందని, దీంతోపాటు మన ఆలోచనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తులు శతాబ్దాలుగా అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేశాయని శ్రీ మోదీ గుర్తుచేశారు. వలసపాలన పర్యవసానంగా పారిశ్రామిక విప్లవాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయిందని ప్రధాని అన్నారు. అయితే, ‘‘ఇది పరిశ్రమ 4.0 శకం. ఇప్పుడు మనం ఎవరికీ బానిసలం కాదు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ముందడుగు వేయడానికి మనం నడుం బిగించాం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
   పరిశ్రమ 4.0కు తగిన నైపుణ్య సముపార్జన, మౌలిక సదుపాయాల కల్పన దిశగా భారత్ వేగంగా ముందుకెళ్తోందని ప్రధాని ఉద్ఘాటించారు. గత దశాబ్దంలో భారత్ జి-20కి అధ్యక్షత వహించడంతోపాటు జి-7 శిఖరాగ్ర సమావేశం సహా అనేక అంతర్జాతీయ వేదికలపై మన సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల (డిపిఐ)పై కీలక చర్చలకు సూత్రధారిగా వ్యవహరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మన ఆధార్, డిజిలాకర్ వంటి ఆవిష్కరణలను ప్రశంసించిన పాల్ రోమర్‌తో తన చర్చలను ప్రస్తావిస్తూ- ‘‘ప్రపంచం మొత్తం నేడు మన యొక్క ‘డిపిఐ’ల వైపు దృష్టి సారించింది’’ అన్నారు. ‘‘ఇంటర్నెట్ యుగంలో తొలి ప్రయోజనం పొందిన దేశాల జాబితాలో భారత్ లేదు. అయితే, ఆ ప్రయోజనం పొందిన దేశాల్లో ప్రైవేట్ వేదికలు డిజిటల్ రంగాన్ని ముందుకు నడిపించాయని శ్రీ మోదీ వివరించారు. అయితే, సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడం ద్వారా భారత్ ప్రపంచం కోసం కొత్త నమూనాను ఆవిష్కరించిందని తెలిపారు. ఇందులో భాగంగా వేగవంతమైన, అవినీతికి తావులేని సేవా ప్రదానం లక్ష్యంగా ‘జన్-ధన్’, ‘ఆధార్’, ‘మొబైల్‌’ (జామ్ త్రయం)తో బలమైన ఏకీకృత వ్యవస్థను రూపొందించిందని గుర్తుచేశారు. అదేవిధంగా రోజువారీగా 500 మిలియన్లకుపైగా లావాదేవీలు నమోదయ్యేలా డిజిటల్ లావాదేవీల సౌలభ్యం కల్పిస్తున్న ‘యుపిఐ’ని కూడా ఆయన ప్రస్తావించారు. వీటన్నిటి వెనుకగల చోదకశక్తులు కార్పొరేట్ సంస్థలు కాదని, మన చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులేనని ఆయన పేర్కొన్నారు. అలాగే బహుళ రవాణా పర్యావరణ వ్యవస్థ రూపాంతరీకరణకు ప్రభుత్వం గట్టి ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.  ఈ మేరకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో అవరోధాలను తొలగిస్తూ ‘పిఎం గతిశక్తి’ వేదిక రూపకల్పనను ప్రస్తావించారు. అలాగే ఆన్‌లైన్ చిల్లర వర్తకంలో ప్రజాస్వామ్యం, పారదర్శకత పెంపులో ‘ఒఎన్‌డిసి’ వేదిక వినూత్న ఆవిష్కరణగా పేరు తెచ్చుకున్నదని చెప్పారు. ఈ విధంగా డిజిటల్ ఆవిష్కరణలు-ప్రజాస్వామ్య విలువల జమిలి మనుగడ సాధ్యమేనని భారత్ నిరూపించిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తద్వారా సాంకేతికత అంటే- నియంత్రణ-విభజన అనే భావనకు భిన్నంగా పారదర్శకత-సాధికారత కల్పించే ఉపకరణమనే అభిప్రాయం బలపడిందని పేర్కొన్నారు.
 

   ఈ 21వ శతాబ్దం మానవ చరిత్రలో అత్యంత కీలక సమయమని శ్రీ మోదీ అన్నారు. ఆ మేరకు స్థిరత్వం, సుస్థిరత, పరిష్కారాలు నేటి తక్షణావసరాలని ఆయన పేర్కొన్నారు. మానవాళికి మెరుగైన భవిష్యత్తు దిశగా ఇవి అత్యంత కీలకాంశాలని, ఆ దిశగా భారత్ కృషి చేస్తున్నదని చెప్పారు. ఇక ప్రభుత్వానికి భారత ప్రజానీకం తిరుగులేని మద్దతును ప్రస్తావిస్తూ- ఆరు దశాబ్దాల అనంతరం వరుసగా మూడోదఫా తమకు అధికారమిస్తూ తీర్పు చెప్పారని గుర్తుచేశారు. హర్యానాలో ఇటీవలి ఎన్నికలలోనూ ప్రజాభిప్రాయం ఇదేవిధంగా వెలువడిందని, తద్వారా రాజకీయ స్థిరత్వానికిగల ప్రాముఖ్యంపై ప్రజలు మరోసారి బలమైన సందేశమిచ్చారని పేర్కొన్నారు.
   ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు సంక్షోభాన్ని వివరిస్తూ- ఇది మొత్తం మానవాళిని ప్రభావితం చేస్తుందని ప్రధాని అన్నారు. ఈ సమస్యలో మన వాటా అత్యంత  స్వల్పమే అయినప్పటికీ దాని పరిష్కారంలో మాత్రం భారత్ ముందుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం హరిత ఇంధనం దిశగా రూపాంతరీకరణను వృద్ధికి కీలక చోదకంగా మార్చిందన్నారు. ఆ మేరకు భారత ప్రగతి ప్రణాళికలో సుస్థిరతకే పెద్దపీట వేశామని శ్రీ మోదీ అన్నారు. ఈ దిశగా ప్రభుత్వ నిబద్ధతకు- ‘పిఎం సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం’, రైతులకు సోలార్ పంపుల పంపిణీ, విద్యుత్ వాహన విప్లవం, ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం, భారీ పవన విద్యుత్ క్షేత్రాలు, ‘ఎల్ఇడి’ లైట్ల ఉద్యమం, సౌరశక్తి ఆధారిత విమానాశ్రయాలు, బయోగ్యాస్ ప్లాంట్లు వంటివి నిదర్శనాలని వివరించారు. వీటిలో ప్రతి కార్యక్రమం హరిత భవిష్యత్తు, హరిత ఉపాధిపై ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తాయని తెలిపారు.
 

   దేశీయంగా రాజకీయ స్థిరత్వం, సుస్థిర ప్రగతితోపాటు ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపడంపైనా భారత్ దృష్టి సారిస్తున్నదని ప్రధాని చెప్పారు. గత దశాబ్దంలో అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు పునరుత్ధాన మౌలిక సదుపాయాల కూటమి, భారత్-మధ్యప్రాచ్యం ఆర్థిక కారిడార్, అంతర్జాతీయ జీవఇంధన సంకీర్ణం వంటివి సహా యోగా, ఆయుర్వేదం, మిషన్ లైఫ్, మిషన్ మిల్లెట్స్‌ వంటి అనేక కార్యక్రమాల విజయానికి భారత్ కృషి చేసిందని గుర్తుచేశారు. ‘‘ఇవన్నీ ప్రపంచంలోని ప్రధాన సవాళ్లకు పరిష్కారాన్వేషణలో భారత్ దేశం నిబద్ధతను సూచించేవే’’ అని ప్రధాని పేర్కొన్నారు.
   చివరగా- అన్ని రంగాల్లోనూ భారత్ పురోగమనంపై గర్విస్తున్నానంటూ- ‘‘భారత్ పురోగమిస్తున్న కొద్దీ ప్రపంచానికి మరింత ప్రయోజనం కలుగుతుంది’’ అన్నారు. ఈ శతాబ్దం భారతదేశానికి చెందినదని, మన విజయం మానవాళి మొత్తానికీ విజయం కాగలదని పేర్కొన్నారు. ఈ శతాబ్దంలో ప్రతి ఒక్కరి ప్రతిభతో దేశం పురోగమిస్తుందన్నారు. ప్రపంచమంతటా స్థిరత్వం, శాంతి నిలపడంలో భారత్ కృషికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. ‘‘ఇది భారత్ కార్యక్రమాలు శాంతియుత, సుస్థిర ప్రపంచానికి తోడ్పాటునిచ్చే శతాబ్దం’’ అంటూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi