ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రసంగించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధి సంస్థ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్) నిర్వహించిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో హరిత మార్పు కోసం నిధులు సమకూర్చడం, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, వృద్ధిపై ప్రతికూలప్రభావం, సుస్థిరత్వాన్ని పరిరక్షించడానికి విధాన కార్యాచరణ సూత్రాలు వంటి అంశాలపై దృష్టి సారించింది.
మూడో కౌటిల్య ఆర్థిక సమ్మేళనానికి హాజరైన వారికి ప్రధాన మంత్రి కృతఙ్ఞతలు తెలియజేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తుందని, భారత వృద్ధిని వేగవంతం చేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని రెండు ప్రధాన ప్రాంతాలు యుద్ధంలో నిమగ్నమైన సమయంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్న ప్రధాన మంత్రి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధన భద్రత పరంగా ఈ ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. "ఇంత పెద్ద ప్రపంచ అనిశ్చితి నడుమ, మనం ఇక్కడ భారతీయ శకం గురించి చర్చిస్తున్నాము" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ రోజు భారతదేశం పట్ల, దాని ఆత్మవిశ్వాసం పట్ల నమ్మకం పెరగడాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు.
"ప్రపంచంలో భారత దేశం నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ " అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం జీడీపీ పరంగా భారత్ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. నేడు ప్రపంచ ఫిన్ టెక్ అడాప్షన్ రేటులోనూ, స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలోనూ- భారత్ నంబర్ వన్ గా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, ప్రపంచంలోని వాస్తవ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం భారత్ లోనే జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్ట్ అప్ వ్యవస్థను కలిగి ఉందని, పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో నాలుగో స్థానంలో నిలిచిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. తయారీ గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఉందని, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల ఉత్పత్తిలో కూడా అతిపెద్ద తయారీదారు అని ప్రధానమంత్రి చెప్పారు. “భారతదేశం ప్రపంచంలోనే అతి పిన్న దేశం అని" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉందని, శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలు వీటన్నింటిలో భారతదేశం ఒక అనుకూల స్థానంలో ఉందని ప్రధానమంత్రి తెలిపారు.
ప్రభుత్వం సంస్కరణ, పనితీరు , మార్పు మంత్రాన్ని అనుసరిస్తోందని, దేశాన్ని వేగంగా ముందుకు నడిపించడానికి నిరంతరం నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాన మంత్రి అన్నారు, దాని ప్రభావం తోనే 60 సంవత్సరాల తరువాత వరుసగా ఒకే ప్రభుత్వం మూడోసారి తిరిగి ఎన్నిక కావడానికి కారణమని పేర్కొన్నారు. తమ జీవితాలు మంచిగా మారినప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందనే విశ్వాసం ప్రజలకు కలుగుతుందని, ఈ భావన భారత ప్రజల తీర్పులో ప్రతిబింబించిందని, 140 కోట్ల మంది దేశప్రజల విశ్వాసం ఈ ప్రభుత్వానికి గొప్ప ఆస్తి అని ప్రధాని అన్నారు.
భారత దేశం అభివృద్ధి చెందడానికి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. మూడోసారి పదవీ కాలం మొదటి మూడు నెలల్లో తాము చేసిన పనులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. సాహసోపేతమైన విధాన మార్పులు, ఉద్యోగాలు, నైపుణ్యాల పట్ల బలమైన నిబద్ధత, సుస్థిర వృద్ధి, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జీవన నాణ్యత, వేగవంతమైన వృద్ధి కొనసాగింపును ఆయన ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఈ కాలంలో రూ .15 ట్రిలియన్లు లేదా 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేశారు. దేశంలో 12 పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు, మూడు కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆమోదం సహా భారతదేశంలో అనేక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
భారత దేశ సమ్మిళిత స్ఫూర్తి భారత దేశ వృద్ధి కథలో మరో ముఖ్యమైన అంశమని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. వృద్ధితో అసమానతలు పెరుగుతాయనే అభిప్రాయం గతంలో ఉండేదని, కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా భారత్ లో వృద్ధితో పాటు సమ్మిళితం కూడా పెరుగుతోందని అన్నారు. ఫలితంగా గత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని వివరించారు. భారతదేశం శరవేగంగా పురోగమించడంతో పాటు అసమానతలు తగ్గుముఖం పట్టేలా, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ రోజు భారత దేశ వృద్ధికి సంబంధించిన అంచనాలను ప్రముఖంగా పేర్కొంటూ, భారత దేశం ఎటువైపు పయనిస్తోందో ఇవి తెలియ చేస్తున్నాయని, గత కొన్ని వారాలు, నెలల డేటా కూడా దీనిని రుజువు చేస్తుందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాది అంచనాల కంటే మెరుగ్గానే ఉందని చెప్పిన ప్రధాని, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లేదా మూడీస్ వంటి అన్ని సంస్థలు భారతదేశానికి సంబంధించిన తమ అంచనాలను నవీకరించాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ ఏడు ప్లస్ వేగంతో వృద్ధిని కొనసాగిస్తుందని ఈ సంస్థలన్నీ చెబుతున్నాయని, అయితే భారతదేశం ఇంతకంటే మెరుగైన పనితీరును కనబరుస్తుందనే పూర్తి విశ్వాసం మన భారతీయులకు ఉందని శ్రీ మోదీ అన్నారు.
భారత్ ఈ విశ్వాసం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని చెబుతూ ప్రధాన మంత్రి, తయారీ లేదా సేవా రంగం ఏదైనా సరే, నేడు ప్రపంచం భారతదేశాన్ని పెట్టుబడులకు అనుకూల ప్రదేశంగా పరిగణిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది యాదృచ్ఛికం కాదని, గత పదేళ్లలో చేసిన ప్రధాన సంస్కరణల ఫలితమని, ఇది భారతదేశ స్థూల ఆర్థిక మూలాలను మార్చివేసిందని ఆయన అన్నారు. సంస్కరణలకు సంబంధించిన ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ, భారతదేశ బ్యాంకింగ్ సంస్కరణలు బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడమే కాకుండా, వాటి రుణ సామర్థ్యాన్ని కూడా పెంచాయని శ్రీ మోదీ అన్నారు. అదేవిధంగా వస్తు, సేవల పన్ను (జిఎస్ టి) వివిధ కేంద్ర, రాష్ట్ర పరోక్ష పన్నులను ఏకీకృతం చేసిందని, దివాలా చట్టం (ఐబిసి) బాధ్యత, రికవరీ పరిష్కారాల కొత్త క్రెడిట్ సంస్కృతిని అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. సంస్కరణల గురించి మరింత వివరిస్తూ, గనులు , రక్షణ, అంతరిక్షం వంటి రంగాలు ప్రైవేట్ సంస్థలకు, యువ పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరిచాయని చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారులకు పుష్కలమైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎఫ్ డి ఐ విధానాన్ని సరళీకరించిందని తెలిపారు. రవాణా ఖర్చులు, సమయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి తెలియజేశారు. గత దశాబ్దంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు అనూహ్యంగా పెరిగాయని ఆయన అన్నారు.
"భారతదేశం 'పాలనా సంస్కరణలను' ప్రభుత్వ నిరంతర కార్యకలాపాలలో భాగం చేసింది" అని ప్రధాన మంత్రి చెప్పారు, ప్రభుత్వం 40,000 పైగా నిర్బంధ షరతులను తొలగించిందని , కంపెనీల చట్టాన్ని నేరరహితం చేసిందని తెలియజేశారు. వ్యాపారాలను కష్టతరం చేసే డజన్ల కొద్దీ నిబంధనలను సంస్కరించడం, ఒక కంపెనీని ప్రారంభించడానికి, మూసివేయడానికి అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు జాతీయ సింగిల్ విండో వ్యవస్థను సృష్టించడం వంటి ఉదాహరణలను ఆయన పేర్కొన్నారు. . రాష్ట్ర స్థాయిలో కూడా 'ప్రక్రియ సంస్కరణలను' వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ రోజు అనేక రంగాల్లో ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టామని, దీని ప్రభావం ఇప్పుడు అనేక రంగాల్లో కనిపిస్తోందని ప్రధాని తెలిపారు. గడచిన మూడేళ్ళలో సుమారు రూ .1.25 ట్రిలియన్లు లేదా రూ .1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని వల్ల సుమారు రూ.11 ట్రిలియన్లు లేదా రూ.11 లక్షల కోట్ల ఉత్పత్తి , అమ్మకాలు జరిగాయని ప్రధాని తెలియజేశారు. భారత అంతరిక్ష , రక్షణ రంగాల అవకాశాలు ఇటీవలే వచ్చినప్పటికీ అంతరిక్ష రంగంలో 200 కి పైగా స్టార్టప్ లు వచ్చాయని, దేశం లోని మొత్తం రక్షణ ఉత్పత్తుల్లో ప్రైవేట్ రక్షణ సంస్థల వాటా 20 శాతంగా ఉందని తెలియజేశారు.
ఎలక్ట్రానిక్స్ రంగం వృద్ధిని ప్రస్తావిస్తూ, 10 సంవత్సరాల క్రితం వరకు భారతదేశం మొబైల్ ఫోన్లను ఎక్కువగా దిగుమతి చేసుకునేదని, ప్రస్తుతం దేశంలో 33 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. భారతదేశంలోని అన్ని రంగాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడులు పొందడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు వంటి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలపై భారత్ దృష్టి సారించిందని, ఈ రెండు రంగాల్లోనూ ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. భారత కృత్రిమ మేధ మిషన్ కృత్రిమ మేధ రంగంలో పరిశోధన, నైపుణ్యాలను పెంచుతుందని ఆయన తెలియజేశారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ గురించి ప్రస్తావిస్తూ, రూ.1.5 ట్రిలియన్లు లేదా లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, అతి త్వరలోనే, దేశం లోని 5 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రపంచంలోని ప్రతి మూలకు మేడ్ ఇన్ ఇండియా చిప్ లను అందించడం ప్రారంభిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద మేధోశక్తి వనరుగా భారత్ అవతరించిందని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం భారత్ లో 1,700కు పైగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు పనిచేస్తున్నాయని, 20 లక్షలకు పైగా అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన వివరించారు. విద్య, సృజనాత్మకత, నైపుణ్యాలు, పరిశోధనలపై బలమైన దృష్టి సారించడం ద్వారా భారతదేశ జనాభా వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను శ్రీ మోదీ స్పష్టంగా చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం తీసుకువచ్చిన కీలక సంస్కరణలను వివరించారు.గత దశాబ్ద కాలంలో ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ రెండు కొత్త కళాశాలలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇదే కాలం లో మన దేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు.
ప్రభుత్వం విద్యా సంస్థల సంఖ్యను పెంచడం మాత్రమే గాకుండా ప్రమాణాలను కూడా పెంచుతోందని ప్రధాన మంత్రి చెప్పారు. క్యుఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో భారతీయ సంస్థల సంఖ్య ఈ కాలంలో మూడు రెట్లు పెరిగిందని, ఇది విద్యాభ్యున్నతికి దేశం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో కోట్లాది మంది యువతకు నైపుణ్యం, ఇంటర్న్ షిప్ కోసం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ గురించి ఆయన ప్రస్తావించారు. పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కోటి మంది యువ భారతీయులకు ప్రధాన కంపెనీల్లో వాస్తవ ప్రపంచ అనుభవం పొందే అవకాశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రి తెలిపారు. తొలిరోజు 111 కంపెనీలు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్నాయని, పరిశ్రమ నుంచి వచ్చిన ఉత్సాహభరిత స్పందనకు ఇది నిదర్శనమని అన్నారు.
భారత దేశ పరిశోధన వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ, గత దశాబ్దంలో పరిశోధ నలు, పేటెంట్ లు వేగంగా పెరిగాయని శ్రీ మోదీ తెలిపారు. ఒక దశాబ్ద కాలంలోనే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో భారత్ ర్యాంకు ఎనభై ఒకటవ స్థానం నుంచి ముప్పై తొమ్మిదో స్థానానికి చేరుకుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇంకా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని , పరిశోధనలకు అనుకూల వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ .1 ట్రిలియన్ విలువైన bపరిశోధనా నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
“నేడు, హరిత ఉద్యోగాలు , హరిత భవిష్యత్తు విషయానికి వస్తే ప్రపంచం భారతదేశం వైపు చాలా ఆశతో చూస్తోంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఇవి అందించే విస్తారమైన అవకాశాలను వివరిస్తూ, భారత్ అధ్యక్షతన జరిగిన జి 20 సదస్సు విజయాలలో హరిత మార్పు పట్ల వ్యక్తమైన ఉత్సాహం ఒకటని అన్నారు. సభ్య దేశాల నుండి విస్తృత మద్దతు పొందిన ఈ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ను ప్రారంభించడంలో భారతదేశం చొరవ గర్వకారణమని అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయాలనే భారతదేశ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఆయన ప్రముఖంగా తెలిపారు. సూక్ష్మ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడానికి భారతదేశం కట్టుబడి ఉందని , పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకంలో ఇప్పటికేకోటి 30 లక్షల కుటుంబాలు నమోదు అయ్యాయని చెప్పారు. "ఈ పథకం పరిమాణంలో మాత్రమే పెద్దది మాత్రమే కాదు, దాని విధానంలో విప్లవాత్మకమైనది, ఇది ప్రతి కుటుంబాన్ని సౌర శక్తి ఉత్పత్తిదారుగా మారుస్తుంది" అని ఆయన అన్నారు. ప్రతి మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ కు 50-60 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నిరోధించడంతో పాటు కుటుంబాలు ఏటా సగటున రూ.25,000 ఆదా చేస్తాయని ప్రధాని వివరించారు. ఈ పధకం నైపుణ్యం కలిగిన యువతను సృష్టిస్తుందని, అక్కడ సుమారు 17 లక్షల ఉద్యోగాలు వస్తాయని, తద్వారా కొత్త పెట్టుబడి అవకాశాలకు దారితీస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ భారీ మార్పులకు లోనవుతోందని, పటిష్ఠ ఆర్థిక మౌలికాంశాల ఆధారంగా సుస్థిరమైన అధిక వృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. "ఈ రోజు, భారతదేశం అగ్రస్థానానికి చేరుకోవడానికి సిద్ధం కావడమే కాకుండా, అక్కడ స్థిర పడేందుకు కూడా తీవ్రంగా కృషి చేస్తోంది" అని ప్రధాని అన్నారు, ప్రస్తుత సమ్మేళనం లో జరిగే జరుగుతున్న చర్చల నుండి అనేక విలువైన సూచనలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్చల్లో వచ్చిన సలహాలు, ముఖ్యంగా చేయాల్సినవి, చేయకూడనివి ప్రభుత్వ వ్యవస్థల్లో అనుసరిస్తారని,విధానాలు , పాలనలో భాగం అవుతాయని ఆయన చెప్పారు. పారిశ్రామిక వేత్తల ప్రాముఖ్యాన్ని, నైపుణ్యాన్ని, అనుభవాన్ని ప్రస్తావిస్తూ, వారి సేవలను ప్రధాని కొనియాడారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అధ్యక్షుడు శ్రీ ఎన్ కె సింగ్ ను, ఆయన మొత్తం బృందానికి వారి ప్రయత్నాలకు గానూ శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.
నేపథ్యం
కౌటిల్య ఆర్థిక సమ్మేళనం మూడో ఎడిషన్ అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ సౌత్ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన అంశాలపై భారతీయ, అంతర్జాతీయ పండితులు, విధాన నిర్ణేతలు చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి వక్తలు పాల్గొంటున్నారు.
Click here to read full text speech
Today, India is the fastest growing major economy. pic.twitter.com/uRcQPPNG5X
— PMO India (@PMOIndia) October 4, 2024
Reform, Perform & Transform. pic.twitter.com/UlsZ5LA8p6
— PMO India (@PMOIndia) October 4, 2024
Commitment to carry out structural reforms to make India developed. pic.twitter.com/41VG83RZFN
— PMO India (@PMOIndia) October 4, 2024
भारत में growth के साथ inclusion भी हो रहा है। pic.twitter.com/o9ZYz9zDAW
— PMO India (@PMOIndia) October 4, 2024
India has made 'process reforms' a part of the continuing activities of the government. pic.twitter.com/581cAat1vV
— PMO India (@PMOIndia) October 4, 2024
Today India's focus is on critical technologies like AI and semiconductors. pic.twitter.com/FlrdGxd7Ut
— PMO India (@PMOIndia) October 4, 2024
Special package for skilling and internship of youth. pic.twitter.com/5yUMwhcPeD
— PMO India (@PMOIndia) October 4, 2024